| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| సీ. |
పూర్వవాయువులు ప్రభూతంబులై వీచెఁ బడమట నింద్రచాపంబు దోఁచెఁ బరివేషయుక్తమై భానుమండల మొప్పె మెఱపు లుత్తరదిశ మెఱవఁ దొడఁగె దక్షిణగాములై తనరె మేఘంబులు జలచరానీకంబు సంతసించెఁ జాతకంబులపిపాసలు కడపలఁ జేరెఁ గాంతారవహ్నులగర్వ మడఁగె |
|
| ఆ. |
నిజకరాళివలన నీరజబంధుండు, దొల్లి పుచ్చుకొన్నతోయ మెల్ల మరల నిచ్చుచుండె మహిఁ గర్షకానంద, కందమైన వాన కందు వందు. |
753 |
| క. |
వర్షాకాలభుజంగుఁడు, హర్షముతో నిడిన నవనఖాంకము లని యు త్కర్షింప భూమిసతిపైఁ, గర్షకహలరేఖ లమరె గహనాంతమునన్. |
754 |
| క. |
చెలువుఁడు ప్రావృట్కాలుఁడు, పొలసినఁ బులకించుభూమిపులకము లనఁగా మొలచి తల లెత్తి నిక్కుచు, సలలితగతి జాలువాఱె సస్యము లధిపా! |
755 |
| వ. | మఱియుఁ జటులపవనచలితంబులై మిన్ను దన్ని, లెక్కకు మిక్కిలియై, ఱెక్కలు గల నీలగిరుల సిరుల మీఱి, కాఱుకొని తెఱపిపడక, నిబిడంబులై, శిశిరకిరణతరణి మండలంబుల చొప్పు దప్పించి, విప్పు కలిగి, చదలు గప్పుకొనిన లీలంగ్రాలు నీలమేఘంబులును, మేఘవిముక్తంబులయి జలదసమయవిటుండు సరసగతి ధరణిసతియురమ్మున దర్పించి నేర్పున సమర్పించు కర్పూరఖండంబులవడువునఁ బుడమిఁ బడు కరకలును, గరకానుగతంబులై యసితభోగిభోగంబుల బాగున నీలమణిమాలికావిశేషంబువిధంబున నెడపడక పడు సలిలధారలును, ధారాధరవిగళితవిమలసలిలంబులం దోఁగుచు, మదజలాభిషిక్తమత్తమాతంగంబుల సొబగున నుండు కొండలును, గొండలతుదలనుండి గండశైలంబులపైఁ బడి వికీర్యమాణంబులగు గిరినిర్ఝరంబుల శీకరంబులును, శీకరపరంపరలఁ జొదుగులు మదుగులఁ గొనినఁ బిదపిద నగుచుఁ జిదుకు చిదుకు మను రొంపులును, రొంపులు గ్రొచ్చి క్రచ్చఱ నుచ్చలితంబు లయి పఱచువఱదలును, వఱదలవలన మెదలి కదలి పాఱెడి యేఱులును, నేఱులవెంట గఱులు త్రిప్పుచు గములు గొని క్రొన్నీటి కెదురు నడుచు మీనంబులును, మీననయనలమెఱుంగు సొంపుపెంపు సైరింపక కంపించి తిరిగి సురిఁగి చనియెడికరణి మేఘమధ్యంబులం బొలసి మలసి నిలువక మరలి చను క్రొమ్మెఱుంగులును, మెఱుంగుల తెఱంగున మగువలు పురుషులం దగిలి నిలువ రని జనుల కెఱుంగ నలువ మొఱయిడిన తెఱంగున మొరయునుఱుములును, నుఱుముల కులికిపడక కికురు పొడుచుచుఁ బించెంబులు గొంచెంబులు సేయక విప్పి దెప్పరంబుగ రొప్పుచు నర్తనంబులు సేయు మయూరంబులును, మయూరఘోషంబులు భీషణములై చెవులు సోఁక ననూనంబులైన మానంబుల నాసలు సెడి యొండొరులకుఁ గ్రిందుపడి క్రందుకొను విరహిజనులును, జనులకు రేపు మా పని నిరూపింపరాక మాలతీకుసుమవిసరవికసనవిదితావసానంబు లగు దుర్దినంబులును, దినావసాన సమయంబున మినుకుమినుకుమని మెఱయుచుం దిరుగు ఖద్యోతంబులును, ఖద్యోతసందర్శనంబు గోరుచు నుడుగక విడువక కురియు జడింబడి వలిగొని వడఁకుచు నశనయత్నంబులు వర్జించి ఖర్జూరజంబూఫల భక్షణంబుల దేహసంరక్షణంబు లాచరించు వనచరులును, వనచరానందకారిణులయి వారరమణుల రుచి ననవరతభుజగసమేతలగు కేతకులును, గేతకీకదంబయూధికా కుటజ కుసుమ పరిమళమిళితంబు లగు విపినమార్గంబులును, మార్గనిరోధంబు లగుచుం బెరిఁగి రసికంబులై పసరు దొలంకుచు హరిన్మణికిరణ పుంజంబులభంగి రంజిల్లి తొంగలించుచు జొంపంబులు గొనిన కసవులును, గసవులు మెసవి మిసమిసం దనువులు మెఱవ వలుఁదపొదుఁగులబరువునం గదలక నిలిచి నెమ రమర నిడు ధేనువులును గలిగి ధేనువ్రజంబు కైవడిఁ బయఃకణమనోహరంబై, హరకరంబుభంగిఁ బరిపూర్ణసారంగభాసురంబై, సురగిరి చెలువున హరిశరాసనవిభీషణంబై, విభీషణహృదయంబు పోలికం బ్రకటిత హరిశబ్దవైభవంబై, భవపూజనంబు చందంబున నింద్రగోపాదివిభవజనకంబై జనకయాగంబుభాతి సీతాప్రకరణాలంకృతంబై, కృతయుగంబు సొంపున బహువర్షంబునై వర్షాగమంబు చెలువొందె నప్పుడు. | 756 |
| క. |
వాడక వ్రాలక తెవుళులఁ, గూడక తగ నల్లగెఱలుకొని నవకములై చూడఁగ భద్రము లగుచును, వీడెన్ సస్యంబు లిడుమ వీడెం బ్రజకున్. |
757 |
| క. |
జీవనము సాలఁ గలిగియుఁ, గావరమున మిట్టిపడని ఘనునిక్రియ నదీ జీవనములు సొర జలనిధి, ప్రావృట్కాలమున డిందుపడియుండె నృపా! |
758 |
| శా. |
ఆ వర్షాగమమందు గోవుల నరణ్యాంతంబులన్ మేపుచున్ గోవిందుండు ప్రలంబవైరియుతుఁడై గోపాలవర్గంబుతోఁ బ్రావీణ్యంబునఁ గందమూలఫలముల్ భక్షించుచున్ మంజుల గ్రావాగ్రంబులఁ బ్రీతిఁ జల్ది గుడిచెం గాసారతీరంబులన్. |
759 |
| వ. | ఆ సమయంబున. | 760 |
| సీ. |
విశ్వమోహనమైన వేణునినాదంబు సరసగంభీరగర్జనము గాఁగ మహనీయనిర్మలమందహాసద్యుతి లలితసౌదామనీలతిక గాఁగఁ దలచుట్టు బాగుగఁ దనరు ఫించపుదండ శైలభేదనశరాసనము గాఁగఁ గరుణాకటాక్షవీక్షణసుధావర్షంబు సలిలధారాప్రవర్షంబు గాఁగ |
|
| తే. |
జాడ నేతెంచు గోపాలజన మునీంద్ర, చాతకంబుల దురవస్థ సక్కఁ జేసి కృష్ణమేఘంబు బహుతరకీర్తి నొప్పె, విమలబృందావనాకాశవీథియందు. |
761 |
| క. |
గోవుల వృషవత్సంబుల, వావిరిఁ బూజించి పిదప వర్షాకాల శ్రీవనితను బూజించెను, శ్రీవల్లభుఁడయ్యు గోపశేఖరుఁ డధిపా! |
762 |
| వ. | ఇట్లు కృష్ణుండు విహితవిహారంబుల వర్షాకాలంబు వుచ్చె నంత. | 763 |