పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
కంసుని పంపునఁ బూతన యను రాక్షసి వ్రేపల్లెకుఁ జనుదెంచుట
వ. అని పలికి వసుదేవుండు నందాదులయినవల్లవుల వీడ్కొలిపిన వారలు గొబ్బున వడిగల గిబ్బలం బూనిన శకటంబులు ప్రకటంబులుగ నెక్కి తమ తమ పల్లెలత్రోవలు వట్టి చని రానందుండు ప్రతీతంబులైన యుత్పాతంబులు ముందటఁ బొడగని శౌరి దనతోఁ బలికిన పలుకులు దప్ప వనుచుఁ దలంచుచుం జనియె నంత. 211
సీ. కంసుపంపున బాలఘాతిని పూతన పల్లెల మందలఁ బట్టణముల
నిల నెల్లచో బాలహింసఁ గావించుచుఁ జనుచు నెవ్వనిపేరు శ్రవణవీథిఁ
బడినయంతన సర్వభయనివారణ మగు నట్టి దైత్యాంతకుం డవతరించి
యున్న నందునిపల్లె కొకనాఁడు ఖేచరి యై వచ్చి యందు మాయాప్రయుక్తిఁ
 
తే. గామరూపిణియై చొచ్చి కానకుండ, నరిగి యిల్లిల్లుఁ దప్పక యరసికొనుచు
నందగృహమున బాలుని నాద మొకటి, విని ప్రమోదించి సుందరీవేష యగుచు.
212
మత్త. క్రాలుకన్నులు గుబ్బచన్నులుఁ గందువొందనిచందురుం
బోలు మోమును గల్గు లేదన బుద్ధి దూఱనికౌను హే
రాళమైన పిఱుందుఁ బల్లవరాగపాదకరంబులుం
జాల దొడ్డగుకొప్పు నొప్పఁగ సర్వమోహనమూర్తితోన్‌.
213
మానిని. కాంచనకుండలకాంతులు గండయుగంబునఁ గ్రేళ్లుఱుకన్‌ జడపై
మించిన మల్లెలమేలిమితావులు మెచ్చి మదాళులు మింటను రా
నంచితకంకణహారరుచుల్‌ చెలువారఁగఁబై వలు వంచల నిం
చించుక జాఱఁగ నిందునిభానన యేఁగెఁ గుమారునియింటికినై.
214
వ. ఆ సమయంబున. 215
మ. ‘సిరి మమ్మున్‌ బ్రదుకంగఁ జూచుకొఱకై శృంగారవేషంబుతో
నరుదే నోపు’ నటంచు గోపికలు జిహ్వల్‌ రాక మోహించి త
త్పరలై చూడ లతాంగి వోయి కనియెం బర్యంకమధ్యంబునం
బరు భస్మానలతేజు దుర్జనవధప్రారంభకున్‌ డింభకున్‌.
216
వ. కని కదియవచ్చుసమయంబున. 217
శా. ఆ లోకేశ్వరుఁ డాచరాచరవిభుం డా బాలగోపాలుఁ డా
బాలధ్వంసిని గొంటు గం టిడి వెసన్‌ బాలెంతచందంబునం
బాలిండ్లన్‌ విస మూని వచ్చుట మదిన్‌ భావించి లో నవ్వుచున్‌
కాలుం గేలు నెఱుంగకున్నకరణిం గన్మోడ్చి గుర్వెట్టఁగన్‌
218
క. ఆ పాపజాతిసుందరి, యా పాపనిపాన్పుఁ జేర నరిగి కరములన్‌
లేపి చనుంగవ శిశువున్‌, మోపుచు ముద్దాడి శిరము మూర్కొని పలికెన్‌.
219
క. “చను నీకుఁ గుడుపఁ జాలెడి, చనువారలు లేరు, నీవు చనవలె,” ననుచుం
జనుగుడిపి మీఁద నిలుకడఁ, జనుదాన ననంగ వేడ్కఁ జనుఁ జను గుడుపన్‌.
220
క. ‘నా చనుఁబా లొక గ్రుక్కెఁడు, నోచిన్ని కుమార! త్రావు మొయ్యను పిదపన్‌
నీ చెలువ మెఱుఁగవచ్చును, నా చెలువము సఫల మగును నళినదళాక్షా!’
221
వ. అని బాలు నుద్దేశించి ముద్దాడెడిభంగి మాటలాడెడి చేడియం జూచి. 222
మ. వనితా! ముట్టకు మమ్మ! చన్ను గుడుపన్‌ వల్దమ్మ! నీ చన్ను మా
తనయుం డొల్లఁడు వాసి పొ మ్మని యశోదారోహిణుల్‌ సీరఁ గై
కొన కీక్షించుచు మాయఁ బన్ని పెలుచం గోశంబులో వాలు మె
ల్పున రాజిల్లుచు మాట మెత్తఁదనమున్‌ లో వాఁడియు న్నేర్పడన్‌.
223
వ. కదిసి కలికిపలుకులు పలుకుచు నులుకుసెడి జళుకు సొరక యెదుర నిదుర గదిరిన ఫణిని ఫణియని యెఱుంగక గుణమతిం దిగుచు జడమతి బెడంగునఁ గఱటి జఱభితెఱవ వెరవునం జనుదెంచి పఱపునడుమ నొఱపు గలిగి మెఱయుచుఁ గన్ను దెఱవక వెఱపు మఱపు నెఱుంగక కొమరుమిగులు చిఱుత కొమరునిం దిగిచి తొడలనడుమ నిడుకొని యొడలు నివురుచు నెడనెడ మమతం గడలుకొలుపుచు నాఁకొన్న చిన్నియన్న! చన్ను గుడువు మని చన్నిచ్చు సమయంబున. 224
సీ. మేల్కొన్న తెఱఁగున మెల్లన కనువిచ్చి క్రేఁగంటఁ జూచుచుఁ గిదికి నీల్గి
యావులించుచుఁ జేతు లాదరంబునఁ జూచి యొదిఁగిలి యాఁకొన్న యోజ నూఁది
బిగిచన్నుఁగవఁ గేలఁ బీడించి కబళించి గ్రుక్కగ్రుక్కకు గుటుగుటుకు మనుచు
నొక రెండుగ్రుక్కల నువిదప్రాణంబులుసైతము మేనిలో సత్త్వ మెల్లఁ
 
తే. ద్రావె నదియును గుండెలు దల్లడిల్లఁ, జిమ్మఁ దిరుగుచు నిలువక శిరము వ్రాల
నితరబాలురక్రియవాఁడ వీవు గావు, చన్ను విడువుము విడువుము చాలు, ననుచు.
225
క. నిబ్బరపు దప్పి మంటలు, ప్రబ్బిన ధృతి లేక నేత్రపదహస్తంబుల్‌
గొబ్బున వివృతములుగ నా, గుబ్బగుచున్నట్టికూఁతఁ గూలెన్‌ నేలన్‌.
226
మ. అదరెం గొండలతోడ భూమి, గ్రహతారానీకముల్‌ మింటిపై
బెదరెన్‌, దిక్కుల మాఱుమ్రోఁత లెసఁగెన్‌, భీతిల్లి లోకంబులుం
గదలం బాఱెను,వజ్రభిన్నగిరిరేఖం బూర్వదేహంబుతో
ద్రిదశధ్వంసిని గూలి కుయ్యిడిన తద్దీర్ఘోరుఘోషంబునన్‌.
227
క. అప్పుడు దెప్పరమగు నా, చప్పుడు హృదయములఁ జొచ్చి సందడి పెట్టన్‌
ముప్పిరిగొని పడి రెఱుకలు, దప్పి ధరన్‌ గొల్ల లెల్లఁ దల్లడపడుచున్‌.
228
క. ఆ జఱభి రండ రక్కసి, నైజశరీరంబు నేల నలియంబడినన్‌
యోజనమున్నర మేర ధ, రాజంబులు నుగ్గులయ్యె రాజవరేణ్యా!
229
సీ. దారుణలాంగూలదండదంతంబులు నగగహ్వరముఁబోలు నాసికయును
గండశైలాకృతి గల కుచయుగమును విరిసి తూలెడి పల్లవెండ్రుకలును
జీఁకటినూతులఁ జెనయునేత్రంబులుఁ బెనుదిబ్బఁబోలెడి పెద్దపిఱుఁదుఁ
జాఁగుకట్టలఁబోలు చరణోరుహస్తంబు లింకినమడువుతో నెనయు కడుపుఁ
 
తే. గలిగి షట్క్రోశదీర్ఘమై కదిసి చూడ, భయదమగు దానిఘనకళేబరముఁ జూచి
గోపగోపీజనంబులు గుంపుగూడి, బెగడుచుండిరి మనముల బెదరు గదిరి.
230
వ. ఇ వ్విధంబున. 231
క. ఆ తఱిఁ గుడువఁగ నడచెన్‌, నూతనఫుల్లాబ్జలోచనుఁడు హరి మృత్యు
ద్యోతనఁ గృతమునిసముదయ, యాతనఁ బూతన నెఱింగి యాతనలీలన్‌.
232
క. విషధరరిపుగమనునికిని, విషగళసఖునికిని విమలవిషశయనునికిన్‌
విషభవభవజనకునికిని, విషకుచచనువిషముఁ గొనుట విషమే తలఁపన్‌?
233
వ. అంత నా గోపగోపీజనంబులు తెలిసి రోహిణీయశోదలం గూడుకొని బెగ్గడిలక డగ్గఱి. 234
శా. నేలం గూలిన దానిపెన్నురముపై నిర్భీతిఁ గ్రీడింప నో
బాలా! రమ్మని మూఁపు జేర్చుకొని సంస్పర్శించి యూరార్చుచున్‌
గోలాంగూలముఁ ద్రిప్పి గోవురజమున్‌ గోమూత్రముం జల్లి త
ద్బాలాంగంబుల గోమయం బలఁది రా పండ్రెండునామంబులన్‌.
235
వ. మఱియు నంతటం దనియక గోపిక లాచమనంబు సేసి దక్షలయి, మునుపుగాఁ దమకు రక్షాకరం బగు బీజన్యాసంబు సేసికొని, ‘చిన్ని యన్న! నీ యడుగు లజుండును, జానువు లనిలుండును, దొడలు యజ్ఞుండును, గటితలం బచ్యుతుండును, గడుపు హయాస్యుండును, హృదయంబుఁ గేశవుండును, నుర మీశుండును, గంఠం బినుండును, భుజంబులు చతుర్భుజుండును, ముఖంబు త్రివిక్రముండును, శిరం బీశ్వరుండును రక్షింతురు. ముందు చక్రియు, వెనుక గదాధరుండైన హరియుఁ బార్శ్వంబుల ధనుర్ధరుండైన మధువైరియు నసిధరుండగు నజనుండును, గోణంబుల శంఖచక్రగదాధరుండైన యురుగాయుండును, మీఁ దుపేంద్రుండును, గ్రిందు తార్‌క్ష్యుండును, నంతటను హలధరుండగు పురుషుండును కాతురు. నీ యింద్రియంబుల హృషీకేశుండును, బ్రాణంబుల నారాయణుండును, జిత్తంబును శ్వేతద్వీపపతియును, మనంబును యోగీశ్వరుండైన కపిలుండును, బుద్ధిని పృశ్నిగర్భుండును, నహంకారంబును భగవంతుండైన పరుండును బాలనంబు సేయుదురు. నీవు క్రీడించునెడ గోవిందుండును, శయనించుతఱి మాధవుండును, నడచువేళ వైకుంఠుండును, గూర్చున్న సమయంబున శ్రీపతియును, గుడుచుకాలంబున సర్వభక్షకుండైన యజ్ఞభుజుండును నేమఱ కుండుదురు. నిన్నుఁ బేర్కొనిన దుస్స్వప్న వృద్ధబాలగ్రహంబులును, గూశ్మాండ డాకినీ యాతుధానులును, భూత ప్రేత యక్ష రాక్షస పిశాచ వినాయకులును, గోటరా రేవతులును, జ్యేష్ఠాపూతనలును, మాతృకాదిగణంబులును నశియింతురు. నీయందుఁ బ్రాణేంద్రియశరీరనిరోధంబు లయిన యున్మాదంబులును నపస్మారంబులును మహోత్పాతంబులును బొందకుండుం గావుతమని రక్షసేసి దీవించి రంత. 236
క. ఆ పెద్దవేడబంబుల, పాపనికినిఁ జన్నుఁ గుడిపి పానుపుపై సం
స్థాపించి కప్పి ‘కూరుకు, మో పాపఁడ!’యని యశోద యొయ్యన పాడెన్‌.
237
వ. అంత నందుండు మొదలయిన గోపకులు మథురనుండి వచ్చి రక్కసిమేనుఁ గని వెఱఁగుపడి ‘మున్ను వసుదేవుం డుత్పాతంబు లెఱింగి చెప్పె, నతండు మహాయోగి’యని పొగడి కఠోరంబగు పూతనయొడలు కుఠారంబుల నఱికి తమ కుటీరంబులకుం దవ్వగు ప్రదేశంబునఁ బటీరంబుల దహనంబు సంగ్రహించి దహించి రంత. 238
ఆ. పొగిలి పొగిలి కాలు మగువదేహంబున, నగురు పరిమళముల పొగలు వెడలె
దేహకల్మషములు శ్రీహరి ముఖమునఁ, ద్రావఁబడుటఁ జేసి భూవరేణ్య!
239
క. హరి దనమీఁదం బదములుఁ, గరములు నిడి చన్నుఁ గుడిచి కదిసినమాత్రన్‌
హరిజననిపగిదిఁ బరగతి, కరిగెను దురితములఁ బాసి యసురాంగనయున్‌.
240
క. వెన్నుని కొకమఱి విషమగు, చన్నిచ్చిన బాలహంత్రి చనెనఁట దివికిన్‌,
వెన్నునిఁ గని పెంచుచుఁ దన, చన్నిచ్చిన సతికి మఱియు జన్మము గలదే?
241
క. హరిఁ గని చన్నులు గుడిపెడి, తరుణులు ప్రాప్తించుపదము దలఁపఁగ వశమే?
హరి యారగించుటకుఁ బా, ల్గురిసినధేనువులు ముక్తికొనలఁ జరించున్‌.
242
క. ఆ పూతన మెయిగంధము, గోపాలు రెఱింగి ‘యిట్టి కువనిత యొడలం
దీపాటి స్వాదుగంధము’, ప్రాపించునె యనుచుఁ జనిరి పల్లెల కధిపా!
243
వ. అంత నందుండు పరమానందంబున నింటికిం జని వ్రేతలచేత రక్కసిచేఁత లన్నియు నెఱింగి వెఱంగుపడి పాపని లేపి శిరంబు మూర్కొని ముద్దాడి ముదంబున నుండె నని చెప్పిన విని పరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. 244
క. ఏ యే యవతారంబుల, నే యే కర్మములు సేసె నీశుఁడు హరి భ
ద్రాయతనము లన్నియు వినఁ, బాయదు చిత్తంబు సెవులపండువు లయ్యెన్‌.
245
క. ఉరుసంసారపయోనిధి, తరణంబులుఁ బాపపుంజతరణంబులు శ్రీ
కరణంబులు ముక్తిసమా, చరణంబులు బాలకృష్ణుసంస్మరణంబుల్‌.
246
వ. అని తరువాత బాలకృష్ణుం డేమి సేసె నాయందుఁ గృప గలదేనిం జెప్పవే యని యడిగిన రాజునకు శుకుం డిట్లనియె. 247
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )