| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| క. |
జొంపములు గొనియె వనములు, రొంపు లిగిరె; నెమిలిగములరొద లుడిగె; నదుల్ పెంపులకుఁ బాసె; నుఱుముల, శంపల సంపదలు మానె శారదవేళన్. |
764 |
| వ. | మఱియు జీవనంబులు విడిచి, విమలజ్ఞానవశంబున ముక్తులగు పురుషరత్నంబుల చెన్నున నన్ను వదలి, మిన్ను విడిచి, వాయువశంబులై, వెల్లివిరిసి చను మేఘంబులును; మేఘపటలరహితంబును గలశభవముని సహితంబునునై, విజ్ఞానదీపవిలసితం బగు యోగిహృదయంబుచందంబున శుభ్రం బయిన యభ్రంబును; నభ్రంబున నీలదుకూలవితానసంయుక్తముక్తాఫలంబులవడువున నెగడు నుడుగణంబులును, నుడుగణ మయూఖంబు క్రొవ్వు లువ్వెత్తుగొని నివ్వటిల్లుచు బ్రహ్మాండకరండకర్పూరఖండాయమానంబులగు చంద్రకిరణంబులును, జంద్రకిరణసంస్పర్శనంబున సగర్భంబులై భూమికి దుర్భరంబు లగుచు నిండి పండి హలికకరనిశితలవిత్రధారాసంరంభంబుఁ దలంచి తల్లడిల్లి వెలువెలుకం బాఱుచుఁ దల్లియగు విశ్వంభరకు మునుకొని ప్రణతంబులై వడంకుచు నెఱుఁగ మొఱయిడుచున్న పెంపున సంపన్నంబు లయిన యెన్నుల వ్రేఁగున వ్రాలి గాలిం దూలుచు మర్మరధ్వనుల సారస్యంబులగు కలమాదిసస్యంబులును; సస్యమంజరీ పుంజంబులఁ గొంచక చంచువులఁ ద్రుంచి కబళించి పిల్ల పెంటి తండంబులం గూడి కడుపులు నిండ మెక్కి విక్కవిరిసి చొక్కుచుఁ ద్రిక్కలు గొని మహోత్తుంగసమంచితమంచప్రదేశంబు లెక్కి సంచరించుచు వెన్నుల కావలియున్న యన్నుల కెమ్మోవులు బింబఫలంబు లని కఱచి తత్కరాస్ఫాలనంబుల నులికిపడి యెగసి చను శుకనికరంబుల కలకలంబులును, గలహంస కోక సారస కోలాహల మండితంబులై నిండిన నిర్మల జలంబులు గల జలాశయంబులును, జలాశయంబుల జలంబు లనుదినంబు నిగుర గృహంబుల బ్రదుకుదినంబులు సనుట యెఱుంగని మనుజుల గమనికం దిరుగు జలచరంబులును, జలచరహృదయంబుల బెదరు గదుర డొంకి యింకిన నదులును, నదులందుఁ గర్పూరమండపంబుల తెఱంగున, మణికుట్టిమంబులమాడ్కిని, సౌధసోపానమార్గంబులజాడను, విలోకితంబులగు నూతనసైకతంబులును, సైకతప్రదేశంబుల నుదయవేళల నిత్యకర్మానుష్ఠాననిరతులగుమునులును, మునికన్యకాకరకలశసలిలాభిషిక్తమూలంబు లగు తపోవన బాలరసాలసాలంబులును, సాలవిటపివాసంతికాకుంజపుంజంబులతఱచున నిముడుకొని దినకరకిరణంబులకుం గరువలికిం జొర వెరవుపడని వనమ్ములును, వనమ్ములం దరులకొనల నాకలములు నేకలములై మెసంగి మసరుకవిసి క్రొవ్వి కొమ్ముకొనల సూటి నేటిదరులు త్రవ్వి చిమ్మి క్రుమ్మి కోరాడెడి వనగజంబులును, గజకుంభకనకకుంభరుచిరకుచభారభీరుమధ్యసమంచిత లగు చెంచితలును, జెంచితల క్రూరమ్ములగువాలమ్ముల సారమ్ములు సెడి ఖేదమ్మునఁ బాదమ్ములు దొట్రుపడఁ బెనుగాతమ్ములం బడు వరాహపుండరీకంబులును, బుండరీకకుముదకురంటకాదికుసుమమకరందంబులు గ్రోలి తేలి సోలి వాలి మహాహంకృతుల ఝంకృతులు సేయు తేఁటికదుపులును, గదుపులం గలయక యెడగలిగి మదమున నదనుపద నెఱింగి మదనమార్గణప్రేరితంబులై పెంటితుటుముల వెంటం జని యొండొంటి గెంటించుచుఁ దగుల నెక్కి గర్భంబులు నెక్కొలుపు మృగవృషభరాజంబులును గలిగి, రాజరాజగృహంబు పగిది విలసితకుందపద్మ సౌభాగ్యంబై, భాగ్యహీనుకర్ణరేఖగతి నశ్రుతనీలకంఠశబ్దంబై, శబ్దశాస్త్రవేదిహృదయంబుబాగున విశదప్రకాశాభిరామంబై, రామసంగ్రామంబుకైవడి బాణాసనాలంకృతంబై, కృతాంతహృదయంబుకరణి నపంకంబై, పంకజాసనుగేహంబు సొంపున రాజహంసవిరాజమానంబై, మానధనునిచరిత్రంబుసొబగున నకల్మషజీవనంబై, వననిధిపొలుపున సమ్మిళితభూభృద్వాహినీసంకులంబై, కులవధూరత్నంబు చెలువున నదృష్టపయోధరం బై ధరణికిం దొడ వగుచు శరత్కాలంబు వచ్చె నంత. | 765 |
| క. |
వాజుల నీరాజనములు, రాజుల జయగమనములును రాజితలక్ష్మీ పూజలు దేవోత్సవములు, రాజిల్లెను జగతియందు రాజకులేంద్రా! |
766 |
| క. |
చేగ గల చెఱకువింటను, బాగుగ నీలోత్పలంబు బాణంబుగ సం యోగంబు సేసి మదనుఁడు, వేగంబున విరహిజనుల వేఁటాడె నొగిన్. |
767 |
| వ. | ఇట్లు భాసురంబు లయిన శరద్వాసరంబుల గోవిందుండు గోబృందసమేతుండై బృందావనంబునఁ బసులఁ బొసంగ మేపుచు. | 768 |
| సీ. |
కర్ణావతంసితకర్ణికారప్రభ గండభాగద్యుతిఁ గడలుకొలుప భువనమోహనమైన భ్రూవిలాసంబుతో వామభాగానతవదన మొప్ప నపసవ్యకరమృదులాంగుళిచాతురి షడ్జధ్వనికి మర్మసరణిఁ జూప డాకాలిమీఁద నడ్డము సాఁచి నిల్పినపదనఖద్యుతి భూమిఁ బ్రబ్బికొనఁగ |
|
| తే. |
మౌళిపింఛముఁ గంఠదామమును మెఱయ, విలసితగ్రామముగ నొక్కవేణువందు బ్రహ్మగాంధర్వగీతంబు పరఁగఁ జేసెఁ, జతురనటమూర్తి గోపాలచక్రవర్తి. |
769 |
| వ. | ఇట్లు హరి వేణునాదంబు పూరించిన మారవికారహేతువగు తద్గీతం బాలించి సిగ్గులు చాలించి మక్కువలు సెక్కులొత్త గోపిక లోపికలు లేక తమతమ పొత్తుకత్తెలుం దారును దత్తరంబునఁ బదుగురు నేగురుఁ దుటుములు గట్టి జిలిబిలి ముచ్చటలకుం జొచ్చి తమలోన. | 770 |
| మ. |
శ్రవణోదంచితకర్ణికారకముతో స్వర్ణాభచేలంబుతో నవతంసాయితకేకిపింఛకముతో నంభోజదామంబుతో స్వవశుండై మధురాధరామృతముచే వంశంబుఁ బూరించుచున్ ఉవిదా! మాధవుఁ డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే! |
771 |
| శా. |
రావే సుందరి! యేమె బోటి! వినవే! రాజీవనేత్రుండు బృం దావీథిం దగ వేణు వూఁదుచు లసత్సవ్యానతాస్యంబుతో భ్రూవిన్యాసము లంగుళీక్రమములుం బొల్పార షడ్జంబుగాఁ గావించెన్ నటుభంగి బ్రహ్మమగు తద్గాంధర్వసంగీతమున్. |
772 |
| క. |
తలఁకెను గొబ్బునఁ జిత్తము, నలినాక్షుని మధురవేణునాదము నా వీ నులు సోఁకినంతమాత్రన, చెలియా! యిఁక నేటివెఱపు చింతింపఁ గదే! |
773 |
| క. |
నాతోడ వెఱవ వలదే?, నాతోడనె కొనుచుఁ బోయి నలినదళాక్షున్ నీతోడుతఁ బలికించెద, నీతోడిజనంబు మెచ్చ నీతోడు సుమీ! |
774 |
| వ. | అని పెక్కుభంగుల నోర్తోర్తె నుద్దేశించి పలుకుచు, గోపసుందరులు బృందావనంబునకు గోవిందుని కెదురు చని పరమానందంబున నతనిం దమమనంబులఁ బ్రతిపదంబును నాలింగనంబు సేసినవార లగుచు, రామకృష్ణుల నుద్దేశించి. | 775 |
| మ. |
నవగోస్థానకరంగమందుఁ బరమానందంబుతోఁ జూత ప ల్లవ నీలోత్పలపింఛపద్మదళమాలావస్త్రసంపన్నులై కవయై వేణువు లూఁదుచున్ బహునటాకారంబులం గేళితాం డవముల్ సేసెద రీ కుమారకులు; వేడ్కం గామినుల్ గంటిరే? |
776 |
| క. |
ఓ చెలువలార! వినుఁడీ, వాచాశతకంబు లేల? వర్ణింపంగా లోచనముల కలిమికి ఫల, మీచెలువురఁ జూడఁగలుగు టింతియ సుండీ? |
777 |
| వ. | అని పలికి; రందుఁ గొందఱు గోవిందు నుద్దేశించి. | 778 |
| మ. |
ఒనరన్ వ్రేతల కించుకేనియును లే కుండంగ గోపాల కృ ష్ణునికెమ్మోవిసుధారసంబు గొనుచుం జోద్యంబుగా మ్రోయుచుం దన పర్వంబులు నేత్రపర్వములుగా దర్పించెఁ బూర్వంబునన్ వనితా! యెట్టితపంబు సేసెనొకొ యీ వంశంబు వంశంబులోన్. |
779 |
| మ. |
ముదితా! యే తటినీపయఃకణములన్ మున్ వేణు వింతయ్యె నా నది సత్పుత్రునిఁ గన్నతల్లిపగిదిన్ నందంబుతో నేఁడు స మ్మదహంసధ్వని పాటగా వికచపద్మశ్రేణి రోమాంచమై యొదవం దుంగతరంగహస్తనటనోద్యోగంబు గావింపదే! |
780 |
| క. |
నలినోదరుభక్తునిఁ గని, కులజులు నందాశ్రుజలము గురియుపగిది మ్రాఁ కులు పూఁదేనియ లొలికెడు, నలినాక్షునిచేతివంశనాళము మ్రోఁతన్. |
781 |
| శా. |
నా మోసంబున కెద్దిమేర? వినవే నా పూర్వజన్మంబులన్ లేమా! నోముల నోఁచుచో నకట! కాళిందీతటిన్ వేణువై భూమిం బుట్టెద నంచుఁ గోరఁ దగదే? బోధిల్లి యట్లైన నీ బామం దిప్పుడు మాధవాధరసుధాపానంబు గల్గుంగదే! |
782 |
| క. |
కాళిందీకూలంబున, నాళీ! యీ నందతనయునధరామృతముం గ్రోలెడి వేణువ నగు నో, మేలాగున నోఁచవచ్చు నెఱిఁగింపఁగదే! |
783 |
| క. |
వనితా! కృష్ణుఁడు నల్లని, ఘన మనియున్ వేణురవము గర్జన మనియున్ మనమునఁ దలంచి రొప్పుచు, ననవరతము నెమలితుటుము లాడెడిఁ గంటే! |
784 |
| క. |
గిరిచరమిథునము లోలిం, బరికింపఁగఁ గృష్ణపాదపద్మాంకితమై సురరాజునగరికంటెను, దరుణీ! బృందావనంబు దద్దయు నొప్పెన్. |
785 |
| మ. |
అమరేంద్రాంగన లాకసంబున విమానారూఢలై పోవుచుం గమలాక్షున్ శుభమూర్తిఁ గాంచి మురళీగానంబు లందంద క ర్ణములన్ నిల్పుచు మేఖలల్ వదలఁగా నాథాంకమధ్యంబులం బ్రమదా! వ్రాలిరి చూచితే వివశలై పంచాశుగభ్రాంతలై. |
786 |
| ఉ. |
కానల నుండుచున్ సరసగానవివేకవిహీనజాతులై వీనుల నేఁడు కృష్ణముఖవేణురవామృతధార సోఁకినన్ మేనులు మేఁతలున్ మఱచి మెత్తనిచూడ్కి మృగీమృగావళుల్ మానిని! చూడవమ్మ! బహుమానము సేసెఁ గృతార్థచిత్తలై. |
787 |
| ఉ. |
తల్లుల చన్నుఁబాలు మును ద్రావు తఱిన్ దమకర్ణవీథులన్ వల్లభమైన మాధవునివంశరవామృతధార సొచ్చినం ద్రుళ్ళక పాలురాఁ దివక దూఁటక మానక కృష్ణుమీఁద దృ గ్వల్లులు సేర్చి నిల్చె నదె! వత్సము లంగనలార! కంటిరే! |
788 |
| మ. |
మమతన్ మోములు మీఁది కెత్తుకొని రోమంథంబు సాలించి హృ త్కమలాగ్రంబులఁ గృషు న్ణిల్పి మురళీగానామృతశ్రేణి క ర్ణములం గ్రోలుచు మేఁత మాని గళితానందాశ్రులై చిత్రితో పమలై గోవులు సూచుచున్న వదిగోఁ, బద్మాక్షి! వీక్షించితే? |
789 |
| మ. |
జగతీజంబులశాఖ లెక్కి మురళీశబ్దామృతస్యందమున్ మిగులన్ వీనులఁ ద్రావి వ్రేఁగుపడి నెమ్మిం గృష్ణురూపంబు చి త్తగమై యుండఁగ నడ్డపెట్టుక్రియ నేత్రంబుల్ దగన్ మూసి, యీ ఖగముల్ సొక్కెడిఁ జూచితే! మునిజనాకారంబులం గామినీ! |
790 |
| మ. |
క్రమ మొప్పన్ నదు లెల్ల వంశరవ మాకర్ణించి సంజాత మో హములన్ మన్మథసాయకక్షతవిశాలావర్తలై హంసవా క్యములం జీరి తరంగహస్తముల నాకర్షించి పద్మోప హా రములం గృష్ణపదార్చనంబు సలిపెన్ రామా! విలోకించితే? |
791 |
| ఆ. |
వనిత! నేఁడు కృష్ణు వంశనినాదంబు, విని పయోధరంబు విరులు గురిసి తన శరీర మెల్ల ధవళాతపత్రంబుఁ, జేసి మింట నీడఁ జేసెఁ గంటె. |
792 |
| క. |
మంచిఫలంబులు హరిచే, నించి కరాలంబనముల నెగడుచు నిదె క్రీ డించెద, రంగన! చూడుము, చెంచితలం బింఛపత్రచేలాంచితలన్. |
793 |
| క. |
ఉల్లసితకుచభరంబుల, నల్లాడెడి నడుముతోడ నలరులదండన్ భిల్లి యొకతె హరి కిచ్చెను, హల్లోహలకలిత యగుచు నంగన! కంటే! |
794 |
| క. |
గిరు లెల్ల జలము లయ్యెం, దరు లెల్లను బల్లవించె ధరణి గగన భూ చరు లెల్లను జొక్కిరి హరి, మురళిరవామృతము సోఁక ముద్దియ! కంటే! |
795 |
| మ. |
బలకృష్ణాంఘ్రిసరోజసంగమముచే భాసిల్లుచున్ ధన్యమై ఫలపుష్పంబులఁ గానికల్ గురిసి సంభావించి మిన్నందుచున్ జలఘాసంబుల గోవులం దనిపి చంచద్భూజరోమాంచమై వెలసెం జూడఁ గదమ్మ! యీ గిరిపురోవీథిన్ సరోజాననా! |
796 |
| వ. | అని యిట్లు బృందావన విహారియైన గోవిందుని సందర్శించి పంచబాణభల్లభగ్నహృదయ లయి వల్లవకాంత లేకాంతంబులఁ జింతించుచుఁ దత్పరతంత్ర లయియుండి రంత. | 797 |