| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | ఇట్లు గోపకన్యకలందుఁ బ్రసన్నుండై గోవిందుండు బృందావనము దాఁటి దూరంబున ధేనువుల మేపుచుండఁ, జండకిరణుని యెండంబడి దండిచెడి తరులదండ నండగొనుచు నాతపత్రాకారంబులై నీడలు సేయుచున్న వృక్షంబుల నీక్షించి కృష్ణ బల శ్రీదామ దేవప్రస్థ విశాలార్జున ప్రముఖులకుం దక్కిన గోపకు లిట్లనిరి. | 849 |
| మ. |
‘అపకారంబులు సేయ వెవ్వరికి నేకాంతంబులందుండు నా తపశీతానిలవర్షవారణములై త్వగ్గంధనిర్యాస భ స్మ పలాశాగ్ర మరందమూల కుసుమచ్ఛాయాఫలశ్రేణిచే నుపకారంబులు సేయు నర్థులకు నీ యుర్వీజముల్ గంటిరే?’ |
850 |
| వ. | అని చిగురాకు పువ్వు గాయ పండు తండంబుల వ్రేఁగున వీఁగిన తరువులనడిమితెరువునం బసులదాఁటుల దాఁటించి, యమునకుం జని, వెడఁదమడుఁగుల మెల్లన చల్లని నీరు ద్రావించి, తత్సమీపంబున మేపుచు, వల్లవులెల్ల మూఁకలు గొని, యాఁకలి గొంటి మని విన్నవించినఁ దనకు భక్తురాండ్రగు విప్రభార్యలవలనం బ్రసన్నుండై వారలం జూచి రామసహితుండైన హరి యిట్లనియె. | 851 |
| సీ. |
వల్లవులార! యీ వనమున విప్రులు బ్రహ్మవాదులు దేవభవనమునకు నరుగుట కాంగిరసాహ్వయసత్త్రంబు సలుపుచునున్నారు సనుఁడు మీరు మా నామములు సెప్పి మైత్రితో నడిగిన నన్నంబు వెట్టెద రనుచుఁ బలుక వారలు చని విప్రవరుల కెల్లను మ్రొక్కి పసుల మేపుచు బలభద్రకృష్ణు |
|
| తే. |
లలసి పుత్తెంచి రిట మమ్ము నన్న మడుగ, ధర్మవిదులార! యర్థిప్రదాతలార! పెట్టుఁ డన్నంబు; శ్రాంతులఁ బిలిచి తెచ్చి, పెట్టుదురు గాదె మిముబోఁటి పెద్దలెల్ల. |
852 |
| క. |
‘ఘన దీక్షితునకు నైనం, జనుఁ గుడువఁగఁ; బశువధంబు సౌత్రామణియుం జనిన వెనుక దోషము లే, దనఘాత్మకులార! పెట్టుఁ డన్నము మాకున్.’ |
853 |
| వ. | అని గోపకులు పలికిన. | 854 |
| మ. |
క్రతువున్ మంత్రము దంత్రమున్ ధనములుం గాలంబు దేశంబు దే వతయున్ ధర్మము నన్యముల్ దలఁప నెవ్వాఁ డట్టి సర్వేశ్వరున్ మతి నూహింపక గోపబాలుఁ డనుచున్ మందస్థితిం జూచి దు ర్మతులై యన్నము, లేదు లేదనిరి సమ్మానక్రియాశూన్యులై. |
855 |
| వ. | అంత గోపకులు నిరాశులై వచ్చి యెఱింగించిన హరి లౌకికానుసారి యగుచు ‘మీరయ్యార్యుల నడుగక, వారిభార్యలకు మా రాకఁ జెప్పుం; డన్నంబు వెట్టెద’ రని పంచిన వారలు సని బ్రాహ్మణసతుల దర్శించి నమస్కరించి సంపూజితులయి యిట్లనిరి. | 856 |
| క. |
‘గోవుల మేపుచు నాఁకొని, గోవిందుం డన్న మడిగికొని రం డని మ మ్మీ వేళం బుత్తెంచెను, ధీవిలసితలార! రండు; తెం డన్నంబుల్.’ |
857 |
| వ. | అనిన విని గోవింద సందర్శనకుతూహలలై ధరణీసురసుందరులు సంభ్రమానందంబులు డెందంబుల సందడింప, భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయ భేదంబులు గలిగి, సంస్కారసంపన్నంబులైన యన్నంబులు కుంభంబుల నిడుకొని సంరంభంబుల సముద్రంబునకు నడచు నదుల తెఱంగున. | 858 |
| క. |
బిడ్డలు మగలును భ్రాతలు, నడ్డము చని వల దనంగ నటు దలఁ డని మా ఱొడ్డుచు జగదీశ్వరునకు, జడ్డన నన్నంబు గొనుచుఁ జని రా సుదతుల్. |
859 |
| వ. | చని యమునాసమీపంబున నవపల్లవాతిరేకంబును విగతవనచరశోకంబును నైన యశోకంబు క్రింద నిర్మలస్థలంబున. | 860 |
| సీ. |
ఒక చెలికానిపై నొకచేయి సాఁచి వే ఱొకచేత లీలాబ్జ మూఁచువానిఁ గొప్పున కందని కొన్నికుంతలములు సెక్కుల నృత్యంబు సేయువానిఁ గుఱుచచుంగులు వుచ్చి కొమరారఁ గట్టిన పసిఁడి వన్నియ గల పటమువాని నౌఁదలఁ దిరిగి రా నలవడఁ జుట్టిన దట్టంపుఁ బించెపు దండవాని |
|
| తే. |
రాజితోత్పలకర్ణపూరములవాని, మహితపల్లవపుష్పదామములవాని భువనమోహననటవేషభూతివానిఁ, గనిరి కాంతలు కన్నుల కఱవు దీఱ. |
861 |
| క. |
కని లోచనరంధ్రంబుల, మునుమిడి హరిలలితరూపమును లోఁగొని నె మ్మనములఁ బరిరంభించిరి, తనుమధ్యలు హృదయజనితతాపము వాయన్. |
862 |
| వ. | ఇ వ్విధంబున. | 863 |
| క. |
వారితసర్వస్పృహలై, వా రందఱుఁ దన్నుఁ జూడ వచ్చుట మదిలో వారిజనయనుఁడు వొడగని, వారికి నిట్లనియె నగి యవారితదృష్టిన్. |
864 |
| శా. |
‘కాంతారత్నములార! మీ గృహములం గల్యాణమే! యేమి గా వింతున్ మీ? కిటు రండు; మమ్ము నిచటన్ వీక్షింప నేతెంచినా రెంతో వేడుకతో; నెఱుంగుదురు నిర్హేతుస్థితిన్ నన్ను ధీ మంతుల్ మీ క్రియఁ జేరి కందురు గదా మత్సేవలన్ సర్వమున్. |
865 |
| వ. | కావున గృహస్థులైన మీ పతులు మిమ్ముం గూడి క్రతువు నిర్విఘ్నంబుగా సమాప్తి సేసెదరు; మీరు యాగవాటంబునకుం జనుం’ డనిన విప్రభార్య లిట్లనిరి. | 866 |
| మ. |
‘తగునే మాధవ! యిట్టి వాఁడిపలుకుల్? ధర్మంబులే మా యెడన్? మగలున్ బిడ్డలు సోదరుల్ జనకులున్ మమ్మున్ నివారింప మ చ్చిగ నీ యంఘ్రులు సేరినార; మటఁబోఁ జేకొందురే వార? లా పగి దే మొల్లము; కింకరీజనులఁగా భావించి రక్షింపవే!’ |
867 |
| వ. | అనిన జగదీశ్వరుండు. | 868 |
| సీ. |
నా సమీపమున నున్నా రంచు నలుగరు బంధులు భ్రాతలు పతులు సుతులు మిమ్ము దేవతలైన మెత్తు రంగనలార! నా దేహసంగంబు నరుల కెల్ల సౌఖ్యానురాగసంజనకంబు గాదు; ముక్తిప్రదాయకము; నా కీర్తనమున దర్శనాకర్ణనధ్యానంబులను గర్మబంధదేహంబులఁ బాసి మీరు |
|
| తే. |
మానసంబులు నాయందు మరగఁజేసి, నన్నుఁ జేరెద రటమీఁద; నమ్ముఁ’ డనుచుఁ బలికి వారలు దెచ్చిన భక్షణాదు, లాప్తవర్గంబుతో హరి యారగించె. |
869 |
| క. |
పరమేశ్వరార్పణంబుగఁ, బరజనులకు భిక్ష యిడినఁ బరమపదమునం బరఁగెద రఁట! తుది సాక్షా, త్పరమేశుఁడు భిక్ష గొన్న ఫల మెట్టిదియో? |
870 |
| వ. | ఇట్లు సర్వేశ్వరుం డయిన హరికి భిక్ష యిడి తమ తమ భార్య లతని వలనం గృతార్థ లగుట యెఱింగి భూసురవరులు తమలో నిట్లనిరి. | 871 |
| చ. |
‘కటకట! మోసపోయితిమి; కాంతలపాటియు బుద్ధి లేదు; నేఁ డిట హరిఁ గానఁబో నెఱుఁగ; మేము దురాత్ముల; మేము కల్మషో ద్భటులము; విష్ణుదూరగుల ప్రాజ్ఞత లేల? తపంబు లేల? ప ర్యటనము లేల? శీలములు యాగములున్ మఱి యేల కాల్పనే? |
872 |
| క. |
జపహోమాధ్యయనంబులు, దపములు వ్రతములును లేని తరుణులు హరి స త్కృపఁ బడసి, రన్ని గలిగియుఁ, జపలతఁ బొందితిమి భక్తి సలుపమి నకటా! |
873 |
| క. |
సురగురులగు యోగీంద్రుల, నరుదుగ మోహితులఁ జేయు హరిమాయ; మమున్ నరగురుల మూఢవిప్రుల, నురవడి మోహితులఁ జేయ నోపక యున్నే? |
874 |
| మ. |
క్రతువుల్ ధర్మము మంత్రతంత్రధనముల్ గాలంబు దేశంబు దే వతయున్ వహ్నులు మేదినీసురులు నెవ్వాఁ డిట్టి సర్వేశుఁ డీ క్షితి రక్షింప జనించినాఁ; డెఱుఁగ; మా శ్రీభర్తకుం గర్తకుం గుతలోద్ధర్తకు మేము మ్రొక్కెదము రక్షోనాథసంహర్తకున్’. |
875 |