| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | అని చెప్పి. | 501 |
| శా. |
కర్ణాలంబితకాకపక్షములతో గ్రైవేయహారాళితో స్వర్ణభ్రాజితవేత్రదండకముతో సత్పింఛదామంబుతోఁ బూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతోఁ దూర్ణత్వంబున నేగె లేఁగలకునై దూరాటవీవీథికిన్. |
502 |
| వ. | ఇ ట్లేగుచు. | 503 |
| క. |
ఇచ్చోఁ బచ్చిక మేసిన, విచ్చోఁ ద్రావినవి తోయ, మేగిన విచ్చో, నిచ్చోట మంద గొన్నవి, యిచ్చోఁ బాసినవి జాడ యిదె యిదె యనుచున్. |
504 |
| క. |
కంజదళాక్షుఁడు వెదకెను, గొంజక లేఁగల నపారగురుతృణవనికా పుంజంబుల భీకరమృగ, కుంజంబులఁ దరుల గిరులఁ గొలఁకుల నదులన్. |
505 |
| వ. | అంత. | 506 |
| శా. |
బాలుం డయ్యు నితం డఘాసురుఁడు ద్రుంపన్ బాలురం గ్రేపులన్ ఏ లీలన్ బ్రదికించెనొక్కొ? భువి నూహింపం గడుం జోద్య మం చాలో నంబుజసంభవుండు సని మాయాబాలు శుంభద్బలం బాలోకింపఁ దలంచి డాఁచె నొకచో నా లేఁగలన్ బాలురన్. |
507 |
| వ. | ఆ సమయంబున దూడలు వోయిన జాడ యెఱుంగక, తప్పి య ప్పద్మలోచనుం డెప్పటి కొలంకుకడకు వచ్చి, యచ్చోట నెచ్చెలులం గానక వారిం జీరి, లేకుండుట నిశ్చయించి గోవిందుండు విశ్వవిదుండు గావున నిది విరించి మొఱం గని యెఱింగి తిరిగిపోవుచు. | 508 |
| శా. |
వంచింపం బనిలేదు బ్రహ్మ కిచటన్ వత్సంబులన్ బాలురన్ వంచించెం గనుఁబ్రామి, తన్ను మరలన్ వంచించు టాశ్చర్యమే? వంచింపన్ మనకేల! తెచ్చుటకునై వల్దంచు బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింప నేర్చు హరి లీలన్ మందహాసాస్యుఁడై. |
509 |
| క. |
గోపాలసుతులు లే రని, గోపికలకుఁ జెప్పనేల? గోపాలకులున్ గోపికలు నలర బాలుర, క్రేపులరూపముల నేఁ జరించెద ననుచున్. |
510 |
| మ. |
కరముల్ పాదములున్ శిరంబు లవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాం తరముల్ ముక్కులుఁ గన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండ కాం బర స్రగ్వేణువిషాణభూషణవయోభాషాగుణాఖ్యాన త త్పరతల్ వీడ్వడకుండఁ దాల్చె విభుఁ డా వత్సార్భకాకారముల్. |
511 |
| క. |
రూపంబు లెల్ల నగు బహు, రూపకుఁ డిటు బాలవత్సరూపంబులతో నే పారు టేమి చోద్యము?, రూపింపఁగ నతని కితరరూపము గలదే? |
512 |
| క. |
మరలుపు మనియెడు కర్తయు, మరలించు కుమారకులును మరలెడి క్రేపుల్, పరికింప దాన యై హరి, మరలం జనె లీలతోడ మందకు నధిపా! |
513 |
| వ. | ఇట్లు బాలవత్సరూపంబులతో విహరించుచు మందకు వచ్చి వారివారిదొడ్ల నయ్యై వత్సంబుల ముందఱి కందువల నిలిపి, తత్తద్బాలరూపంబుల నందఱిగృహంబులం బ్రవేశించి వేణునాదంబులు సేసిన, | 514 |
| చ. |
కొడుకుల వేణునాదములు గొబ్బున వీనులకుం బ్రియంబు లై ముడివడ లేచి యెత్తికొని మూర్కొని తల్లులు గౌఁగిలించుచుం జడిగొనఁ జేఁపు వచ్చి తమచన్నులయందు సుధాసమంబు లై వెడలెడిపాలు నిండుకొనువేడుక నిచ్చిరి తత్సుతాళికిన్. |
515 |
| వ. | మఱియుఁ దల్లు లుల్లంబులఁ బెల్లుగ వెల్లిగొను వేడుకలం దమనందనులకు నలుంగు లిడి, మజ్జనంబులు గావించి, గందంబు లలంది తొడవులు దొడిగి నిటలతటంబుల రక్షాతిలకంబులు వెట్టి, సకలపదార్థసంపన్నంబు లయిన యన్నంబు లొసంగి సన్నములు గాని మన్ననలు సేసిరి. | 516 |
| క. |
ఏ తల్లుల కే బాలకు, లే తెఱఁగునఁ దిరిగి ప్రీతి యెసఁగింతురు ము న్నా తల్లుల కా బాలకు, లా తెఱఁగునఁ బ్రీతిఁ జేసి రవనీనాథా! |
517 |
| వ. | ఆ సమయంబున. | 518 |
| ఉ. |
పాయని వేడ్కతో నునికిపట్టులకుం జని గోవులెల్ల నం బే యని చీరి హుమ్మనుచుఁ బేరిచి మూర్కొని పంచితిల్లి పె ల్లై యతిరేకమై పొదుఁగులం దెడలేక స్రవించుచున్న పా లాయెడ నాకుచున్ సుముఖలై యొసఁగెన్ నిజవత్సకోటికిన్. |
519 |
| క. |
వ్రేతలకును గోవులకును, మాతృత్వము సాలఁ గలిగె మఱి మాధవు పై మాత లని హరియు నిర్మల, కౌతూహల మొప్పఁ దిరిగెఁగడు బాల్యమునన్. |
520 |
| ఆ. |
ఘోషజనుల కెల్లఁ గుఱ్ఱలపై వేడ్క, పూఁటపూఁట కెలమిఁ బొటకరించె నిచ్చ క్రొత్త యగుచు నీరజాక్షునిమీఁద, వేడ్కఁ దమకుఁ దొల్లి వెలసినట్లు. |
521 |
| వ. | ఇట్లు కృష్ణుండు బాలవత్సరూపంబులు దాల్చి తన్నుఁ దాన రక్షించుకొనుచు, మందను వనంబున నమందమహిమంబున నొక్కయేఁడు క్రీడించె. నా యేఁటికి నై దాఱు దినంబులు కడమవడి యుండ నం దొక్కనాఁడు బలభద్రుండును, దానును వనంబునకుం జని మందచేరువ లేఁగల మేప నతిదూరంబున గోవర్ధనశైలశిఖరంబున ఘాసంబులు గ్రాసంబులు గొనుచున్న గోవు లా లేఁగలం గని. | 522 |
| చ. |
ముదమున హుంకరించుచును, మూఁపులపై మెడ లెత్తి చాఁచుచుం బదములు నాల్గు రెండయిన బాగునఁ గూడఁగఁ బెట్టి దాఁటుచున్ వదనములన్ విశాలతరవాలములన్ వడి నెత్తిపాఱి యా మొదవులు సన్నులం గుడిపె మూఁతుల మ్రింగెడిభంగి నాకుచున్. |
523 |
| వ. | అంత గోపకులు గోవుల వారింప నలవి గాక, దిగ్గన నలుకతోడి సిగ్గు లగ్గలంబుగ దుర్గమ మార్గంబున వానివెంట నంటి వచ్చి లేఁగల మేపుచున్న కొడుకులం గని. | 524 |
| ఉ. |
అయ్యలఁ గంటి మంచుఁ బులకాంకురముల్ వెలయంగఁ గుఱ్ఱలం జయ్యన డాసి యెత్తుకొని సంతస మందుచు గౌఁగిలించి తా రయ్యెడ నౌఁదలల్ మనము లారఁగ మూర్కొని ముద్దు సేయుచున్ దయ్య మెఱుంగు, గోపకులు దద్దయు నుబ్బిరి నిబ్బరంబుగన్. |
525 |
| వ. | ఇట్లు బాలకాలింగనంబుల నానందబాష్పపూరితనయనులై గోపకులు గోవుల మరలించుకొని తలంగి చన వారలం జూచి బలభద్రుండు దనలో నిట్లని తలంచె. | 526 |
| సీ. |
చన్ను మానినయట్టి శాబకశ్రేణిపై గోగణంబులకును గోపకులకు నిబ్భంగి వాత్సల్య మెబ్భంగి నుదయించె? హరిఁ దొల్లి మన్నించునట్లు వీరు మన్నించుచున్నారు మమతఁ జేయుచుఁ బ్రీతి నంబుజాక్షునిఁ గన్నయట్లు నాకుఁ బ్రేమమయ్యెడి, డింభబృందంబుఁ గనుఁగొన్న నిది మహాద్భుత మెందు నెఱుఁగరాదు |
|
| తే. |
మనుజ దైవత దానవమాయయొక్కొ?, కాక నా భర్త యగుచున్న కమలనయను మాయయో కాక యితరులమాయ నన్నుఁ, గలఁప నోపదు విభుమాయ గాఁగ నోపు. |
527 |
| క. |
అని మున్న ముగ్ధుఁ డయ్యును, దనయందుల దివ్యదృష్టిఁ దప్పక బుద్ధిం దన చెలికాండ్రను గ్రేపుల, వనజాక్షుం డనుచుఁ జూచె వసుధాధీశా! |
528 |
| వ. | ఇట్లు విజ్ఞానదృష్టిం జూచి యెఱింగియు నమ్మక బలదేవుండు గొందలంపడుచుఁ గృష్ణుం జూచి ‘మహాత్మా! తొల్లి యెల్ల క్రేపులును ఋషులయంశం బనియును, గోపాలకులు వేల్పులయంశం బనియును దోఁచు చుండు, నిపుడు వత్సబాలక సందోహంబు సందేహంబు లేక నీవ యని తోఁచుచున్న, దిదియ యేమి?’యని యడిగిన నన్నకు నున్నరూపు వెన్నుండు మన్ననసేసి క్రన్నన యెఱింగించె, నతండు నెరింగె నవ్విధంబున హరి బాలవత్సంబులు దానయై సంచరించిన యేఁడు విరించికిఁ దన మానంబున నొక్క త్రుటి మాత్రంబైన, విరించి చనుదెంచి, వత్సబాలకాకారుండైన కృష్ణబాలకుం జూచి వెఱంగు పడి యిట్లని వితర్కించె. | 529 |
| శా. |
మందం గల్గిన వత్సబాలకులు నామాయాగుహాసుప్తులై యెందుం బోవరు, లేవ రిప్పుడును వేఱే చేయ నాకన్యు లొం డెందున్ లేరు, విధాతలుం బరులు, వీ రెవ్వార లె ట్లైరొకో! యెం దేతెంచిరొ కృష్ణుతో మెలఁగువా? రేఁడయ్యెడిన్ నేఁటికిన్. |
530 |
| మత్తకోకిలము. |
బ్రహ్మపంపునఁ గాని పుట్టదు ప్రాణిసంతతి యెప్పుడున్ బ్రహ్మ నొక్కఁడఁ గాని వేఱొక బ్రహ్మ లేఁడు సృజింపఁగా బ్రహ్మ నేను సృజింప నొండొక బాలవత్సకదంబ మే బ్రహ్మమందు జనించె? నొక్కట బ్రహ్మ మౌ నది చూడఁగాన్. |
531 |
| వ. | అని యిట్లు సకలంబును సుకరంబున నెఱింగెడి నెఱవాది ముదుక యెఱుక గల ప్రోడ వెఱంగుపడి గ్రద్దనఁ బెద్దప్రొద్దు దద్దయుం దలపోసి కర్జంబు ముందల యెఱుంగక కొందలం పడుచు నాందోళనంబున. | 532 |
| క. |
మోహము లేక జగంబుల, మోహింపఁగఁ జేయ నేర్చి మొనసినవిష్ణున్ మోహింపించెద ననియెడు, మోహమున విధాత దాన మోహితుఁ డయ్యెన్. |
533 |
| తే. |
పగలు ఖద్యోతరుచి చెడుపగిది రాత్రి,మంచు చీఁకటి లీనమై మాయుమాడ్కి విష్ణుపై నన్యమాయలు విశద మగునె?, చెడి నిజేశుల గరిమంబుఁ జెఱుచుఁగాక. |
534 |
| వ. | మఱియును. | 535 |
| క. |
పుట్టితి, బుద్ధి యెఱింగితిఁ, బుట్టించితి జగము, సగము వోయెను బ్రాయం, బిట్టివి నూతనసృష్టులు, పుట్టుట లే, దౌర! యిట్టి బూమెలు భూమిన్. |
536 |
| వ. | అని యిట్లు దలవాకిట వాణిగల పోఁడిమిచే వాఁడిమి కెక్కిన నలుమొగంబుల తక్కరిగొంటు పెనుదంట పలువెంటలం దనమనంబున వితర్కించి, విచారించునెడ, నతండు గనుంగొనుచుండ నబ్బాలకులు మేఘశ్యాములును, హారకుండల కిరీట వనమాలికాభిరాములును, శ్రీవత్స మంగళాంగద నూపుర కనక కటక కంకణ కటిఘటిత కాంచీగుణోద్దాములును, నాపాదమస్తక తులసీదళదాములును, విలస దంగుళీయకస్తోములును, శంఖ చక్ర గదా కమల హస్తులును, చతుర్భుజప్రశస్తులును, బీతకౌశేయవాసులును, జంద్రికాధవళహాసులును, గరుణాకటాక్ష వీక్షణవిలాసులును, రవికోటిభాసులును, ననంత సచ్చిదానంద రూపమహితులును, నణిమాదిగుణోపేతులును, విజాతీయభేదరహితులును, శ్రీ మన్నారాయణ ప్రతిమాన విగ్రహస్వరూపులును నయి తమకుఁ బరతంత్రు లగుచు నృత్తగీతాదిసేవావిశేషంబులకుం జొచ్చి మెలంగుచు మూర్తిమంతంబులయిన బ్రహ్మాదిచరాచరంబులును నణిమాదిసిద్ధులును, మాయాప్రముఖంబులైన శక్తులును, మహదాదిచతుర్వింశతితత్త్వంబులును, గుణక్షోభ కాలపరిణామ హేతుసంస్కారకామ కర్మగుణంబులును సేవింప వేదాంతవిదులకైన నెఱుంగరాని తెఱంగున మెఱయుచుఁ గానంబడిన వారలం గనుంగొని. | 537 |
| ఉ. |
బాలురఁ గంటి నాచెయిదిఁ బాసినవారిని మున్నవారి నేఁ బోలఁగఁ జూచునంతటన భూరినిరర్గళదుర్గమప్రభా జాలముతోడఁ జూపులకుఁ జాలమిఁ దెచ్చుచు, నున్నవార, లే మూలమొ? మార్గ మెయ్యదియొ? మోసము వచ్చెఁగదే! విధాతకున్. |
538 |
| వ. | అని సకలేంద్రియంబులకు వెక్కసంబయిన స్రుక్కి. | 539 |
| ఉ. |
ఏ పరమేశుతేజమున నీ సచరాచరమైనలోక ము ద్దీపిత మయ్యె నట్టి విభుతేజముఁ గన్నులఁ జక్కఁ జూడఁగా నోపక పారవశ్యమును నొందుచు సంస్తిమితాఖిలేంద్రియుం డై పరమేష్ఠి మైమఱచె నప్పుడు చిత్రపురూపుకైవడిన్. |
540 |
| వ. | ఇట్లు మాయాతీతుండును, వేదాంతవిజ్ఞానదుర్లభుండును, స్వప్రకాశానందుండును నైన తన బాహుళ్యంబుఁ జూచి నివ్వెఱపడినబ్రహ్మం గని యీశ్వరుండు. | 541 |
| శా. |
‘బాలుండై చతురాననుండు తన యీ బ్రహ్మాభిమానంబునన్ లోలుండై మతిదప్పి నా మహిమ యాలోకింప నేతెంచెఁ దా నాలోకింపఁగ నెంతవాఁ?డనుచు మాయాజాలమున్ విప్పి త ల్లీలారూపము లెల్ల దాఁచె నటఁ గేళీచాతురీధుర్యుఁడై. |
542 |
| వ. | అంతలోన నజీవుండు సజీవుండైన తెఱంగున నెనిమిదికన్నులు గల వేలుపుగమికాఁడు తేఱి తెప్పిఱి కాలుఁ గేలుఁ గదలించి, చెచ్చెరం గన్నులు విచ్చిచూడ సమర్థుండై ముందటఁ గని, వెనుకఁ జూచి, దివి విలోకించి, దిక్కులు వీక్షించి, యెల్లయెడలం గలయ దర్శించి, తన పురోభాగంబున హరి సంచరించుటంజేసి జాతివైరంబులు లేని నరపక్షి మృగాదులకు నాటపట్టయి సిరి గలిగి కామక్రోధాదిరహితులకు జీవనంబైన బృందావనంబుంబొడగాంచి యందె. | 543 |
| సీ. |
తన కన్యములు లేక తనరారి ముమ్మూలవిభుఁ డయ్యుఁ గ్రేపుల వెదకువాని నఖిలజ్ఞుఁడై యొక్కఁ డయ్యు నజ్ఞాకృతిఁ జెలికాండ్రఁ బెక్కండ్రఁ జీరువాని బహిరంతరాద్యంతభావశూన్యుం డయ్యు నంతంత నడుగు చొప్పరయువాని గురుగభీరుం డయ్యు పరువులు వాఱుచు నట్టిట్టుఁ బాతరలాడువాని |
|
| ఆ. |
జాతిరహితుఁ డయ్యుఁ జతుర గోపార్భక, భావ మెల్ల నచ్చువడినమేని చెలువువాని హస్తశీతాన్నకబళంబు, వానిఁ గాంచె నపుడు వాణిమగఁడు. |
544 |
| వ. | కని సంభ్రమించి విరించి రాయంచ డిగ్గనుఱికి కనకదండసుకుమారంబైన శరీరంబుతోడ నేలఁ జాఁగిలంబడి మణిగణసుప్రకాశంబులైన తన కిరీటశిఖరప్రదేశంబు లాకుమారునిపాదపద్మంబులు మోవ మ్రొక్కి తోరంబులగు నానందబాష్పజలపూరంబుల నతని యడుగులు గడిగి మఱియును. | 545 |
| క. |
అడుగులపైఁ బడు లేచుం, బడుఁ గ్రమ్మఱ లేచు, నిట్లు భక్తిన్ మును తాఁ బొడగనిన పెంపుఁ దలఁచుచు, దుడుకని మహిమాబ్ధి నజుఁడు దుడు కడిచె నృపా! |
546 |
| వ. | అంత నల్లనల్లన లేచి నిలుచుండి నయనారవిందంబులు దెఱచి, గోవిందుని సందర్శించి చతుర్ముఖుండు ముఖంబులు వంచి కృతాంజలియై దిగ్గన డగ్గుత్తిక యిడుచు నేకచిత్తంబునఁ జతుర్ముఖంబుల నిట్లని స్తుతియించె. | 547 |