| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| సీ. |
బాలకుం డొదిఁగిలఁబడ నేర్చె నని జన్మనక్షత్రమం దొకనాఁడు నందు పొలఁతి వేడుక బోర్కుఁ బోయ వ్రేతలఁ జీరి వాదిత్రగీతారవంబు సెలఁగ విప్రులతోఁగూడ వేదమంత్రంబుల నభిషేచనాదిక మాచరించి వారిదీవన లొంది వారికి మొదవుల నన్నంబుఁ జీరల నడిగినట్టు |
|
| ఆ. |
లిచ్చి బాలుఁ దియ్య మెసఁగఁ బానుపు సేర్చి, నిదురపుచ్చి గోపనివహమునకు గోపికలకుఁ బూజఁ గొమరారఁ జేయుచు, జనని కొడుకు మఱచె సంభ్రమమున. |
248 |
| వ. | ఆ సమయంబున. | 249 |
| క. |
నిదురించిన శిశు వాఁకొని, కిదుకుచుఁ జను గోరి కెరలి కిసలయ విలస న్మృదుచక్రచాపరేఖా, స్పదపదమునఁ దన్నె నొక్కబండిన్ దండిన్. |
250 |
| క. |
శకటము హరి దన్నిన దివిఁ, బ్రకటం బై యెగసి యిరుసు భరమునఁ గండ్లున్ వికటంబుగ నేలం బడె, నకటా! యని గోపబృంద మాశ్చర్యపడన్. |
251 |
| వ. | అప్పు డందున్న సరసపదార్థంబులు వ్యర్థంబులై నేలం గూలుటం జూచి యశోదానందముఖ్యులైన గోపగోపికాజనంబులు పనులు మఱచి పబ్బంబులు మాని యుబ్బుసెడి వెఱపులు ఘనంబులుగ మనంబులందు. | 252 |
| క. |
మిన్నున కూరక యెగయదు, తన్న సమర్థుండు గాఁడు తల్పగతుం డీ చిన్నికుమారుఁడు దేరే, విన్ననువున నెగసె దీనివిధ మెట్టిదియో. |
253 |
| వ. | అని వితర్కించు సమయంబున. | 254 |
| క. |
బాలకుఁ డాఁకొని యేడ్చుచుఁ, గా లెత్తినఁ దాఁకి యెగసెఁ గాని శకట మే మూలమున నెగయ దని య, బ్బాలుని కడ నాడుచుండి పలికిరి శిశువుల్. |
255 |
| వ. | ఇట్లు శిశువులు పలికిన పలుకు విని. | 256 |
| శా. |
బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడం గాలం దన్నుట యెక్క? డేల పడుచుల్ గల్లాడి? రీజడ్డుఁ బ ల్కే లోకంబున నైనఁ జెప్పఁబడునే? యే చందమో కాక యం చాలాపించుచు వ్రేలువ్రేతలుఁ బ్రభూతాశ్చర్యు లైరందఱున్. |
257 |
| వ. | అప్పు డా బాలునిరోదనంబు విని యశోద పఱతెంచి. | 258 |
| ఆ. |
అలసితివి గదన్న! యాఁకొంటివి గదన్న!, మంచియన్న! యేడ్పు మాను మన్న! చన్ను గుడువు మన్న సంతసపడు మన్న, యనుచుఁ జన్ను గుడిపె నర్భకునకు. |
259 |
| వ. | అంత న బ్బాలునిమేన బాలగ్రహంబు సోఁకునుగదా యని శంకించి గోపకు లనేకు లనేక బలివిధానంబులు సేసిరి. బ్రాహ్మణులు దధికుశాక్షతంబుల హోమంబు లాచరించిరి. ఋగ్యజుస్సామ మంత్రంబుల నభిషేచనంబులు సేయించి స్వస్తి పుణ్యాహవాచనంబులు సదివించి కొడుకున కభ్యుదయార్థంబు నందుం డలంకరించిన పాఁడిమొదవుల విద్వజ్జనంబుల కిచ్చి వారల యాశీర్వాదంబులు గైకొని ప్రమోదించె నని చెప్పి శుకుం డిట్లనియె. | 260 |
| క. |
కొడుకు నొకనాఁడు తొడపై, నిడుకొని ముద్దాడి తల్లి యెలమి నివురుచోఁ గడుదొడ్డకొండశిఖరము, వడువున వ్రేఁగయ్యె నతఁడు వసుధాధీశా! |
261 |