పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
బకాసుర వధ
వ. మఱియు నొక్కనాఁడు రేపకడ గోపకుమారులు క్రేపులం గొంచు నడవికిం జని యెండంబడి మెండుకొనిన దప్పిని బెండువడిన తమతమ లేఁగకదుపుల నేర్పరించి నిలువరించుకొని కలంకంబు లేని యొక్క కొలంకున నీరు ద్రావించి, తారును జలపానంబు సేసి వచ్చునెడ నందు. 440
క. అకలంకులు బాలురు గని, రకుటిలదంభోళిహతసితాద్రిశిఖర రూ
పకమున్‌ హరిహింసారం, భకమున్‌ బకమున్‌ విశాలభయదాంబకమున్‌.
441
వ. కని దానియొడలిపొడవునకు వెఱఁగుపడి చూచుచుండ. 442
ఆ. ఎల్లపనులు మాని యేకాగ్రచిత్తుఁడై, మౌనివృత్తి నితరమమత విడిచి
వనములోన నిలిచి వనజాక్షుపై దృష్టిఁ, జేర్చి బకుఁడు దపసిచెలువుఁ దాల్చె.
443
వ. ఇ వ్విధంబున నొదుఁగు వెట్టికొని యుండి. 444
ఉ. చంచువు దీటి పక్షములు జల్లున విచ్చి పదంబు లెత్తి కు
ప్పించి నభంబుపై కెగసి, భీషణఘోషణవక్త్రుఁడై విజృం
భించి గరుత్సమీరమున భిన్నము లై తరులోలిఁ గూలఁగా
మించి బకాసురుం డొడిసి మ్రింగె సహిష్ణునిఁ జిన్నికృష్ణునిన్‌.
445
క. సంగడిలోకము లన్నియు, మ్రింగుచుఁ గ్రక్కుచును బయల మెలఁగించుచు ను
ప్పొంగెడు, వేడుకకాఁ డటు, మ్రింగుడువడె బకునిచేత మీఁదెఱిఁగి నృపా!
446
క. దనుజుఁడు మ్రింగినఁ గృష్ణునిఁ, గనలేక బలాదిబాలకప్రముఖు లచే
తనులై వెఱఁగందిరి చ, య్యనఁ బ్రాణము లేని యింద్రియంబుల భంగిన్‌.
447
వ. ఇట్లు మ్రింగుడువడి లోనికిం జనక. 448
శా. కంఠోపాంతము దౌడలున్‌ మెఱముచుం గాలాగ్నిచందంబునం
గుంఠీభూతుఁడు గాక వేండ్రమగు నా గోపాలబాలున్‌ జయో
త్కంఠున్‌ బ్రహ్మగురున్‌ మహామహిముఁ జక్కన్‌ మ్రింగ రాదంచు ను
ల్లుంఠం బాడుచు వాఁడు గ్రక్కె వెడలన్‌ లోకం బశోకంబుగన్‌.
449
క. క్రక్కి మహాఘోషముతోఁ, జక్కఁగఁ దనుఁ బొడువరాఁగఁ జంచులు రెండున్‌
స్రుక్కఁగఁ బట్టి తృణముక్రియ, గ్రక్కున హరి సీరె బకునిఁ గలహోత్సుకునిన్‌.
450
వ. అప్పు డా నందనందనునిమీఁద వేలుపులు చాలుపులుగా నందనమల్లికాదికుసుమవర్షంబులు హర్షంబునం గురియించిరి, దేవవాద్యంబులు మొరసె, రామాదిగోపకుమారులు ప్రాణంబులతోఁ గూడిన యింద్రియంబులునుం బోలెఁ గ్రమ్మఱఁ గృష్ణునిం గని రమ్మని కౌఁగిలించుకొని కృష్ణసహితులయి లేఁగ దాఁటుల మరల దాఁటించుకొని మందగమనంబున మంద కరిగిరి, వారలచేత నా వృత్తాంతం బంతయు విని వెఱంగుపడి గోపగోపికాజనంబులు. 451
క. ఆపదలమీఁద నాపద, లీ పాపనిఁ జెంది తొలఁగె, నీ యర్భకుపై
వే పడిన ఖలులు దహనుని, వైపున శలభముల పగిదిఁ బడిరి ధరిత్రిన్‌.
452
వ. అని పలికిరి, మఱియు నా రామకృష్ణులు క్రేపులం గాచుతఱి. 453
సీ. కపులమై జలరాశిఁ గట్టుదమా యని కట్టుదు రడ్డంబు గాలువలకు,
మునులమై తపములు మొనయుదమా యని మౌనులై యుందురు మాట లేక,
గంధర్వవరులమై గానవిద్యలు మీఱఁ బాడుదమా యని పాడఁ జొత్తు,
రప్సరోజనులమై యాడుదమా యని యాఁడురూపులఁ దాల్చి యాడఁ జనుదు,
 
ఆ. రమర దైత్యవరులమై యబ్ధిఁ ద్రత్తమా, యని సరోవరములయందు హస్త
దండచయముఁ ద్రిప్పి తరుతురు తమయీడుకొమరు లనుసరింపఁ గొమరు మిగుల.
454
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )