| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | అట్లు క్రూరంబులైన హరిచరణప్రహారంబులం బడగ లెడసి నొచ్చి చచ్చిన క్రియం బడియున్న పతిం జూచి నాగకాంతలు దురంతంబైన చింతాభరంబున నివ్వటిల్లెడు నెవ్వగల నొల్లంబోయి పల్లటిల్లిన యుల్లంబుల. | 670 |
| మ. |
కచబంధంబులు వీడ భూషణము లాకంపింప గౌఁదీవియల్ కుచయుగ్మంబుల వ్రేఁగునం జడియఁ బై కొంగుల్ వడిన్ జాఱఁగాఁ బ్రచురభ్రాంతిఁ గలంగి ముందట రుదద్బాలావలిం గొంచు స్రు క్కుచు, భక్తిం జని కాంచి రాగుణమణిన్ గోపాలచూడామణిన్. |
671 |
| వ. | కని దండప్రణామంబు లాచరించి నిటలతటఘటితకరకమలలై యిట్లనిరి. | 672 |
| క. |
క్రూరాత్ముల దండింపఁగ, ధారుణిపై నవతరించి తనరెడి నీ కీ క్రూరాత్ముని దండించుట, క్రూరత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా! |
673 |
| క. |
పగవారి సుతులయందును, బగ యించుక లేక సమతఁ బరఁగెడి నీకుం బగ గలదె? ఖలుల నడఁచుట, జగదవనముకొఱకుఁ గాక జగదాధారా! |
674 |
| క. |
నిగ్రహమె మము విషాస్యుల, నుగ్రుల శిక్షించు టెల్ల? నూహింప మహా నుగ్రహము గాక మా కీ, నిగ్రహము విషాస్యభావనిర్గతిఁ జేసెన్. |
675 |
| ఉ. |
ఎట్టి తపంబు సేసెనొకొ? యెట్టి సుకర్మము లాచరించెనో? యెట్టి నిజంబు వల్కెనొకొ? యీ ఫణి పూర్వభవంబునందు ము న్నెట్టి మహానుభావులకు నెన్నఁడుఁ జేరువగాని నీవు నేఁ డిట్టి వినోదలీలఁ దలలెక్కి నటించెద వీ ఫణీంద్రుపై. |
676 |
| మ. |
బహుకాలంబు దపంబు సేసి వ్రతముల్ వాటించి కామించి నీ మహనీయోజ్జ్వల పాదరేణుకణసంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము దొల్లి కాంచె నిదె నేమం బేమియున్ లేక యీ యహి నీ పాదయుగాహతిం బడసె నేఁ డత్యద్భుతం బీశ్వరా! |
677 |
| ఉ. |
ఒల్లరు నిర్జరేంద్రపద మొల్లరు బ్రహ్మపదంబు నొందఁగా నొల్లరు చక్రవర్తిపద మొల్లరు సర్వరసాధిపత్యము న్నొల్లరు యోగసిద్ధి మఱి యొండు భవంబుల నొందనీని నీ సల్లలితాంఘ్రిరేణువుల సంగతి నొందిన ధన్యు లెప్పుడున్. |
678 |
| క. |
ఘనసంసారాహతులగు, జను లాకాంక్షింపఁ గడు నశక్యం బగు శో భనము సమక్షంబున నహి, గనియెం దామసుఁడు రోషకలితుం డయ్యున్. |
679 |
| వ. | దేవా? సకలపురుషాంతర్యామి రూపత్వంబువలనఁ బరమపురుషుండ వయ్యు నపరిచ్ఛిన్నత్వంబువలన మహాత్ముండ వయ్యును, నాకాశాదిభూతసమాశ్రయత్వంబువలన భూతవాసుండ వయ్యును, భూతమయ త్వంబువలన భూతశబ్ద వాచ్యుండ వయ్యును, గారణాతీతత్వంబువలనఁ బరమాత్ముండ వయ్యును, జ్ఞానవిజ్ఞాన పరి పూర్ణత్వంబు గలిగి నిర్గుణత్వ నిర్వికారత్వంబుల వలన బ్రహ్మంబ వయ్యును, బ్రకృతి ప్రవర్తకత్వంబువలన ననంతశక్తివై యప్రాకృతుండ వయ్యును, గాలచక్రప్రవర్తకత్వంబువలనఁ గాలుండ వయ్యును, గాలశక్తి సమాశ్రయత్వంబువలనఁ గాలనాభుండ వయ్యును, సృష్టిజీవనసంహారాదిదర్శిత్వంబువలనం గాలావయవసాక్షి వయ్యును నొప్పు నీకు నమస్కరించెదము, మఱియును. | 680 |
| సీ. |
విశ్వంబు నీవయై విశ్వంబుఁ జూచుచు, విశ్వంబు సేయుచు విశ్వమునకు హేతువవై పంచభూతమాత్రేంద్రియములకు మనఃప్రాణబుద్ధిచిత్త ముల కెల్ల నాత్మవై మొనసి గుణంబుల నావృత మగుచు నిజాంశభూత మగు నాత్మచయమున కనుభూతి సేయుచు మూఁ డహంకృతులచే ముసుఁగువడక |
|
| తే. |
నెఱి ననంతుఁడవై దర్శనీయరుచివి, గాక సూక్ష్ముఁడవై నిర్వికారమహిమఁ దనరి కూటస్థుఁ డన సమస్తంబు నెఱుఁగు, నీకు మ్రొక్కెద మాలింపు నిర్మలాత్మ! |
681 |
| వ. | మఱియుఁ గలఁడు లేడు, సర్వంబు నెఱుంగు, నించుక యెఱుంగు, బద్ధుండు, విముక్తుం డొకం, డనేకుండు నను నివి మొదలుగాఁ గల వాదంబులు మాయవలన ననురోధింపుదురు గావున నానావాదానురోధకుండ వయ్యును, నభిధానాభిధేయశక్తిభేదంబువలన బహుప్రభావప్రతీతుండ వయ్యును, జక్షురాది రూపంబులవలనఁ బ్రమాణరూపకుండ వయ్యును, నిరపేక్షజ్ఞానంబు కలిమిం గవి వయ్యును, వేదమయ నిశ్శ్వాసత్వంబువలన శాస్త్రయోని వయ్యును, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ రూపంబులవలనఁ జతుర్మూర్తి వయ్యును, భక్తజనపాలకుండ వయ్యును, నంతఃకరణప్రకాశకత్వంబుగలిగి సేవకజనఫలప్రదానంబుకొఱకు గుణాచ్ఛాదకుండ వయ్యును, జిత్తాదివర్తనంబులఁ గానం దగిన గుణంబులకు సాక్షివై యొరుల కెఱుంగరామి నగోచరుండ వయ్యును, దర్కింపరాని పెంపువలన నవ్యాహతవిహారుండ వయ్యును, సకలకార్యహేతు వయ్యు, నంతఃకరణప్రవర్తకత్వంబువలన హృషీకేశుండ వయ్యును, సాధనవశంబుగాని యాత్మారామత్వంబువలన ముని వయ్యును, స్థూలసూక్ష్మగతుల నెఱుంగుచు నెందుం జెందక నీవు విశ్వంబు గాకయు విశ్వంబు నీవ యయ్యును, విశ్వభావాభావసందర్శనంబు సేయుచు విద్యావిద్యలకు హేతువయిన నీకుం ప్రణామంబు లాచరించెద మవధ రింపుము. | 682 |
| క. |
లోకజనిస్థితిలయములు, గైకొని చేయుదువు త్రిగుణకలితుఁడవై కా లాకారమున నమోఘ, శ్రీకలితుఁడ వగుచు నిచ్చ సెందక యీశా! |
683 |
| క. |
నీ శాంతలు గాని తనువు, లీశా! యీ మూఢజాతు లీ సజ్జాతుల్ నీ శాంతతనువులందుఁ బ్ర, కాశింతువు ధర్మహితముగా సుజనులలోన్. |
684 |
| ఉ. |
నేరము లెన్న నెక్కడివి? నేము దలంచు తలంపులోపలన్ నేరుపు లున్నవే? సుతులనేరమిఁ దండ్రులు త్రోచిపుచ్చరే? నేరము సేయువారి ధరణీపతు లొక్కొకమాటు గావరే? నేరము గల్గు మద్విభుని నేఁడిటఁ గావఁ గదే కృపానిధీ! |
685 |
| శా. |
బాలుం డీతఁడు మంచివాఁ డనుచుఁ జెప్పన్ రాము క్రూరుండు దు శ్శీలుం డౌ నవు నైన నేము సుభగశ్రీఁ బాసి వైధవ్య దు ష్టాలంకారముఁ బొంద నోడెద మనాథాలాప మాలింపవే? చాలున్ నీ పదతాండవంబు, పతిభిక్షం బెట్టి రక్షింపవే? |
686 |
| ఉ. |
ఆకులమయ్యె భోగ, మిదె యౌఁదల లన్నియు వ్రస్సెఁ, బ్రాణముల్ రాకలఁ బోకలం బొలిసె, రాయిడి వెట్టక మా నిజేశుపై నీ కరుణాకటాక్షములు నిల్పఁగదే తగ, నో సమస్త లో కైకశరణ్య! యో యభయకారణ! యో కమలామనోహరా! |
687 |
| ఆ. |
మమ్ముఁ బెండ్లిసేయు మా ప్రాణవల్లభు, ప్రాణ మిచ్చి కావు భక్తవరద! నీవు సేయుపెండ్లి నిత్యంబు భద్రంబుఁ, బిన్ననాఁటిపెండ్లి పెండ్లి గాదు. |
688 |
| ఇంద్రవజ్ర. |
నీయాన, యెవ్వారిని నిగ్రహింపం డా యుగ్ర పాపాకృతి నందఁ డింకన్, నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁ గోలెన్ మా యీశుప్రాణంబులు మాకు నీవే! |
689 |
| వ. | అని యిట్లు తమ పెనిమిటిబ్రదుకుఁ గోరెడి భుజగసతులయందు శరణాగతరక్షకుండైన పుండరీకాక్షుండు గరుణించి, చరణఘట్టనంబు సాలించి, తలంగిన నెట్టకేలకుఁ బ్రాణేంద్రియంబుల మరలం బడసి, చిదిసి నలఁగిన తలలు సవరించుకొని వగర్చుచు భుజగపతి జలజనయనునికి నంజలి సేసి మెల్లన నిట్లనియె. | 690 |
| చ. |
మలఁకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవహ్నిఘోరముల్, ఖలులము, రోషజాతులము, గర్వుల, మే మొక మంచివారమే? నళినదళాక్ష! ప్రాణులకు నైజగుణంబులు మాన నేర్చునే? వెలయవె? మా వికారములు వింతలె? మే లొనరించి తీశ్వరా! |
691 |
| సీ. |
వివిధభావాకారవీర్యబీజాశయజవయోనియుతముగా జగము లెల్ల నీవ చేసితి మున్న, నే మా జగంబులో సహజకోపనులము సర్పములము, దుర్వారమైన నీ తోరంపుమాయ నే మెఱిఁగి దాఁటెడు పని కెంతవార? మంతకుఁ గారణ మఖిలేశ్వరుండవు సర్వజ్ఞుఁడవు నీవు జలజనయన! |
|
| తే. |
మనిచె దేనిని మన్నించి మనుపు నన్ను, నిగ్రహించెద వేనిని నిగ్రహింపు, మింక సర్వేశ! మా యిమ్ము లెందుఁ గలవు, చిత్తమందున్న క్రమమునఁ జేయఁ దగును. |
692 |
| క. |
నా పుణ్య మేమి సెప్పుదు? నీ, పాదరజంబుఁ గంటి నే, సనకాదుల్ నీ పాదరజము గోరుదు, రే పదమం దున్ననైన నిఁక మేలు హరీ! |
693 |
| వ. | అని విన్నవించినఁ గాళియుపలుకులు విన నవధరించి కారుణ్యమానసుండయిన సర్వేశ్వరుం డతని కిట్లనియె. | 694 |
| క. |
‘గోవర్గముతో మనుజులు, ద్రావుదు రీ మడుఁగు నీరు, తగ దిం దుండన్, నీవును నీ బాంధవులును, నీ వనితలు సుతులుఁ జనుఁడు నేఁ డంబుధికిన్. |
695 |
| క. |
నిను నే శాసించిన కథ, మనమునఁ జింతించి రేపు మాపును గీర్తిం చిన మనుజులు నీ భయమును, విను మెన్నఁడుఁ బొంద రెందు విషవిజయముతోన్. |
696 |
| చ. |
ఇది మొద లెవ్వరైన నరు లీ యమునాతటినీహ్రదంబులో వదలక తోఁగి నన్ను నుపవాసముతోడఁ దలంచి కొల్చుచుం గదలక దేవతాదులకుఁగా జలతర్పణ మాచరించినన్ సదమలచిత్తులై దురితసంఘముఁ బాయుదు రాక్షణంబునన్. |
697 |
| ఆ. |
గరుడభీతి రమణకద్వీప మొల్ల కీ, మడువుఁ జొచ్చి తీవు, మత్పదాబ్జ లాంఛనములు నీతలను నుంటఁ జూచి యా, పక్షిరాజు నిన్నుఁ బట్టఁ డింక. |
698 |
| వ. | అని యిట్లు విచిత్రవిహారుండైన గోపాలకృష్ణకుమారుం డాన తిచ్చిన, నియ్యకొని, చయ్యన నయ్యహీంద్రుండు దొయ్యలులుం దానును నెయ్యంబున న య్యీశ్వరునకు నవ్యదివ్యాంబరాభరణరత్నమాలికానులేపనంబులు సమర్పించి, తేఁటితండంబులకు దండయగు నీలోత్పలంబుల దండ యిచ్చి, పుత్త్రమిత్రకళత్రసమేతుండై, బహువారంబులు గైవారంబు సేసి, వలగొని, మ్రొక్కి, లేచి, వీడ్కొని రత్నాకరద్వీపంబునకుం జనియె, నిట్లు. | 699 |
| క. |
వారిజలోచనుఁ డెవ్వరు, వారింపఁగ లేని ఫణినివాసత్వంబున్ వారించిన యమున సుధా, వారిం బొలుపారె నెల్లవారికిఁ బ్రియమై. |
700 |