పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
గ్రీష్మర్తు వర్ణనము
సీ. దినము లంతంతకు దీర్ఘంబులై యుండ దిననాథుఁ డుత్తరదిశఁ జరించె,
నాఁటి నాఁటికి నెండ నవ్యమై ఖర మయ్యె, వెచ్చనిగాడ్పులు విసరఁ జొచ్చె,
మేదినీరేణువుల్‌ మింట సంకుల మయ్యె, నేఱులుఁ గొలఁకులు నిగిరిపోయెఁ,
బానీయశాలలఁ బథికసంఘము నిల్చెఁ, జప్పరంబుల భోగిచయము డాఁగెఁ,
 
ఆ. దరులఁ గుసుమచయము దళములతో వాడె, మిథునకోటికి రతి మెండు దోఁచె,
నఖిలజంతుభీష్మమైన గ్రీష్మము రాకఁ, గీలి యడవులందుఁ గేలి సలిపె.
716
ఆ. వాఁడిరుచులు గలుగువానివేఁడిమి గ్రీష్మ, కాలమందు జగము గలయఁ బడియె
బ్రహ్మ జనులకొఱకు బ్రహ్మాండఘటమున, నుష్ణరసముఁ దెచ్చి యునిచె ననఁగ.
717
వ. ఇ ట్లాభీలం బయిన నిదాఘకాలంబు వర్తింప బృందావనంబు రామగోవిందమందిరంబైన కతంబున నిదాఘకాలలక్షణంబులం బాసి, నిరంతరగిరినిపతితనిర్ఝరశీకరపరంపరాభాసితపల్లవితకుసుమితతరులతం బయ్యును, దరులతాకుసుమపరిమళమిళితమృదులపవనం బయ్యును, బవనచలితకమలకహ్లారసరోవర మహాగభీరనదీహ్రదం బయ్యును, నదీహ్రదకల్లోలకంకణప్రభూతపంకం బయ్యును, బంకసంజనిత హరితాయమానతృణనికుంజం బయ్యును, జనమనోరంజనంబైన వసంతకాలలక్షణంబులు గలిగి లలిత మృగపక్షి శోభితం బయి యొప్పుచుండె, మఱియు నందు. 718
క. పికములకోలాహలమును, శుకసంఘముకలకలంబు సుభగమయూర
ప్రకరముకేకారవ, మళి, నికరమురొదయును జెలంగె నెఱి నయ్యడవిన్‌.
719
క. ఆతతయమునాసరసీ, జాతతరంగాభిషిక్తజలరుహగంధో
పేతానిల మడఁచె నిదా, ఘాతతదావాగ్నిపీడ న వ్వనమందున్‌.
720
వ. ఇ ట్లామనికందువ తెఱంగు గల్గి సుందరంబైన బృందావనంబునకు బలకృష్ణులు గోవుల రొప్పికొని చని గోపకులుం దారును నొండొరులతో నగుచుఁ,దెగడుచుఁ, జెలంగుచుఁ,దలంగుచు, జిఱజిఱం దిరుగుచుఁ, దరులసందుల కరుగుచు, దాఁగిలి మూఁతలాడుచు, గీతంబులు వాడుచు, వేణునాదంబులు ఘటియించుచు, నటియించుచు, గతులు దప్పినక్రియ నొఱఁగుచుఁ, గుప్పల కుఱుకుచుఁ, జటలు గొట్టుచుఁ, గందుకంబులం దట్టుచు, నుప్పరం బెగసి, దర్దురంబులచందంబున దాఁటుచు, నామలకబిల్వాదిఫలంబుల మీటుచుఁ, గుటవిటపంబులఁ గదల్చుచు, మృగంబుల నదల్చుచుఁ, బెరల రేఁపుచు, మధుమక్షికలఁ జోపుచుఁ, దేనియలు ద్రావుచు, సొమ్మలు వోవుచు, గురుశిష్యకల్పనంబులం బనులు సేయుచుఁ, గాకపక్షధరులై ముష్టియుద్ధంబులకు డాయుచుఁ, బన్నిదంబులు సఱచుచుఁ బులుఁగులభంగి నఱచుచు, బహురూపంబులు వన్నుచు, నెగిరి తన్నుచు, సేవ్యసేవకమిత్రామిత్రభావంబులు వహించుచు నుత్సహించుచు, మఱియు ననేకవిధంబులఁ గ్రీడించి, రందు. 721
క. మాపాలికి బలకృష్ణులు, భూపాలకు లంచు ఎగిరి బొబ్బ లిడుచు న
గ్గోపాలురు మోతురు ప్రమ, దాపాదకు లగుచు వల్లికాందోళికలన్‌.
722
క. గోపకు లందఱు నాడుచు, దీపింపఁగ రామవాసుదేవులవెనుకం
బై పడి పాఠకగాయకరూపంబులఁ బొగడుదురు నిరూఢాత్మకులై.
723
క. ప్రీతిన్‌ గోపకు లందఱు, గీతంబులు వాడఁ దరుల క్రిందను నగుచుం
జేతులు ద్రిప్పుచు వెడవెడ, పాతర లాడును యశోదపాపం డడవిన్‌.
724
మ. జలజాక్షుండును రాముఁడున్‌ నటనముల్‌ సల్పంగ గోపాల మూ
ర్తులతో వారలఁ గొల్చు నిర్జరులు సంతోషించి, వేణుస్వనం
బులు గావించుచు గొమ్ము లూఁదుచు శిరంబుల్‌ ద్రిప్పుచుం బాడుచున్‌
వలనొప్పన్‌ వినుతించి రప్పుడు నటుల్‌ వర్ణించు చందంబునన్‌.
725
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )