పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ కృష్ణ బలరాముల బాల్యక్రీడాభివర్ణనము
సీ. జానుభాగముల హస్తమ్ములు వీడ్వడ నిడుచు దిగ్గనఁ బోదు రింత నంత
నవ్వల పయ్యెద లంది జవ్వాడుదు రాలక్రేపులతోఁక లలమి పట్టి
విడువనేరక వానివెనువెంట జరగుదు రప్పంకముల దుడు కడరఁ జొత్తు
రెత్తి చన్నిచ్చుచో నిరుదెసం బాలిండ్లు చేతులఁ బుడుకుచుఁ జేఁపుఁ గలుగ
 
తే. దూఁటుదురు గ్రుక్క గ్రుక్కకుఁ దోర మగుచు, నాడుదురు ముద్దుపలుకు లవ్యక్తములుగఁ
గరము లంఘ్రులు నల్లార్చి కదలుపుదురు, రామకృష్ణులు శైశవరతులఁ దగిలి.
289
క. తడ వాడిరి బలకృష్ణులు, దడ వాడిరి వారిఁ జూచి తగ రంభాదుల్‌
దడవాడి రరులు భయమునఁ, దడ వాడిరి మంతనములఁ దపసులు వేడ్కన్‌.
290
సీ. తల లెత్తి మెల్లన తడవి యాడెడువేళఁ బన్నగాధీశులపగిదిఁ దాల్తు,
రంగసమ్మృష్టపంకాంగరాగంబుల నేనుఁగుగున్నల యెత్తు వత్తు,
రసమంబులైన జవాతిరేకమ్ముల సింగపుఁగొదమలసిరి వహింతు
రాననంబులఁ గాంతు లంతకంతకు నెక్కు బాలార్కచంద్రులపగిదిఁ దోఁతు,
 
తే. రెలమిఁ దల్లులచన్నుఁబా లెల్లఁ ద్రావి, పరమయోగోద్భవామృతపానలీల
సోలి యెఱుఁగనియోగులసొంపు గందు, రా కుమారులు జనమనోహారు లగుచు.
291
క. చూడనివారల నెప్పుడుఁ, జూడక లోకములు మూఁడు చూపులఁ దిరుగం
జూడఁగ నేర్చిన బాలక, చూడామణి జనుల నెఱిఁగి చూడఁగ నేర్చెన్‌.
292
క. నగవుల నవిద్యపోఁడిమి, నగుబాటుగఁ జేయ నేర్చునగవరి యంతన్‌
నగుమొగముతోడ మెల్లన, నగుమొగములసతులఁ జూచి నగ నేర్చె నృపా!
293
క. అవ్వల నెఱుఁగక మువ్వురి, కవ్వల వెలుఁగొందు పరముఁ డర్భకుఁడై యా
యవ్వలకు సంతసంబుగ, నవ్వా! యవ్వా! యనంగ నల్లన నేర్చెన్‌.
294
క. అడుగులు వే గలిగియు రెం, డడుగులనే మన్ను మిన్ను నలమిన బాలుం
డడుగిడఁ దొడఁగెను శాత్రవు, లడుగులు సడుగులును వదలి యడుగవనిఁ బడన్‌.
295
వ. మఱియును. 296
సీ. తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నెఱిభూతి పూఁత గాఁగ
ముందఱ వెలుఁగొందు ముక్తాలలామంబు తొగలసంగడికాని తునుక గాఁగ
ఫాలభాగంబుపైఁ బరఁగు కావిరిబొట్టు కాముని గెల్చినకన్ను గాఁగఁ
గంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయ మగు మెడకప్పు గాఁగ
 
ఆ. హారవల్లు లురగహారవల్లులు గాఁగ బాలలీలఁ బ్రౌఢబాలకుండు
శివునిపగిది నొప్పె శివునికిఁ దనకును, వేఱులేమిఁ దెల్ప వెలయునట్లు.
297
క. ఆ పాపలవిహరణములు, తీపులు వుట్టింప మరఁగి తేఁకువ లే కా
గోపాలసతులు మక్కువ, నే పనులును మఱచి యుండి రీక్షణపరలై.
298
వ. ఆ సమయంబున బాలకులతల్లులు గోరు గోఱకొమ్ములు గల జంతువులవలన నేమఱక, జలదహన కంటకాదులయెడ మోసపోక, బాలసంరక్షణంబు సేయుచు నుల్లంబుల మొల్లంబులైన ప్రేమంబు లభిరామంబులుగా విహరించుచుండి రంత. 299
క. తనయీడు గోపబాలురు, దనుఁ గొలువఁగ రాముఁ గూడి తనుపు గలుగుచుం
దనుగమనంబులఁ గృష్ణుఁడు, తనుమధ్యలు మెచ్చ నీలతనురుచి మెఱసెన్‌.
300
వ. మఱియు నా కుమారుండు దినదినంబునకు సంచారసంభాషణదక్షుండై. 301
ఉ. చప్పుడు సేయకుండు మని జంకె యొనర్చిన నల్గి పోవఁగా
నప్పుడు బార సాఁచి తన యర్మిలి విందులు వచ్చి రంచు న
వ్వొప్పఁగఁ జీరు తల్లిదెస కొత్తిలి కృష్ణుఁడు రంతు సేయుచు
న్నెప్పటి వచ్చి చన్గుడుచు నిం పొలయన్‌ మొలగంట మ్రోయఁగన్‌
302
క. వల్లవగృహనవనీతము, లెల్లను భక్షించి వచ్చి యెఱుఁగనిభంగిం
దల్లిఁ గదిసి చి ట్టాడుచు, నల్లన చనుబువ్వఁ బెట్టు మవ్వా! యనుచున్‌.
303
వ. మఱియు గోపకుమారులం గూడికొని కృష్ణుండు 304
సీ. “గోవల్లభుఁడ నేను, గోవులు మీ’రని వడి ఱంకె వైచుచు వంగి యాడు,
‘రాజ నే, భటులు మీరలు, రండు రం’డని ప్రాభవంబునఁ బెక్కుపనులు వనుచు,
‘నేఁ దస్కరుండ, మీ రింటివా’ రని నిద్ర పుచ్చి సొమ్ములు గొనిపోయి డాఁగు,
‘నే సూత్రధారి! మీ రందఱు బహురూపు’ లని చెలంగుచు నాటలాడఁ బెట్టు,
 
తే. మూల లుఱుకును, డాఁగిలిమూఁతలాడు, నుయ్యెలల నూఁగుఁ జేబంతు లొనర వైచు,
జారచోరుల జాడలఁ జాల నిగుడు, శౌరి బాలురతో నాడుసమయమందు.
305
వ. మఱియు నా కుమారశేఖరుండు గపట శైశవంబున దొంగజాడలం గ్రీడింప గోపిక లోపికలు లేక యశోదకడకు వచ్చి యిట్లనిరి. 306
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )