| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | ఇట్లు కృష్ణుండు బహువిధంబులఁ గపటబాలలీలల వినోదింప, బృహద్వనంబున నందాదు లైన గోపవృద్ధులు మహోత్పాతంబు లగుటయు, వానివలన బాలుం డుత్తరించుటయుఁ జూచి యేకాంతంబున నొక్కనాఁడు విచారింప నుపనందుండను వృద్ధగోపకుండు దన యెఱుక మెఱసి యిట్లనియె. | 422 |
| ఉ. |
‘ఇక్కడ నుందురే మనుజు? లీ మన కృష్ణున కెగ్గు సేయఁగా రక్కసురాలు చ న్నొసఁగె, ఱాలపయిన్ సుడిగాలి వీచెఁ, బైఁ గ్రిక్కిఱియం దరుల్ వడియెఁ, గేశవు సత్కృపఁ దప్పెఁ, జాలు నేఁ డెక్కడి కైనఁ బోవలయు నింకిట గోపకులార! వింటిరే? |
423 |
| క. |
కసవు గల దిరవు పసులకు, లసదద్రినదీమహీజలతికావలి పెం పెసఁగును, గాఁపురమునకును, బొసఁగును బృందావనంబు వొదఁ డచ్చటికిన్. |
424 |
| వ. | అని పలుకు నుపనందునిపలుకుల కార్యులైన గోపకు ‘లిదియ కార్యంబు మందల’ యని కొందల మందక యాలమందల నమందగమనంబున ముందర నడవం బనిచి పిఱుందం గ్రందుకొనకుండ, బాలవృద్ధనారు లెక్కిన తేరులు సాగించి తారు తనుత్రాణతూణీరబాణధరులై విండ్లఁ బట్టుకొని నడవ, బండ్లవెనుకం గొమ్ము లిమ్ములం బూరించుచు నవార్యంబులగు తూర్యరవంబులు సెలంగ నార్యపురోహిత సమేతులై వేడుకలు కొనలు నిగుడ మొన లేర్పఱచుకొని పావనం బగు బృందావనంబునకుం జని రప్పుడు. | 425 |
| తరల. |
పసుపు లాడి యురోజకుంకుమపంకశోభితలై లస ద్వసనలై కచభారచంపకదామలై సులలామలై పసిఁడిమాడలకాంతు లఱ్ఱులఁ బర్వఁ దేరులమీఁదఁ బెం పెసఁగఁ బాడిరి వ్రేత లా హరిహేల లింపగు నేలలన్. |
426 |
| వ. | అప్పుడు రోహిణీయశోద లేకరథంబునఁ బరిపూర్ణమనోరథలై రామకృష్ణుల ముందట నిడుకొని వారలవినోదంబులకుఁ బ్రమోదంబు నొందుచుం జని, రిట్లు గోపకులు బృందావనంబు సొచ్చి యం దర్ధచంద్రాకారంబుగ శకటసందోహంబు నిలిపి మందల విడియించి వసియించిరి. | 427 |
| క. |
చెందిరి బలమాధవు లభి, నందించుచుఁ బరమపావనము నంచిత కా ళిందీసంజీవనమున్, బృందావనమున్ మునీంద్రబృందావనమున్. |
428 |
| వ. | ఇట్లు బృందావనంబుఁ జెంది యందుఁ గొంతకాలంబునకు రామకృష్ణులు సమానవయస్కులైన గోపబాలకులం గూడికొని వేడుక లూఁడుకొన దూడలఁ గాచుచు. | 429 |
| సీ. |
వేణువు లూఁదుచు వివిధరూపములతో గంతులు వైతురు కౌతుకమున, గురుకంబళాదుల గోవృషంబులఁ బన్ని పరవృషభము లని ప్రతిభటింతు, రల్లులు దట్టించి యంఘ్రులగజ్జెలు మొరయఁ దన్నుదు రోలి ముమ్మరముగఁ బన్నిదంబులు వైచి ఫలమంజరులఁ గూల్చి వ్రేటు లాడుదురు ప్రావీణ్య మొప్ప, |
|
| తే. |
వన్యజంతుచయంబుల వాని వాని, పదురు పదురుచు వంచించి పట్టఁబోదు, రంబుజాకరములఁ జల్లులాడఁ జనుదు, రా కుమారులు బాల్యవిహారు లగుచు. |
430 |
| క. |
పోరుదురు గికురు వొడుచుచుఁ, దూఱుదురు భయంబు లేక తోరపుటిరవుల్, జాఱుదురు ఘనశిలాతటి, మీఱుదు రెన్నంగరాని మెలఁకువల నృపా! |
431 |
| వ. | అంత నొక్కనాఁడు యమునాతీరంబున నా కుమారులు గోపకుమారులుం దారును గ్రేపుల మేప నొక్క రక్కసుండు క్రేపురూపున వచ్చి వారల హింసింపం దలంచి. | 432 |