పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
దేవకీవసుదేవల పూర్వజన్మముల వృత్తాంతము
వ. అని యిట్లు దేవకీదేవి విన్నవించిన నీశ్వరుం డిట్లనియె, అవ్వా! నీవు దొల్లి స్వాయంభువ మన్వంతరంబునఁ బృశ్ని యను పరమపతివ్రతవు, వసుదేవుండును సుతపుం డనుప్రజాపతి, మీ రిరువురును సృష్టికాలంబున బ్రహ్మపంపునం, బెంపున నింద్రియంబుల జయించి తెంపున వాన గాలి యెండ మంచులకు సైరించి యేకలములయి యాకలములు దిని యే కలంకంబును లేక వేండ్రంబుగఁ బండ్రెండువేల దివ్యవర్షంబులు దపంబులు సేసిన నెపంబున మీ రూపంబులు మెరయ నోజ నాజపంబులు సేసి, డాసి, పేర్చి, యర్చింప మీకు నాకుం గల రూపుఁ జూపి యేను ‘దిరంబు లగు వరంబులు వేఁడుం’ డనిన మీరు నా మాయం బాయని మోహంబున బిడ్డలు లేని దొడ్డయడ్డంబున దుర్దమం బగు నపవర్గంబు గోరక నా యీడుకొడుకు నడిగిన మెచ్చి యట్ల వరం బిచ్చి మీ కేను ‘బృశ్నిగర్భుం’డన నర్భకుండ నయితి, మఱియును. 131
క. అదితియుఁ గశ్యపుఁడును నన, విదితుల రగు మీకుఁ గుఱుచవేషంబున నే
నుదయించితి వామనుఁ డనఁ, ద్రిదశేంద్రానుజుఁడనై ద్వితీయభవమునన్‌.
132
క. ఇప్పుడు మూఁడవబామునఁ, దప్పక మీ కిరువురకును దనయుఁడ నైతిం
జెప్పితిఁ బూర్వము మీయం, దెప్పటికిని లేదు జన్మ మిటపై నాకున్‌.
133
క. నందనుఁ డనియుం బరమా, నందంబగు బ్రహ్మ మనియు ననుఁ దలఁచుచు నా
పెందెరువు నొందెదరు, నా, యందలిప్రేమమున భవము నందరు మీరల్‌.
134
వ. అని యిట్ల పలికి యీశ్వరుం డా రూపంబు విడిచి. 135
క. ఱెప్ప లిడక తలిదండ్రులు, దప్పక తనుఁ జూడ మాయఁ దనరి లలితుఁడై
యప్పు డటు గన్న పాపని, యొప్పున వేడుకలు సేసె నొకకొన్ని నృపా!
136
వ. అంత వసుదేవుండు దనకుం జేయవలసిన పను లీశ్వరుండైన హరివలన నెఱింగినవాఁడు గావున. 137
క. ఆ పురిటియిల్లు వెలువడి, పాపనిఁ దరలించుకొనుచుఁ బఱచెద ననుచున్‌
రూపింప నందుభార్యకుఁ, బాప యగుచు యోగమాయ ప్రభవించె నృపా!
138
వ. అయ్యవసరంబున. 139
క. బిడ్డనిఁ గరముల ఱొమ్మున, నడ్డంబుగఁ బట్టి పదము లల్లన యిడుచున్‌
జడ్డనఁ గావలివారల, యొడ్డు గడచి పురిటిసాల యొయ్యన వెడలెన్‌.
140
వ. అంత నట. 141
క. నందునిసతికి యశోదకుఁ, బొందుగ హరియోగమాయ పుట్టిన మాయా
స్పందమున నొక్క యెఱుఁగమి, క్రందుకొనియె నూరివారిఁ గావలివారిన్‌.
142
వ. అప్పుడు చప్పుడు గాకుండఁ దప్పుటడుగు లిడుచు, నినుప గొలుసుల మెలుసులు వీడినఁ దాలంబులు మహోత్తాలుండైన బిడ్డనికి నడ్డంబు గాక కీలూడి వీడి పడ, నరళంబులు విరళంబులైన సరళంబులగు మొగసాలలం గడచి, పాఁపఱేఁడు వాకిళ్ళు మరల మూయుచుఁ, బడగ లెడగలుగ విప్పి, కప్పి, యేచి, కాచికొని వెంట నంటి రాఁగఁ దూఁగి నడచు నెడ. 143
క. ఆ శౌరికి దెరు వొసఁగెఁ బ్ర, కాశోద్ధతతుంగభంగకలితధరాశా
కాశ యగు యమున మును సీ, తేశునకుఁ బయోధి త్రోవ యిచ్చినభంగిన్‌.
144
వ. ఇట్లు యమున దాఁటి, దూఁటి, చని, నందుని మందం జేరి, యం దమందనిద్రం బొంది, యొడ లెఱుంగని గొల్లలం దెలుప నొల్లక, నిత్యప్రసాదయగు యశోదశయ్య నొయ్యన చిన్ని నల్లనయ్య నునిచి, చయ్యన న య్యవ్వకూఁతు నెత్తుకొని, మరల నింటికిఁ బంటింపక వచ్చి, య చ్చిఱుతపాపను దేవకి ప్రక్కం జక్క నిడి. 145
క. పదముల సంకెల లిడుకొని, మదిఁ దలఁకుచు శూరసుతుఁడు మందుఁడు వోలెన్‌
బెదరు గలరీతి దేహము, గదలించుచు నొదిఁగి యుండె గఱువతనమునన్‌.
146
క. వనజాక్షునిఁ దెచ్చుటయును, దనసుతఁ గొనిపోవుటయును దా నెఱుఁగక మూఁ
గిన నిద్రఁ జొక్కియుండెను, వనజాక్షి యశోద రేయి వసుధాధీశా!
147
సీ. అంత బాలిక యావు రని యేడ్చుచిఱుచప్పు డాలించి వే కన నాఁకయింటి
కావలివారు మేల్కని చూచి తలుపులతాళముల్‌ తొంటివిధమున నుండఁ
దెలిసి చక్కన వచ్చి దేవకి నీళ్ళాడె రమ్మురమ్మని యా భోజరాజుతోడఁ
జెప్పిన నాతఁడు చిడిముడిపాటుతోఁ దల్పంబు పై లేచి తత్తఱమున
 
తే. వెండ్రుకలు వీడఁ బై చీర వ్రేలియాడఁ, దాల్మి కీలూడ రోషాగ్ని దర్పమాడ
భూరివైరంబుతోఁ గూడ పురిటియింటి, జాడఁ జనుదెంచి యా పాపఁ జంపఁ గదియ.
148
వ. అంత దేవకి యడ్డంబు వచ్చి యిట్లనియె. 149
ఉ. అన్న! శమింపు మన్న! తగ దల్లుఁడు గాఁ డిది మేనగోడ లౌ
మన్నన సేయుమన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా
దన్న, సుకీర్తివై మనఁ గ దన్న! మహాత్ములు వోవు త్రోవఁ బో
వన్న! భవత్సహోదరిఁ గదన్న, నినున్‌ శరణంబు వేఁడెదన్‌.
150
క. కట్టా! యార్గురుకొడుకులఁ, బట్టి వధించితివి యాఁడుఁబడు చిది, కోడల్‌,
నెట్టన చంపఁగవలెనే?, కట్టిఁడివి గదన్న! యన్న! కరుణింపఁగదే!
151
క. పుత్త్రుఁడు నీ బ్రతుకునకును, శత్రుం డని వింటి గాన సమయింపఁ దగుం,
బుత్త్రులకు నోఁచనైతిని, బుత్త్రీదానంబు సేసి పుణ్యముఁ గనవే!
152
వ. అని పయ్యెదఁ జక్క సవరించుకొనుచుఁ బలవరించుచు, భ్రాంతిపడి కూఁతున్‌ గ్రక్కున నక్కునం జక్క హత్తించుకొని, చెక్కు చెక్కున మోపి చయ్యన నుత్తరీయాంచలంబున సంచలతం గప్పి చప్పుడుగాఁ గుయ్యిడ, నయ్యెడం గ్రయ్యంబడి వాఁడు పోఁడిమి సెడఁ దోఁబుట్టువుం దిట్టి, చిట్టిపట్టి నావురని వాపోవఁ గావరంబున నడుగు లొడిసి తిగిచి వడిం బెడిసిపడం బుడమిపయిం బడవైచిన నబ్బాలయు నేలంబడక యవలీల నెగసి నవ్యదివ్యమాలికాగంధబంధురమణిహారాంబరాద్యలంకారమనోహారిణియు, గదా శంఖ చక్రపద్మశరచాపాసిశూలధారిణియునై యెనిమిదికరంబులం గరం బొప్పుచు, సిద్ధచారణకిన్నరగరుడ గంధర్వాది వైమానిక నికాయంబు గానిక లిచ్చి పొగడ, నెగడుచు నచ్చరలయాటపాటలకు మెచ్చుచు, మింటనుండి కంటఁబడి కంటువడఁ గంసున కిట్లనియె. 153
ఉ. తెంపరివై పొరిం బొరిని దేవకిబిడ్డలఁ జిన్నికుఱ్ఱలం
జంపితి వింకనైన నుపశాంతి వహింపక ఱాలమీఁద నొ
ప్పింపఁగ నిస్సిరో యిదియు బీరమె? నా సరసన్‌ జనించి నిన్‌
జంపెడు వీరుఁ డొక్క దెస సత్కృతి నొందెడువాఁడు దుర్మతీ!
154
వ. అని పలికి. 155
క. మహనీయగుణాస్పదయై, మహిలో నా దేవి జనము మన్నింపంగా
బహునామనివాసంబుల, బహునామములం జరించె భద్రాత్మికయై.
156
వ. అంత నా బోటి వలికిన కలికి పలుకులు ములుకులై, చెవులఁ జిలికిన, నులికిపడి, జళుకు గదిరిన మనంబున ఘనంబుగ వెఱఁగంది, కంది, కుందెడు దేవకీవసుదేవుల రావించి, యాదరంబున సంభావించి, చేరి వారితో నిట్లనియె. 157
ఉ. పాపుఁడ, బాలఘాతకుఁడ, బంధువిరక్తుఁడ, దుష్టచిత్తుఁడన్‌,
గోపనుఁడం, జరన్మృతుఁడఁ, గ్రూరుఁడ, బ్రాహ్మణహంతభంగి మీ
పాపలఁ జంపితిన్‌ బయలిపల్కుల నమ్మితి సాధులార! నా
పాపము లుగ్గడింపక కృపాపరులై కనరే శమింపరే!
158
ఉ. ఒక్కెడఁ బ్రాణు లందఱు నిజోచితకర్మము లోలిఁ ద్రిప్పఁగా
నొక్కొక మేనితోఁ బొడమి యొక్కొక త్రోవను రాక పోకలం
జిక్కులఁ బొందుచుండుదురు, చెల్మిని సంసృతితోడఁ బాయ రే
నెక్కడి హంత? మీ శిశువు లెక్కడి హన్యులు దూఱ నేటికిన్‌?
159
క. పగతురఁ జెఱచితి ననియును, బగతురచేఁ జెడితి ననియు బాలుఁడు దలఁచున్‌,
బగచెలుములు లే వాత్మకుఁ, బగచెలుములకీలు కర్మబంధము సుండీ!
160
వ. అని పలికి, కన్నీరు నించి, వగచి, వెఱచుచు, దేవకీవసుదేవుల పాదంబులఁ బట్టుకొని, సంకెలలు విప్పించి, మిక్కిలి యక్కఱ గల వాక్యంబుల నైక్యంబులు నెఱపిన, వారును బరితప్తుండైన కంసునిం జూచి, రోషంబును బాసిరి. అంత నా వసుదేవుండు బావ కిట్లనియె. 161
శా. బావా! నీ వచనంబు నిక్కము సుమీ, ప్రాణుల్‌ గతజ్ఞానులై
నీ వే నంచును లోభమోహమదభీనిర్మిత్రతామోద శో
కావేశంబుల నొండొరుం బొడుతు రేకాకారుఁడై సర్వ రూ
పావిష్టుండగు నీశ్వరుం దెలియలే రన్యోన్యవిభ్రాంతులై.
162
వ. అని యిట్లు ప్రసన్నులైన దేవకీ వసుదేవుల యనుజ్ఞ వడసి, కంసుం డింటికిం జని యా రేయి గడపి, మఱునాఁడు ప్రొద్దునం గ్రద్దనం దనకుం బరతంత్రులగు మంత్రుల రావించి, యోగనిద్రవలనం దా వినిన వృత్తాంతం బంతయు మంతనంబున నెఱింగించిన, నపుడు వార లతని కిట్లనిరి. 163
క. ఇట్టయినఁ దడయ నేటికిఁ?, బట్టణముల మందలందుఁ బల్లెల నెల్లన్‌
బుట్టెడి పెరిఁగెడి శిశువులఁ, బట్టి వధించెదము మమ్ముఁ బంపు మధీశా!
164
మ. భవదీయోజ్జ్వలబాహుచాపవిలసద్బాణావళీభగ్నులై
దివిజాధీశ్వరు లేక్రియం బడిరొ యే దేశంబులన్‌ డాఁగిరో
శివునిం జొచ్చిరొ బ్రహ్మఁజెందిరొ హరిన్‌ సేవించిరో మౌని వృ
త్తి వనాంతంబుల నిల్చిరో మనకు శోధింపం దగున్‌ వల్లభా!
165
క. నొచ్చిరి శాత్రవు లనుచును, విచ్చలవిడిఁ దిరుగవలదు వివిధాకృతులన్‌
మ్రుచ్చిలి వత్తురు వారలు, సచ్చినయందాఁక మఱవఁ జన దధిపునకున్‌.
166
క. ఒత్తికొనుచు రానీఁ జన, దెత్తిన రోగముల రిపుల నింద్రియముల ను
త్పత్తిసమయములఁ జెఱుపక, మెత్తన గారాదు రాదు మీఁద జయింపన్‌.
167
మ. అమరశ్రేణికి నెల్లఁ జక్రి ముఖరుం డా చక్రియే ధర్మమం
దమరున్‌, గోవులు భూమిదేవులు దితిక్షామ్నాయకారుణ్య స
త్యములున్‌ యాగతపోదమంబులును శ్రద్ధాశాంతులున్‌ విష్ణు దే
హము లిన్నింటిని సంహరించిన నతం డంతంబునుం బొందెడిన్‌.
168
వ. కావున. 169
ఉ. చంపుదుమే నిలింపులను? జంకెల ఱంకెలఁ దాపసావలిం
బంపుదుమే కృతాంతకుని పాలికిఁ? గ్రేపులతోడ గోవులం
ద్రుంపుదుమే? ధరామరులఁ దోలుదుమే? నిగమంబులన్‌ విదా
రింపుదుమే? వసుంధర హరింపుదుమే? జననాథ! పంపుమా!
170
వ. అని పలుకుమంత్రుల మంత్రంబుల నిమంత్రితుండై బ్రాహ్మణనిరోధంబు నిషిద్ధం బని తలంపక కాలపాశబద్ధుండై విప్రాదిసాధుమానవులఁ జంప దానవులం బంపి యంతిపురంబునకుం జనియె, ననంతరంబ యా రక్కసులు వెక్కసంబులగు మొక్కలంబుల సజ్జనులపజ్జలం బడి తర్జన గర్జన భర్జనాది దౌర్జన్యంబులంజేసి నిర్జించి పాపంబు లార్జించిరి. 171
ఆ. వెదకి వెదకి దైత్యవీరులు సాధుల, నణఁప వారిబలము లడఁగి పోయె,
యశము సిరియు ధర్మ మాయువు భద్రంబు, నార్యహింస సేయ నణఁగుఁ గాదె!
172
వ. అంత మందలో నందుండు నందనుండు పుట్టుట యెఱింగి మహానందంబున నెఱవాదులగు వేదవిదులం బిలిపించి, జలకంబులాడి, శుచియై, శృంగారించుకొని, స్వస్తిపుణ్యాహవాచనంబులు సదివించి, జాతకర్మంబులు సేయించి, పితృదేవతల నర్చించి, క్రేపులతోడం గూడఁ గైసేసిన పాఁడిమొదవుల రెండులక్షలను, గనక కలశ మణి వసన విశాలంబులైన తిలశైలంబు లేడింటిని భూదేవతల కిచ్చిన. 173
క. ఈ యాభీరకుమారుఁడు, శ్రీయుతుఁడై వీరవైరిజేతయునై దీ
ర్ఘాయుష్మంతుం డగు నని, పాయక దీవించి రపుడు బ్రాహ్మణజనముల్‌.
174
క. దుందుభులు మొరసె, గాయక, సందోహము పాడె, సూతసముదాయముతో
వందిజనులు కీర్తించిరి, క్రందుగ వీతెంచె భద్రకాహళరవముల్‌.
175
క. పల్లవతోరణసురుచిర, వల్లీధ్వజరాజధూపవాసనములతో
సల్లలితములై యొప్పెను, వల్లవవల్లభులయిండ్లవాకిం డ్లెల్లన్‌.
176
క. పసుపులు నూనెలు నలఁదిన, పసఁ దనరి సువర్ణబర్హిబర్హప్రభతోఁ
బసిమి గలిగి వెలుఁగొందుచుఁ, బసు లన్నియు మందలందుఁ బ్రసరించె నృపా!
177
క. క్రేళ్లుఱికి మసలె లేఁగలు, మల్లడిగొని ఱంకె లిడియె మదవృషభంబుల్‌,
పెల్లుగ మొదవులపొదుఁగుల, జల్లించెం బాలు బాలుసంభవవేళన్‌.
178
క. ఆరఁగఁ జదివెడి పొగడెడి, వారికి విద్యలను బ్రదుకువారికి లేమిం
జేరినవారికి నెల్లను, గోరక మును నందుఁ డిచ్చె గోధనచయముల్‌.
179
వ. ఆ సమయంబున. 180
క. కంచుకములు తలచుట్లును, గాంచనభూషాంబరములుఁ గడు మెఱయఁగ నే
తెంచిరి గోపకు లందఱు, మంచిపదార్థములు గొనుచు మాధవుఁ జూడన్‌.
181
క. ఏతెంచి చూచి చెలఁగుచు, నేతులఁబెరుఁ గులను బాల నీళ్లను వెన్నం
బ్రీతి వసంతము లాడిరి, యేతరులై సరసభాష లెసఁగన్‌ గొల్లల్‌.
182
వ. తదనంతరంబ. 183
ఆ. ఏమినోము ఫలమొ యింత ప్రొ ద్దొకవార్త, వింటి మబలలార! వీను లలర
మనయశోద చిన్నిమగవానిఁ గనె నఁట, చూచి వత్త మమ్మ! సుదతులార!
184
వ. అని యొండొరుల లేపికొని గోపిక లోపికలు లేనిచిత్తంబుల నెత్తినతత్తఱంబు లొత్తుకొన నుదారంబులగు శృంగారంబులతో నిండ్లు వెలువడి. 185
క. జడగతులును బలుపిఱుఁదులుఁ, బిడికెడునడుములును వలుఁదబిగిచనుఁగవలున్‌
వెడఁదనయనములు సిరి దడఁ, బడుమోములు భ్రమరచికురభరములు నమరన్‌.
186
ఉ. వేడుకతోడఁ గ్రొమ్ముడులు వీడఁ గుచోపరిహారరేఖ ల
ల్లాడఁ గపోలపాలికల హాటకపత్త్రరుచుల్‌ వినోదనం
బాడఁ బటాంచలంబు లసియాడఁగఁ జేరి యశోద యింటికిం
జేడియ లేఁగి చూచి రొగి జిష్ణుని విష్ణునిఁ జిన్ని కృష్ణునిన్‌.
187
వ. చూచి సంతసించి తెచ్చిన కానుక లిచ్చి. 188
తే. పాపనికి నూనెఁ దలయంటి పసుపుఁ బూసి, బోరుకాడించి “హరి రక్ష పొ”మ్మటంచు
జలము లొకకొన్ని చుట్టిరాఁ జల్లి తొట్ల, నునిచి దీవించి పాడి రయ్యువిద లెల్ల.
189
క. ‘జోజో కమలదళేక్షణ!, జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా!
జోజో పల్లవకరపద!, జోజో పూర్ణేందువదన! జోజో’ యనుచున్‌.
190
వ. ఇవ్విధంబున. 191
క. పలుతోయంబుల జగములఁ, బలుతోయములందు ముంచి భాసిల్లెడి యా
పలుతోయగాఁడు వల్లవ, లలనాకరతోయములఁ జెలంగుచుఁ దడియున్‌.
192
క. లోకములు నిదుర వోవఁగ, జో కొట్టుచు నిదురవోని సుభగుఁడు రమణుల్‌
జోకొట్టి పాడ నిదురం, గైకొనుక్రియ నూరకుండెఁ గను దెఱవకయున్‌.
193
సీ. ఏ బాము లెఱుఁగక యేపారుమేటికిఁ బసులకాపరియింట బాము గలిగె,
నే కర్మములు లేక యెనయునెక్కటికిని జాతకర్మంబులు సంభవించె,
నే తల్లిచనుఁబాలు నెఱుఁగనిప్రోడ యశోదచన్నులపాల చొరవ నెఱిఁగె,
నే హానివృద్ధులు నెఱుఁగనిబ్రహ్మంబు పొదిఁగిటిలో వృద్ధిఁ బొందఁ జొచ్చె,
 
ఆ. నే తపములనైన నెలమిఁ బండనిపంట, వల్లవీజనముల వాడఁ బండె
నే చదువుల నైన నిట్టిట్టి దనరాని, యర్థ మవయవముల నంద మొందె.
194
మ. చెయువుల్‌ సేయుతఱిన్‌ విధాతకరణిం జెన్నొందు, సంతోష దృ
ష్టియుతుండై నగుచున్‌ జనార్దనునిమాడ్కిం బొల్చు, రోషించి యు
న్న యెడన్‌ రుద్రునిభంగి నొప్పును, సుఖానందంబునం బొంది త
న్మయుఁడై బ్రహ్మముభాతి బాలుఁ డమరు న్బాహుళ్యబాల్యంబునన్‌.
195
వ. అయ్యవసరంబున. 196
ఆ. కొడుకుఁ గన్నవేడ్క కొనసాగ రోహిణిఁ, జీరఁ బంచి చిత్రచేలములను
మండనముల నిచ్చి మన్నించె నందుఁ డా, యంబుజాక్షి ప్రీతయై చరింప.
197
వ. అది మొదలు మొదవులకదుపులు పొదువులు గలిగియుండె, నంత నందుండు గోపకుల ననేకుల గోకులరక్షకుం దక్షులైనవారిని నియమించి మథురకుం జని కంసునికి నేఁటేఁటం బెట్టెడి యరిం బెట్టి వీడ్కొని వసుదేవుని కడకుం జని యథోచితంబుగ దర్శించిన. 198
క. నందునిఁ గనుఁగొని ప్రాణము, పొందినబొందియునుఁబోలెఁ బొలుపారుచు నా
నందాశ్రులు గడకన్నులఁ, గ్రందుకొనం గేలుసాఁచి కౌఁగిటఁ జేర్చెన్‌.
199
వ. మఱియుఁ గౌఁగిలించుకొని, సుఖాసీనుం జేసి, వసుదేవుండు దనకొడుకువలనిమోహంబు దీపింప నందున కిట్లనియె. 200
క. సంతతి లే దని మును ఘన, చింతనముల మునిఁగి ముదిసి చిక్కిననీకున్‌
సంతతి గలిగెను భాగ్యము!, సంతతిహీనునికి సౌఖ్యసంతతి గలదే?
201
క. పొడగంటి నిన్ను బ్రదికితిఁ, గడచితి నాపదల నింకఁ గార్యంబులు నే
యెడమడుగు లేనినెచ్చెలిఁ, బొడఁగాంచుట చచ్చి మఱలఁ బుట్టుట గాదే!
202
క. పలుపాటులఁబడు జనులకు, నిల నొకచో నుండఁ గలదె? యేఱుల వెంటం
గలిగి చనుమ్రాఁకు లన్నియుఁ, బలువెంటలఁ బోవుఁగాక పాయక యున్నే?
203
మ. పలురోగంబుల నొందకున్నవె పసుల్‌? పాలిచ్చునే ధేనువుల్‌?
కొలఁకుల్‌ వాఁగులు వారిపూరితములే? గోష్ఠప్రదేశంబులం
బులులున్‌ దుప్పులు సంచరింపవు గదా! పొల్పారునే ఘోషముల్‌?
కలవే పచ్చనిపూరిజొంపములు తత్కాంతారభాగంబులన్‌?
204
క. తనపుత్త్రమిత్రముఖరులఁ, దనుపక చూడకయు వారు దఱిఁగి నశింపన్‌
మనుచు గృహమేధియాశ్రమ, మున నుండెడువాని కొక్క మోదముఁ గలదే?
205
క. నీకాంతయొద్ద నీవును, నీకాంతయు గారవింప నినుఁ దండ్రిఁగ నా
లోకించుచు నీ మందను, నా కొడు కున్నాఁడె? నంద! నందాన్వితుఁఢై.
206
వ. అనిన నందుం డిట్లనియె. 207
శా. నీకున్‌ దేవకికిన్‌ జనించిన సుతానీకంబుఁ దోడ్తోడ ము
న్నీ కంసుండు వధించె, మీసుతఁ దుదిన్‌హింసింపఁ జేఁదప్పి తా
నాకాశంబున కేగె, బాల యది, దైవాధీన మాపద్దశన్‌
శోకం బందునె తద్‌జ్ఞుఁ డూఱడుము నా సూనుండు నీ సూనుఁడే.
208
వ. అనిన వసుదేవుండు నందునకు మఱియు నిట్లనియె. 209
క. జనపతి కరి యిడితివి, మముఁ, గనుఁగొంటివి, మేము నిన్నుఁ గంటిమి, మే ల
య్యెను, బొమ్మింకను గోకుల, మున నుత్పాతములు దోఁచు మునుకొనవలయున్‌.
210
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )