| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| మ. |
రమణుల్ ప్రొద్దున మేలుకాంచి సఖులన్ రం డంచు నాత్మీయ నా మములం జీరి, కుచద్వయీభరములన్ మధ్యంబు లల్లాడఁగాఁ బ్రమదోద్దామగజేంద్రయాన లగుచుం బద్మాక్షునిం బాడుచున్ యమునాతీరముఁ జేరఁ బోయిరి గృహీతాన్యోన్యహస్తాబ్జలై. |
811 |
| వ. | ఇ ట్లా నదీతీరంబు సేరం జని గజగమనలు విజనస్థలంబున వలువలు విడిచి యిడి మది శంక లేక యకలంకలై క్రుంకులిడఁ జలంబుల జలంబులు సొచ్చి. | 812 |
| క. |
వారిజలోచనుఁ బాడుచు, వారిజలోచనలు వారివారికి వేడ్కన్ వారివిహారము సలిపిరి, వారివిహారములు జగతివారికిఁ గలవే? |
813 |
| వ. | ఆ సమయంబున. | 814 |
| క. |
తోయజనయనలు యమునా, తోయములం దుండు టెఱిఁగి దూరగుఁ డయ్యుం దోయజనయనుఁడు హరి తన, తోయము గోపకులు దానుఁ దోతెంచె నృపా! |
815 |
| తరలము. |
కదలకుం డని తోడివారలఁ గన్ను సన్నల నిల్పుచుం బదము లొయ్యన నేలఁ బెట్టుచుఁ బద్మనేత్రుఁడు మౌనియై పొదల మాటున నల్లనల్లన పొంచి పొంచి నతాంగుఁడై యదను గోరుచు డాసి వ్రేతల యంబరంబులు దొంగిలెన్. |
816 |
| వ. | ఇట్లు దొంగిలి. | 817 |
| శా. |
ఉద్యద్గంధగజేంద్రగౌరవముతో యోషాంబరంబుల్ విభుం డాద్యుం డర్భకుభంగి నర్భకులతో హాసార్థియై కొంచుఁ ద న్నద్యంభఃకణశీతవాతజనితానందంబుతో నెక్కెఁ దా సద్యోముక్తదురంతపాదపజనుస్సంతాపమున్ నీపమున్. |
818 |
| వ. | అప్పు డయ్యింతు లిట్లనిరి. | 819 |
| క. |
‘మా మా వలువలు ముట్టకు, మా మా! కొనిపోకు పోకు మన్నింపు తగన్ మా మాన మేల కొనియెదు?, మా మానసహరణ మేల? మానుము కృష్ణా! |
820 |
| సీ. |
బహుజీవనముతోడ భాసిల్లి యుండుటో గోత్రంబు నిల్పుటో కూర్మితోడ? మహి నుద్ధరించుటో? మనుజసింహంబవై ప్రజలఁ గాచుటొ? కాక బలిఁ దెరల్చి పిన్నవై యుండియుఁ బెంపు వహించుటో? రాజుల గెల్చుటో రణములందు? గురునాజ్ఞ సేయుటో? గుణనిధి వై బలప్రఖ్యాతిఁ జూపుటో భద్రలీల? |
|
| ఆ. |
బుధులు మెచ్చ భువిఁ బ్రబుద్ధత మెఱయుటో, కలికితనము సేయ ఘనత గలదె? వావి లేదు వారివారు నా వా రని, నెఱుఁగ వలదె వలువ లిమ్ము కృష్ణ! |
821 |
| క. |
కొంటివి మా హృదయంబులు, గొంటివి మానంబు; లజ్జఁ గొంటివి; వలువల్ గొంటి; విఁక నెట్లు సేసెదొ, కొంటెవు గద! నిన్ను నెఱిఁగికొంటిమి కృష్ణా! |
822 |
| సీ. |
రాజసంబున నీవు రంజిల్లు టెఱుఁగమే? చెలరేఁగి వింతలు సేయుచుండ సత్త్వసంపద గల్గి జరగుటఁ దలఁపమే?, సిరి గల్గి యన్యులఁ జెనకుచుండ గురుతరశక్తియుక్తుఁడ వౌట యెఱుఁగమే? తామసంబున నెగ్గు దలఁచుచుండ నొకభంగితో నుండకుంటఁ జింతింపమే? మాయావియై మాఱుమలయుచుండ |
|
| ఆ. |
నేమి జాడవాఁడ? వేపాటి గలవాఁడ, వే గుణంబు నెఱుఁగ వెల్ల యెడల నొదిఁగి యుండనేర? వోరంత ప్రొద్దును, బటము లీఁగదయ్య! పద్మనయన! |
823 |
| క. |
రాజుల నెఱుఁగవు బలిమిని, రాజిల్లెదు చీర లీవు రమణుల మింకన్ రాజున కెఱిఁగించెద; మో రాజీవదళాక్ష! నీవు రాజవె ధరకున్? |
824 |
| వ. | అని పలికిన కన్నియలపలుకు లాలించి మందహాససుందరవదనారవిందుండై గోపాలబాలకుల కరంబులం గరంబులు వ్రేసి య మ్ముద్దియల నుద్దేశించి నెఱవాది చతురుం డిట్లనియె. | 825 |
| శా. |
రామల్ రాజులతోడ నీ పనికి నారంభింతురే మీ క్రియన్ మోమో టేమియు లేక దూఱెదరు మీ మోసంబు చింతింప; రం భోమధ్యంబున నుండి వెల్వడి వెసం బూర్ణేందుబింబాననల్ మీ మీ చీరలు వచ్చి పుచ్చుకొనుఁడీ? మీ కిచ్చెదం జెచ్చెరన్’ |
826 |
| వ. | అనిన న మ్మానవతు లొండొరుల మొగంబులు సూచి నగుచు, మర్మంబుల నాఁటు న మ్మాటలకు మగుడం బలుక సిగ్గుపడుచు, నగ్గలంబైన చలిని వలిగొని కంఠప్రమాణజలంబులం దుండి డోలాయమాన మానసలై యిట్లనిరి. | 827 |
| క. |
‘మా వలువ లాగడంబున, నీ వేటికిఁ బుచ్చుకొంటి? వీ వల్పుఁడవే? నీ వెఱుఁగని దేమున్నది? నీ వందఱిలోన ధర్మనిరతుఁడవు గదే? |
828 |
| శా. |
ఇంతుల్ తోయము లాడుచుండ మగవా రేతెంతురే? వచ్చిరా యింతల్ సేయుదురే? కృపారహితులై యేలోకమందైన నీ వింతల్ నీ తలఁ బుట్టెఁ గాక! మఱి యేవీ కృష్ణ! యో చెల్ల! నీ చెంతన్ దాసులమై చరించెదము మా చేలంబు లిప్పింపవే! |
829 |
| క. |
వచ్చెదము నీవు పిలిచిన; నిచ్చెద మేమైనఁగాని; యెటఁ జొరు మనినం జొచ్చెదము; నేఁడు వస్త్రము, లిచ్చి మముం గరుణతోడ నేలుము కృష్ణా? |
830 |
| వ. | అనిన దరహసితవదనుండై హరి యిట్లనియె. | 831 |
| క. |
‘ఏ తరుణుఁడు మగఁ డౌటకు, మీ తపములు? సెప్పుఁ డింక మీ యానలు సుం డీ తప్పిన నీ కూరిమి, మీ తలలనె పుట్టెనోటు మేదిని లేదే? |
832 |
| క. |
ఎవ్వనిఁ గని మోహించితి, రెవ్వఁడు మీ మానధనము లెల్ల హరించెన్? నివ్వటిలె మీకుఁ గూరిమి, యెవ్వనిపైఁ? బలుకరాదె? యే నన్యుఁడనే? |
833 |
| వ. | అనిన విని సుందరు లన్యోన్యసందర్శనమ్ములు సేయుచు, హృదయారవిందంబులందుఁ గందర్పుండు సందడింప నగుచు నిరుత్తరలయి యున్న లోకోత్తరుం డిట్లనియె. | 834 |
| క. |
నా యింటికి దాసులరై, నా యాజ్ఞ వహించి మీరు నడిచెద రేనిన్ మీ యంబరమ్ము లిచ్చెదఁ, దోయంబులు వెడలి రండు తొయ్యలులారా! |
835 |
| వ. | అనిన విని హరిమధ్యలు చలికి వెఱచి సలిలమధ్యంబున నిలువనోపక. | 836 |
| క. |
కొందఱు వెడలుద మందురు, కొందఱు వెడలుటయు సిగ్గుగొను గోవిందుం డందురు; కొందఱు దమలోఁ, గొందల మందుదురు వడఁకుగొని మనుజేంద్రా! |
837 |
| వ. | మఱియు నెట్టకేలకుఁ జిత్తంబులు గట్టిపఱచుకొని తనుమధ్యలు తోయమధ్యంబు వెలువడి. | 838 |
| క. |
చంచత్పల్లవకోమల, కాంచన నవరత్నఘటితకంకణరుచిరో దంచిత కరసంఛాదిత, పంచాయుధగేహ లగుచుఁ బడఁతులు వరుసన్. |
839 |
| వ. | చని ప్రౌఢలైన సుందరుల ముందట నిడుకొని మందగమనలు మందహాసంబుతోడ నెదుర నిలిచిన నరవిందనయనుం డిట్లనియె. | 840 |
| సీ. |
శృంగారవతులార! సిగ్గేల? మిముఁ గూడి పిన్ననాఁటను గోలెఁ బెరిఁగినాఁడ నెఱుఁగనే మీలోన నెప్పుడు నున్నాడ నేను జూడని మర్మ మెద్ది గలదు? వ్రతనిష్ఠలై యుండి వలువలు గట్టక నీరు సొత్తురె మీరు నియతి దప్పి? కాత్యాయనీ దేవిఁ గల్లసేయుట గాక యీ రీతి నోమువా రెందుఁ గలరు? |
|
| ఆ. |
వ్రతఫలంబు మీరు వలచినఁ జక్కఁగ, నింతు లెల్లఁ జేతు లెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుఁడు చీరలు; సిగ్గువో, నాడ నేల? యెగ్గు లాడనేల? |
841 |
| వ. | అనిన విని మానవతులు దమలోన. | 842 |
| మ. |
వ్రతముల్ సేయుచు నొక్క మాటయిన నెవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షు లీక్షించియున్ గతచేలాప్లవనంబు నేఁడు వ్రతభంగం బంచు శంకించి ఫా ల తటన్యస్తకరాబ్జలై సరసలీలన్ మ్రొక్కి రట్లందఱున్. |
843 |
| క. |
బాలలకు హస్తకీలిత, ఫాలలకు నితాంతశీతపవనాగమ నా లోలలకు నంబరములు కృ, పాలుఁడు హరి యిచ్చె భక్తపాలకుఁ డగుటన్. |
844 |
| ఆ. |
‘చీర లపహరించి సిగ్గులు విడిపించి, పరిహసించి యైనఁ బరఁగ మనకు ఘనుఁడు నోము కొఱఁతగాకుండ మ్రొక్కించె, ననుచు హరి నుతించి రబల లెల్ల. |
845 |
| క. |
ఉల్లములు నొవ్వ నాడినఁ, గల్లలు సేసినను నగినఁ గలఁచిన నైనన్ వల్లభులు సేయు కృత్యము, వల్లభలకు నెగ్గు గాదు; వల్లభ మధిపా! |
846 |
| వ. | ఇట్లు హరి వలువ లిచ్చినం గట్టుకొని సతు లతనియందు బద్ధానురాగ లయ్యుఁ జలింపక ఱెప్పలిడక తప్పక చూడ నా ప్రోడ యెఱింగి చేరి వారి కిట్లనియె. | 847 |
| సీ. |
లక్షణవతులార! లజ్జించి చెప్పరు గాని మీ మర్మముల్ గానఁబడియె; ననుఁ గొల్వఁ జింతించినారు నాచేతను సత్యంబు మీ నోము సఫల మగును; గామితార్థంబుల కలిమిఁ జెప్పఁగ నేల? ననుఁ గొల్వ ముక్తికి నడవవచ్చుఁ; గడమ కూడఁగ నంబికాదేవి నోమంగ నటమీఁద రాత్రులయందు మీకు |
|
| ఆ. |
నన్నుఁ బొందఁ గల్గు నమ్మి పొండని హరి, పల్క నింతు లెల్ల భ్రాంతిఁ జనిరి తపము పండె ననుచుఁ దత్పదాంభోజముల్, మానసించుకొనుచు మందకడకు. |
848 |