పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణునిఁ బట్టుకొనుట
సీ. కరకమలారుణకాంతిఁ గవ్వపుఁ ద్రాడు పవడంపు నునుఁదీవపగిది మెఱయఁ
గ్రమముతో రజ్జు వాకర్షింపఁ బాలిండ్లు వీడ్వడి యొండొంటి వీఁక నొత్తఁ
గుచకుంభములమీఁదికొంగు జాఱఁగఁ జిక్కు వడుచు హారావళు ల్బయలుపడఁగఁ
బొడమినచెమటతోఁ బొల్పారునెమ్మోము మంచుపై పడిన పద్మంబుఁ దెగడఁ
 
తే. గౌను నులియంగఁ గంగణక్వణన మెసఁగఁ, దుఱుము బిగివీడఁ గర్ణికాద్యుతులు మెఱయ
బాలు నంకించి పాడెడిపాటవలనఁ, దరువు లిగురొత్తఁ బెరుఁ గింతి దరువఁ జొచ్చె.
355
వ. ఆ సమయంబున. 356
క. సుడియుచు వ్రాలుచుఁ గిదుకుచు, సడి గొట్టుచు నమ్మ రమ్ము! చ న్నిమ్మనుచున్‌
వెడవెడ గంతులు వైచుచుఁ, గడవఁ గదిసి బాలకుండు గవ్వముఁ బట్టెన్‌.
357
క. కవ్వముఁ బట్టిన ప్రియసుతు, న వ్వనరుహనేత్ర దిగిచి యంకతలమునన్‌
నవ్వుచు నిడుకొని కూఁకటి, దువ్వుచుఁ జన్నిచ్చె, నతఁడు దూఁటుచుఁ గుడిచెన్‌.
358
మ. కడుపారం జనుఁబాలు ద్రావని సుతుం గంజాక్షి పీఠంబుపై
నిడి పొంగారెడి పాలు డించుటకునై యేగంగఁ దద్బాలుఁ డె
క్కుడు కోపంబున వాఁడిఱాత దధిమత్కుంభంబు వోఁగొట్టి తెం
పడరం గుంభములోని వెన్నఁ దినె మిథ్యాసంకులద్బాష్పుఁడై.
359
వ. అంత నా లోలలోచన పాలు డించి వచ్చి వికలంబు లయిన దధికుంభశకలంబులఁ బొడగని తుంటకొడుకు వెన్న దింట యెఱింగి నగుచు నా కలభగామిని యతనిం గానక చని చని. 360
ఆ. వికచకమలనయన వే ఱొకయింటిలో, వెలయ ఱోలు దిరుగ వేసి యెక్కి
యుట్టిమీఁదివెన్న నులుకుచు నొక కోఁతి, పాలు సేయుచున్న బాలుఁ గనియె.
361
మ. కని చేతన్‌ సెలగోల వట్టికొనుచుం గానిమ్ము గానిమ్ము రా
తనయా! యెవ్వరియందుఁ జిక్కువడ నేదండంబునుం గాన నే
వినివారంబును బొంద నే వెఱపు నే విభ్రాంతియుం జెంద ము
న్ననియో నీవిటు నన్నుఁ గై కొనమి నేఁ డారీతి సిద్ధించునే
362
వ. అని యదలించుచుఁ గొడుకునడవడిం దలంచి తనుమధ్య దనమనంబున. 363
సీ. బాలుఁ డీతం డని భావింతు నందునా యే పెద్దలును నేర రీక్రమంబు
వెఱ వెఱుంగుటకు నై వెఱపింతు నందునా కలిగి లే కొక్కఁడు గాని లేఁడు
వెఱపుతో నా బుద్ధి వినిపింతు నందునా తనుఁ దానయై బుద్ధిఁ దప్పకుండు
నొం డెఱుంగక యింట నుండెడి నందునా చొచ్చి చూడని దొకచోటు లేదు
 
ఆ. తన్ను నెవ్వరైనఁ దలపోయఁ బాఱెడి, యోజ లేదు భీతి యొకటి యెఱుఁగఁ
డెలమి నూర కుండఁ డెక్కసక్కెము లాడుఁ, బట్టి శాస్తి సేయు భంగి యెట్లు?
364
వ. అని వితర్కించి. 365
క. లాలనమున బహుదోషము, లోలిం బ్రాపించుఁ దాడనోపాయములం
జాలగుణంబులు గలుగును, బాలురకును దాడనంబ పథ్యం బరయన్‌.
366
వ. అని నిశ్చయించి కేల నున్న కోల జళిపించి బాలా! నిలునిలు మని బగ్గుబగ్గున నదల్చుచుఁ దల్లి డగ్గఱిన బెగ్గడిలినచందంబున నగ్గలిక సెడి ఱోలు డిగ్గ నుఱికి. 367
క. గజ్జెలు గల్లని మ్రోయఁగ, నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షిజ్జనములు నగఁ దల్లియుఁ, బజ్జం జనుదేర నతఁడు పరువిడె నధిపా!
368
వ. అప్పుడు. 369
మ. స్తనభారంబున డస్సి క్రుస్సి యసదై జవ్వాడుమధ్యంబుతో
జనితస్వేదముతోఁ జలత్కబరితో స్రస్తోత్తరీయంబుతో
వనజాతేక్షణ గూడ బాఱి తిరిగెన్‌ వారించుచున్‌ వాకిటన్‌
ఘనయోగీంద్రమనంబులున్‌ వెనుకొనంగా లేని లీలారతున్‌.
370
వ. ఇట్లు గూడం జని. 371
సీ. స్తంభాదికంబులు దనకు నడ్డం బైన నిట్టట్టు సని పట్టనీనివాని
నీ తప్పు సైరింపు మింక దొంగిలఁ బోవ నే నని మునుముట్ట నేడ్చువానిఁ
గాటుక నెఱయంగఁ గన్నులు నులుముచు వెడలుకన్నీటితో వెగచువాని
నే దెస వచ్చునో యిది యని పలుమాఱు సురుఁగుచుఁ గ్రేఁగంటఁ జూచువానిఁ
 
ఆ. గూడఁబాఱి పట్టుకొని వెఱపించుచుఁ, జిన్ని వెన్నదొంగ సిక్కె ననుచు
నలిగి కొట్టఁ జేతు లాడక పూఁబోఁడి, కరుణతోడ బాలుఁ గట్టఁ దలఁచి.
372
వ. ఇ ట్లనియె. 373
క. వీ రెవ్వరు? శ్రీకృష్ణులు, గారా? యెన్నఁడును వెన్నఁ గానరఁట కదా
చోరత్వం బించుకయును, నేర రఁట! ధరిత్రి నిట్టి నియతులు గలరే?
374
క. పట్టినఁ బట్టువడని నినుఁ, బట్టెద నని చలముగొనినఁ బట్టుట బెట్టే?
పట్టువడ వండ్రు పట్టీ!, పట్టుకొనన్‌ నాకుఁగాక పరులకు వశమే?
375
క. ఎక్కడ నైనను దిరిగెద, వొక్కయెడన్‌ గుణము కలిగి యుండవు, నియమం
బెక్కడిది నీకు? మఱచినఁ, జక్కఁగఁ బోయెదవు పెక్కుజాడలఁ బుత్త్రా!
376
సీ. తోయంబు లివి యని తొలఁగక చొచ్చెదు, తలఁచెదు గట్టైనఁ దరల నెత్త,
మంటితో నాటలు మానవు, కోరాడె, దున్నతస్తంభంబు లూఁపఁ బోయె,
దన్యుల నల్పంబు లడుగంగఁ బాఱెదు, రాచవేఁటలఁ జాల ఱవ్వదెచ్చె,
దలయవు నీళ్లకు నడ్డంబు గట్టెదు, ముసలివై హలివృత్తి మొనయఁ,జూచె
 
ఆ. దంబరంబు మొలకు నడుగవు తిరిగెద, వింకఁ గల్కిచేఁత లేల పుత్త్ర!
నిన్ను వంప వ్రాల్ప నే నేర ననియొ, నీ విట్టు క్రిందు మీఁదు నెఱుఁగ కునికి.
377
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )