పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
చిన్నికృష్ణుఁడు మద్దిచెట్లను కూల్చుట
క. ముద్దుల తక్కరి బిడ్డఁడు, మద్దులఁ గూల్పంగఁ దలఁచి మసలక తా నా
మద్దికవ యున్న చోటికి, గ్రద్దన ఱో లీడ్చుకొనుచుఁ గడఁకం జనియెన్‌.
400
వ. చని యా యూర్జిత మహాబలుండు నిజోదరదామసమాకృష్యమాణతిర్యగ్భవదులూఖలుండై యా రెండుమ్రాఁకుల నడుమం జొచ్చి ముందటికి నిగుడుచు. 401
క. బాలుఁడు ఱో లడ్డము దివ, మూలంబులు వెకలి విటపములు విఱిగి మహా
భీలధ్వనిఁ గూలెను శా, పాలస్యవివర్జనములు యమళార్జునముల్‌.
402
వ. ఇట్లు నిర్మూలంబు లయి పడిన సాలంబులలోనుండి కీలికీలలు వెల్వడు పోలిక నెక్కుడు తేజంబున దిక్కులు పిక్కటిల్లం బ్రసిద్ధులైన సిద్ధు లిద్దఱు వెడలివచ్చి ప్రబుద్ధులై భక్తలోకపాలకుండైన బాలకునకు మ్రొక్కి లేచి కరకమలంబులు మొగిచి యిట్లనిరి. 403
క. బాలుఁడవె నీవు? పరుఁడ వ, నాలంబుఁడ వధికయోగి వాద్యుఁడవు తను
స్థూలాకృతి యగు విశ్వము, నీ లీలారూప మండ్రు నిపుణులు కృష్ణా!
404
సీ. ఎల్లభూతంబుల కింద్రియాహంకృతి ప్రాణంబులకు నధిపతివి నీవ!
ప్రకృతియుఁ బ్రకృతిసంభవమహత్తును నీవ, వీని కన్నిటికిని విభుఁడ వీవ,
ప్రాకృతగుణవికారములఁ బొందక పూర్వసిద్ధుండ వగు నిన్నుఁ జింత సేయ
గుణవృతుం డోపునే? గుణహీన! నీ యంద, కల గుణంబుల నీవ కప్పఁబడుదు,
 
తే. మొదల నెవ్వని యవతారములు శరీరు, లందు సరిదొడ్డు లేని వీర్యములఁ దనువు,
లడర జన్మించి వారలయందుఁ జిక్క, వట్టి పరమేశ! మ్రొక్కెద మయ్య! నీకు.
405
క. భువనములు సేయఁ గావఁగ, నవతీర్ణుఁడ వైతి కాదె యఖిలేశ్వర! యో
గి వరేణ్య! విశ్వమంగళ!, కవిసన్నుత! వాసుదేవ! కల్యాణనిధీ!
406
ఉపేంద్రవజ్ర. తపస్వివాక్యంబులు దప్ప వయ్యెన్‌, నెపంబునం గంటిమి నిన్నుఁ జూడం
దపంబు లొప్పెన్‌, మముఁ దావకీయ, ప్రపన్నులం జేయుము భక్తమిత్రా!
407
శా. నీ పద్యావళు లాలకించు చెవులున్‌ ని న్నాడు వాక్యంబులున్‌
నీ పేరం బనిసేయు హస్తయుగముల్‌ నీ మూర్తిపైఁ జూపులున్‌
నీ పాదంబులపొంత మ్రొక్కు శిరముల్‌ నీ సేవపైఁ జిత్తముల్‌
నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్‌ నీరేజపత్త్రేక్షణా!
408
వ. అని యిట్లు కీర్తించిన గుహ్యకులం జూచి నగుచు నులూఖల బద్ధుండైన హరి యిట్లనియె. 409
క. ‘తమతమధర్మము దప్పక, సములై నను నమ్మి తిరుగు సభ్యులకును బం
ధము నన్నుఁ జూడ విరియును, గమలాప్తుఁడు వొడమ విరియు ఘనతమము క్రియన్‌.
410
క. కారుణ్యమానసుండగు, నారదు వచనమునఁజేసి ననుఁ బొడఁగనుటన్‌
మీరు ప్రబుద్ధుల రైతిరి, చేరెన్‌ నామీఁది తలఁపు సిద్ధము మీకున్‌.
411
వ. అని యీశ్వరుండు ‘మీరు మీ నెలవులకుం బొం’ డని యానతిచ్చిన మహాప్రసాదంబని వలగొని పెక్కు మ్రొక్కులిడి వీడుకొని నలకూబర మణిగ్రీవు లుత్తరభాగంబున కరిగి, రంత నందాదు లయిన గోపాలకులు నిర్మూలంబులయి పడిన సాలంబుల చప్పుడు పిడుగుచప్పుడని శంకించి వచ్చి చూచి. 412
క. ‘ఈ పాదపములు గూలఁగ, నీ పాపఁ డులూఖలమున నిటు బద్ధుండై
యే పగిది బ్రదికెఁ? గంటిరె!, వాపోవఁడు, వెఱవఁ,డెట్టివాఁడో యితఁడున్‌.
413
ఆ. పిడుగు వడదు, గాక పెనుగాలి విసరదు, ఖండితంబు లగుట గానరాదు,
బాలుఁ డితఁడు, వట్టి పడఁద్రోయఁజాలఁడు, తరువు లేల కూలె ధరణిమీఁద?’
414
వ. అని పెక్కండ్రు పెక్కువిధంబుల నుత్పాతంబులు గావలయు నని శంకింప నక్కడ నున్న బాలకు లిట్లనిరి. 415
క. “నందునికొమరుఁడు వినుఁ డీ, సందున మును దూఱి ఱోలు సరి యడ్డముగా
ముందటి కీడ్చిన మద్దులు, గ్రందుకొనం గూలె, జనులఁ గంటి మిరువురన్‌.”
416
వ. అని యిట్లు పలికిన బాలకాలాపంబులు విని కొందఱు మిథ్యారూపంబు లనిరి, కొందఱు నానావిధంబుల సందేహించి రంత నందుండు వికసితవదనారవిందుం డగుచుఁ బట్టికట్టు విడిచె, నట్టియెడఁదనతెఱంగెవ్వరు నెఱుంగకుండవలె నని కపటకుమారుండు. 417
శా. పాడున్‌ మందునిభంగి, గోపవనితల్‌ పాణిధ్వనుల్‌ సేయఁగా
నాడున్‌ జంత్రముకైవడిం, బరవశుండై హస్తముల్‌ ద్రిప్పుచుం
జూడ న్నే రనివానిభంగి జనులం జూచున్‌, నగున్‌, బాలురం
గూడుం బెద్దలపంపు సేయఁ జను, డాఁగున్‌ మట్టిఁ జిట్టాడుచున్‌.
418
క. ‘చుంచెదుగుఁ బాలు ద్రావు ము, దంచితముగ’ ననుడుఁ బాలుద్రావి, జననితోఁ
జుంచెదుగ దంచు లీలా, చుంచుండై యతఁడు చుంచుఁ జూపు నరేంద్రా!
419
క. సెలగోల వట్టుకొని జల, కలశములో నీడఁ జూచి కలశయుతుండై
సెలగోలఁ బాపఁ డొకఁ డిదె, తలఁచెన్‌ ననుఁ గొట్ట ననుచుఁ దల్లికిఁ జెప్పెన్‌.
420
క. భిక్షులు వచ్చెద రేడ్చిన, భిక్షాపాత్రమున వైచి బెగడించి నినున్‌
శిక్షించెద, రని చెప్పిన, భిక్షులఁ గని, తల్లిఁ గనియు భీతిల్లు నృపా!
421
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )