పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీకృష్ణుఁడు గోపకులతో బంతి చల్దులు గుడువ వనమున కేగుట
వ. అంత నొక్కనాఁడు రామకృష్ణులు గాంతారంబున బంతిచలుదులు గుడువ నుద్యోగించి ప్రొద్దున లేచి, గ్రద్దనం దమయింటి లేఁగకదుపులఁ గదలించి, సురంగంబులకు శృంగంబులు పూరించిన విని, మేలుకని, సంరంభంబున గోపడింభకులు చలిదికావడులు మూపుల వహించి, సజ్జంబులగు కజ్జంబులు గట్టికొని, పదత్రాణవేత్రదండధరులై, లెక్కలకు వెక్కసంబైన తమతమ క్రేపుకదుపులం జప్పుడించి రొప్పుకొనుచుఁ, గాననంబు సొచ్చి, కాంచనమణి పుంజగుంజాది భూషణభూషితు లయ్యును, ఫలకుసుమ కోరకపల్లవవల్లరులు దొడవులుగా నిడుకొని, కొమ్ము లిమ్ముగఁ బూరించుచు, వేణువు లూఁదుచుఁ, దుమ్మెదలం గూడి పాడుచు, మయూరంబులతోడం గూడి యాడుచు, బికంబులం గలసి కూయుచు, శుకంబులం జేరి రొదలు సేయుచుఁ, బులుఁగుల నీడలం బాఱుచు, సరాళంబులగు వాఁగులు గడచుచు, మరాళంబులచెంత నడచుచు, బకమ్ములం గని నిలుచుచు, సారసంబులం జోపి యలంచుచు, నదీజలంబులం దోఁగుచుఁ, దీవయుయ్యెలల నూఁగుచుఁ, బల్లంబులన్‌ డాఁగుచు, దూరంబుల కేగుచుఁ, గపులసంగడిఁ దరువు లెక్కుచు, ఫలంబుల మెక్కుచు, రసంబులకుం జొక్కుచు, నింగికి నిక్కుచు, నీడలు సూచి నవ్వుచుఁ, గయ్యంబులకుం గాలు ద్రవ్వుచుఁ, జెలంగుచు, మెలంగుచు, వ్రాలుచు, సోలుచు బహుప్రకారంబుల శరీరవికారంబులు సేయుచు మఱియును. 455
క. ఒకనొకని చల్దికావడి, నొకఁ డొకఁ డడకించి దాఁచు, నొకఁ డొకఁ డది వే
ఱొకఁ డొకని మొఱఁగి కొని చన, నొకఁ డొకఁ డది దెచ్చి యిచ్చు నుర్వీనాథా!
456
క. ఒక్కఁడు ము న్నేమఱి చన, నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్‌, వే
ఱొక్కఁడు మిట్టి తటాలున, నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁగన్‌.
457
క. తీపుగల కజ్జ మన్యుఁడు, గోపింపఁగ నొడిసి పుచ్చుకొని త్రోపాడం
బైపడి యది గొని యొక్కఁడు, క్రేపులలో నిట్టునట్టుఁ గికురించు నృపా!
458
క. వనజాక్షుఁడు ము న్నరిగిన, ‘మునుపడఁగా నతని నేనె ముట్టెద’ ననుచుం
జని మును ముట్టనివానిన్‌, మును ముట్టినవాఁడు నవ్వు మొనసి నరేంద్రా!
459
వ. ఇ వ్విధంబున. 460
ఉ. ఎన్నఁడునైన యోగివిభు లెవ్వని పాదపరాగ మింతయుం
గన్నులఁ గాన రట్టిహరిఁ గౌఁగిటఁ జేర్చుచుఁ జెట్టఁ బట్టుచుం
దన్నుచుఁ గ్రుద్దుచున్‌ నగుచుఁ దద్దయుఁ బైపడి కూడి యాడుచున్‌
మన్నన సేయు వల్లవకుమారుల భాగ్యము లింత యొప్పునే?
461
క. విందులకును బ్రహ్మసుఖా, నందంబై భక్తగణమునకు దైవతమై
మందులకు బాలుఁడగు హరి, పొందుఁ గనిరి గొల్ల! లిట్టిపుణ్యులు గలరే?
462
వ. అని పలికి శుకయోగీంద్రుండు మఱియు ని ట్లనియె. 463
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )