| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | కని తమ్మికంటి తమ్ముల యింటి సొబగునకు నిచ్చ మెచ్చుచుఁ జెచ్చెర గాలి నోలిం గదలెడు కరళ్లతుంపురుల జల్లుపెల్లున నొడళ్లు గగురుపొడువఁ గొలంకుఁ గెలంకులఁ గాయపండుల గొలలవ్రేఁగున వీఁగి పట్టు గల చెట్టుఁదుటుము నీడల నొప్పుచున్న యిసుక తిప్పల విప్పు సూచి వేడుక పిచ్చలింప నెచ్చెలుల కిట్లనియె. | 492 |
| శా. |
“ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రిం కేలా విలంబింపఁగా రండో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్క డీ దండన్ లేఁగలు నీరు ద్రావి యిర వందం బచ్చికల్ మేయుచుం దండంబై విహరించుచుండఁగ నమందప్రీతి భక్షింతమే! |
493 |
| వ. | అనిన “నగుఁ గాక”యని వత్సంబుల నుత్సాహంబున నిర్మలంబులగు జలంబులు ద్రావించి, పచ్చికల మొల్లంబులు గల పల్లంబుల నిలిపి చొక్కంబులగు చల్దులచిక్కంబులు సక్కడించి. | 494 |
| మ. |
జలజాంతస్స్థితకర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే కుల చందంబునఁగృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్ శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులున్ బువ్వు లా కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా! |
495 |
| సీ. |
మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు నూరుఁగాయలు దినుచుండు నొక్కఁ, డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి “చూడు లే” దని నోరు సూపు నొక్కఁ, డేగు రార్గురచల్దు లెలిమిఁ బన్నిద మాడి కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ డిన్ని యుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన మనుచు బంతెనగుండు లాడు నొకఁడు, |
|
| ఆ. |
కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి పరుమ్రోల, మేలిభక్ష్యరాశి మెసఁగు నొకఁడు నవ్వు నొకఁడు, సఖుల నవ్వించు నొక్కఁడు, ముచ్చటాడు నొకఁడు, మురియు నొకఁడు. |
496 |
| వ. | అయ్యవసరంబున. | 497 |
| సీ. |
కడుపున దిండుగాఁ గట్టినవలువలో, లాలితవంశనాళంబుఁ జొనిపి విమలశృంగంబును వేత్రదండంబును జాఱి రానీక డాచంక నిఱికి మీఁగడ పెరుఁగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలిచేత మొనయ నునిచి చెలరేఁగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు వ్రేళ్ల సందులయందు వెలయ నిఱికి |
|
| ఆ. |
సంగడీల నడుమఁ జక్కఁగఁ గూర్చుండి, నర్మభాషణముల నగవు నెఱపి యాగభోక్త కృష్ణుఁ డమరులు వెఱఁగంద, శైశవంబు మెఱసి చల్ది గుడిచె. |
498 |
| వ. | ఇట్లు కృష్ణసహితు లయిన గోపకుమారులు చల్దులు గుడుచు నెడఁ గ్రేపులు మేపులకుం జొచ్చి పచ్చనిగఱికిజొంపంబుల గుంపుల కుఱికి, లంపులు మేయుచు, ఘోరంబగు నరణ్యంబు నడుమఁ దోరంబగు దూరంబు సనిన, వానిం గానక వెఱచుచున్న గోపడింభకులకు నంభోజనయనుం డిట్లనియె. | 499 |
| మ. |
వినుఁ డో బాలకులార! క్రేపు లటవీవీథిన్ మహాదూరముం జనియెం గోమలఘాసఖాదనరతోత్సాహంబుతో నెందుఁ బో యెనొ యే మయ్యెనొ క్రూరజంతువులచే నే యాపదం బొందెనో? కని తెత్తుం, గుడువుండు చల్దిఁ, గొఱఁతల్ గా కుండ మీ రందఱున్? |
500 |