| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | అనుచుండ దేవకీదేవి మహాపురుషలక్షణుండును, విచక్షణుండును, సుకుమారుండును నైన కుమారునిం గని, కంసునివలన వెఱపున శుచిస్మితయై యిట్లనియె. | 125 |
| సీ. |
అట్టిట్టి దనరానిదై మొదలై నిండుకొన్నదై వెలుఁగుచు గుణము లేని దై యొక్క చందంబుదై కలదై నిర్విశేషమై క్రియలేక చెప్పరాని దేరూప మని శ్రుతు లెప్పుడు నొడివెడి యా రూప మగుచు నధ్యాత్మదీప మై బ్రహ్మరెండవయర్ధంబుతుది జగంబులు నశింపఁ, గఁ బెద్దభూతగణము |
|
| ఆ. |
సూక్ష్మభూతమందుఁ జొరఁగ నా భూతంబు, ప్రకృతిలోనఁ జొరఁగఁ బ్రకృతి వోయి వ్యక్తమందుఁ జొరఁగ వ్యక్త మడంగను, శేషసంజ్ఞ నీవు సెలువ మగుదు. |
126 |
| ఉ. |
విశ్వము లీలఁ ద్రిప్పుచు నవిద్యకుఁ జుట్టమ వైన నీకుఁ దా శాశ్వతమైనకాల మిది సర్వము వేడబ మందు, రట్టి వి శ్వేశ్వర! మేలుకుప్ప! నిను నెవ్వఁడు గోరి భజించు వాఁడపో శాశ్వతలక్ష్మి మృత్యుజయసౌఖ్యయుతుం డభయుండు మాధవా! |
127 |
| మత్త. |
ఒంటి నిల్చి పురాణయోగులు యోగమార్గనిరూఢులై ‘కంటి’ మందురు కాని, నిక్కమ కాన రీ భవదాకృతిం గంటి భద్రముఁ గంటి, మాంసపుఁగన్నులం గనఁబోల, దీ తొంటిరూపుఁ దొలంగఁ బెట్టుము తోయజేక్షణ! మ్రొక్కెదన్. |
128 |
| ఆ. |
విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద, కడుపులోన దాఁచు కడిమి మేటి నటుఁడ వీవు, నేఁడు నా గర్భజుఁడ వౌట, పరమపురుష! వేడబంబు గాదె! |
129 |
| తరలము. |
నలినలోచన! నీవు నిక్కము నాకుఁ బుట్టెద వంచు నీ ఖలుఁడు గంసుఁడు పెద్దకాలము కారయింట నడంచె, దు ర్మలినచిత్తుని నాజ్ఞసేయుము, మమ్ముఁ గావుము భీతులన్, నులుసులేక ఫలించె నోఁచిననోము లెల్లను నీవయై. |
130 |