పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
హేమంతఋతు వర్ణనము
క. శామంతికాస్రగంచిత, సీమంతవతీకుచోష్ణజితశీతభయ
శ్రీమంతంబయి గొబ్బున, హేమంతము దోఁచె; మదనుఁ డేఁచె విరహులన్‌.
798
క. ఉత్తరపుగాలి విసరె వి, యత్తలమునఁ దుహినకిరణుఁ డహితుం డయ్యెన్‌
బొత్తు జరిగె మిథునములకు, నెత్తమ్ములు దఱిఁగె హిమము నెలకొనియె నృపా!
799
క. అహములు సన్నము లయ్యెను, దహనము హితమయ్యె దీర్ఘ దశలయ్యె నిశల్‌;
బహుశీతోపేతంబయి, యుహుహూ యని వడఁకె లోక ముర్వీనాథా!
800
క. అన్నుల చన్నులదండ వి, పన్నులు గా కెల్లవారు బ్రదికిరిగా కీ
చన్నుల మీఱిన వలి నా, పన్నులు గాకుండఁ దరమె బ్రహ్మాదులకున్‌.
801
ఆ. పొడుపుఁ గొండమీఁదఁ బొడుచుట మొదలుగాఁ, బరువువెట్టి యినుఁడు పశ్చిమాద్రి
మఱుఁగుఁ జొచ్చెఁగాక మసలినఁ జలిచేతఁ, జిక్కెఁ జిక్కె ననఁగఁ జిక్కకున్నె.
802
క. చెంగల్వవిరులగంధము, మంగళముగఁ గ్రోలుచున్న మధుపము లొప్పె
న్నంగజ వహ్నులపై ను, ప్పొంగి విజృంభించు పొగలపోలిక నధిపా!
803
ఆ. శంభుకంట నొకటి, జలరాశి నొక్కటి, మఱియు నొకటి మనుజ మందిరముల
నొదిగెఁగాక; మెఱసియున్న మూఁడగ్నులు, చలికి నులికి భక్తి సలుపకున్నె?
804
శా. ఈ హేమంతము రాకఁ జూచి రమణీహేలాపరీరంభ స
త్సాహాయ్యంబునఁగాని వీని గెలువన్‌ శక్యంబుగా దంచుఁ దా
రూహాపోహవిధిం ద్రిమూర్తులు సతీయుక్తాంగు లైనారు గా
కోహో! వారలదేమి సంతతవధూయోగంబురాఁ గందురే?
805
క. ఈ హేమంతము రాకకు, శ్రీహరి యొక్కింత వడఁకి చింతింపంగా
నోహో! వెఱవకు మని తా, మా హరికిని శ్రీకుచంబు లభయం బిచ్చెన్‌.
806
వ. ఇట్లు నితాంతంబగు హేమంతంబున మొదలినెల తొలిదినంబు నందు నందునిమందం గల గోప కుమారికలు రేపకడ లేచి చని కాళిందీజలంబులం దోఁగి; జలతీరంబున నిసుమునం గాత్యాయనీరూపంబుఁ జేసి, సురభికుసుమగంధంబు లిడి, ధూపదీపంబు లిచ్చి, బహువిధోపహారంబులు సమర్పించి; 807
క. ‘ఓ కాత్యాయని! భగవతి, నీకున్‌ మ్రొక్కెదము నేము నేఁ డనుకంపన్‌
మా కిందఱకును వైళమ, శ్రీకృష్ణుఁడు మగఁడు గాఁగఁ జేయుము తల్లీ!
808
క. ఓ తల్లి! మాకుఁ గృష్ణుఁడు, చేతోవిభుఁ డైననాఁడు చెలువల మెల్లన్‌
నేతివసంతము లాడుచు, జాతర సేసెదము భక్తిచాతురితోడన్‌.
809
వ. అని నమస్కరించి హవిష్యంబులు గుడుచుచు న వ్విధంబున మాసవ్రతంబు సలిపి రందొక్కనాఁడు. 810
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )