పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
కాళియుని పూర్వకథ
వ. అనిన విని ‘మునీంద్రా! యేమి కారణంబునఁ గాళియుండు భుజగనివాసంబయిన రమణకద్వీపంబు విడిచె? నతం డొక్కరుండును గరుడున కేమి తప్పు దలంచె?’నని నరవరుం డడిగిన మునివరుం డిట్లనియె. 701
సీ. ‘సర్పభీరువులైన జను లెల్ల నెలనెల సరసభక్ష్యములు వృక్షముల మొదల
సర్పంబులకుఁ బెట్ట, సర్పంబులును మును సర్పాంతకుఁడు దమ్ముఁ జంపకుండఁ
బ్రతిమాసమును దమభాగభక్ష్యంబు లా పక్షిరాజున కిచ్చి బ్రదుకుచుండ
విషవీర్యదుర్మదావిష్టుఁడై కాళియుఁ డహికులాంతకునిపా లపహరించి
 
తే. యీక తనపాలిబలిభాగ మెల్లఁ దినిన, విని ఖగేంద్రుఁడు కోపించి ‘వీని’ తలలు
సీరి చెండాడి భోగంబు చించివైచి, ప్రాణములఁ బాపి వచ్చెదఁ బట్టి‘ యనుచు.
702
క. అక్షీణకనకసన్నిభ, పక్షయుగోద్భూతఘోరపవమానమహా
విక్షేపకంపితానే, క క్షోణిధరేంద్రుఁ డగుచు గరుడుఁడు వచ్చెన్‌.
703
ఉ. వచ్చిన సర్పవైరిఁ గని వ్రాలక లేచి మహాఫణావళుల్‌
విచ్చి దృగంచలంబుల నవీనవిషాగ్నికణంబు లొల్కఁగా
నుచ్చలదుగ్రజిహ్వలు మహోద్ధతిఁ ద్రిప్పుచు నూర్పులందుఁ గా
ర్చి చ్చెగయంగఁ బాఱి కఱచెన్‌ విహగేంద్రు నహీంద్రుఁ డుగ్రతన్‌.
704
క. కఱచిన భుజగము రదములు, విఱుగఁగ వదనములు విషము వెడలఁగ శిరముల్‌
పఱియలుగ నడిచె గరుడుఁడు, తఱిమి కనకరుచులు గలుగు తన డాఱెక్కన్‌.
705
వ. ఇ ట్లహికులారాతిచేత వ్రేటువడి వెఱచి పఱతెంచి కాళియుం డీ గభీరంబయిన మడుఁగుఁ జొచ్చె, మఱియు నొక్కవిశేషంబు గలదు. 706
సీ. మున్ను సౌభరి యనుముని యీ హ్రదంబునఁ దపము సేయుచు నుండ ధరణిలోన
నాఁకలిగొని పన్నగాంతకుఁ డొకనాఁడు సనుదెంచి యిందుల జలచరేంద్రు
నొడిసి భక్షించిన నున్న మీనము లెల్ల ఖిన్నంబులై వగఁ గ్రిస్సి యున్నఁ
జూచియు మునిరాజు శోకించి కోపించి ‘గరుడుఁడు నేఁడాది గాఁగ నిందుఁ
 
తే. జొచ్చి మీనంబులను మ్రింగఁ జూచెనేనిఁ, జచ్చుఁ గావుత’ మని యుగ్రశాప మిచ్చెఁ
గాళియుం డొక్కఁ డా శాపకథ యెఱుంగు, నితరభుజగంబు లెవ్వియు నెఱుఁగ వధిప!
707
వ. అది కారణంబుగాఁ గాళియుం డీ మడుఁగుఁ జొచ్చియున్న, గో మనుజ రక్షణార్థంబు కృష్ణుం డతని వెడలించె, నిట్లు దివ్యగంధాంబరసువర్ణమణిగణమాలికాలంకృతుండై, మడుఁగు వెడలి వచ్చిన మాధవుం గని, ప్రాణలాభంబులం బొందిన యింద్రియంబులంబోలె, యశోదారోహిణీ సమేతలయిన గోపికలును, నందసునందాదులైన గోపకులును మూర్ఛలం బాసి, తేఱి, తెప్పిఱి, లేచి, పరమానందంబునం బొందిరి, బల భద్రుండు తమ్ముని నాలింగనంబు సేసె, నప్పుడు. 708
క. ఱంకెలు వైచె వృషభము ల, హంకారముతోడ, లేఁగ లట్టిట్టుఱికెం,
బొంకముల నొప్పె ధేనువు, లంకురితము లయ్యెఁ దరువు లా హరిరాకన్‌.
709
క. ‘నీ సుతుఁ డహిచే విడివడె, నీ సురుచిరభాగ్యమహిమనిశ్చల’ మనుచున్‌
భూసురులు సతులు దారును, భాసురవచనముల నందుఁ బలికి రిలేశా!
710
శా. ‘ని న్నా యుగ్రభుజంగమంబు గఱవన్‌ నీ వాపదం బొందుచున్‌
న న్నే మంటి తనూజ! యోడవు గదా నాకూన! నా తండ్రి! రా
వన్నా!’ యంచు శిరంబు మూర్కొని నిజాంకాగ్రంబుపై నిల్పుచుం
గన్నీ రొల్కఁగఁ గౌఁగిలించెఁ దనయున్‌ గారాముతోఁ దల్లి దాన్‌.
711
వ. ఇట్లు పరమసంతోషులై ఘోషజను లారేయి కాళిందీతటంబున నాఁకలి నీరువట్టుల డస్సి క్రుస్సి, గోవులం దారు నుండ, నగణ్యంబగు న య్యరణ్యంబున నొక్క దవానలంబు వుట్టి చుట్టు ముట్టికొని నడురేయి నిద్రితంబైన వ్రజంబుమీదఁ గదిసిన నదిరిపడి, లేచి, దందహ్యమానదేహులయి సకలజనులును మాయామనుజబాలకుండైన హరికి శరణాగతులై యిట్లనిరి. 712
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )