| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | అని మఱియు ననేకవిధంబులఁ బశ్చాత్తాపంబులం బొంది హరిం దలంచి శమింపు మని మ్రొక్కి బ్రాహ్మణులు కంసభీతులయి బలకృష్ణసందర్శనంబు సేయంజనరై; రంత నక్కడ నఖిలదర్శనుండైన హరి యింద్రయాగంబు సేయం దలంచి తన కడకు వచ్చిన నందాదిగోపవృద్ధులం గని నమస్కరించి నందున కిట్లనియె. | 876 |
| సీ. |
యాగంబు సేయంగ నర్థించి వచ్చితి; రీ యాగమున ఫల మేమి గలుగు నెవ్వాఁడు దీనికి నీశ్వరుం? డధికారి యెవ్వఁడు? సాధన మెంత వలయు శాస్త్రీయమో, జనాచారమో కార్యంబు? వైరుల కెఱిఁగింపవలదు గాని యెఱిఁగెడి మిత్రుల కెఱిఁగింపఁ దగుఁ జేరి యెఱిఁగి చేసినఁ గోర్కు లెల్లఁ గలుగుఁ |
|
| ఆ. |
బగయుఁ జెలిమి లేక పరఁగిన మిముబోఁటి, మంచివారి కేల మంతనంబు తలఁపు లెల్ల మాకుఁ దగ నెఱిఁగింపవే, తాత! వాక్సుధాప్రదాత వగుచు. |
877 |
| వ. | అని పలికిన ప్రౌఢకుమారునికిఁ దండ్రి యిట్లనియె. | 878 |
| సీ. |
పర్జన్యుఁ డధికుండు భగవంతుఁ డమరేంద్రుఁ డతనికిఁ బ్రియమూర్తు లగుచు నున్న మేఘబృందంబులు మేదినీతలముపై నతనిపంపున భూతహర్షణముగ జలములు గురియుఁ, దజ్జలపూరములఁ దోఁగి పండు సస్యంబు లా పంట దమకు ధర్మార్థకామప్రదాయకంబుగ లోకు లెల్లను బ్రదుకుదు; రింత యెఱిఁగి |
|
| తే. |
మేఘవిభుఁడైన యింద్రుండు మెచ్చుకొఱకు, నింద్రయాగము సేయుదు రెల్లనృపులు కామలోభభయద్వేషకలితు లగుచుఁ, జేయ కుండిన నశుభంబు సెందుఁ బుత్త్ర! |
879 |
| వ. | అదియునుం గాక. | 880 |
| ఆ. |
మఖము సేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వాన గురియు వాన గురియఁ గసవు వసుమతిఁ బెరుఁగును, గసవు మేసి ధేనుగణము బ్రదుకు. |
881 |
| క. |
ధేనువులు బ్రదికెనేనిన్, మానదు ఘనమైన పాఁడి మందలఁ గలుగున్ మానుగను బాఁడి గలిగిన, మానవులును సురలఁ దనిపి మనుదురు పుత్త్రా! |
882 |
| వ. | అని యిట్లు నొడివిన నందుని వచనంబులు విని యింద్రునికిఁ గోపంబు దీపింప దనుజదమనుండు తండ్రి కిట్లనియె. | 883 |
| క. |
కర్మమునఁ బుట్టు జంతువు, కర్మమునన వృద్ధిఁ బొందుఁ గర్మమునఁ జెడుం గర్మమె జనులకు దేవత, కర్మమె సుఖదుఃఖములకుఁ గారణ మధిపా! |
884 |
| క. |
కర్మములకుఁ దగు ఫలములు, కర్ములకు నిడంగ రాజు గాని, సదా ని ష్కర్ముఁడగు నీశ్వరుండును, గర్మవిహీనునికి రాజు గాఁడు మహాత్మా! |
885 |
| వ. | కావునఁ గర్మానుయాతంబు లయిన భూతంబులకుఁ బురుహూతునివలని భీతి యేటికి? పురాతనజన్మ సంస్కారంబులు గుప్పలు గొని కప్పినఁ గర్మంబులఁ దప్పించి పెంపు వడయ నప్పరమేశ్వరుండును నేరఁ డితరులం జెప్పనేల? సురాసుర నరానీకంబులతోడి లోకంబు నిజసంస్కారవశంబై యంద డిందియున్నది; సందేహంబు లేదు. దేహి కర్మవశంబున గురు తను దేహంబులం జొచ్చి వెడలు; నొజ్జ, వేలుపు, నెచ్చెలి, పగఱు, చుట్టంబులు, కర్మంబులు; జీవుండు కర్మంబు తోడన వర్తించు; నతనికిఁ గర్మంబు దైవతంబు. కర్మంబునం బ్రదుకుచు నితరసేవ సేయుట సతి పతిని విడిచి జారుం జేరినచందంబగు; విప్రుండు వైదికకర్మంబున మెలంగు; నృపతి ధరణీపాలనంబున సంచరించు; వైశ్యుండు వాణిజ్యకృషి కుసీద గోరక్షణాదుల వర్తించు; శూద్రుం డగ్రజన్ముల సేవించి బ్రదుకు; సత్త్వ రజ స్తమో గుణంబు లుత్పత్తి స్థితి లయ కారణంబు; లందు రజంబున జగంబు జన్మించు; రజోగుణ ప్రేరితంబు లయి మేఘంబులు వర్షించు; వర్షంబునం బ్రజావృద్ధి యగు; నింద్రుం డేమి సేయంగల వాఁ డదియునుం గాక. | 886 |
| శా. |
కోపింపన్ బనిలేదు శక్రునికిఁ, దాఁ గోపించుఁగా కేమి సం క్షేపం బయ్యెడి దేమి? పట్టణములుం గేహంబులున్ దేశముల్ వ్యాపారంబులు మీకుఁ బోయెడినె? శైలారణ్యభాగంబులన్ గోపత్వంబున నుండుచున్ మనకు సంకోచింపఁగా నేటికిన్? |
887 |
| సీ. |
పసులకుఁ గొండకు బ్రాహ్మణోత్తములకు మఖము గావించుట మంచి బుద్ధి యింద్రయాగంబున కేమేమి దెప్పింతు రవి యెల్లఁ దెప్పింపుఁ డరసి మీరు పాయసంబులు నపూపములు సైఁదపుఁబిండివంటలుఁ బప్పును వలయునట్టి ఫలశాకములు వండఁ బంపుండు హోమంబు సేయుఁడు; ధేనుదక్షిణల నిచ్చి |
|
| తే. |
బహురసాన్నంబు పెట్టుఁడు బ్రాహ్మణులకు, నచలులై పూజ లొనరింపుఁ డచలమునకు నధమ చండాల శునక సంహతికిఁ దగిన, భక్ష్యముల నిండు కసవులు పసుల కిండు. |
888 |
| శా. |
గంధాలంకరణాంబరావళులచేఁ గైసేసి యిష్టాన్నముల్ బంధుశ్రేణియు మీరలుం గుడిచి నా భాషారతిన్ వేడుకల్ సంధిల్లన్, గిరిగో ద్విజానల నమస్కారంబు గావింపుఁ డో జం ధర్మం బని తోఁచెనేని జనకా! జన్మంబు ధన్యం బగున్. |
889 |
| వ. | అని మఱియు నిలింపపతిసొంపు దింపుతలంపున ని మ్మఖంబు దనకు సమ్మతం బని గోవిందుండు పలికిన, నందాదులు మేలు మే లని తద్వచనప్రకారంబునం బుణ్యాహవాచనంబులు సదివించి ధరణీసురులకు భోజనంబు లిడి పసులకుం గసవు లొసంగి, రప్పుడు. | 890 |
| మ. |
సకలాభీరులు వీఁడె కృష్ణుఁ డన నైజం బైన రూపంబుతో నకలంకస్థితినుండి శైల మిదె మీ రర్చింప రం’ డంచుఁ దా నొక శైలాకృతిఁ దాల్చి గోపకులతో నొండొండ పూజించి గో పక దత్తాన్నము లాహరించె విభుఁ డా ప్రత్యక్షశైలాకృతిన్. |
891 |
| మ. |
‘వినుఁ డీ శైలము కామరూపి; ఖలులన్ వేధించు; నాజ్యాన్నముల్ మన మొప్పించిన వాహరించె; మనలన్ మన్నించెఁ; జిత్తంబులో ననుకంపాతిశయంబు సేసె మనపై నంచున్ సగోపాలుఁడై వనజాక్షుండు నమస్కరించె గిరికిన్ వందారుమందారుఁడై. |
892 |
| వ. | ఇట్లు గోపకులు హరిసమేతులై గిరికిం బూజనోపహారంబులు సమర్పించి, గోధనంబులం బురస్కరించుకొని భూసురాశీర్వాదవచనంబులతో గిరికిం బ్రదక్షిణంబు సేసి, రా సమయంబున. | 893 |
| క. |
గుఱ్ఱముల పరువు మెచ్చని, నఱ్ఱలఁ గట్టిన రథంబు నందప్రముఖుల్ గుఱ్ఱల యార్పులు సెలఁగఁగఁ, దొఱ్ఱుల గమివెంట నంటఁ దోలి రిలేశా! |
894 |
| క. |
పాటించి గానవిద్యా, పాటవమునఁ దేరు లెక్కి బహుతానములం బాటలగంధులు కృష్ణునిఁ, బాటలఁ బాడిరి విరోధిపాటనుఁ డనుచున్. |
895 |
| క. |
కుండనిభాపీనంబులు, మండితవర్ణములు వివిధమహితాకృతులున్ నిండిన కడుపులు గన్నుల, పండువులుగఁ బాడికుఱ్ఱిపదువులు నడచెన్. |
896 |
| క. |
పొగ రెక్కిన మూఁపురములు;, దెగ గల వాలములు, శైలదేహంబులు, భూ గగనములు నిండు ఱంకెలు, మిగుల మెఱయు వృషభగణము మెల్లన నడచెన్. |
897 |
| వ. | ఇట్లు పర్వతప్రదక్షిణంబు సేసి గోపకులు మాధవసమేతులై మందకుం జని రంత మహేంద్రుం డంతయు నెఱింగి మహాకోపంబునఁ బ్రళయప్రవర్తకంబులగు సంవర్తక మేఘంబులం జీరి యిట్లనియె. | 898 |
| మ. |
‘పెరుఁగుల్ నేతులు ద్రావి, క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాతకఠోరపత్త్రదళనక్రీడాసమారంభ దు ర్భరదంభోళిధరుం బురందరు ననుం బాటించి పూజింప క గ్గిరికిం బూజలు సేసి పోయి రదెపో కృష్ణుండు ప్రేరేపఁగన్. |
899 |
| క. |
గురుదేవహీను బాలుని, గిరిభూజప్రముఖవాసుఁ గృష్ణు ననీశుం బరిణామశీలుఁ గులగుణ, విరహితుఁ జేపట్టి యింద్రు విడిచిరి గొల్లల్. |
900 |
| ఆ. |
విమలఘనతరాత్మవిజ్ఞానవిద్యచే, నిగుడలేక యుడుపనిభము లగుచుఁ గర్మమయములైన క్రతువుల భవమహా, ర్ణవముఁ గడవఁ గోరినారు వీరు. |
901 |
| శా. |
ఉద్యత్సంపద నమ్మి నందతనయోద్యోగంబునన్ వెఱ్ఱులై మద్యాగంబు విసర్జనీయ మని రీ మర్త్యుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లులఁ గప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యోమృత్యువుఁ బొంద ఱాల్ గురియుఁడీ! శౌర్యం బవార్యంబుగన్. |
902 |
| క. |
మీ వెంట వత్తు నే నై, రావణనాగంబు నెక్కి రయ మొప్పంగా దేవగణంబులతోడను, గోవిందునిమంద లెల్ల గొందలపెట్టన్. |
903 |
| వ. | అని యిట్లు పలికి జంభవైరి సంరంభంబున దంభోళి జళిపించి, బింకంబున శంకింపక, కింకతోడ సంకలియ లూడ్చిన, మహానిలప్రేరితంబులయి చని, నందునిమందమీఁద నమోఘంబు లైన మేఘంబులు మహౌఘంబులై పన్ని, ప్రచండగతిం జండమరీచిమండలంబుఁ గప్పి, దివినుండి, దిశ లావరించి, రోదోంతరాళంబు నిరంతరనీరంధ్రనిబిడాంధకారబంధురంబుగ నిరోధించి, బలిభంజనద్వితీయ పాదపల్లవభగ్నంబైన బ్రహ్మాండభాండంబు చిల్లుల జల్లించినఁ దొఱఁగు బహిస్సముద్రసలిలనిర్ఝరంబుల వడువున నెడతెగక తోరంబులైన నీరధారలం గురియుచు, శిలల వర్షించుచుఁ, బిడుగుల ఱువ్వుచు నుండ, మిఱ్ఱు పల్లంబులు సమతలంబులయి, యేకార్ణవంబు రూపుసూపిన, నందు దుడు కడుచుచు నీఁదుచు, విలయశిఖి శిఖాసంరంభవిజృంభమాణవిద్యుల్లతావిలోకంబున రిమ్మలుగొని, సొమ్మలు వోవుచున్న లేఁగలును; లేఁగలమూతు లడ్డంబు లిడి ప్రళయభైరవభేరీభాంకారభీషణంబులగు గర్జనఘోషణంబులఁ జెవుడువడి చిందఱవందఱ లైన డెందంబులం గంది కుంది వ్రాలు ధేనువులును; ధేనువుల వెనుక నిడు కొని దురంతకల్పాంత కాలకీలికరాళకాలకంఠకరవిశాలగదాఘాతప్రభూతంబులైన నిర్ఘాతపాతంబులకు భీతంబులై హరికి మ్రొక్కి, రక్షరక్షేతి శబ్దంబులు సేయుకైవడి విడువని జడిం బడి, సైరింపక శిరంబులు వంచుకొని, గద్గదకంఠంబున నంభారవంబులు సేయు వృషభంబులును,వృషభాదిగోరక్షణంబు సేయుచు దుర్వారఘోరశిలాసారంబుల సారంబులు సెడి శరీరంబులు భారంబులైన మ్రానువడు గోపకులును; గోపకులం బట్టుకొని దట్టంబయిన వానకొట్టునం బెట్టువడి బడుగునడుములు నుసులువడ వడవడ వడంకుచు గోవిందునిం జీరు గోపికలును, గోపికాజన కఠినకుచకలశయుగళంబుల మఱుంగునం దలలు వెట్టుకొని పరవశులైన శిశువులునుం గలిగి, మహాఘోషంబుతోడ నష్టంబైన ఘోషంబుఁ జూచి ప్రబుద్ధులైన గోపవృద్ధులు గొందఱు దుర్జనశిక్షకుండును సజ్జనరక్షకుండును నైన పుండరీకాక్షునకు మ్రొక్కి యిట్లనిరి. | 904 |
| ఉ. |
అక్కట! వానఁ దోఁగి వ్రజ మాకుల మయ్యెఁ గదయ్య! కృష్ణ! నీ వెక్కడ నుంటి? వింత తడవేల సహించితి? నీ పదాబ్జముల్ దిక్కుగ నున్న గోపకులు దీనత నొంద భయాపహారివై గ్రక్కునఁ గావ కిట్లునికి కారుణికోత్తమ! నీకుఁ బాడియే! |
905 |
| క. |
ఈ యుఱుములు నీ మెఱుములు, నీ యశనులఘోషములును నీ జలధారల్ నీ యాన తొల్లి యెఱుఁగము, కూయాలింపం గదయ్య! గుణరత్ననిధీ! |
906 |
| క. |
వారి బరు వయ్యె మందల, వారికి; నిదె పరులు లేరు వారింపంగా; వారిదపటలభయంబును, వారిరుహదళాక్ష! నేఁడు వారింపఁగదే! |
907 |
| వ. | అనిన విని సర్వజ్ఞుండైన కృష్ణుం డంతయు నెఱింగి. | 908 |
| ఉ. |
తన్నొక యింత గైకొనరు; తప్పిరి; యాగము సేసి’ రంచుఁ దా మిన్నుననుండి గోపకులమీఁద శిలల్ గురియించుచున్న వాఁ డున్నతనిర్జరేంద్రవిభవోత్థితగర్వనగాధిరూఢుఁడై కన్నులఁ గానఁ డింద్రుఁ డిటు; గర్వపరుం డొరుఁ గాన నేర్చునే? |
909 |
| క. |
దేవత లందఱు నన్నును, సేవింతురు; రాజ్యమదముఁ జెందరు, చెఱుపం గా వలదు; మానభంగము, గావింపఁగ వలయు శాంతి గలిగెడుకొఱకై. |
910 |
| వ. | అని చింతించి శిలావర్షహతులై శరణాగతులైన ఘోషజనుల రక్షించుట తగ వని, సకలలోకరక్షకుం డయిన విచక్షణుండు. | 911 |
| చ. |
కలఁగకుఁడీ వధూజనులు! కంపము నొందకుఁడీ వ్రజేశ్వరుల్! తలఁగకుఁడీ కుమారకులు! తక్కినవారలు ఱాలవానచే నలఁగకుఁడీ! పశువ్రజము నక్కడ నక్కడ నిల్వనీకుఁడీ! మెలపున మీకు నీశ్వరుఁడు మేలొసఁగుం గరుణార్ద్రచిత్తుఁడై. |
912 |