పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీకృష్ణుఁడు గోవర్ధన పర్వతము నెత్తుట
వ. అని పలికి. 913
క. కిరియై ధర యెత్తినహరి, కరి సరసిజముకుళ మెత్తుగతిఁ ద్రిభువన శం
కరకరుఁడై గోవర్ధన, గిరి యెత్తెం జక్క నొక్క కేలన్‌ లీలన్‌.
914
క. దండిని బ్రహ్మాండంబులు, చెండుల క్రియఁ బట్టి యెగురఁ జిమ్మెడు హరికిన్‌
గొండఁ బెకలించి యెత్తుట, కొండొక పనిగాక యొక్క కొండా తలఁపన్‌?
915
వ. ఇట్లు గిరి యెత్తి. 916
శా. బాలుం డాడుచు నాతపత్ర మని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతోఁ గృష్ణుండు దా నమ్మహా
శైలంబున్‌ వలకేలఁ దాల్చి విపులచ్ఛత్రంబుగాఁ బట్టె నా
భీలాభ్రచ్యుతదుశ్శిలాచకితగోపీగోపగోపంక్తికిన్‌.
917
వ. ఇట్లు గోత్రంబు ఛత్రంబుగాఁ బట్టి గోపజనులకు గోపాలశేఖరుం డిట్లనియె. 918
క. రా తల్లి! రమ్ము తండ్రీ!, వ్రేతలు గోపకులు రండు! వినుఁడీ గర్త
క్ష్మాతలమున నుండుఁడు గో, వ్రాతముతో మీరు మీకు వలసిన యెడలన్‌.
919
శా. బాలుం డీతఁడు, కొండ దొడ్డది; మహాభారంబు సైరింపఁగాఁ
జాలండో? యని దీనిక్రింద నిలువన్‌ శంకింపఁగాఁ బోల; దీ
శైలాంభోనిధిజంతుసంయుతధరాచక్రంబు పైఁ బడ్డ నా
కే లల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్‌.
920
వ. అని పలుకుచున్న హరిపలుకులు విని నెమ్మనమ్ముల నమ్మి కొండ యడుగునం దమ తమ యిమ్ములం బుత్త్ర మిత్ర కళత్రాదిసమేతులై గోవులుం దారును గోపజనులు జనార్దనకరుణావలోకనామృతవర్షంబున నాఁకలి నీరువట్టుల చొప్పెఱుంగక కృష్ణకథావినోదంబుల నుండి; రి వ్విధంబున. 921
మ. హరిదోర్దండము గామ; గుబ్బ శిఖరం; బాలంబిముక్తావళుల్‌
పరఁగన్‌ జాఱెడు తోయబిందువులు; గోపాలాంగనాపాంగ హా
స రుచుల్‌ రత్నచయంబు గాఁగ, నచలచ్ఛత్రంబు శోభిల్లెఁ ద
ద్గిరిభిద్దుర్మదభంజియై జలధరాక్లిన్నప్రజారంజియై.
922
క. రాజీవాక్షునిచే నొక, రాజీవముభంగి శైలరాజము మెఱసెన్‌;
రాజేంద్ర! మీఁద మధుకర, రాజిక్రియ మేఘరాజి రాజిల్లెఁ గడున్‌.
923
క. వడిగొని బలరిపుపనుపున, నుడుగక జడి గురిసె నే డహోరాత్రము; ల
య్యెడ గోపజనులు బ్రదికిరి, జడిఁ దడియక కొండగొడుగు చాటున నధిపా!
924
వ. ఇట్లు హరి యే డహోరాత్రంబులు గిరి ధరించిన గిరిభేది విసిగి వేసరి కృష్ణుచరితంబులు విని వెఱఁగుపడి విఫలమనోరథుండై మేఘంబుల మరలించుకొని చనియె; నంత నభోమండలంబు విద్యోతమాన ఖద్యోతమండలం బగుట విని గోవర్ధనధరుండు గోపాలకుల కిట్లనియె. 925
క. ‘ఉడిగెను వానయు గాలియు, వడిసెడి నదులెల్లఁ బొలిచె; వఱద లిగిరెఁ, గొం
డడుగున నుండక వెడలుఁడు, కొడుకులుఁ గోడండ్రు సతులు గోవులు మీరున్‌’.
926
వ. అనిన విని సకలగోపజనులు శకటాద్యుపకరణసమేతులయి గోవులుం దారును గొండ యడుగు విడిచి వచ్చి; రచ్యుతుండును జెచ్చెరఁ దొల్లింటి యట్ల నిజస్థానంబున గిరి నిలిపె; నంత వల్లవు లెల్లం గృష్ణుం గౌఁగిలించుకొని సముచితప్రకారంబుల సంభావించి దీవించిరి; గోపికలు సేసలిడి, దధ్యన్నకబళంబు లొసంగుచు నాశీర్వదించిరి; నంద బలభద్ర రోహిణీ యశోద లాలింగనంబు సేసి భద్రవాక్యంబులు పలికిరి; సిద్ధ సాధ్య గంధర్వవరులు విరులు గురియించిరి; సురలు శంఖదుందుభులు మ్రోయించిరి; తుంబురు ప్రముఖు లయిన గంధర్వులు పాడి; రప్పుడు. 927
క. వల్లవకాంతలు దన కథ, లెల్లను బాడంగ నీరజేక్షణుఁ డంతన్‌
వల్లవబలసంయుతుఁడై, యొల్లన గోష్ఠంబు సేరె నుర్వీనాథా?
928
వ. అయ్యవసరంబునఁ గృష్ణుచరిత్రంబులు దలంచి వెఱఁగుపడి గోపజనులు నందున కిట్లనిరి. 929
సీ. కన్నులు దెఱవని కడుఁ జిన్నిపాపఁడై దానవిఁ జనుఁబాలు ద్రాగి చంపె
మూఁడవనెలనాఁడు ముద్దులబాలుఁడై కోపించి శకటంబుఁ గూలఁ దన్నె
నేఁడాదికుఱ్ఱఁడై యెగసి తృణావర్తు మెడఁ బట్టుకొని కూల్చి మృతునిఁ జేసెఁ
దల్లి వెన్నలకునై తను ఱోలఁ గట్టినఁ గొమరుఁడై మద్దులఁ గూల నీడ్చెఁ;
 
తే. బసులఁ గ్రేపులఁ గాచుచు బకునిఁ జీరె, వెలఁగతో వత్సదైత్యుని వ్రేసి గెడపె
సబలుఁడై ఖరదైత్యుని సంహరించె, నితఁడు కేవలమనుజుఁడే యెంచిచూడ
930
క. తెంపరియై రామునిచేఁ, జంపించెఁ బ్రలంబు; మ్రింగెఁ జటులదవాగ్నిన్‌;
సొంపు సెడఁ ద్రొక్కి కాళియుఁ, ద్రుంపక కాళింది వెడలఁ దోలెన్‌ లీలన్‌.
931
క. ఏడేండ్ల బాలుఁ డెక్కడ?, క్రీడం గరి తమ్మియెత్తుక్రియ నందఱముం
జూడ గిరి యెత్తు టెక్కడ?, వేడుక నొకచేత నేఁడు వెఱఁగౌఁ గాదే.
932
క. ఓ నంద! గోపవల్లభ, నీ నందనుఁ డాచరించు నేర్పరితనముల్‌
మానవులకు శక్యంబులె?, మానవమాత్రుండె నీ కుమారుఁడు తండ్రీ!
933
వ. అనిన విని నందుండు వారలం జూచి మున్ను తనకు గర్గమహాముని చెప్పిన సంకేతంబుఁ దెలిసి శంక లేదు; కృష్ణుండు లోకరక్షకుం డయిన పుండరీకాక్షునినిజాంశ యనుచు నంతరంగంబునం జింతింతు’నని పలికిన వెఱఁగుపడి గోపకులు కృష్ణుం డనంతుం డని పూజించి; రంత. 934
మ. హరి కేలన్‌ గిరి యెత్తి వర్షజలఖిన్నాభీరగోరాజికిన్‌
శరణంబైనఁ ద్రిలోక రాజ్యమదముం జాలించి నిర్గర్వుఁడై
సురభిం గూడి బలారి వచ్చి కనియెన్‌ సొంపేది దుష్టప్రజే
శ్వరదుర్మాననిరాకరిష్ణుఁ గరుణావర్ధిష్ణు శ్రీకృష్ణునిన్‌.
935
క. కని యింద్రుఁడు పూజించెను, దినకరనిభనిజకిరీటదీధితిచేతన్‌
మునిహృదలంకరణంబులు, సునతోద్ధరణములు నందసుతుచరణంబుల్‌.
936
వ. ఇట్లు నమస్కరించి కరకమలంబులు ముకుళించి హరికి హరిహయుం డిట్లనియె. 937
సీ. పరమ! నీ ధామంబు భాసురసత్త్వంబు; శాంతంబు; హతరజస్తమము; నిత్య
మధికతపోమయ; మట్లు గావున మాయ నెగడెడి గుణములు నీకు లేవు
గుణహీనుఁడవు గాన గుణముల నయ్యెడి లోభాదికములు నీలోనఁ జేర
వైన దుర్జననిగ్రహము శిష్టరక్షయుఁ దగిలి సేయఁగ దండధారి వగుచు
 
తే. జగముభర్తవు; గురుఁడవు; జనకుఁడవును, జగదధీశుల మను మూఢజనులు దలఁక
నిచ్చ పుట్టినరూపంబు లీవు దాల్చి, హితము సేయుదు గాదె లోకేశ్వరేశ!
938
క. నావంటి వెఱ్ఱివారిని, శ్రీవల్లభ! నీవు శాస్తి చేసితి వేనిం
గావరము మాని పెద్దల, త్రోవల జరుగుదురు బుద్ధితోడుత నీశా!
939
క. ఒక్కొక లోకముఁ గాఁచుచు, నెక్కుడు గర్వమున ‘నేమె యీశుల’ మనుచుం
జొక్కి ననుబోఁటి వెఱ్ఱులు, నిక్కము నీ మహిమఁ దెలియనేర రనంతా!
940
ఆ. వాసుదేవ! కృష్ణ! వరద! స్వతంత్ర! వి, జ్ఞానమయ! మహాత్మ! సర్వపుణ్య
పురుష! నిఖిలబీజభూతాత్మకబ్రహ్మ!, నీకు వందనంబు నిష్కలంక!
941
శా. నీ సామర్థ్య మెఱుంగ మేఘములచే నీ ఘోషమున్‌ భీషణో
గ్రాసారంబున ముంచితిన్‌ మఖము నాకై వల్లవుల్‌ సేయ రం
చో సర్వేశ! భవన్మహత్త్వమున నాయుద్యోగ మిట్లయ్యె నీ
దాసున్‌ నన్నుఁ గృతాపరాధుఁ గరుణన్‌ దర్శింపవే మాధవా!
942
మ. నిను బ్రహ్మాదు లెఱుంగలేరు; జడతానిష్ఠుండ లోకత్రయా
వనదుర్మానగరిష్ఠుఁడన్‌ విపులదుర్వైదుష్యభూయిష్ఠుఁడన్‌
వినయత్యాగవరిష్ఠుఁడన్‌; గుజనగర్విశ్రేష్ఠుఁడన్‌ దేవ! నీ
ఘనలీలావిభవంబుపెంపుఁ దెలియంగా నెవ్వఁడన్‌? సర్వగా!
943
వ. అనిన విని నగుచు జలధరగంభీరరవంబుల శక్రునకుం జక్రి యిట్లనియె. 944
మ. ‘అమరాధీశ్వర! లక్ష్మితోఁ దగిలి యి ట్లంధుండవై యున్న నీ
సమదోద్రేకము ద్రుంచి వైచుటకు నీ జన్నంబుఁ దప్పించితిం;
బ్రమదశ్రీకులు దండధారి నగు నన్‌ భావింప; రెవ్వాని ని
క్కము రక్షింపఁ దలంతు వాని నధనుం గావింతు జంభాంతకా?
945
క. నా యాజ్ఞ సేయుచుండుము, నీ యధికారంబునందు నిలువు; సురేంద్రా!
శ్రీయుతుఁడవై మదింపకు, శ్రేయంబులు గల్గుఁ; బొమ్ము సితకరిగమనా!
946
వ. అని యిట్లు జిష్ణునిం బలుకుచున్న కృష్ణునికి మ్రొక్కి గోగణసమేతయయిన కామధేనువు భక్తజన కామధేను వయిన యీశ్వరున కిట్లనియె. 947
క. ‘విశ్వేశ! విశ్వభావన!, విశ్వాకృతి! యోగివంద్య! విను నీచేతన్‌
శాశ్వతుల మైతి మిప్పుడు, శాశ్వతముగఁ గంటి మధికసౌఖ్యంబు హరీ!
948
వ. దేవా! మాకుం బరమదైవతంబ; వింద్రుండవు; భూసుర గో సుర సాధు సౌఖ్యంబులకొఱకు నిన్నింద్రుని జేసి పట్టంబు గట్టు మని విరించి నియమించి పుత్తెంచె; నీవు భూతలభూరిభారనివారణంబు సేయ నవతరించిన హరి’ వని పలికి యంత. 949
మ. సురభిక్షీరములన్‌ సురద్విపమహా శుండాలతానీత ని
ర్జర గంగాంబువులన్‌ నిలింపజననీసన్మౌనిసంఘంబుతో
సురనాథుం డభిషిక్తుఁ జేసి పలికెన్‌ సొంపార గోవిందుఁ డం
చు రణాక్రాంతవిపక్షుఁ దోయజదళాక్షున్‌ సాధుసంరక్షణున్‌.
950
సీ. తుంబురునారదాదులు సిద్ధచారణగంధర్వులును హరికథలు వాడి;
రమరకాంతలు మింట నాడిరి; వేల్పులు గురియించి రంచిత కుసుమవృష్టి;
జగములు మూఁడును సంతోషమును బొందెఁ; గుఱ్ఱులచన్నులఁ గురిసెఁ బాలు;
నవజలంబులతోడ నదులెల్లఁ బ్రవహించె; నిఖిలవృక్షములుఁ దేనియలు వడిసె;
 
తే. సర్వలతికల ఫలపుష్పచయము లమరెఁ; బర్వతంబులు మణిగణప్రభల నొప్పెఁ;
బ్రాణులకు నెల్లఁ దమలోని పగలు మానె; వాసుదేవునియభిషేకవాసరమున.
951
వ. ఇట్లు గోప గోగణ పతిత్వంబునకు గోవిందు నభిషిక్తుం జేసి వీడ్కొని పురందరుండు, దేవగణంబులతో దివంబున కరిగె నంత. 952
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )