పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
తృణావర్తుఁడను రాక్షసుఁడు సుడిగాలియై కృష్ణు నెత్తుకొని పోవుట
క. బరువైనకొడుకు మోవను, వెరవిఁడి యిలమీఁదఁ బెట్టి వెఱచి జనని దా
ధరఁ గావఁ బుట్టిన మహా, పురుషుఁడు గాఁబోలు ననుచు బుద్ధిఁ దలంచెన్‌.
262
వ. అప్పుడు. 263
క. ఖరుఁ డగు కంసునిపంపున, నరిగి తృణావర్తుఁ డవని కవచాటముగా
సురకరువలి యై బిసబిస, నరు దరు దన ముసరి విసరి హరిఁ గొనిపోయెన్‌.
264
క. సుడి యెఱుఁగని హరి సుడివడ, సుడిగాలితెఱంగు రక్కసుఁడు విసరెడి యా
సుడిగాలిధూళి గన్నుల, సుడిసిన గోపకులు బెగడి సుడివడి రధిపా!
265
వ. మఱియు న వ్వలయపవనదనుజుండు విలయపవనునితెఱంగునం గసిమసంగి ముసరి మసరు గవిసి విసరెడి సురకరువలిం బొడమిన పుడమిరజంబు వడి నెగసి గగనమున మెరసి తరణికిరణములకు మఱుఁగువడిన నిబిడమగు బెడిదంపుఁదిమిరమున దశదిశ లెఱుంగఁబడక గోకులం బాకులత నొంద నొండొరుల నెఱుంగక బెండుపడుచున్న జనంబుల మనంబుల ఘనంబుగ భయంబు రయంబునం జెంద నదభ్రపరిభ్రమణ శబ్దంబున దిగంతంబులు సెవుడు పడి పరిభ్రాంతంబులుగ నొక్క ముహూర్తమాత్రంబున భువనభయంకరత్వంబు దోఁచె, నా సమయంబున. 266
ఉ. పాపనిఁ జూడఁ గానక విపద్దశ నొంది కలంగి తల్లి ‘యో
పాపఁడ! బాలసూర్యనిభ! బాలశిరోమణి! నేఁడు గాలికిం
జేపడి పోయితే’ యనుచుఁ జీరుచు దైవముఁ జాల దూఱుచుం
దాపము నొంది నెవ్వగల దయ్యుచుఁ గ్రుయ్యుచు బిట్టుఁ గూయుచున్‌.
267
క. సుడిగాలి వచ్చి నిన్నున్‌, సుడిగొని కొనిపోవ మింట సుడిసుడి గొనుచున్‌
బెడఁ గడరెడి నా ముద్దుల, కొడుకా! యే మంటి వనుచు ఘోరం బనుచున్‌.
268
ఉ. ఇక్కడఁ బెట్టితిం దనయుఁ డిక్కడ నాడుచు నుండె గాలి దా
నెక్కడనుండి వచ్చె శిశు వెక్కడి మార్గము వట్టిపోయె నే
నెక్కడఁ జొత్తు నంచుఁ గమలేక్షణ గ్రేపుఁ దొఱంగి ఖిన్నయై
పొక్కుచు వ్రాలు గోవుక్రియ భూస్థలి వ్రాలె దురంతచింతయై.
269
క. పాపనికై యిటు వొగిలెడి, యా పాపనితల్లిఁజూచి యారటపడుచున్‌,
గోపాలసతులు బాష్పజ, లాపూరిత నయన లైరి యార్తిం బడుచున్‌.
270
శా. ఆలోఁ జక్రసమీరదైత్యుఁడు మహాహంకారుఁడై మింటికిన్‌
బాలుం దాఁ గొనిపోయి పోయి తుదిఁ దద్భారంబు మోవన్‌ బల
శ్రీ లేమిం బరిశాంతవేగుఁ డగుచుం జేష్టింపఁగా లేక ము
న్నీలా గర్భకుఁ జూడనంచు నిట మీఁ దెట్లంచుఁ జింతించుచున్‌.
271
వ. అటు దనుజుండు చింతించుచున్న సమయంబున. 272
క. బాలద్విరదకరంబులఁ, బోలెడి కరములను దనుజు బొండుగ బిగియం
గీలించి వ్రేలఁబడియెను, బాలకుఁడొక కొండభంగి బరువై యధిపా!
273
క. మెడ బిగియఁ బట్టుకొని డిగఁ, బడియెడి బాలకునిచేతఁ బర్వతనిభుచే
విడివడఁ జాలక వాఁ డురిఁ, బడి బెగడెడు ఖగముభంగి భయముం బొందెన్‌!
274
క. హరికరతలపీడనమునఁ, బరవశుఁడై ఱాలమీఁద భగ్నాంగకుఁ డై
సురవైరిభటుఁడు గూలెను, బురభంజనుకోలఁ గూలు పురముంబోలెన్‌.
275
వ. అంత గోపకాంత లంతయుం గని రోదనంబులు మాని సమ్మోదంబున విక్కవిరిసి రక్కసుని యురంబున మురువు గలిగి బరువులేక వ్రేలు బాలుం గొనివచ్చి ముచ్చిరుచున్న తల్లి కిచ్చి రప్పుడు గోపగోపికాజనంబు లందఱుఁ దమలో నిట్లనిరి. 276
క. రక్షణము లేక సాధుఁడు, రక్షితుఁ డగు సమతఁజేసి రాయిడులందున్‌
రక్షణములు వెయి గలిగిన, శిక్షితుఁ డగు ఖలుఁడు పాపచిత్తుం డగుటన్‌.
277
మ. గతజన్మంబుల నేమి నోఁచితిమొ? యాగశ్రేణు లే మేమి సే
సితిమో? యెవ్వరి కేమి వెట్టితిమొ యే చింతారతిం బ్రొద్దు వు
చ్చితిమో? సత్యము లేమి వల్కితిమొ? యే సిద్ధప్రదేశంబుఁ ద్రొ
క్కితిమో? యిప్పుడు సూడఁ గంటి మిచటం గృష్ణార్భకున్‌ నిర్భయున్‌.
278
వ. అని పలికి రంత నందుండు మున్న దనకు వసుదేవుండు సెప్పిన మాటలకు వెఱఁగుపడుచుండె. మఱియును. 279
సీ. జననాథ! యొకనాఁడు చన్ను చేఁపినఁ దల్లి చిన్నిముద్దుల కృష్ణుఁ జేరఁ దిగిచి
యెత్తి పెందొడలపై నిడికొని ముద్దాడి చ న్నిచ్చి నెమ్మోము సక్క నివిరి
యల్లని నగవుతో నావులించినబాలువదనగహ్వరమున వారినిధులు
దిశలు భూమియు వనద్వీపశైలంబులు నేఱులు గాలియు నినుఁడు శశియు
 
ఆ. దహనుఁ డాకసంబుఁ దారలు గ్రహములు, నఖిలలోకములుఁ జరాచరంబు
లైన భూతగణము లన్నియు నుండుటఁ, జూచి కన్నుమోడ్చి చోద్యపడియె.
280
వ. అంత నొక్కనాఁడు వసుదేవుపంపున యాదవపురోహితుండైన గర్గుండు మందకుం జనుదెంచిన నందుం డతనిఁ గనుంగొని లేచి నిలిచి కృతాంజలియై. 281
క. కోరి భజించెను నందుఁడు, సారగుణాచారమార్గు సత్సంసర్గు
న్నారాధితభర్గున్‌ మతి, దూరితషడ్వర్గుఁ గుజనదుర్గున్‌ గర్గున్‌.
282
వ. మఱియుఁ దగిన సత్కారంబులు సేసి యిట్లనియె. 283
క. ఊరక రారు మహాత్ములు, వా రధముల యిండ్లకడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు, నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా!
284
శా. జ్యోతిశ్శాస్త్రుల కెల్ల మేటరివి తేజోమూర్తి వాశాంత వి
ఖ్యాతస్ఫూర్తివి బ్రహ్మబోధనుఁడ వాకర్ణింపు నా పల్కు ని
ర్ణీతుండైనగురుండు మానవులకున్‌విప్రోత్తముం డండ్రు నీ
చాతుర్యంబున నీ కుమారులకు సంస్కారంబు గావింపవే.
285
వ. అని రామకృష్ణులం జూపిన గర్గుండు మున్ను కంసునిచేత వ్రేటువడి దివి కెగసిపోయిన తెఱవ సెప్పిన తెఱంగు దేటపఱిచి దేవకీదేవికొడుకని కృష్ణునిఁ గంసుండు దలంచుం గావున రహస్యంబున సంస్కారంబు సేయుట కార్యం బని నందానుమతంబున రోహిణీసుకుమారు నుద్దేశించి. 286
క. జనులు రమియింపఁ దిరిగెడి, యనువు కలిమి రాముఁ డనియు యదుసంకర్షం
బున సంకర్షణుఁ డనియును, ఘనబలమున బలుఁడు ననియు గణుతించె నృపా!
287
వ. మఱియుం గృష్ణు నుద్దేశించి తొల్లి యీ శిశువు ధవళారుణ పీతవర్ణుండై యిప్పుడు నల్లనైనకతంబునఁ గృష్ణుం డయ్యె, వసుదేవునకు నొక్కెడ జన్మించిన కారణంబున వాసుదేవుం డయ్యె, నీ పాపనికి గుణరూపకర్మంబు లనేకంబులు గలుగుటంజేసి నామంబు లనేకంబులు గలవు. ఈ శాబకునివలన మీరు దుఃఖంబులఁ దరియింతు, రీ యర్భకునిచేత దుర్జనశిక్షణంబును సజ్జనరక్షణంబును నగు, నీ కుమారుండు నారాయణసమానుం డని చెప్పి తన గృహమ్మున కమ్మునీశ్వరుండు సనియె. నందుండును బరమానందంబున నుండె నంత. 288
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )