| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| సీ. |
‘ఒకనాఁడు బలభద్రుఁ డొక్కఁడు రాకుండ గోపాలకులు దానుఁ గూడి కృష్ణుఁ డడవికిఁ జని యెండ నా గోవులును గోపకులు నీరు వట్టునఁ గుంది డస్సి కాళిందిలో విషకలితతోయముఁ ద్రావి ప్రాణానిలంబులు వాసి పడిన యోగీశ్వరేశుండు యోగివంద్యుఁడు గృష్ణుఁ డీక్షణామృతధార లెలమి గురిసి |
|
| ఆ. |
పసుల గోపకులను బ్రదికించె మరలంగ, వారు దమకుఁ గృష్ణువలన మరల బ్రదుకు గలిగె నంచు భావించి సంతుష్ట, మానసములఁ జనిరి మానవేంద్ర! |
630 |
| క. |
కాళియఫణిదూషిత యగు, గాళిందిఁ బవిత్రఁ జేయఁగా నుత్సుకుఁడై కాళిందీజలవర్ణుఁడు, కాళియు వెడలంగ నడిచెఁ గౌరవముఖ్యా! |
631 |
| వ. | అనిన ‘నయ్యగాధజలంబువలన మాధవుం డెట్టి నేర్పున సర్పంబుదర్పంబు మాపి వెడలించె, నందుఁ బెద్దకాలం బా వ్యాళం బేలయుండె? నెఱింగింపుము. | 632 |
| క. |
తొఱ్ఱులఁ గాచిన నందుని, కుఱ్ఱనిచరితామృతంబు గొనకొని చెవులన్ జుఱ్ఱంగఁ దనివి గల్గునె!, వెఱ్ఱుల కయినను దలంప? విప్రవరేణ్యా!’ |
633 |
| వ. | అనిన శుకుం డిట్లనియె. | 634 |
| సీ. |
మానవేశ్వర! యొక్కమడుఁగు కాళిందిలోఁ గల, దది యెప్పుడుఁ గాళియాహి విషవహ్నిశిఖలచే వేఁచు చుండును, మీఁదఁ బఱతెంచి నంతన పక్షులైనఁ బడి మ్రగ్గు, నందుఁ దద్భంగశీకరయుక్తపవనంబు సోఁకినఁ బ్రాణు లెవ్వి యైన నప్పుడ చచ్చు? నట్టి యా మడుఁగులో నుదకంబు వొంగుచు నుడుకుచుండఁ |
|
| తే. |
జూచి వెఱఁగంది కుజనుల స్రుక్కఁజేయ, నవతరించిన బలువీరుఁ డాగ్రహించి భుజగవిషవహ్నిదోషంబు వొలియఁజేసి, సుజలఁ గావించి యీనదిఁ జూతు ననుచు. |
635 |
| వ. | కృతనిశ్చయుండై, పూర్వజన్మ భాగ్యంబులం దన చరణ సంస్పర్శంబునకు యోగ్యంబై, తత్సమీపంబున విశాలవిటపశాఖాకదంబంబుతో నున్న కదంబభూజంబు నెక్కి. | 636 |
| మ. |
కటిచేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దో స్తటసంస్ఫాలన మాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి త త్కుటశాఖాగ్రము మీఁదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానం బనూనంబుగన్. |
637 |
| ఉ. |
భూరిమహాప్రతాపపరిపూర్ణభయంకరగోపబాల కం ఠీరవపాతవేగవికటీకృతదుర్విషభీషణోర్మిసం పూరితమై వడిం గలఁగి పొంగి ధనుశ్శతమాత్రభాగ వి స్తారము వొంగె నమ్మడుఁగు తప్తపయఃకణబుద్బుదోగ్రమై. |
638 |
| శా. |
పాఠీనాకృతిఁ దోయరాశి నడుమన్ భాసిల్లి మున్నాఢ్యుఁడై కాఠిన్యక్రియ నీఁదునేర్పు దనకుం గల్మిన్ భుజంగేంద్ర హృ త్పీఠాగ్రంబున రోషవహ్ను లెగయన్ భీమంబుగా నీఁదె ను ల్లోఠోత్తుంగతరంగమై మడుఁగు దుర్లోక్యంబుగా బాహులన్. |
639 |
| వ. | ఆ సమయంబున. | 640 |
| శా. |
‘బాలుం డొక్కఁడు వీఁడు నామడుఁగు విభ్రాంతోచ్చలత్కీర్ణ క ల్లోలంబై కలఁగం జరించె నిట నే లో నుంటఁ జూడండు, మ త్కీలాభీలవిశాలదుస్సహవిషాగ్నిజ్వాలలన్ భస్మమై కూలంజేసెద నేఁడు లోకులకు నాకోపంబు దీపింపఁగన్.’ |
641 |
| వ. | అని తలంచి విజృంభించి. | 642 |
| ఉ. |
ఘోరవిషానలప్రభలు గొబ్బునఁ గ్రమ్మఁగ సర్పసైన్య వి స్ఫారుఁడు గాళియోరగుఁడు పాఱి వడిం గఱచెం బయోధరా కారుఁ బయోవిహారు భయకంపవిదూరు మహాగభీరు నా భీరకుమారు వీరు నవపీతశుభాంబరధారు ధీరునిన్. |
643 |
| క. |
కఱచి పిఱుతివక మఱియును, వెఱవక నిజవదనజనితవిషదహనశిఖల్ మెరయఁ దననిడుదయొడలిని, నెఱి హరిఁ బెనఁగొనియె భుజగనివహపతి వడిన్. |
644 |
| వ. | ఇట్లు భోగిభోగపరివేష్టితుండై, చేష్టలు లేనివానితెఱంగునఁ గానంబడుచున్న ప్రాణసఖునిం గనుంగొని తత్ప్రభావంబు లెఱుంగక, తత్సమర్పితధనదారమనోరథమానసులు గావున. | 645 |
| చ. |
అదె మన కృష్ణునిం గఱిచె, నంతటఁ బోక భుజంగమంబు దు ర్మదమున మేనఁ జుట్టికొని మానక యున్నది, యింక నేమి సే యుద? మెటఁ జొత్త మే పురుషు లోపుదు రీయహి నడ్డపెట్ట నె య్యది సదుపాయ? మంచుఁ బడి రార్తరవంబులఁ దూలి గోపకుల్. |
646 |
| క. |
గోపకుమారకశేఖరు, నేపున సర్పంబు గఱచు టీక్షించి వగన్ మేపులకుఁ దొలఁగి గోవులు, వాపోవుచు నుండె వృషభవత్సంబులతోన్. |
647 |
| క. |
భూతలము వడఁకె నుల్కా, పాతంబులు మింటఁ గానఁబడె ఘోషములో వ్రేతలకును గోపక సం, ఘాతములకు నదరెఁ గీడుకన్ను లిలేశా! |
648 |
| వ. | అంత నా దుర్నిమిత్తంబులు వొడగని బెగడు గదిరినచిత్తంబుల నుత్తలపడుచు మందనున్న నందయశోదాదులైన గోపగోపికాజనంబులు హరిదళసరి యెఱుంగక గోపాలగోగణపరివృతుండైన కృష్ణుం డెక్కడ నైనం జిక్కనోపు నని పొక్కుచుం బెక్కువలయిన మక్కువలు చెక్కులొత్త నొక్కపెట్ట బాలవృద్ధసమేతులై మహాఘోషంబున నా ఘోషంబు వెలువడి. | 649 |
| క. |
వా రిబ్భంగి నెఱుంగని, వారై హరిఁ జూడఁ బోవ వడిగఁగొని నగుచున్ వారింపఁ డయ్యె రాముఁడు, వారిని హరి లావెఱుంగువాఁ డయ్యు నృపా! |
650 |
| వ. | అంతలోన వారునుం దానును గాంతారమార్గంబు వట్టి పోవుచు నెడనెడ గోపగోష్పదంబులసందుల నింత నంత నక్కడక్కడ యవాంకుశ హల కమల కులిశ చక్ర చాప కేతనాది రేఖాలంకృతంబులై మార్గాభరణంబులైన హరిచరణంబుల జాడఁ గని చొప్పు దప్పక చని దుర్ఘటంబయిన యమునాతటంబు సేరి, వారిమధ్యంబున నితరుల కసాధ్యంబైన సర్పంబుచేతఁ గాటు వడి దర్పంబు సూపక భోగిభోగపరివృతుండైన కృష్ణునిం గృష్ణ కృష్ణేతివిలాపంబులఁ దాపంబులం బొందుచుఁ దత్కాలంబునం బ్రతికూలం బయ్యె ననుచు దైవంబు దిట్టు గోపకులను, గోపకులం గలసి మేఁత లుడిగి ఱెప్పలిడక కృష్ణునిం దప్పక చూచుచు నొరలుచున్న గోవులం గని, రందు గోపికలు యశోదం బట్టుకొని విలపించుచుఁ గృష్ణు నుద్దేశించి యిట్లనిరి. | 651 |
| సీ. |
ఎదురువచ్చినఁ జాల నెదురుగాఁ జనుదెంతు, వెదురు వచ్చిన నేఁడదేల రావు? చూచినఁ గృపతోడఁ జూచు చుందువు నీవు, సూచినఁ గనువిచ్చి చూడ వేల? డాసిన నఱలేక డాయంగ వత్తువు, డాసిన నేటికి డాయ విచటఁ? జీరిన ‘నో’ యని చెలరేఁగి పలుకుదు, విది యేమి సీరిన నెఱుఁగ కుంట? |
|
| ఆ. |
తలఁపు సేయునంతఁ దలపోయుచుందువు, తలఁపు సేయ నేఁడు దలఁప వకట! యనుచు భక్తివివశ లాడెడి కైవడి, వ్రేత లెల్ల నాడి వివశలైరి. |
652 |
| వ. | ఆ సమయంబున నందయశోదాదులు హరిం జూచి యధికంబైన శోకంబున నిట్లనిరి. | 653 |
| క. |
విషకుచయుగ యగు రక్కసి, విషకుచదుగ్ధంబు ద్రావి విషవిజయుఁడవై విషరుహలోచన! యద్భుత, విషయుండగు నీకు సర్పవిష మెక్కెఁ గదా! |
654 |
| క. |
కట్టా! క్రూరభుజంగము, గట్టలుకన్ నిన్నుఁ గఱవఁ గంపించితివో? తిట్టితివో పాపపువిధి?, పట్టీ! మముఁ దలఁచి కాఁకఁ బలవించితివో? |
655 |
| క. |
పన్నగము మమ్ము గఱవక, ని న్నేటికిఁ గఱచెఁ గుఱ్ఱ! నెమ్మి గలిగి నీ వున్నను మము రక్షింతువు, నిన్నున్ రక్షింప నేము నేరము తండ్రీ! |
656 |
| ఉ. |
చూడ వ దేమి గౌరవపుఁజూపుల మమ్ము? సఖాలితోడ మా టాడ వ దేమి? నర్మముగ నందెలు పాదములందు మ్రోయ? నేఁ డాడ వ దేమి నర్తనము? లవ్వలమ్రోలను గోపికావళిం గూడ వ దేమి నవ్వులకు? గోపకుమారవరేణ్య! చెప్పుమా! |
657 |
| సీ. |
శ్రవణరంధ్రంబులు సఫలతఁ బొందంగ నెలమి భాషించువా రెవ్వ రింకఁ? గరచరణాదులకలిమి ధన్యత నొంద నెగిరి పైఁ బ్రాఁకువా రెవ్వ రింక? నయనయుగ్మంబు లున్నతిఁ గృతార్థములుగా నవ్వులు సూపువా రెవ్వ రింక? జిహ్వలు గౌరవశ్రీఁ జేరఁ బాటల యెడఁ బలికించువా రెవ్వ రింక? |
|
| ఆ. |
దండ్రి! నీవు సర్పదష్టుండవై యున్న, నిచట మాకుఁ బ్రభువు లెవ్వ రింక? మరగి పాయ లేము, మాకు నీ తోడిద, లోక మీవు లేనిలోక మేల? |
658 |
| వ. | అని యొండొరులం బట్టుకొని విలపించుచుం గృష్ణునితోడన మడుఁగు జొత్తము, చత్త’ మనుచుఁ గృష్ణవిరహవేదనానలభారతప్తులై మడుఁగుఁ జొరఁ బాఱుచున్నవారలఁ గనుంగొని భగవంతుండైన బలభద్రుండు ‘మీరు మీఁదెఱుంగరు, ధైర్యంబు విడుచుట కార్యంబు గాదు. సహించి చూడుఁ’ డనుచు వారిని వారించె. | 659 |
| క. |
తనుఁ గూర్చి యి వ్విధంబున, వనితలు బిడ్డలును దారు వాపోయెడి ఘో షనివాసులఁ గని కృష్ణుఁడు, మనుజునిక్రియ నొక ముహూర్తమాత్రము జరిపెన్. |
660 |
| శా. |
అంతం గృష్ణుఁడు మేను వెంప భుజగుం డావృత్తులం బాసి తా సంతప్తాయతభోగుఁ డై కఱచుటల్ సాలించి నిట్టూర్పుతో శ్రాంతుండై తలలెత్తి దుర్విషము నాసావీథులం గ్రమ్మ దు శ్చింతన్ దిక్కులు సూచుచుం దలఁగి నిల్చెన్ ధూమకాష్ఠాకృతిన్. |
661 |
| చ. |
వెఱ మెర లేనియట్టి బలువీరుఁడు కృష్ణకుమారుఁ డొక్కచేఁ జఱచి ఖగేంద్రుచందమునఁ జక్కన దౌడలు వట్టి కన్నులం జొఱచొఱ దుర్విషానలము జొబ్బిలు చుండఁగ నెత్తి లీలతో జిఱజిఱఁ ద్రిప్పి వైచెఁ బరిశేషితదర్పముఁ గ్రూరసర్పమున్. |
662 |
| వ. | ఇట్లు వేగంబుగ నాగంబు వీచి వైచి జగజెట్టియైన నందునిపట్టి రెట్టించిన సంభ్రమంబున. | 663 |
| సీ. |
ఘనయమునానదీకల్లోలఘోషంబు సరసమృదంగఘోషంబు గాఁగ సాధుబృందావనచరచంచరీకగానంబు గాయకసుగానంబు గాఁగ గలహంససారసకమనీయమంజుశబ్దంబులు దాళశబ్దములు గాఁగ దివినుండి వీక్షించు దివిజగంధర్వాదిజనులు సుఖాసీనజనులు గాఁగఁ |
|
| తే. |
బద్మరాగాదిరత్నప్రభాసమాన, మహితకాళియఫణిఫణామండపమున నళినలోచనవిఖ్యాతనర్తకుండు, నిత్యనైపుణ్యమునఁ బేర్చి నృత్య మాడె. |
664 |
| శా. |
కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతి న్నున్న యా రక్షోహంత వడిన్ మహాఫణిఫణారంగప్రదేశంబుపై నక్షీణోద్ధతి నాఁడుఁ, బాడుఁ, జెలఁగున్, హాసంబుతోడం బద ప్రక్షేపంబులు సేయుఁ గేళిగతులం బ్రాణైకశేషంబుగన్. |
665 |
| క. |
ఘనతరసుషిరానంద, స్వనములతో సిద్ధ సాధ్య చారణ గంధ ర్వ నిలింప మునిసతులు చ, య్యనఁ గురిసిరి విరులవాన లాడెడు హరిపై. |
666 |
| వ. | ఇట్లు దుష్టజనదండధరావతారుండైన హరి వడి గలిగిన పడగల మీఁదఁ దాండవంబు సలుప, బెండువడి యొండొండ ముఖంబుల రక్తమాంసంబు లుమియుచుఁ గన్నుల విషంబు గ్రక్కుచు నుక్కుసెడి చిక్కి దిక్కులు సూచుచుం గంఠగతప్రాణుండై ఫణీంద్రుండు తన మనంబున. | 667 |
| ఉ. |
‘వేలుపులైన లావులుసెడి వేదనఁ బొందుచు నావిషానల జ్వాలలు సోఁకినంతటన చత్తురు, నేఁడిది యేమి చోద్య? మా భీలవిషాగ్నిహేతిచయపీడకు నోర్చియుఁ గ్రమ్మఱంగ నీ బాలుఁడు మత్ఫణాశతము భగ్నముగా వెసఁ ద్రొక్కి యాడెడిన్. |
668 |
| క. |
ఈతఁడు సర్వచరాచర, భూతేశుండైన పరమపురుషుఁడు సేవా ప్రీతుఁడు శ్రీహరి యగు నని, భీతిన్ శరణంబు నొందె బిట్టలసి నృపా! |
669 |