పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
అఘాసుర వధ
క. అమరు లమృతపానంబున, నమరినవా రయ్యు నే నిశాటునిపంచ
త్వమునకు నెదుళ్ళు సూతురు, తము నమ్మక యట్టి యఘుఁడు దర్పోద్ధతుఁడై.
464
క. బకునికిఁ దమ్ముఁడు గావున, బకమరణము దెలిసి కంసుపంపున గోపా
లక బాలురతోఁ గూడను, బకవైరినిఁ ద్రుంతు ననుచుఁ బటురోషమునన్‌.
465
క. ‘బాలురు ప్రాణంబులు గో, పాలురకు, మదగ్రజాతుప్రాణము మా ఱీ
బాలురఁ జంపిన నంతియ, చాలును, గోపాలురెల్ల సమసినవారల్‌.
466
వ. అని నిశ్చయించి, యోజనంబు నిడుపును, మహాపర్వతంబు పొడవును, గొండతుదల మీఱిన కోఱలును, మిన్ను దన్ని పన్నిన నల్లమొగిళ్ళ పెల్లుగల పెదవులును, బిలంబులకు నగ్గలం బైన యిగుళ్ళసందులును, నంధకారబంధురంబైన వదనాంతరాళంబును, దావానలజ్వాలాభీలంబైన దృష్టిజాలంబును, వేఁడిమికి నివాసంబులైన యుచ్ఛ్వాసనిశ్వాసంబులును మెఱయ, నేల నాలుకలు పఱచుకొని ఘోరంబగు నజగరాకారంబున. 467
క. జాపిరము లేక యిప్పుడు, గ్రేపుల గోపాలసుతులఁ గృష్ణునితోడన్‌
గీపెట్టఁగ మ్రింగెద నని, పాపపురక్కసుఁడు త్రోవఁబడి యుండె నృపా!
468
వ. ఆ సమయంబున. 469
మ. ‘ఒక వన్యాజగరేంద్ర మల్లదె గిరీంద్రోత్సేధమై దావ పా
వకకీలాపరుషప్రచండతరనిశ్శ్వాసంబుతో ఘోర వ
హ్ని కరాళాతతజిహ్వతోడ మనలన్‌ హింసింప నీక్షించుచున్‌
వికటంబై పడిసాఁగి యున్నది పురోవీథిం గనుంగొంటిరే?
470
వ. అని యొండొరులకుం జూపుచు. 471
మ. బకునిం జంపిన కృష్ణుఁ డుండ మనకుం బామంచుఁ జింతింప నే
టికి? రా పోదము దాఁటి, కాక యది కౌటిల్యంబుతో మ్రింగుడున్‌
బకువెంటం జనుఁ గృష్ణుచేత’ ననుచుం బద్మాక్షు నీక్షించి యు
త్సుకు లై చేతులు వ్రేసికొంచు నగుచున్‌ దుర్వారులై పోవఁగన్‌.
472
వ. వారలం జూచి హరి దనమనంబున. 473
ఉ. ‘అర్భకు లెల్లఁ బాము దివిజాంతకుఁ డౌట యెఱుంగ, రక్కటా!
నిర్భయులై యెదుర్కొనిరి నేఁ గల నంచు విమూఢు లంచు నా
విర్భవదాగ్రహత్వమున వెన్తగులం దమలేఁగపిండుతో
దుర్భరఘోరసర్పఘనతుండబిలాంతముఁజొచ్చి రందఱున్‌.
474
వ. అయ్యవసరంబున. 475
శా. వేల్పుల్‌ సూచి భయంబు నొంద గ్రసనావేశంబుతో నుజ్జ్వల
త్కల్పాంతోజ్జ్వలమానజిహ్వదహనాకారంబుతో మ్రింగె న
స్వల్పాహీంద్రము మాధవార్పితమనోవ్యాపారసంచారులన్‌
స్వల్పాకారుల శిక్యభారులఁ గుమారాభీరులన్‌ ధీరులన్‌.
476
వ. ఇట్లు పెనుఁబాముచేత మ్రింగుడుపడు సంగడికాండ్రగమిం జూచి కృష్ణుండు. 477
చ. ‘పడుచులు లేఁగలుం గలసి పై కొని వత్తురు తొల్లి కృష్ణ! మా
కొడుకు లదేల రా?’ రనుచు గోపిక లెల్లను బల్క నే క్రియన్‌
నొడివెద? నేఁడు పన్నగమునోరికి వీరికి నొక్కలంకెగా
నొడఁబడ నేల చేసె? విధి యోడక సేయుఁ గదయ్య క్రౌర్యముల్‌!
478
వ. అని తలపోసి, నిఖిలలోచనుండును, నిజాశ్రితనిగ్రహమోచనుండును నైన తమ్మికంటి, మింటితెరు వరులు మొఱలిడ రక్కసు లుక్కుమిగుల వెక్కసంబగు నజగరంబయి యున్న య న్నరభోజనుకుత్తుకకుఁ బొత్తుగొని మొత్తంబు వెంటనంటం జని తమ్ము నందఱఁ జిందఱవందఱ సేసి మ్రింగ నగ్గలించు నజగరంబు కంఠద్వారంబున సమీరంబు వెడలకుండఁ దనశరీరంబు వెంచి గ్రద్దన మిద్దె సఱచి నట్లుండ. 479
క. ఊపిరి వెడలక కడుపున, వా పొదవినఁ బాము ప్రాణవాతంబులు సం
తాపించి శిరము వ్రక్కలు, వాపికొనుచు వెడలి చనియెఁ బటుఘోషముతోన్‌.
480
శా. క్రూరవ్యాళవిశాలకుక్షిగతులన్‌ గోవత్ససంఘంబుతోఁ
గారుణ్యామృతవృష్టిచేత బ్రదుకంగాఁ జూచి వత్సంబులున్‌
వారుం దాను దదాస్యవీథి మగుడన్‌ వచ్చెన్‌ ఘనోన్ముక్తుఁడై
తారానీకముతోడ నొప్పెసఁగు నా తారేశుచందంబునన్‌.
481
ఆ. అమరవరులకొఱకుఁ గమలజాండం బెల్ల, బలిఁ దిరస్కరించి బలియువడుగు
గోపసుతులకొఱకుఁ బాపపుఁబెనుఁబాము, గళము దూఁటుగట్ట బలియకున్నె!
482
ఉ. ఆ పెనుఁబాము మేన నొక యద్భుతమైన వెలుంగు దిక్తటో
ద్దీపకమై వడిన్‌ వెడలి దేవపథంబునఁ దేజరిల్లుచుం
గ్రేపులు బాలురున్‌ బెదరఁ గృష్ణునిదేహము వచ్చి చొచ్చె నా
పాపఁడు సొచ్చి ప్రాణములఁ బాపినయంతన శుద్ధసత్త్వమై.
483
క. తన రూ పొక మా ఱైనను, మనమున నిడికొనినఁ బాపమయు నైనను లోఁ
గొని చను హరి దను మ్రింగిన, దనుజునిఁ గొనిపోవకున్నె తన లోపలికిన్‌?
484
వ. తదవసరంబున, సురలు గుసుమవర్షంబులు గురియించిరి, రంభాదు లాడిరి, గంధర్వాదులు పాడిరి, మేఘంబులు మృదంగంబులభంగి ఘోషించె, సిద్ధగణంబులు ‘జయజయ’ భాషణంబులు భాషించి, రంత. 485
శా. ఆ వాద్యంబులు, నా మహాజయరవం, బా పాట లాయాటలుం
దేవజ్యేష్ఠుఁడు పద్మజుండు విని ప్రీతిన్‌ భూమి కేతెంచి నేఁ
డీ వత్సార్భకులన్‌ భుజంగపతి హింసింపంగ నీ బాలకుం
డే వెంటన్‌ బ్రదికించె? మే, లనుచు నూహించెం గడున్‌ నివ్వెఱన్‌.
486
వ. అంత న య్యజగరచర్మంబు గొన్ని దివసంబుల కెండి పెద్ద కాలంబు గోపాలబాలురకుం గేళీబిలంబై యుండె, నిట్లు కౌమారవిహారంబున నైదవయేఁటఁ గృష్ణుం డఘాసురునిం దెగఁ జూచుటయుఁ దమ్ముం గాచుటయు, నాఱవయేఁటిదైన పౌగండవృత్తాంతం బని చిత్తంబులం గోపకుమారులు దలంచు చుందు రని చెప్పిన నప్పుడమిఱేఁ డ ప్పరమయోగీంద్రున కిట్లనియె. 487
సీ. ‘అయిదేండ్లు కౌమార, మటమీఁద నైదేండ్లు పౌగండ మనియెడు ప్రాయమందు,
నయిదేండ్లవాఁడైన యబ్జాక్షుచరితంబు పౌగండ మని గోపబాలు రెల్లఁ
దలఁతు రంటివె? యెట్లు దలఁతురు వారలు? నిరుడు సేసినపని నేఁటి దనఁగ
వచ్చునే? యిది నాకు వరుసతో నెఱిఁగింపు’ మనవుడు యతిచంద్రుఁడైన శుకుఁడు
 
ఆ. యోగదృష్టిఁ జూచి యొక్కింత భావించి ‘వినుము రాజవర్య! వినయధుర్య!
పరమగుహ్య మనుచుఁ బల్కుదు రార్యులు, శిష్యజనుల కీవు సేయు తలఁపు.
488
క. ప్రియురాలివలని వార్తలు, ప్రియజనులకు నెల్లప్రొద్దుఁబ్రియ మగు భంగిన్‌
బ్రియుఁడగు హరిచరితంబులు, ప్రియభక్తుల కెల్లయెడలఁ బ్రియములు గావే!
489
వ. అని పలికి యోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె. న ట్లఘాసురుమొగంబువలనం గడ చనిన లేఁగల గోపకుమారులన్‌ బ్రదికించి వారును దానునుం జని చని. 490
మ. కనియెం గృష్ణుఁడు సాధునీరము మహాగంభీరముం బద్మకో
కనదాస్వాదవినోదమోదమదభృంగద్వంద్వఝంకారమున్‌
ఘనకల్లోలలతావితానవిహరత్కాదంబకోలాహల
స్వనవిస్ఫారము మందవాయుజకణాసారంబుఁ గాసారమున్‌.
491
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )