పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
మృద్భక్షణ విశ్వరూప ప్రదర్శనాద్యభివర్ణనము
ఉ. కాంతలు దల్లితోఁ దన వికారము లెల్ల గణింప భీతుఁడై
శాంతుని సొంపునం బరమసాధునిపెంపున గోలమాడ్కి వి
భ్రాంతుని కైవడిన్‌ జడునిభంగిఁ గుమారకుఁ డూరకుండె నే
వింతయు లేక తల్లికుచవేదికపైఁ దల మోపి యాడుచున్‌.
334
వ. అంత నొక్కనాఁడు బలభద్రప్రముఖులైన గోపకుమారులు వెన్నుండు మన్ను దినె నని చెప్పిన యశోద బాలునికేలు పట్టుకొని యిట్లనియె. 335
క. మ న్నేటికి భక్షించెదు?, మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ
యన్నయు సఖులును జెప్పెద, రన్నా! మ న్నేల? మఱి పదార్థము లేదే?
336
వ. అని పలికిన ముగుదతల్లికి నెఱదంటయైన కొడు కిట్లనియె. 337
శా. అమ్మా! మన్ను దినంగ నే శిశువనో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరిమాటలు మదిన్‌, న న్నీవు గొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు, కాదేనిన్‌ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్‌ దప్పైన దండింపవే!
338
వ. అని పలికి నెయ్యంబున నయ్యవ్వ నియ్యకొలిపి క్రీడామనుజబాలకుండైన యీశ్వరుండు తన నోరు దెఱచి ముఖంబుఁ జూపిన. 339
క. ఆ లలితాంగి కనుంగొనె, బాలునిముఖమందు జలధి పర్వత వన భూ
గోళ శిఖి తరణి శశి ది, క్పాలాదికరండమైన బ్రహ్మాండంబున్‌.
340
వ. కనుంగొని. 341
మ. కలయో! వైష్ణవమాయయో! యితరసంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్‌ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁ డెంత! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్‌.
342
ఆ. బాలమాత్రుఁ డగు సలీలునిముఖమందు, విశ్వమెల్ల నెట్లు వెలసి యుండు
బాలుభంగి నితఁడు భాసిల్లుఁగాని స, ర్వాత్ముఁ డాదివిష్ణుఁ డగుట నిజము.
343
వ. అని నిశ్చయించి. 344
ఆ. ఏ మహాత్మువలన నీ విశ్వరూపంబు, గానఁబడిన బుద్ధి కంప మయ్యె
నా మహాత్ము విష్ణు నఖిలలోకాధారు, నార్తులెల్లఁ బాయ నాశ్రయింతు.
345
క. నా మగఁడు నేను గోవులు, నీ మందయు గోపజనులు నిబ్బాలుని నె
మ్మోమున నున్న విధముఁ గని, యేమఱితిమి గాని యీశుఁ డీతఁడు మాకున్‌.
346
వ. అని తన్నుఁ బరమేశ్వరుం డని తలంచుచున్న యశోదయందు నా కృష్ణుండు వైష్ణవమాయం బొందించిన. 347
క. జడనుపడి యెఱుక సెడి యా, పడఁతుక సర్వాత్ముఁ డనుచుఁ బలుకక యతనిం
గొడు కని తొడపై నిడుకొని, కడువేడుకతోడ మమత గావించె నృపా!
348
వ. అనిన విని రా జిట్లనియె. 349
ఆ. జగదధీశ్వరునకుఁ జ న్నిచ్చు తల్లిగా, నేమి నోము నోఁచె నీ యశోద!
పుత్త్రుఁ డనుచు నతనిఁ బోషించు తండ్రిగా, నందుఁ డేమి సేసె నందితాత్మ!
350
క. ప్రబ్బినభక్తిని హరిపైఁ, గబ్బంబులు సెప్పి కవులు కైవల్య శ్రీ
కబ్బుదు రఁట! హరిపోషణ, మబ్బిన తల్లిదండ్రు లెచటి కబ్బుదురొ తుదిన్‌.
351
వ. అనిన విని రాజయోగికి శుకయోగి యిట్లనియె. 352
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )