| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | అని మర్మంబు లెత్తి పలికి. | 378 |
| క. |
ఆ లలన గట్టె ఱోలన్, లీలన్ నవనీతచౌర్యలీలుం బ్రియవా గ్జాలుం బరివిస్మిత గో, పాలున్ ముక్తాలలామఫాలున్ బాలున్. |
379 |
| క. |
ఱోలను గట్టువడియు న, బ్బాలుఁడు విలసిల్లె భక్తపరతంత్రుండై యాలానసన్నిబద్ధ వి, శాలమదేభేంద్రకలభసమరుచి నధిపా! |
380 |
| క. |
వెలి లోను మొదలు దుది నడు, ములు లేక జగంబు తుదియు మొదలున్ నడుమున్ వెలియును లో నగు నీశ్వరు, నలవడునే కట్టఁ బ్రణతురాల్ గా కున్నన్? |
381 |
| ఆ. |
పట్టి యెల్లబోఁటి పట్టి యీతం డని, గట్టితలఁపుతోడఁగట్టెఁగాక పట్టికడుపు పెక్కు బ్రహ్మాండములు వట్టు, టెఱిఁగె నేనిఁదల్లి యేల కట్టు? |
382 |
| క. |
చిక్కఁడు సిరికౌఁగిటిలోఁ, జిక్కఁడు సనకాదియోగిచిత్తాబ్జములం జిక్కఁడు శ్రుతిలతికావలిఁ, జిక్కె నతఁడు లీలఁ దల్లిచేతన్ ఱోలన్. |
383 |
| వ. | ఇట్లు గ్రద్దన నా ముద్దియ ముద్దులపట్టియుదరంబు గట్ట నడరుచుఁ జతురంబుగఁ జక్క నొక్కత్రాడు సుట్టిన నది రెండంగుళంబులు గడమపడియె, మఱియు నొక్కబంధనంబు సంధించి వలగొనిన నంతియ కొఱంత యయ్యె, వెండియు నొక్కపాశంబు గూర్చి పరివేష్టించిన వెల్తి సూపె నిట్లు. | 384 |
| క. |
తజ్జనని లోఁగిటంగల, రజ్జుపరంపరలఁ గ్రమ్మఱన్ సుతుఁ గట్టన్ బొజ్జ దిరిగి రా దయ్యె జ, గజ్జాలము లున్న బొజ్జఁ గట్టన్ వశమే? |
385 |
| వ. | అప్పు డా యవ్వయు గోపికలును వెఱంగుపడిరి, తదనంతరంబ. | 386 |
| ఆ. |
ఒడలఁ జెమట లెగయ నుత్తరీయము జార, వీడి యున్న తుఱుము విరులు రాలఁ గట్టరాని తన్నుఁ గట్టెద నని చింతఁ, గట్టుకొనిన తల్లిఁ గరుణఁ జూచి. |
387 |
| క. |
బంధవిమోచనుఁ డీశుఁడు, బంధింపఁ బెనంగు జననిపాటోర్చి సుహృ ద్బంధుఁడు గావున జననీ, బంధంబునఁ గట్టువడియెఁ బాటించి నృపా! |
388 |
| క. |
సంగడిఁ దిరిగెడు శంభుఁడు, నంగాశ్రయ యైన సిరియు నాత్మజుఁడై యు ప్పొంగెడి పద్మజుఁడును గో, పాంగన క్రియఁ గరుణ వడయ రఖిలేశ్వరుచేన్. |
389 |
| క. |
జ్ఞానులచే మౌనులచే, దాసులచే యోగసంవిధానులచేతం బూని నిబద్ధుం డగునే, శ్రీనాథుఁడు భక్తియుతులచేతంబోలెన్? |
390 |
| వ. | అంత న య్యశోద యింటికడం బనులవెంటం దిరుగఁ గృష్ణుండు దొల్లి నారదుశాపంబున నిరుమద్దు లై యున్న నలకూబర మణిగ్రీవులను గుహ్యకుల నిద్దఱం గని ఱో లీడ్చుకొని చనియె నని చెప్పిన శుకయోగివరునకు భూవరుం డిట్లనియె. | 391 |
| క. |
‘నారదుఁ డేల శపించెను?, వా రా వృక్షత్వమునకు వచ్చినపనికిం గారణ మెయ్యది? యోగి కు, లారాధ్య! యెఱుంగఁ జెప్పుమయ్య! వినియెదన్.’ |
392 |
| వ. | అనిన శుకుం డిట్లనియె - ‘మున్ను కుబేరునికొడుకు లిరువురు శంకరకింకరులై యహంకరించి వెండికొండమీఁద విరులతోఁటలం బాడెడి చేడియలం గూడికొని కరేణుసంగతంబు లైన యేనుంగులభంగి సురంగంబు లైన మందాకినీతరంగంబులం గ్రీడింప, నారదుండు వచ్చిన నచ్చెలువలు సెచ్చెర వలువలు ధరియించిరి, మదిరాపానపరవశులు గావున వారలిరువురు వివస్త్రులై మెలంగుచున్న నా మునీశ్వరుండు సూచి శపియించువాఁడై ప్రతీతంబగు గీతంబు వాడె, వినుము. | 393 |
| శా. |
‘సంపన్నుం డొరుఁ గానలేఁడు తనువున్ సంసారమున్ నమ్మి హిం సింపం జూచు, దరిద్రుఁ డెత్తువడి శుష్కీభూతుఁడై చిక్కి హిం సింపం డన్యుల నాత్మకున్ సములుగాఁ జింతించు నట్టౌటఁ ద త్సంపన్నాంధున కంజనంబు వినుమీ దారిద్ర్య మూహింపఁగన్. |
394 |
| వ. | అని గీతంబు వాడి తన మనంబున. | 395 |
| క. |
కలవానిసుతుల మనుచును, గలకంఠులతోడఁ గూడి కానరు పరులం గలలో నైనను, వీరికిఁ, గల క్రొ వ్వడఁగించి బుధులఁ గలుపుట యొప్పున్. |
396 |
| వ. | అని చింతించి విజ్ఞానవిశారదుండగు నారదుండు నలకూబరమణిగ్రీవులం జూచి మీరలు స్త్రీమదాంధులరు గావున భూలోకంబున నర్జునతరువులై నూఱుదివ్యవర్షంబు లుండుం, డట మీఁద గోవిందచరణారవిందపరిస్పందంబున. | 397 |
| క. |
ముక్తులరై నారాయణ, భక్తులరై పరమసాధుభావ శ్రీ సం సక్తులరై సురలోక, వ్యక్తుల రయ్యెదరు నాదువాక్యముకతనన్. |
398 |
| వ. | అని యిట్లు వలికి, నారదుండు నారాయణాశ్రమంబునకుం జనియె. వా రిరువురును సంగడి మద్దులైరి. పరమభాగవతుండైన నారదుమాటలు వీటింబుచ్చక పాటించి. | 399 |