| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| సీ. |
శంపాలతికతోడి జలదంబుకైవడి మెఱుఁగు టొల్లియతోడి మేనివానిఁ గమనీయమృదులాన్నకబళవేత్రవిషాణవేణుచిహ్నంబులు వెలయువాని గుంజావినిర్మితకుండలంబులవాని శిఖిపింఛవేష్టితశిరమువాని వనపుష్పమాలికావ్రాతకంఠమువాని నలినకోమలచరణములవానిఁ |
|
| ఆ. |
గరుణ గడలుకొనిన కడగంటివాని గో, పాలబాలుభంగిఁ బరఁగువాని నగుమొగంబువాని ననుఁగన్న తండ్రిని, నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష! |
548 |
| మ. |
నను మన్నించి భవజ్జనంబులకు నానందంబు నిండించు నీ తనురూపం బిదె నామనంబున కచింత్యం బయ్యె, నీ యుల్లస ద్ఘనవిశ్వాకృతి నెవ్వఁ డోపు? నెఱుఁగం గైవల్యమై యొప్పు నా త్మనివేద్యంబగు నీదు వైభవము చందంబెట్టిదో యీశ్వరా! |
549 |
| క. |
విజ్ఞానవిధము లెఱుఁగక, తజ్‌జ్ఞులు నీ వార్తఁ జెప్పఁ దను వాఙ్మనముల్ యజ్ఞేశ! నీకు నిచ్చిన, యజ్ఞులు నినుఁబట్టి గెలుతు రజితుఁడ వైనన్. |
550 |
| క. |
శ్రేయములు గురియు భక్తినిఁ, జేయక కేవలము బోధసిద్ధికిఁ దపముం జేయుట విఫలము, పొల్లున, నాయము సేకుఱునె తలఁప నధికం బైనన్. |
551 |
| క. |
నిజముగ ని న్నెఱుఁగఁగ మును, నిజవాంఛలు నిన్నుఁ జేర్చి నీ కథ వినుచున్ నిజకర్మలబ్ధభక్తిన్, సుజనులు నీ మొదలిటెంకిఁ జొచ్చి రధీశా! |
552 |
| సీ. |
విక్రియాశూన్యమై విషయత్వమును లేని దగుచు నాత్మాకారమై తనర్చు నంతఃకరణ మొక్క యధికసాక్షాత్కారవిజ్ఞానమునఁ బట్టి వే ఱొరులకు నెఱుఁగంగ రానిదై యే పారి యుండుటఁజేసి నీ నిర్గుణ శ్రీవిభూతి బహిరంగవీథులఁ బాఱక దిరములై యమలంబులగు నింద్రియములచేత |
|
| ఆ. |
నెట్టకేలకైన నెఱుఁగంగ నగుఁగాని, గుణవిలాసి వగుచుఁ గొమరుమిగులు నీ గుణవ్రజంబు నేర రా దెఱుఁగంగ, నొక్క మితము లేక యుంట నీశ! |
553 |
| క. |
తారాతుషారశీకర, భూరజములకైన లెక్క బుధు లిడుదురు, భూ భారావతీర్ణకరుఁడగు, నీ రమ్యగుణాలి నెన్న నేర రగణ్యా! |
554 |
| శా. |
‘ఏవేళం గృపఁ జూచు నెన్నఁడు హరిన్ వీక్షింతు’ నం చాఢ్యుఁడై నీ వెంటంబడి తొంటి కర్మచయమున్ నిర్మూలముం జేయుచున్ నీవాఁడై తనువాఙ్మనోగతుల ని న్సేవించు విన్నాణి వో కైవల్యాధిపలక్ష్మి నుద్దవడిఁ దాఁ గైకొన్నవాఁ డీశ్వరా! |
555 |
| ఉ. |
మాయలు గల్గువారలను మాయలఁ బెట్టెడి ప్రోడ నిన్ను నా మాయఁ గలంచి నీ మహిమ మానముఁ జూచెద నంచు నేరమిం జేయఁగ బూనితిం గరుణ సేయుము, కావుము, యోగిరాజ వా గ్గేయ! దవాగ్నిఁ దజ్జనితకీలము గెల్చి వెలుంగనేర్చునే? |
556 |
| సీ. |
సర్వేశ! నే రజోజనితుండ, మూఢుండఁ, బ్రభుఁడ నేనని వెఱ్ఱిప్రల్లదమున గర్వించినాఁడను, గర్వాంధకారాంధనయనుండఁ, గృపఁ జూడు ననుఁ, బ్రధాన మహదహంకృతి నభోమరుదగ్ని జలభూమి పరివేష్టితాండకుంభంబులోన నేడుజేనలమేన నెనయు నే నెక్కడ నీ దృగ్విధాండంబు లేరి కైన? |
|
| తే. |
సంఖ్య సేయంగ రానివి, సంతతంబు, నోలిఁ బరమాణువులభంగి నొడలిరోమ వివరములయందె వర్తించు విపులభాతి, నెనయుచున్న నీ వెక్కడ? నెంత కెంత? |
557 |
| తరలము. |
కడుపులోపల నున్న పాపఁడు గాలఁ దన్నినఁ గిన్కతో నడువఁ బోలునె క్రాఁగి తల్లికి? నాథ! సన్నము దొడ్డు నై యడఁగి కారణకార్యరూపమునైన యీ సకలంబు నీ కడుపులోనిది గాదె? పాపఁడఁ గాక నే మఱి యెవ్వఁడన్? |
558 |
| క. |
భూరిలయజలధినిద్రిత, నారాయణనాభికమలనాళమున నజుం డారయఁ బుట్టె ననుట నిజ, మో రాజీవాక్ష! పుట్టె నోటు తలంపన్. |
559 |
| సీ. |
నళినాక్ష! నీ వాదినారాయణుండవు, జలము నారము జీవచయము నార మందు నీ వుంట నీయం దవి యుంటను నారాయణుం డనునామ మయ్యె సకలభూతములకు సాక్షి వధీశుండ, వబ్ధి నిద్రించు నారాయణుఁడవు నీ మూర్తి యది నీకు నిజమూర్తి యనరాదు, నలిననాళముత్రోవ నడచి మున్ను |
|
| తే. |
కడఁగి నూఱేండ్లు వెదకి నేఁ గాననయితి, నేకదేశస్థుఁడవు గా వనేకరుచివి జగములో నుందు, నీలోన జగములుండు, నరుఁదు, నీమాయ నెట్లైన నగుచు నుందు. |
560 |
| మ. |
విను మో యీశ్వర! వెల్పలన్ వెలుఁగు నీ విశ్వంబు నీ మాయ గా క నిజంబైన యశోద యెట్లు గనియెం? గన్నార నీ కుక్షిలోఁ గనెఁ బో క్రమ్మఱఁ గాంచెనే? భవదపాంగశ్రీఁ బ్రపంచంబు చ క్కన లోనౌ, వెలి యౌను, లోను వెలియుంగాదేఁ దదన్యం బగున్? |
561 |
| మ. |
ఒకఁడై యుంటివి, బాలవత్సములలో, నొప్పారి తీ వంతటన్ సకలోపాసితులౌ చతుర్భుజులునై సంప్రీతి నేఁ గొల్వఁగాఁ బ్రకటశ్రీగలవాఁడ వైతి, వటుపై బ్రహ్మాండముల్ సూపి యొ ల్లక యిట్లొక్కఁడ వైతి నీ వివిధలీలత్వంబుఁ గంటింగదే? |
562 |
| క. |
ఎఱుఁగని వారికిఁ దోతువు, నెఱిఁబ్రకృతింజేరి జగము నిర్మింపఁగ నా తెఱఁగున రక్షింపఁగ నీ, తెఱఁగున బ్రహరింప రుద్రు తెఱఁగున నీశా! |
563 |
| క. |
జలచర మృగ భూసుర నర, కులముల జన్మించి తీవు కుజనులఁ జెఱుపం జెలిమిని సుజనుల మనుపను, దలపోయఁగ రాదు నీవిధంబు లనంతా! |
564 |
| ఆ. |
మ్రబ్బుగొలిపి యోగమాయ నిద్రించిన, యో పరాత్మభూమ! యోగిరాజ! యే తెఱంగు లెన్ని యెప్పు డెచ్చోట నీ, హేల లెవ్వఁ డెఱుఁగు నీశ్వరేశ! |
565 |
| సీ. |
అది గాన నిజరూప మనరాదు, కలవంటిదై బహువిధదుఃఖమై విహీన సంజ్ఞానమై యున్న జగము సత్సుఖబోధ, తనుఁడవై తుది లేక తనరు నీదు మాయచేఁ బుట్టుచు మనుచు లే కుండుచు నున్న చందంబున, నుండుచుండు, నొకఁడ, వాత్ముఁడ, వితరోపాధిశూన్యుండ, వాద్యుండ, వమృతుండ, వక్షరుండ, |
|
| ఆ. |
వద్వయుండవును, స్వయంజ్యోతి, వాపూర్ణుఁ, డవు, పురాణపురుషుఁడవు, నితాంత సౌఖ్యనిధివి, నిత్యసత్యమూర్తివి, నిరం, జనుఁడ వీవు, దలఁపఁ జనునె నిన్ను? |
566 |
| వ. | దేవా! యిట్టి నీవు జీవాత్మ స్వరూపకుండవును, సకలాత్మలకు నాత్మయైన పరమాత్మస్వరూపకుండవు నని యెవ్వ రెఱుఁగుదురు, వారు గదా గురువనియెడు దినకరునివలనఁ బ్రాప్తంబైన యుపనిషదర్థజ్ఞానం బను సునేత్రంబునంజేసి సంసార మిథ్యాసాగరంబుఁ దరించిన చందంబున నుండుదురు, రజ్జువందు రజ్జువని యెఱింగెడి యెఱుక లేకుండ, న య్యెఱుంగమి నది సర్పరూపంబయి తోఁచిన పిదప నెఱింగినవారి వలన రజ్జువు రజ్జువని యెఱుంగుచుండ, సర్పరూపంబు లేకుండు కైవడి, నాత్మయప్పరమాత్మయని యెవ్వరెఱుంగరు వారి కయ్యెఱుంగమివలన సకల ప్రపంచంబుఁ గలిగి తోఁచు, నాత్మ యప్పరమాత్మయని యెవ్వరెఱుంగుదురు, వారి కయ్యెఱుకవలనఁ బ్రపంచంబు లేకుండు, నజ్ఞానసంభావిత నామకంబులైన సంసారబంధమోక్షంబులు, జ్ఞానవిజ్ఞానంబుల లోనివి గావు! కావునఁ గమలమిత్రున కహోరాత్రంబులు లేని తెఱంగునఁ, బరిపూర్ణజ్ఞానమూర్తి యగు నాత్మయందు నజ్ఞానంబులేమిని బంధంబును సుజ్ఞానంబు లేమిని మోక్షంబును లే, వాత్మవైన నిన్ను దేహాదికంబని తలంచియు, దేహాదికంబు నిన్నుఁగాఁ దలంచియు, నాత్మ వెలి నుండు నంచు మూఢులు మూఢత్వంబున వెదకుచుందురు, వారిమూఢత్వంబుఁ జెప్ప నేల? బుద్ధిమంతులై పరతత్త్వంబు గాని జడంబును నిషేధించుచున్న సత్పురుషులు తమ శరీరంబులయందు నిన్నరయుచుందు రది గావున. | 567 |
| శా. |
దేవా! నీచరణప్రసాదకణలబ్ధింగాక లేకున్న నొం డేవెంటం జను నీ మహామహిమ నూహింపంగ నెవ్వారికిన్? నీవారై చనువారిలో నొకఁడనై నిన్ గొల్చు భాగ్యంబు నా కీవే యిప్పటి జన్మమం దయిన నొండెందైన నో యీశ్వరా! |
568 |
| తరలము. |
క్రతుశతంబులఁ బూర్ణకుక్షివి, కాని నీ విటు క్రేపులున్ సుతులునై చనుఁబాలు ద్రావుచుఁ జొక్కి యాడుచుఁ గౌతుక స్థితిఁ జరింపఁగఁ దల్లులై విలసిల్లు గోవుల గోపికా సతుల ధన్యత లెట్లు సెప్పఁగఁ జాలువాఁడఁ గృపానిధీ! |
569 |
| క. |
పరిపూర్ణంబుఁ బురాణముఁ, బరమానందంబునైన బ్రహ్మమె చెలికాఁ డరుదరుదు నందఘోష, స్థిరజనముల భాగ్యరేఖ చింతింపంగన్. |
570 |
| సీ. |
ఏకాదశేంద్రియాధీశులు చంద్రాదు లేను ఫాలాక్షుండు నిట్లు సూడఁ బదుమువ్వురము నెడపడక యింద్రియపాత్రముల నీ పదాంభోజముల మరంద మమృతంబుగాఁ ద్రావి యమరనేకైకేంద్రియాభిమానుల మయ్యు నతికృతార్థ భావుల మైతిమి, పరఁగ సర్వేంద్రియవ్యాప్తులు నీ మీఁద వ్రాల్చి తిరుగు |
|
| తే. |
గోపగోపికాజనముల గురువిశిష్ట, భాగ్యసంపదఁ దలపోసి ప్రస్తుతింప నలవిగా దెవ్వరికి నైన నంబుజాక్ష! భక్తవత్సల! సర్వేశ! పరమపురుష! |
571 |
| శా. |
‘ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగా రాని ని న్నీ లోకంబున నీవనాంతరమునం దీ మందలోఁ గృష్ణ యం చాలాపాదిసమస్తభావములు నీ యందే సమర్పించు నీ వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్టించినం జాలదే? |
572 |
| మ. |
నిను హింసించిన పూతనాదులకు మున్ నీ మేటిసంకేత మి చ్చిన నీకుం బురదారపుత్త్రగృహ గో స్త్రీప్రాణదేహాదు లె ల్లను వంచింపక యిచ్చు గోపకులకున్ లక్షింప నే మిచ్చెదో! యని సందేహము దోఁచుచున్నది ప్రపన్నానీకరక్షామణీ! |
573 |
| క. |
దేహము కారాగేహము, మోహము నిగళంబు, రాగముఖరములు రిపు వ్యూహములు భక్తితో ని, న్నూహింపని యంతదడవు నో కమలాక్షా! |
574 |
| ఆ. |
ఆశ్రయించు జనుల కానందసందోహ, మీఁ దలంచి వివిధహేలతోడ నప్రపంచకుండ వయ్యుఁ బ్రపంచంబు, వెలయఁ జేయు దీవు విశ్వమూర్తి! |
575 |
| క. |
ఎఱిఁగినవార లెఱుంగుదు, రెఱుఁగన్ బహుభాష లేల? యీశ్వర! నీ పెం పెఱుఁగ మనోవాక్కులకున్, గుఱి సేయం గొలఁది గాదు గుణరత్ననిధీ! |
576 |
| క. |
సర్వము నీవ యెఱుంగుదు, సర్వవిలోకనుఁడ వీవ, జగదధిపతివిన్, సర్వాపరాధు నను నో, సర్వేశ! యనుగ్రహింపు, చనియెద నింకన్. |
577 |
| క. |
జిష్ణు! నిశాటవిపాటన!, వృష్ణికులాంభోజసూర్య! విప్రామర గో వైష్ణవసాగరహిమకర!, కృష్ణా! పాషండధర్మగృహదావాగ్నీ! |
578 |
| వ. | దేవా! నీకుఁ గల్పపర్యంతంబు నమస్కరించెద నని యివ్విధంబున సంస్తుతించి ముమ్మాఱు వలగొని పాదంబులపైఁ బడి వీడ్కొని బ్రహ్మ దన నెలవునకుం జనియె, నతని మన్నించి భగవంతుండైన హరి తొల్లి చెడి తిరిగి వచ్చిన వత్సబాలకులం గ్రమ్మఱం గైకొని పులినంబుకడఁ జేర్చె, నిట్లు. | 579 |
| క. |
క్రించుఁదనంబున విధి దము, వంచించిన యేఁడు గోపవరనందను లొ క్కించుక కాలంబుగ నీ, క్షించిరి రాజేంద్ర! బాలకృష్ణునిమాయన్. |
580 |
| ఆ. |
ఏ మహాత్ముమాయ నీ విశ్వమంతయు, మోహితాత్మక మయి మునిఁగియుండు నట్టి విష్ణుమాయ నర్భకు లొక్క యేఁ, డెఱుఁగకుండి రనుట యేమి వెఱఁగు? |
581 |
| వ. | అప్పుడు. | 582 |
| మ. |
‘చెలికాఁడా! యరుదెంచితే యిచటికిన్? సేమంబునం గ్రేపులున్ నెలవుల్ సేరె నరణ్యభూమివలనన్ నీ వచ్చునందాఁకఁ జ ల్దులు వీ రించుక యెవ్వరుం గుడువ, రాలోకింపు, ర’ మ్మంచు నా జలజాక్షుండు నగన్ భుజించి రచటన్ సంభాషలన్ డింభకుల్. |
583 |
| వ. | ఇట్లు బాలకులతోడఁజల్ది గుడిచి వారలకు నజగరచర్మంబు సూపుచు వనంబునుండి తిరిగి. | 584 |
| పంచచామరము. |
ప్రసూనపింఛమాలికా ప్రభావిచిత్రితాంగుఁడుం బ్రసిద్ధశృంగవేణునాదపాశబద్ధలోకుఁడుం బ్రసన్నగోపబాలగీతబాహువీర్యుఁడయ్యు ను ల్లసించి యేఁగె గోపకుల్ సెలంగి చూడ మందకున్. |
585 |
| వ. | ఆ సమయంబున. | 586 |
| క. |
పెనుఁబాము దమ్ము మ్రింగిన, మన నందసుతుండు పాము మర్దించి మమున్ మనిచె నరణ్యములోపల, నని ఘోషించిరి కుమారు లాఘోషములోన్. |
587 |
| వ. | అనిన విని నరేంద్రుండిట్లనియె. | 588 |
| క. |
‘కని మనిచి యెత్తి పెంచిన, తనుజన్ములకంటె నందతనయుం డా ఘో ష నివాసులకు మనోరం, జనుఁ డెట్లయ్యెను? బుధేంద్ర! చను నెఱిఁగింపన్‘ |
589 |
| వ. | అనిన శుకుం డిట్లనియె. | 590 |
| సీ. |
అఖిలజంతువులకు నాత్మవల్లభమైన, భంగి బిడ్డలు నిండ్లుఁ బసిఁడి మొదలు వస్తువు లెవ్వియు వల్లభంబులు గావు, సకలాత్మకుండైన జలజనేత్రుఁ డఖిల జంతువులకు నాత్మ గావున ఘోషవాసుల కెల్లను వల్లభత్వ మునను మిక్కిలి యొప్పె మూఁడులోకములకు హితము సేయఁగ జలజేక్షణుండు |
|
| ఆ. |
మాయతోడ మూర్తిమంతుఁడై యొప్పారుఁ, గలఁ డతండు నిఖిలగణములందు భవతిధాతు వెట్లు భావార్థమై సర్వ, ధాతు గణమునందుఁ దనరునట్లు. |
591 |
| క. |
శ్రీపతి పద మనునావను, బ్రాపించి భవాబ్ధి వత్సపదముగ ధీరుల్ రూపించి దాఁటి చేరుదు, రాపత్పదరహితు లగుచు నమృతపదంబున్. |
592 |
| ఆ. |
అఘునిఁ జంపి కృష్ణుఁ డాప్తులుఁ దానును, జల్ది గుడిచి జలజసంభవునకుఁ జిద్విలాసమైన చెలువు సూపిన కథఁ, జదువ వినినఁ గోర్కి సంభవించు. |
593 |
| వ. | అని చెప్పి మఱియు వ్యాసనందనుం డిట్లనియె. | 594 |
| క. |
రాగంబున బలకృష్ణులు, పౌగండవయస్సు లగుచుఁ బశుపాలకతా యోగంబున బృందావన, భాగంబునఁ గాచి రంతఁ బశువుల నధిపా! |
595 |
| వ. | అయ్యెడఁ గృష్ణుం డొక్కనాఁడు రేపకడ లేచి, వేణువు పూరించి బలభద్ర సహితుండై గోపకుమారులు దన్ను బహువారంబులు గైవారంబులు సేయ మ్రోల నాలకదుపుల నిడికొని నిరంతర ఫల కిసలయ కుసుమంబులును, గుసుమ మకరంద నిష్యంద పానానందదిందిందిర కదంబంబును, గదం బాది నానాతరు లతాగుల్మసంకులంబును, గులవిరోధరహిత మృగపక్షి భరితంబును, భరితసరస్సరోరుహపరిమిళిత వనంబును నయిన వనంబుఁ గని యందు వేడుకం గ్రీడింప నిశ్చయించి వెన్నుం డన్న కిట్లనియె. | 596 |
| శా. |
శాఖాపుష్పఫలప్రభారనతలై చర్చించి యో దేవ! మా శాఖిత్వంబు హరింపు’ మంచు శుకభాషన్ నీ కెఱింగించుచున్ శాఖాహస్తములం బ్రసూనఫలముల్ సక్కన్ సమర్పించుచున్ శాఖిశ్రేణులు నీపదాబ్జముల కోజన్ మ్రొక్కెడిం జూచితే! |
597 |
| సీ. |
నిఖిలపావనమైన నీ కీర్తిఁ బాడుచు నీ తుమ్మెదలు వెంట నేగుదెంచె నడవిలో గూఢుండ వైన యీశుఁడ వని ముసరి కొల్వఁగ వచ్చె మునిగణంబు నీలాంబరముతోడ నీవు జీమూతమ వని నీలకంఠంబు లాడఁ దొడఁగెఁ బ్రియముతోఁ జూచు గోపికలచందంబున నినుఁ జూచె నదె హరిణీచయంబు |
|
| ఆ. |
నీవు వింద వనుచు నిర్మలసూక్తులు, వలుకుచున్న విచటఁ బరభృతములు నేఁడు విపినచరులు నీవు విచ్చేసిన, ధన్యులైరి గాదె తలఁచి చూడ. |
598 |
| సీ. |
నీ పాదములు సోఁకి నేఁడు వీరుత్తృణపుంజంబుతో భూమి పుణ్య యయ్యె నీ నఖంబులు దాఁకి నేఁడు నానాలతా తరుసంఘములు గృతార్థంబు లయ్యె నీ కృపాదృష్టిచే నేఁడు నదీశైలఖగమృగంబులు దివ్యకాంతిఁ జెందె నీ పెన్నురము మోవ నేఁడు గోపాంగనాజనములపుట్టువు సఫల మయ్యె |
|
| ఆ. |
నని యరణ్యభూమి నంకించి పసులను, మిత్రజనులు దాను మేపుచుండి నలినలోచనుండు నదులందు గిరులందు, సంతసంబు మెఱయ సంచరించె. |
599 |
| వ. | మఱియు న య్యీశ్వరుండు. | 600 |
| సీ. |
ఒకచోట మత్తాళియూథంబు జు మ్మని మ్రోయంగ జుమ్మని మ్రోయుచుండు నొకచోటఁ గలహంసయూథంబు గూడి కేంకృతులు సేయంగఁ గేంకృతులు సేయు నొకచోట మదకేకియూథంబు లాడంగ హస్తాబ్జములు ద్రిప్పి యాడఁ దొడఁగు నొకచోట వనగజయూథంబు నడవంగ నయముతో మెల్లన నడువఁ జొచ్చుఁ |
|
| ఆ. |
గ్రౌంచచక్రముఖరఖగము లొక్కొకచోటఁ, బలుక వానియట్ల పలుకుఁ గదిసి పులుల సింహములను బొడగని యొకచోటఁ, బఱచు మృగములందుఁ దఱచుఁ గూడి. |
601 |
| వ. | మఱియును. | 602 |
| సీ. |
రా పూర్ణచంద్రిక! రా గౌతమీ గంగ! రమ్ము భగీరథరాజతనయ! రా సుధాజలరాశి! రా మేఘబాలిక! రమ్ము చింతామణి! రమ్ము సురభి! రా మనోహారిణి! రా సర్వమంగళ! రా భారతీదేవి! రా ధరిత్రి! రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి! రమ్ము మందాకిని! రా శుభాంగి! |
|
| ఆ. |
యనుచు మఱియుఁ గలుగు నాఖ్యలు గల గోవు, లడవిలోన దూరమందు మేయ ఘనగభీరభాషఁ గడునొప్పఁ జీరు నా, భీరజనులు వొగడఁ బెంపు నెగడ. |
603 |
| క. |
కాంతారవిహారమ్ముల, శ్రాంతుండై గోపకాంకశయుఁడగు నన్నన్ సంతుష్టిఁ బొందఁ జేయు ని, రంతరకరచరణమర్శనాదుల నధిపా! |
604 |
| క. |
పాడుచు నాడుచు మందట, లాడుచు నొండొరులఁ దాఁకు నాప్తులఁ గని బి ట్టాడుచుఁ జేతులు వ్రేయుచుఁ, గ్రీడింతురు నగుచు బలుఁడు గృష్ణుఁడు నొకచోన్. |
605 |
| వ. | ఇవ్విధంబున. | 606 |
| సీ. |
వేదాంతవీథుల విహరించు విన్నాణి, విహరించుఁ గాంతారవీథులందు ఫణిరాజశయ్యపైఁ బవళించు సుఖభోగి పల్లవశయ్యలఁ బవ్వళించు గురుయోగిమానసగుహలఁ గ్రుమ్మరు మేటి గ్రుమ్మరు నద్రీంద్రగుహలలోనఁ గమలతోడఁ బెనఁగి కడు డయ్యు చతురుఁ డా భీరజనులతోడఁ బెనఁగి డయ్యు |
|
| ఆ. |
నఖిలలోకములకు నాశ్రయుండగుధీరుఁ, డలసి తరులనీడ నాశ్రయించు యాగభాగచయము లాహరించుమహాత్ముఁ, డడవిలోని ఫలము లాహరించు. |
607 |
| వ. | ఆ సమయంబున. | 608 |
| సీ. |
అలసినచోఁ గొంద ఱతిమోదమున వీఁపు లెక్కించుకొని పోదు రేపు మెఱసి సొలసి నిద్రించినచో నూరుతల్పంబు లిడుదురు కొందఱు హితవు గలిగి చెమరించి యున్నచోఁ జిగురుటాకులఁ గొంద ఱొయ్యన విసరుదు రుత్సహించి ద వ్వేఁగి నిలుచుచోఁ దడయక కొందఱు పదము లొత్తుదు రతిబాంధవమున, |
|
| ఆ. |
గోపవరులు మఱియుఁ గొందఱు ప్రియమున, మాధవునకుఁ బెక్కుమార్గములను బనులు సేసి రెల్లభవములఁ జేసిన, పాపసంచయములు భస్మములుగ. |
609 |
| వ. | అ య్యవసరంబున శ్రీదామనామధేయుండైన గోపాలకుండు రామకేశవులం జూచి యిట్లనియె. | 610 |