| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| సీ. |
నందుఁ డేకాదశినాఁ డుపవాసంబు చేసి శ్రీహరిపూజ చేసి దనుజ వేళ యెఱుంగక వేగక ముందర ద్వాదశీస్నానంబు దగ నొనర్ప యమునాజలము సొర నప్డు వరుణుదూత నందుని వరుణుని నగరమునకుఁ గొనిపోవఁ దక్కిన గోపకు లందఱు నందగోపకునిఁ గానక కలంగి |
|
| తే. |
రామకృష్ణులఁ బేర్కొని రవము సేయఁ, గృష్ణుఁ డీశుండు తమతండ్రిఁ గికురువెట్టి వరుణభృత్యుండు గొనిపోయి వరుణుఁ జేర్చు, టెఱిఁగి రయమున నచ్చోటి కేఁగె నధిప! |
953 |
| వ. | అప్పుడు. | 954 |
| క. |
వచ్చినమాధవుఁ గనుఁగొని, చెచ్చెర వరుణుండు పూజ సేసి వినతుఁడై యచ్చుగ నిట్లని పలికెను, విచ్చేసితి దేవ! నా నివేశంబునకున్. |
955 |
| ఉ. |
ఏ విభుపాదపద్మరతు లెన్నఁడు నెవ్వరుఁ బొందలేని పెం ద్రోవఁ జరింతు రట్టి బుధతోషక! నీ వరుదెంచుటం బ్రమో దావృత మయ్యెఁ జిత్తము; గృతార్థత నొందె మనోరథంబు; నీ సేవఁ బవిత్రభావమును జెందె శరీరము నేఁడు మాధవా! |
956 |
| ఉ. |
ఏ పరమేశ్వరున్ జగము లిన్నిటిఁ గప్పిన మాయ గప్పఁగా నోపక పారతంత్ర్యమున నుండు మహాత్మక! యట్టి నీకు ను ద్దీపిత భద్రమూర్తికి సుధీజనరక్షణవర్తికిం దనూ తాపము వాయ మ్రొక్కెద నుదారతపోధనచక్రవర్తికిన్. |
957 |
| చ. |
ఎఱుఁగఁడు వీఁడు నాభటుఁ డొకించుక యైన మనంబులోపలం దెఱకువ లేక నీజనకుఁ దెచ్చె; దయం గొని పొమ్ము; ద్రోహమున్ మఱవుము; నన్ను నీభటుని మన్నన సేయుము; నీదు సైరణన్ వఱలుదుఁ గాదె యో జనకవత్సల! నిర్మలభక్తవత్సలా! |
958 |
| వ. | అని యిట్లు వలుకుచున్న వరుణునిం గరుణించి తండ్రిం దోడ్కొని హరి దిరిగి వచ్చె; నంత నందుండు దన్ను వెన్నుండు వరుణనగరంబుననుండి విడిపించి తెచ్చిన వృత్తాంతం బంతయు బంధువుల కెఱింగించిన వారలు కృష్ణుం డీశ్వరుం డని తలంచి; రఖిలదర్శనుం డయిన యీశ్వరుండును వారలతలం పెఱింగి వారికోరిక సఫలము సేయుదు నని వారి నందఱ బ్రహ్మహ్రదంబున ముంచి యెత్తి. | 959 |
| ఆ. |
ప్రకృతి కామకర్మ పరవశమై యుచ్చ, నీచగతులఁ బొంది నెఱయ బ్రమసి తిరుగుచున్న జనము తెలియనేరదు నిజ, గతివిశేష మీ జగంబునందు’. |
960 |
| మ. |
అని చింతించి దయాళుఁడైన హరి మాయాదూరమై జ్యోతియై యనిరూప్యం బయి సత్యమై, యెఱుకయై, యానందమై, బ్రహ్మమై యనఘాత్ముల్ గుణనాశమందుఁ గను నిత్యాత్మీయలోకంబు గ్ర క్కునఁ జూపెం గరుణార్ద్రచిత్తుఁ డగుచున్ గోపాలకశ్రేణికిన్. |
961 |
| వ. | ఇట్లు హరి ము న్నక్రూరుండు వొందిన లోక మంతయుఁ జూపి బ్రహ్మలోకంబు సూపినం జూచి, నందాదులు పరమానందంబునుం బొంది వెఱఁగుపడి హంసస్వరూపకుండైన, కృష్ణునిఁ బొడగని పొగడి పూజించి రంత. | 962 |
| చ. |
కలువలమేలికందువలు, కామునికయ్యపుఁ బాళెముల్, వియో గులఁ దలఁడించు వేళలు, చకోరకపంక్తులభోగకాలముల్, సెలువలు సైరణల్ విడిచి చిక్కుతఱుల్, ఘనచంద్రచంద్రికా జ్వలితదిశల్ శరన్నిశలు జారకదుర్దశ లయ్యె నయ్యెడన్. |
963 |
| ఆ. |
కామతంత్రటీక, కలువలజోక, కం, దర్పుడాక, విటులతాల్మి పోక, చకితచక్రవాక, సంప్రీత జనలోక, రాక వచ్చె మేలురాక యగుచు. |
964 |
| క. |
పతి దన కరములఁ గుంకుమ, సతిమొగమున నలఁదుభంగి సముదయవేళాం చిత కరరాగమున నిశా, పతి రంజించెన్ నరేంద్ర! ప్రాక్సతిమొగమున్. |
965 |
| సీ. |
విటసేనపై దండు వెడలెడు వలఱేని గొల్లెనపై హేమకుంభ మనఁగఁ గాముకధృతివల్లికలు ద్రెంప నెత్తిన శంబరాంతకుచేతిచక్ర మనఁగ మారుండు పాంథులమానాటవుల గాల్పఁ గూర్చిన నిప్పులకుప్ప యనఁగ విరహిమృగమ్ముల వేఁటాడ మదనుండు దెచ్చిన మోహనదీప మనఁగ |
|
| ఆ. |
వింతనునుపు గల్గి వృత్తమై యరుణమై, కాంతితోఁ జకోరగణము లుబ్బఁ బొడువుఁగొండ చక్కిఁ బొడిచె రాకాచంద్ర, మండలంబు గగనమండలమున. |
966 |