| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| క. |
బాలురకుఁ బాలు లే వని, బాలెంతలు మొఱలు వెట్టఁ బకపక నగి యీ బాలుం డాలము సేయుచు, నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ! |
307 |
| క. |
పడఁతీ! నీ బిడ్డఁడు మా, కడవలలో నున్న మంచి కాఁగిన పా లా పడుచులకుఁ బోసి చిక్కిన, కడవలఁ బో నడిచె నాజ్ఞ గలదో లేదో? |
308 |
| క. |
మీ పాపఁడు మా గృహముల, నాపోవఁగఁ బాలు ద్రావ నగపడ కున్నం గోపించి పిన్నపడుచుల, వాపోవఁగఁ జిమ్ముకొనుచు వచ్చెం దల్లీ! |
309 |
| మత్త. |
పుట్టి పుట్టఁడు నేఁడు దొంగిలఁ బోయి మా యిలు సొచ్చి తా నుట్టి యందక ఱోళ్ళుఁ బీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చే వెట్టఁ జాలక కుండక్రిం దొక పెద్దతూఁ టొనరించి మీ పట్టి మీఁగడపాలుఁ జేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ! |
310 |
| క. |
ఆడం జని వీరల పెరుఁ, గోడక నీ సుతుఁడు ద్రావి యొకయించుక తాఁ గోడలి మూఁతిం జరిమినఁ, గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ! |
311 |
| క. |
వా రిల్లు సొచ్చి కడవలఁ, దోరంబగు నెయ్యి ద్రావి తుది నా కడవల్ వీరింట నీ సుతుం డిడ, వారికి వీరికిని దొడ్డవా దయ్యె సతీ! |
312 |
| క. |
వేలుపులటె! నా కంటెను, వేలుపు మఱి యెవ్వఁ డనుచు వికవిక నగి మా వేలుపులగోడపై నో, హేలావతి! నీ తనూజుఁ డెంగిలిఁ జేసెన్. |
313 |
| క. |
వెన్నఁ దినఁగఁ బొడగని మా, పిన్నది యడ్డంబు వచ్చి పిఱిఁదికిఁ దివియం జ న్నొడిసి పట్టి చీరెను, జిన్నికుమారుండె యితఁడు? శీతాంశుముఖీ! |
314 |
| క. |
ఇమ్మగువ దన్ను వాకిటఁ, గ్రుమ్మరుచోఁ జీరి నిలిపికొని పే రడుగం గెమ్మోవిఁ గఱచి వడిఁ జనె, నమ్మా! యీ ముద్దుఁగుఱ్ఱఁ డల్పుఁడె? చెపుమా. |
315 |
| క. |
చేబంతి దప్పి పడె నని, ప్రాబల్యముతోడ వచ్చి భవనమువెనుకన్ మాబిడ్డ జలక మాడఁగ, నీ బిడ్డఁడు వలువ దెచ్చె నెలఁతుక తగునే? |
316 |
| క. |
ఇచ్చెలువఁ జూచి ‘మ్రుచ్చిలి, యచ్చుగ నుఱికించుకొనుచు నరిగెద, నాతో వచ్చెదవా? యని’ యన్నాఁ, డిచ్చిఱుతఁడు, సుదతి! చిత్ర మిట్టిది గలదే? |
317 |
| క. |
కొడుకులు లే రని యొక సతి, గడు వగవఁగఁ దన్ను మగనిఁగాఁ గైకొనినం గొడుకులు గలిగెద రని పైఁ, బడినాఁ డిది వినుము శిశువుపనులే తల్లీ! |
318 |
| క. |
తలఁగినదానం దల మనఁ, దలఁగక యా చెలికి నాన తల యెత్తఁగ నీ తలఁగినచో టెయ్యది? యని, తలయూఁచెన్ నీ సుతుండు దగవె మృగాక్షీ! |
319 |
| క. |
వ్రాలఁగ వచ్చిన నీ సతి, చూలాలం దలఁగు మనుడుఁ జూ లగుటకు నే మూలంబు సెప్పు మనె నీ, బాలుఁడు, సెప్పుదురె సతులు పర్వేందుముఖీ! |
320 |
| క. |
మగువా! నీ కొమరుఁడు మా, మగవా రటు వోవఁ జూచి మంతనమునకుం దగఁ జీరి పొందు నడిగెను, జగముల ము న్నిట్టి శిశువు సదువంబడెనే? |
321 |
| ఆ. |
నమ్మి నిదురవోవ నా పట్టిచుంచు మా, లేఁగతోఁకతోడ లీలఁ గట్టి వీథులందుఁ దోలె వెలఁది నీ కొమరుండు, రాచబిడ్డఁడైన ఱవ్వ మేలె? |
322 |
| క. |
నాపట్టిపొట్ట నిండఁగఁ, బై పడి నీ పట్టి వెన్న బానెం డిడినాఁ, డూపిరి వెడలదు, వానిం, జూపెద నేమైన నీవ చుమ్ము లతాంగీ! |
323 |
| క. |
తెఱవ యొకతె నిద్రింపఁగ, నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం గఱపించి నీ కుమారుఁడు, వెఱచుచు నది పఱవ నగియె విహితమె సాధ్వీ? |
324 |
| క. |
నా కొడుకును నా కోడలు, నేకతమునఁ బెనఁగఁ బాము నీతఁడు వైవం గోక లెఱుంగక పాఱినఁ, గూఁక లిడెన్ నీ సుతుండు గుణమె గుణాఢ్యా! |
325 |
| ఆ. |
తరుణి యొకతె పెరుఁగుఁద్రచ్చుచోఁదుది వంగి, వెన్నదీయ నొదిఁగి వెనుకఁ గదిసి మగువ! నీ సుతుండు మగపోఁడుములు సేయ, సాగినాఁడు తగదె? చక్కఁజేయ. |
326 |
| సీ. |
కలకంఠి! మావాడ గరితల మెల్ల నీపట్టి రాఁగలఁ డని పాలు పెరుఁగు లిండ్ల లోపల నిడి యే మెల్లఁ దనత్రోవఁ జూచుచో నెప్పుడు సొచ్చినాఁడొ? తలుపులముద్రలుఁ దాళంబులును బెట్టి యున్నచందంబున నున్న వరయ నొకయింటిలో నాడు నొకయింటిలోఁ బాడు నొకయింటిలో నవ్వు, నొకటఁ దిట్టు, |
|
| ఆ. |
నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ, పక్షిఘోషణములు పరఁగఁ జేయు నిట్లు సేసి వెనుక నెక్కడఁ బోవునో?, కాన రాఁడు రిత్తకడవ లుండు. |
327 |
| క. |
కడు లచ్చి గలిగె నేనిం, గుడుతురు గట్టుదురు గాక కొడుకుల నగుచున్ బడుగుల వాడలపైఁబడ, విడుతురె రాకాంత లెందు? విమలేందుముఖీ! |
328 |
| క. |
ఓ యమ్మ! నీ కుమారుఁడు, మా యిండ్లను బాలుఁ బెరుఁగు మననీఁ డమ్మా! పోయెద మెక్కడి కైనను, మా యాన్నల సురభులాన మంజులవాణీ! |
329 |
| వ. | అని మఱియు ననేకవిధంబుల బాలకృష్ణుండు సేయు వినోదంబులు దమయందుఁ జేయు మహాప్రసాదంబు లని యెఱుంగక దూఱుచున్న గోపికలకు యశోద యిట్లనియె. | 330 |
| క. |
చన్ను విడిచి చనఁ డిట్టటు, నెన్నఁడుఁ బొరుగిండ్లత్రోవ లెఱుఁగడు నేఁడుం గన్నులు దెఱవని మా యీ, చిన్న కుమారకుని ఱవ్వసేయం దగునే? |
331 |
| తే. |
అన్య మెఱుఁగఁడు, తనయంత నాడుచుండు, మంచివాఁ డీతఁ, డెగ్గులు మానరమ్మ! రామలార! త్రిలోకాభిరామలార, తల్లులార, గుణవతీమతల్లులార! |
332 |
| వ. | అని యశోద వారల నొడంబఱిచి పంపి గొడుకుం గోపింపం జాలక యుండె నిట్లు. | 333 |