పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
వత్సాసుర బకాసురుల వధ
క. క్రేపుల యఱ్ఱులు నాకుచుఁ, గ్రేపులలో నిదియె మంచి క్రే పనఁగఁ గడుం
జూపట్టి భక్తి సంగతిఁ, గ్రేపై చనువాని మ్రోలఁ గ్రేపై తిరిగెన్‌.
433
వ. వాని నెఱింగి కృష్ణుండు రామునకుం జెప్పి. 434
చ. ‘ఇది యొక మంచిలేఁగ, వినుఁ డెంతయు నొప్పెడి’ నంచు డాసి, త
త్పదములఁ దోఁకయున్‌ బిగియఁ బట్టి చెలంగి వెలంగమ్రానితోఁ
జదియఁగ నొక్క పెట్టుగొని చంపెఁ గుమారుఁడు లేఁగరక్కసుం,
గుదులుకొనంగ బాలకులు గోయని యార్వ నఖర్వలీలతోన్‌.
435
వ. ఇట్లు రక్కసుండు వ్రేటుపడి విశాలంబగు సాలంబుతో నేలంగూలె, నప్పుడు. 436
క. గొంగడు లెగురఁగ వైచుచుఁ, జంగున దాఁటుచును జెలఁగి చప్పట లిడుచుం
బొంగుచుఁ గృష్ణునిఁ బొగడుచుఁ, ద్రుంగిన రక్కసునిఁ జూచి త్రుళ్ళిరి కొమరుల్‌.
437
వ. ఆ సమయంబున వేలుపులు విరులవానలు గురియించి, రివ్విధంబున. 438
క. వత్సములపగిది జగముల, వత్సలతన్‌ మనుపఁజూచువాఁడై యుంటన్‌
వత్సముల మేపుచుండియు, వత్సాసురుఁ జంపె భక్త వత్సలుఁడధిపా!
439
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )