పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ కృష్ణుఁడు దావాగ్నిని మ్రింగి గో గోపకసంఘమును కాపాడుట
వ. ఇట్లు గోపకులు క్రీడింప గోవు లంతంతఁ గాంతారంబున వింత కసవులు మెసవుచు, మేఁతవడి నొం డడవికి దూరంబు సని యందు దవదహనపవన సంస్పర్శంబు సైరింపక కంపించి దప్పినొప్పు సెడి ఘోషించిన. 740
శా. ఆ గోపాలకు లందఱుం బసుల కుయ్యాలించి కౌమార కే
ళీగాఢత్వము మాని గోఖురరదాళిచ్ఛిన్నఘాసంబుతో
బాగై యున్న పథంబునం జని దవాపన్నంబు గాకుండ వే
వేగన్‌ గోగణమున్‌ మరల్చి రటవీవీథిన్‌ జవం బొప్పఁగన్‌.
741
క. జలధరగభీరరవమున, నలినదళాక్షుండు దమ్ము నామాంకములం
బిలిచిన విని ప్రతిఘోషణ, ములు సేయుచుఁ బసులు దిరిగె ముదమున నధిపా!
742
వ. అంత న వ్వనంబున దైవయోగంబునం బుట్టిన కార్చిచ్చు బిట్టు విసరెడి కరువలివలన మిన్నుముట్ట మిట్టిపడి గట్టు చెట్టనక దరికొని, యట్టె క్రాలుచుఁ జుట్టుకొని, పఱవం గని పల్లటిల్లిన యుల్లంబులతో వల్లవు లెల్లఁ దల్ల డిల్లి సబలుండైన హరికి మృత్యుభీతులరీతిం జక్క మ్రొక్కి యిట్లనిరి. 743
క. అభ్రంకషధూమాయిత, విభ్రాంతమహాస్ఫులింగవిసరోగ్రశిఖా
విభ్రష్టదగ్ధలోకా, దభ్రంబై వచ్చెఁ జూడు దవశిఖి కృష్ణా!
744
శా. నీ చుట్టాలకు నాపదల్‌ గలుగునే! నే మెల్ల నీవార; మ
న్యాచారంబు లెఱుంగ, మీశుఁడవు మా; కాభీలదావాగ్ని నేఁ
డే చందంబున నింక దాఁటుదుము? మమ్మీక్షించి రక్షింప వ
న్నా! చంద్రాభ! విపన్నులన్‌ శిఖివితానచ్ఛన్నులన్‌ ఖిన్నులన్‌.
745
వ. అని విన్నవించి రంత. 746
ఉ. బంధుజనంబుచేత నిటు ప్రార్థితుఁడై హరి విశ్వరూపుఁ డో
బంధువులార! మీ నయనపంకజముల్‌ ముకుళింపుఁ డగ్ని నీ
సంధి నడంతు నే ననినఁ జక్కన వారలు నట్ల చేయుడున్‌
బంధురదావపావకముఁ బట్టి ముఖంబునఁ ద్రావె లీలతోన్‌.
747
వ. ఇట్లు నిజయోగవైభవంబున దావదహనంబు పానంబు సేసి నిమిషమాత్రంబున గోపకుల నందఱ భాండీరకవటసమీపంబునకుం దెచ్చి విడిచిన వారు వికసితనయనకమలు లయి కృష్ణునియోగమాయా ప్రభావంబున నెరగలి చిచ్చు మ్రగ్గె నని యగ్గించుచుఁ దమ మనంబులందు. 748
క. ‘కార్చి చ్చార్చుపటుత్వము, నేర్చునె నరుఁ డొకఁడు? శౌరి నేఁ డిదె కార్చి
చ్చార్చి మనల రక్షింపఁగ, నేర్చె నితం డజుఁడొ హరియొ నిటలాక్షుండో!’
749
వ. అని వితర్కించి రంతఁ గృష్ణుండు సాయాహ్నసమయంబున రామసహితుండై వంశనాళంబు పూరించుచు గోపగణజేగీయమానుండై గోష్ఠంబు ప్రవేశించె నప్పుడు. 750
క. కమలాక్షునొద్ద నుండని, నిమిషము యుగశతము గాఁగ నెగడిన గోప
ప్రమదలు సంభ్రమమున నా, కమలాక్షునిఁ జూచి ముదముఁ గనిరి మహీశా!
751
వ. ఆ సమయంబున గోపకు లిండ్లకడ నున్న వృద్ధకాంతాజనంబులకు రామకృష్ణుల చిత్రచరిత్రంబులు సెప్పిన, విని వారు వారినిఁ గార్యార్థులై వచ్చిన వియచ్చరవరు లని తలంచి రంత. 752
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )