పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థుండగు శ్రీకృష్ణుని స్తుతించుట
సీ. సత్యవ్రతుని నిత్యసంప్రాప్తిసాధనుఁ గాలత్రయమునందుఁ గలుగువాని
భూతంబు లైదును బుట్టుచోటగువాని నైదుభూతంబులం దమరువాని
నైదుభూతంబులు నడఁగిన పిమ్మటఁ బరఁగువానిని సత్యభాషణంబు
సమదర్శనంబును జరిపెడువానిని ని న్నాశ్రయింతుము, నీ యధీన
 
ఆ. మాయచేత నెఱుకమాలినవారలు, పెక్కుగతుల నిన్నుఁ బేరుకొందు,
రెఱుఁగ నేర్చువిబుధు లేకచిత్తంబున, నిఖిలమూర్తు లెల్ల నీవ యండ్రు.
89
వ. అదియునుంగాక. 90
సీ. ప్రకృతి యొక్కటి పాదు, ఫలములు సుఖదుఃఖములు రెండు, గుణములు మూఁడు వేళ్ళు,
తగు రసంబులు నాల్గు ధర్మార్థముఖరంబు, లెఱిఁగెడివిధము లై దింద్రియంబు,
లాఱు స్వభావంబు లా శోకమోహాదు లూర్ములు, ధాతువు లొక్కయేడు,
పైపొర లెనిమిది ప్రంగలు, భూతంబు లైదు బుద్ధియు మనోఽహంకృతులును,
 
తే. రంధ్రములు దొమ్మిదియుఁ గోటరములు, ప్రాణపత్త్రదశకంబు, జీవేశపక్షియుగముఁ
గలుగు సంసారవృక్షంబు గలుగఁజేయఁ, గావ నడఁగింప రాజ వొక్కరుఁడ వీవ.
91
క. నీదెసఁ దనుచిత్తము లిడి, యే దెసలకుఁ బోక కడతు రెఱుక గలుగు వా,
రాదూడయడుగుక్రియ నీ, పాదం బనునావకతన భవసాగరమున్‌.
92
ఆ. మంచివారి కెల్ల మంగళప్రద లయ్యుఁ, గల్లరులకు మేలుగానియట్టి
తనువు లెన్నియైనఁ దాల్చి లోకములకు, సేమ మెల్లప్రొద్దుఁ జేయు దీవు.
93
క. ఎఱిఁగినవారల మనుచును, గొఱమాలినయెఱుక లెఱిఁగి కొందఱు నీ పే
రెఱిఁగియుఁ దలఁపఁగ నొల్లరు, పఱతు రధోగతులజాడఁ బద్మదళాక్షా!
94
క. నీవారై నీ దెసఁ దమ, భావంబులు నిలిపి ఘనులు భయవిరహితులై
యే విఘ్నంబులఁ జెందక, నీ వఱలెడిమేటిచోట నెగడుదు రీశా!
95
క. నిను నాలుగాశ్రమంబుల, జనములు సేవింప నఖిలజగముల సత్త్వం
బును శుద్ధంబును శ్రేయం, బును ననుగాత్రంబు నీవు వొందుదువు హరీ!
96
సీ. నలినాక్ష! సత్త్వగుణంబు నీ గాత్రంబు గాదేని విజ్ఞానకలిత మగుచు
నజ్ఞానభేదకం బగు టెట్టు? గుణములయందును వెలుఁగ నీ వనుమతింపఁ
బడుదువు, సత్త్వరూపంబు సేవింపంగ సాక్షాత్కరింతువు సాక్షి వగుచు
వాఙ్మనసముల కవ్వలిదైనమార్గంబు గలుగు, నీ గుణజన్మకర్మరహిత
 
తే. మైనరూపును బేరు నత్యనఘబుద్ధు, లెఱుఁగుదురు, నిన్నుఁ గొల్వ నూహించుకొనుచు
వినుచుఁ దలఁచుచుఁ బొగడుచు వెలయువాఁడు, భవము నొందఁడు నీ పాదభక్తుఁ డగును.
97
క. ధరణీభారము వాసెను, బురుషోత్తమ! యీశ! నీదుపుట్టువున, భవ
చ్చరణాంబుజములప్రాపున, ధరణియు నాకసముఁ గాంచెదము నీ కరుణన్‌.
98
ఉ. పుట్టువు లేని నీ కభవ! పుట్టుట క్రీడయ కాక పుట్టుటే?
యె ట్టనుడున్‌ భవాదిదశ లెల్లను జీవులయం దవిద్య దాఁ
జుట్టుచు నుండుఁగాని నినుఁ జుట్టినదింబలెఁ బొంత నుండియుం
జుట్టఁగ లేమిఁ దత్క్రియలఁ జొక్కనియెక్కటి వౌదు వీశ్వరా!
99
మ. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకే
సరివై భిక్షుఁడవై హయాననుఁడవై క్ష్మాదేవతాభర్త వై
ధరణీనాథుఁడవై దయాగుణగణోదారుండవై లోకముల్‌
పరిరక్షించిన నీకు మ్రొక్కెద, మిలాభారంబు వారింపవే!
100
క. ముచ్చిరి యున్నది లోకము, నిచ్చలుఁ గంసాదిఖలులు నిర్దయు లేఁచన్‌,
మచ్చిగఁ గావఁగవలయును, విచ్చేయుము తల్లికడుపువెడలి ముకుందా!
101
వ. అని మఱియు దేవకీదేవిం గనుంకొని 102
మత్త. తల్లి! నీ యుదరంబులోనఁ బ్రధానపూరుషుఁ డున్న వాఁ
డెల్లి పుట్టెడిఁ,గంసుచే భయ మింత లేదు, నిజంబు, మా
కెల్లవారికి భద్రమయ్యెడు, నింక నీ కడు పెప్పుడుం
జల్లగావలె యాదవావళి సంతసంబునఁ బొంగఁగన్‌.
103
వ. అని యి వ్విధంబున హరిం బొగడి దేవకీదేవిని దీవించి దేవత లీశానబ్రహ్మల మున్నిడుకొని చని, రంత- 104
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )