పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
గార్దభాకారుండైన ధేనుకాసురుని బలభద్రుఁడు వధించుట
క. దూరంబునఁ దాలతరు, స్ఫారం బగు వనము గలదు, పతితానుపత
ద్భూరిఫలసహిత మది, యే, ధీరులు సొరవెఱతు రందు ధేనుకుఁ డుంటన్‌.
611
వ. ఆ ధేనుకాసురుండు మహాశూరుండును, ఖరాకారుండును నై సమానసత్త్వసమేతులైన జ్ఞాతులుం దానును మనుష్యులం బట్టి భక్షించుచుండు, నయ్యెడఁ బరిమళోపేతంబులైన నూతన ఫలవ్రాతంబులసంఖ్యాకంబులు గలవు. వినుఁడు. 612
క. ఫలగంధము నాసాపుట, ములఁ జొచ్చి కలంచి చిత్తములఁ గొనిపోయెన్‌
ఫలముల నమలింపుఁడు మము, బలియురకును మీకు దైత్యభటు లడ్డంబే?
613
వ. అని పలికిన చెలికానిపలుకు లాదరించి విని నగి వారునుం దారును నుత్తాలంబగు తాలవనంబునకుం జని యందు. 614
క. తత్తఱమున బలభద్రుఁడు, తత్తాలానోకహములఁ దనభుజబల సం
పత్తిఁ గదల్చుచు గ్రక్కున, మత్తేభముభంగిఁ బండ్లు మహిపై రాల్చెన్‌.
615
వ. అప్పుడు పండ్లు రాల్చినచప్పుడు సెవులకు దెప్పరంబయిన నదిరిపడి రిపుమర్దనకుతుకంబున గర్దభాసురుండు. 616
మ. పదవిక్షేపములన్‌ సవృక్షధరణీభాగంబు గంపింపఁగా
రదముల్‌ దీటుచుఁ గత్తిరించిన చెవుల్‌ రాజిల్ల వాలంబు భీ
తిదమై తూలఁగఁ గావరంబున సముద్దీపించి గోపాలకుల్‌
బెదరన్‌ రామునిఱొమ్ముఁ దన్నె వెనుకై బీరంబు దోరంబుగన్‌.
617
క. మఱియును దనుజుఁడు రామునిఁ, గఱవఁగ గమకించి తెఱపి గానక యతనిం
జుఱచుఱఁ జూచుచు శౌర్యము, పఱివోవఁగ నింత నంతఁ బదములఁ దన్నెన్‌.
618
వ. అంత బలభద్రుండు రౌద్రాకారంబున గర్దభాసురుపదంబులు నాలుగు నొక్కకేల నంటం బట్టి బెట్టు దట్టించి త్రిప్పి విగత జీవునిం జేసి. 619
మ. ఒక తాలాగ్రముఁ దాఁక వైవ నది కంపోద్రిక్తయై త్రుళ్ళి వే
ఱొక తాలాగ్రము పైఁబడ న్నదియు నయ్యుగ్రాహతిన్‌ నిల్వ కొం
డొక తాలాగ్రముపైఁ బడన్‌ విఱిగి యిట్లొండొంటిపైఁ దాల వృ
క్షకముల్‌ గూలెఁ బ్రచండమారుతము దాఁకం గూలు చందంబునన్‌.
620
ఉ. తంతువులందుఁ జేలము విధంబున నే పరమేశుమూర్తియం
దింతయుఁ బుట్టునట్టి జగదీశుఁ డనంతుఁడు దైత్యమాత్రు ని
ట్లంతము సేయు టెంతపని? యద్భుత మే విను మంతలోన వాఁ
డంతముఁ బొందుటెల్లఁ గని యాతనిబంధులు గార్దభంబులై.
621
క. బలకృష్ణులపైఁ గవిసిన, బలియుర ఖరదైత్యభటులఁ బశ్చిమపాదం
బులు వట్టి తాలశిఖరం, బుల కెగురఁగ వైచి వారు పొరిగొని రధిపా!
622
వ. అప్పుడు. 623
క. ఆలమున నోలిఁ గూలిన, తాలద్రుమఖండదైత్యతనుఖండములన్‌
గీలితయై ధర జలధర, మాలావృతమైన మింటిమాడ్కిన్‌ వెలిఁగెన్‌.
624
క. ధేనుకవనమున నమలిరి, మానవు లావేళఁ దాటిమ్రాఁకులఫలముల్‌,
ధేనువులు మెసఁగెఁ గసవులు, ధేనుకహరభక్తకామధేనువు గలుగన్‌.
625
వ. ఆ సమయంబున సురలు విరులవానలు గురియించి దుందుభులు మొరయించి, రంతఁ గమలలోచనుండు గోపజనజేగీయమాన వర్తనుండై యన్నయుం దానును గోగణంబులం దోలుకొని మందకుం జనియె, నయ్యెడ. 626
మ. గోపదరేణుసంకలితకుంతలబద్ధమయూరపింఛు; ను
ద్దీపితమందహాసశుభదృష్టిలసన్ముఖు, నవ్యపుష్ప మా
లా పరిపూర్ణు, గోపజనలాలితవేణురవాభిరాము, నా
గోపకుమారునిం గనిరి గోపసుతుల్‌ నయనోత్సవంబుగన్‌.
627
ఆ. కమలనయను వదనకమలమరందంబుఁ, దవిలి నయనషట్పదములవలనఁ
ద్రావి దినవియోగతాపంబు మానిరి, గొపకాంతలెల్ల గోర్కు లలర.
628
వ. ఇట్లు గోపికలు సాదరంబుగం జూడ వ్రీడాహాసనవినయంబులం జూచుచుఁ గ్రీడాగరిష్ఠుం డయిన ప్రోడ గోష్ఠంబు ప్రవేశించె, నంత రోహిణీయశోదలు గుఱ్ఱలవలని మచ్చికలు పిచ్చలింప నిచ్చకు వచ్చిన ట్లయ్యైవేళల దీవించిరి. వారును మజ్జనోన్మర్దనాదు లంగీకరించి సురభికుసుమగంధంబులు గైకొని, రుచిరచేలంబులు గట్టికొని, రసోపపన్నంబు లయిన యన్నంబులు గుడిచి, తృప్తులై మంజులశయ్యల సుప్తులయి యుండి, రందు. 629
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )