పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ కృష్ణావతార ఘట్టము
క. పంకజముఖి నీ ళ్ళాడను, సంకటపడ ఖలుల మానసంబుల నెల్లన్‌
సంకటము దోఁచె, మెల్లన, సంకటములు లేమి దోఁచె సత్పురుషులకున్‌.
105
సీ. స్వచ్ఛంబులై పొంగె జలరాసు లేడును గలఘోషణముల మేఘంబు లుఱిమె,
గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివిఁ దాల్చెఁ
గమ్మని చల్లని గాలి మెల్లన వీచె, హోమానలంబు చెన్నొంది వెలిఁగెఁ
గొలఁకులు కమలాళికులములై సిరి నొప్పెఁ, బ్రవిమలతోయలై పాఱె నదులు,
 
తే. వరపురగ్రామఘోషయై వసుధ యొప్పె, విహగరవపుష్పఫలముల వెలసె వనము,
లలరుసోనలు గురిసి ర య్యమరవరులు దేవదేవుని దేవకీదేవి గనఁగ.
106
క. పాడిరి గంధర్వోత్తము, లాడిరి రంభాదికాంత, లానందమునం
గూడిరి సిద్ధులు, భయముల, వీడిరి చారణులు, మొరసె వేల్పులభేరుల్‌.
107
వ. అయ్యవసరంబున. 108
క. సుతుఁ గనె దేవకి నడురే, యతిశుభగతిఁ దారలును గ్రహంబులు నుండన్‌
దితిసుతనిరాకరిష్ణున్‌, శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్‌ విష్ణున్‌.
109
క. వెన్నుని నతిప్రసన్నునిఁ, గ్రన్నన గని మెఱుఁగుఁబోఁడి గడు నొప్పారెం
బున్నమనాఁడు కళానిధిఁ, గన్న మహేంద్రాశచెలువు గలిగి నరేంద్రా!
110
వ. అప్పుడు. 111
సీ. జలధరదేహు నాజానుచతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షుఁ
జారుగదాశంఖచక్రపద్మవిలాసుఁ గంఠకౌస్తుభమణికాంతిభాసుఁ
గమనీయకటిసూత్రకంకణకేయూరు శ్రీవత్సలాంఛనాంచితవిహారు
నురుకుండలప్రభాయుతకుంతలలలాటు వైదూర్యమణిగణవరకిరీటు
 
తే. బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోక, పాలు సుగణాలవాలుఁ గృపావిశాలుఁ
జూచి తిలకించి పులకించి చోద్య మంది, యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె.
112
క. స్నానము సేయఁగ రామిని, నానందరసాబ్ధిమగ్నుఁడై విప్రులకున్‌
ధేనువులం బదివేలను, మానసమున ధారవోసె మఱి యిచ్చుటకున్‌.
113
వ. మఱియు వసుదేవుండు. 114
క. ఈ పురిటియింటి కుద్య, ద్దీపంబునుబోలి చాల దీపించి నిజం
బీ పాపఁడు నలుమొగముల, యా పాపనిఁ గనినమేటి యగు నని భక్తిన్‌.
115
ఆ. చాఁగి మ్రొక్కి లేచి సరగున నొసలిపై, గేలుఁదమ్మిదోయిఁ గీలుకొలిపి
పాపఁ డనక వెఱక పాపనిమొదలింటి, పోకలెల్లఁ దలఁచి పొగడఁ దొడఁగె.
116
క. ఏ నిన్ను నఖిలదర్శను, జ్ఞానానందస్వరూపు సంతతు నపరా
ధీనుని మాయాదూరుని, సూనునిఁగాఁ గంటి, నిట్టిచోద్యము గలదే?
117
క. అచ్చుగ నీ మాయను మును, జెచ్చెరఁ ద్రిగుణాత్మకముగఁ జేసిన జగముం
జొచ్చినక్రియఁ జొరకుందువు, చొచ్చుటయును లేదు, లేదు చొరకుండుటయున్‌.
118
సీ. అదియు నెట్లన మహదాదులఁ బోలెడి దై వేఱువేఱయై యన్నివిధము
లగు సూక్ష్మభూతంబు లమర షోడశవికారములతోఁ గూడి విరా ట్టనంగఁ
బరమాత్మునకు నీకుఁ బఱపైన మేను సంపాదించి యందులోఁ బడియుఁ బడక
యుండు సృష్టికి మున్న యున్న కారణమున వానికి లోనిభవంబు గలుగ,
 
ఆ. దట్లు బుద్ధి నెఱుఁగ ననువైనలాగునఁ, గలుగు నింద్రియములకడలనుండి
వానిపట్టులేక వరుస జగంబులఁ, గలసియుండి యైనఁ గలయ వెపుడు.
119
క. సర్వము నీలోనిదిగా, సర్వాత్ముఁడ, వాత్మవస్తుసంపన్నుఁడవై
సర్వమయుఁడ వగు నీకును, సర్వేశ్వర! లేవు లోను సంధులు వెలియున్‌.
120
ఆ. ఆత్మవలనఁ గలిగి అమరుదేహాదుల, నాత్మకంటె వేఱు లవి యటంచుఁ
దలఁచువాఁడు మూఢతముఁడు గావున నీశ!, విశ్వ మెల్ల నీవ, వేఱు లేదు.
121
వ. అదియునుం గాక. 122
సీ. గుణము వికారంబుఁ గోరికయును లేని నీవలన జగంబు నెఱి జనించుఁ,
బ్రబ్బు, లేదగు; నంచుఁ బలుకుట దప్పుగా దీశుండవై బ్రహ్మ మీవ యైన
నినుఁ గొల్చుగుణములు నీ యానతులు సేయ, భటులశౌర్యంబులు పతికి వచ్చు
పగిది నీ గుణములబాగులు నీ వని తోఁచును నీమాయతోడఁ గూడి
 
ఆ. నీవు రక్తధవళనీలవర్ణంబుల, జగము సేయఁ గావ సమయఁజూడఁ
దనరు, దట్లు నేఁడు దైత్యుల దండింపఁ, బృథివిఁ గావ నవతరించి తీశ!
123
శా. మింటన్‌ మ్రోసినమ్రోఁత దాలిమిని లో మేండ్రింప మున్‌ నీవు నా
యింటం బుట్టెద వంచుఁ గంసుఁడు దొడిన్‌ హింసించె నీ యన్నలం
గంటం గూరుకుఁ దేఁడు, నీ యుదయ మా కారాజనుల్‌ సెప్పఁగా
బంటింపం, డెదురేఁగుదెంచు వడి నీపై నేఁడు సన్నద్ధుఁడై.
124
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )