| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | ఇట్లు రామకృష్ణులు నదనదీతీరంబులఁ, గొలంకుల సమీపంబుల, గిరులచఱుల, సెలయేఱుల పొంతల, మడుఁగుల చెంతలఁ, బొదల క్రేవలఁ, బసిమిగల కసవుజొంపంబులఁ బసుల మేపుచుండఁ బ్రలంబుం డను రక్కసుం డుక్కు మిగిలి గోపాలరూపంబున వచ్చి వారల హింససేయం దలంచుచుండ న య్యఖిలదర్శనుం డగు సుదర్శనధరుం డెఱింగియు నెఱుంగని తెఱంగున. | 726 |
| క. |
ఆ రామునిసహజన్ముఁడు, రా రమ్మని వానిఁ జీరి రాకం బోకన్ గారాముసేసి మెల్లన, పోరామి యొనర్చెఁ బిదపఁ బొరిగొనుకొఱకున్. |
727 |
| వ. | ఇట్లు ప్రలంబునితోఁ జెలిమిసేయుచుఁ, గృష్ణుండు గోపాలకులకు నిట్లనియె. | 728 |
| ఆ. |
‘మనకుఁ బ్రొద్దువోదు మన మిందఱము రెండు, గములవార మగుచుఁ గందుకముల శిలలు గుఱులు సేసి చేరి క్రీడింతము, రండు వలయు జయపరాజయములు.’ |
729 |
| వ. | అని యిట్లు పలికి, తానును బలభద్రుండును బెన్నుద్దులై యితరవల్లవులెల్ల నుద్దించుకొని చిఱ్ఱుద్దులై వచ్చిన సమయంబున విభజించుకొని, రెండుగములవారై మార్గంబులందుఁ దృణదారుశిలాకల్పితంబులగు గుఱులొడ్డి, కందుకశిలాదిప్రక్షేపణంబుల లక్ష్యంబులఁ దాఁకవైచి, జయపరాజయనిర్ణయంబులు గైకొని, వాహ్యవాహకలక్షణంబుల జేతలను నిర్జితులు వహించి క్రీడించుచు, బలరామునికి వానిచందంబు రహస్యంబున నెఱింగించి పసుల వెల్చుచు భాండీరకం బనువటంబు సేరి; రా సమయంబునఁ గ్రీడయందు శ్రీదామనామధేయుండైన గోపకుండు శ్రీకృష్ణుని వహించె; భద్రసేనుండు వృషభు నెక్కించుకొనియె; బలభద్రుండు ప్రలంబు నారోహించె; నప్పుడు. | 730 |
| మ. |
‘వనజాక్షున్ బలిమిన్ బలాఢ్యుఁడు దృణావర్తుండు మున్ మింటికిం గొనిపోఁ జాలక చిక్కినాఁ డితని నాకున్ మోవరా’ దంచు నా దనుజారిన్ గొనిపోఁ దలంపక వడిన్ దైత్యేశుఁ డయ్యాటలోఁ గొనిపోయెన్ గిరి దాఁటి రాము నఖిలక్రూరక్షయోద్దామునిన్. |
731 |
| వ. | ఇట్లు క్రీడాకల్పితవాహనుండైన ప్రలంబుండు బలభద్రునిం గొనిపోవుచు. | 732 |
| మ. |
గురుశైలేంద్రసమానభారుఁ డగు నా గోపాలకున్ మోవ లే క రయోద్రేకము మాని దైత్యుఁడు నరాకారంబు సాలించి భీ కరదైత్యాకృతి నేగె హేమకటకాకల్పంబుతో రాముతో మురు వొప్పంగఁ దటిల్లతేందుయుతజీమూతంబుచందంబునన్. |
733 |
| ఉ. |
మోసము లేక వాని పెనుమూఁపున నుండుచు నా హలాయుధుం డా సమయంబునం గనియె హాటకరత్నకిరీటకుండలో ద్భాసితమస్తకున్ భ్రుకుటిభాసురదారుణనేత్రు నుగ్ర దం ష్ట్రాసహితుం బ్రలంబు నురుశౌర్యవిలంబు మదావలంబునిన్. |
734 |
| వ. | కని నక్తంచరుం డని యించుక శంకించి వెఱవక. | 735 |
| క. |
కడువడిఁ దను దివికిం గొని, వడిఁ జనియెడు దనుజుశిరము వ్రయ్య హలధరుం డడరి పటుచటులతర మగు, పిడికిట వెస విసిరి పొడిచె బిఱుసున నలుకన్. |
736 |
| క. |
హలధరుబలుపిడికిటి హతిఁ, దల పగిలిన రుధిరజలము దనువివరములం దొలఁక మొఱయిడుచు దనుజుఁడు, బలరిపుపవినిహతనగముపగిదిం బడియెన్. |
737 |
| మత్తకోకిలము. |
‘మేలు మేలు గదయ్య! రాముఁడు మేటిరక్కసు నొక్కఁడున్ నేలఁ గూలిచె నొక్కపోటున నేఁడు విస్మయ’ మంచు గో పాలకుల్ గని చచ్చి వచ్చిన భ్రాతఁ గన్న విధంబునం జాల దీవన లిచ్చి రాముని సత్కరించిరి వేడుకన్. |
738 |
| క. |
బలవంతుఁ డగు ప్రలంబుఁడు, బలుముష్టిన్ నిహతుఁడైన బ్రదికితి మనుచున్ బలసూదనాది దివిజులు, బలుపైఁ గుసుమములవానఁ బరఁగించి రొగిన్. |
739 |