పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శరద్రాత్రి గాన మొనర్చు కృష్ణు సన్నిధికి గోపికలు వచ్చుట
వ. ఇట్లు పొడమిన నవకుంకుమాంకితరమాముఖమండలంబునుం బోలె నఖండంబైన చంద్రమండలంబుం బొడగని పుండరీకనయనుండు యమునాతటవనంబున జగన్మోహనంబుగ నొక్కగీతంబుఁ బాడిన విని, తదాయత్తచిత్తలై తత్తఱంబున వ్రేత లే పనులకుం జేతు లాడకయు, గోవులకుం గ్రేపుల విడువకయు, విడిచి విడిచియీడకయు, నీడి యీడికా నీడిన పాలు కాఁపకయు, గాఁచి కాఁచియుఁ, గాఁగినపాలు డింపకయు, డించి డించియు, డించినపాలు బాలురకుం బోయకయుఁ, బోసి పోసియుఁ బతులకుఁ బరిచర్యలు సేయకయుఁ, జేసి చేసియు నశనంబులు గుడువకయుఁ, గుడిచి కుడిచియుఁ గుసుమంబులు ముడువకయు, ముడిచి ముడిచియుఁ, దొడవులు దొడుగకయుఁ, దొడిగి తొడిగియు గోష్ఠంబులపట్టుల నుండకయుఁ, బాయసంబులు నెఱయ వండకయు, నయ్యైయెడల నిలువంబడకయుఁ, గాటుకలు సూటి నిడకయుఁ, గురులు సక్క నొత్తకయుఁ, గుచంబుల గంధంబులు కలయ మెత్తకయుఁ, బయ్యెదలు విప్పి కప్పకయు, సఖులకుం జెప్పకయు, సహోదరులు, మగలు, మామలు, మఱందులు, బిడ్డలు నడ్డంబు చని నివారింపం దలారింపకయు, సంచలించి పంచభల్లునిభల్లంబుల మొల్లంపు జల్లుల పెల్లునం దల్లడిల్లి, డిల్లపడి, మొగిళ్ళగమి వెలువడి; యుల్లసిల్లు తటిల్లతల పొందున మందగమనల మందగమనంబుల మందవెలువడి గోవింద సందర్శనంబునకుం జని రప్పుడు. 967
మ. తరుణుల్‌ గొందఱు మూలగేహముల నుద్దండించి రారాక త
ద్విరహాగ్నిం బరితాప మొందుచు మనోవీథిన్‌ విభున్‌ మాధవుం
బరిరంభంబులు సేసి జారుఁ డనుచున్‌ భావించియుం జొక్కి పొం
దిరి ముక్తిన్‌ గుణదేహముల్‌ విడిచి ప్రీతిన్‌ బంధనిర్ముక్తలై.
968
వ. అనిన నరేంద్రుం డిట్లనియె. 969
క. జారుఁ డని కాని కృష్ణుఁడు, భూరిపరబ్రహ్మ మనియు బుద్ధిఁ దలంపన్‌
నేరరు; గుణమయదేహము, లే రీతిన్‌ విడిచి రింతు? లెఱిఁగింపు శుకా!
970
వ. అనిన శుకుం డిట్లనియె. 971
మ. ‘మును నేఁ జెప్పితిఁ జక్రికిం బగతుఁడై మూఢుండు చైద్యుండు పెం
పునఁ గైవల్యపదంబు నొందెఁ; బ్రియలై పొందంగ రాకున్నదే?
యనఘుం డవ్యయుఁ డప్రమేయుఁ డగుణుండై నట్టి గోవిందుమూ
ర్తి నరశ్రేణికి ముక్తిదాయిని సుమీ! తెల్లంబు భూవల్లభా!
972
ఆ. బాంధవమున నైనఁ బగనైన వగనైనఁ, బ్రీతినైనఁ బ్రాణభీతినైన
భక్తినైన హరికిఁ బరతంత్రులై యుండు, జనులు మోక్షమునకుఁ జనుదు రధిప!
973
వ. అటు గావునఁ బరమపురుషుండును, నజుండును, యోగీశ్వరేశ్వరుండును నైన హరిని సోఁకిన స్థావరం బయిన ముక్తం బగు; వెఱఁగుపడ వలవ, దివ్విధంబున. 974
క. ఘనమధురగీతనినదము, విని వచ్చిన గోపికలను వీక్షించి నయం
బున మేటి సుగుణి నేర్పరి, తన వాగ్వైభవము మెఱయఁ దగ నిట్లనియెన్‌.
975
శా. మేలా మీకు? భయంబు పుట్టదు గదా మీమందకున్‌? సింహ శా
ర్దూలానేకపముఖ్యముల్‌ దిరిగెడిన్‌ దూరంబు లేతెంతురే?
యేలా వచ్చితి రీ నిశాసమయమం? దిచ్చోట వర్తింతురే?
చాలుంజాలు లతాంగులార! చనుఁడీ సంప్రీతితో మందకున్‌.
976
శా. మీ రేతెంచిన జాడఁ గానక వగన్‌ మీతల్లులుం దండ్రులున్‌
మీ రాముల్‌ మఱఁదుల్‌ తనూజులు గురుల్‌ మీ సోదరుల్‌ బంధువుల్‌
‘మేరల్‌ మీఱిరి లేరు పోయి’ రనుచున్‌ మీ ఘోషభూభాగమం
దేరీతిం బరికించిరో తగవులే యీ సాహసోద్యోగముల్‌?
977
చ. ఇలువడి సున్నసేసి హృదయేశుల సిగ్గులు వుచ్చి యత్త మా
మల నెరియించి సోదరుల మానము సూఱలు వుచ్చి తల్లి దం
డ్రుల రుచి మాన్చి బంధులకు రోఁత యొనర్చుచు జారవాంఛలన్‌
వలనఱి సత్కులాంగనలు వత్తురె? లోకులు సూచి మెత్తురే?
978
సీ. ప్రాణేశుఁ డెఱిఁగిన బ్రాణంబునకుఁ దెగు దండించు నెఱిఁగిన ధరణివిభుఁడు
మామ యెఱింగిన మనువెల్లఁ జెడిపోవుఁ దలవరి యెఱిఁగినఁ దగులు సేయుఁ
దలిదండ్రు లెఱిఁగిన దల లెత్తకుండుదు రేరా లెఱింగిన నెత్తిపొడుచు
నాత్మజు లెఱిఁగిన నాదరింపరు చూచి బంధువు లెఱిఁగిన బహి యొనర్తు
 
ఆ. రితరు లెఱిఁగిరేని నెంతయుఁ జుల్కగాఁ, జూతు; రిందు నందు సుఖము లేదు;
యశము లేదు నిర్భయానందమును లేదు, జారుఁ జేరఁ జనదు చారుముఖికి.
979
క. నడవడి గొఱ గాకున్నను, బడుగైనఁ గురూపియైనఁ బామరుఁ డైనన్‌
జడుఁడైన రోగి యైనను, విడుచుట మరియాద గాదు విభు నంగనకున్‌.
980
చ. ఇది యమునానదీజలసమేధితపాదపపల్లవప్రసూ
న దళవిరాజితంబగు వనంబు; మనంబులు మేర దప్పెనో?
పొదఁ డటు నేడ్చు బిడ్డలకుఁ బోయుఁడు పాలు; విడుండు లేఁగలన్‌
మొదవులకున్‌; నిజేశ్వరుల ముద్దియలార! భజింపుఁ డొప్పుగన్‌.
981
చ. వనితలు నన్నుఁ గోరి యిట వచ్చితి, రింతఁ గొఱంత లేదు; మే
లొనరె; సమస్తజంతువులు నోలిఁ బ్రియంబులు గావె నాకు; నై
నను నిలువంగఁ బోలదు, సనాతనధర్మము లాఁడువారికిం
బెనిమిటులన్‌ భజించుటలు; పెద్దలు సెప్పుచు నుందు రెల్లెడన్‌.
982
క. ధ్యానాకర్ణన దర్శన, గానంబుల నా తలంపు గలిగినఁ జాలుం
బూనెదరు కృతార్థత్వము, మానవతుల్‌! చనుఁడు మరలి మందిరములకున్‌.
983
వ. అని పలికిన విని. 984
సీ. ‘విరహాగ్నిశిఖలతో వెడలు నిట్టూర్పుల ముమ్మరంబులఁ దాఁకి మోవు లెండఁ
గన్నుల వెడలెడి కజ్జలధారలు కుచకుంకుమంబుల గ్రొచ్చి పాఱఁ
జెక్కులఁ జేర్చిన చేతుల వేఁడిమి మోముఁదమ్ముల మేలి మురువు డిందఁ
బొరిఁ బొరిఁ బుంఖానుపుంఖంబులై తాఁకు మదనుకోలల ధైర్యమహిమ సెదర
 
తే. దుఃఖభరమున మాటలు దొట్రుపడఁగఁ, బ్రియము లాడని ప్రియుఁ జూచి బెగ్గడిల్లి
చరణముల నేల వ్రాయుచు సంభ్రమమునఁ, గాంత లెల్లను వగల నా క్రాంత లగుచు.
985
వ. ఇట్లనిరి. 986
మ. ‘అకటా! నమ్మితి మేము; క్రూరుఁడన ని న్నర్హంబె? మా యిండ్లలో
సకలవ్యాప్తుల డించి నీ పదసరోజాతంబు లర్చింపఁ జి
క్కక యేతెంచితి, మీశుఁ, డాఢ్యుఁడవు; మోక్షాసక్తులం గాచు పో
లికఁ గావందగుఁ గావవే? విడువ మేలే కాంతలన్‌ భ్రాంతలన్‌.
987
మ. పతులన్‌ బిడ్డల బంధులన్‌ సతులకుం బాటించుటే ధర్మ ప
ద్ధతి యౌ నంటివి; దేహధారిణులకున్‌ ధర్మజ్ఞ! చింతింపుమా;
పతిపుత్త్రాదికనామమూర్తి వగుచున్‌ భాసిల్లు నీయందుఁ ద
త్పతిపుత్త్రాదికవాంఛలన్‌ సలిపి సంభావించు టన్యాయమే?
988
మత్తకోకిలము. నీపయిన్‌ రతి సేయుచుందురు నేర్పరుల్‌, సతతప్రియో
ద్దీపకుండవు; గాన నెవ్వగఁ దెచ్చు నాథసుతాదులం
జూప నేటికి? మన్మహాశలు సుట్టి నీకడ నుండఁగాఁ
బాప నేల? మదీయతాపముఁ బాపఁ బోలు కృపానిధీ!
989
సీ. నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱఁ గాని తరలి పోవంగఁ బాదములు రావు
నీ కరాబ్జంబులు నెఱి నంటి తివఁ గాని తక్కిన పనికి హస్తములు సొరవు
నీ వాగమృతధార నిండఁ గ్రోలఁగఁ గాని చెవు లన్యభాషలు సేరి వినవు
నీ సుందరాకృతి నియతిఁ జూడఁగఁ గాని చూడ వన్యంబులఁ జూడ్కికవలు
 
ఆ. నిన్నె కాని పలుకనేరవు మా జిహ్వ, లొల్ల ననుచుఁ బలుకనోడ వీవు
మా మనంబు లెల్ల మరపించి దొంగిలి, తేమి సేయువార మింకఁ గృష్ణ!
990
చ. సిరికి నుదారచిహ్నములు సేయు భవచ్చరణారవిందముల్‌
సరసిజనేత్ర! మా తపముసంపదఁ జేరితి మెట్టకేలకున్‌
మరలఁగ లేము మా మగలమాటల నొల్లము; పద్మగంధముల్‌
మరఁగిన తేఁటు లన్యకుసుమంబులచెంతను జేరనేర్చునే?
991
ఆ. సవతు లేక నీ విశాలవక్షస్స్థలిఁ, దులసితోడఁ గూడఁ దోయజాక్ష!
మనుపు మనుచు నెపుడు మాకాంత నీపాద, కమలరజముఁ గోరుఁ గాదె కృష్ణ!
992
ఉ. అత్తలు మామలున్‌ వగవ నాఱడి కోడక నాథులన్‌ శుగా
యత్తులఁ జేసి యిల్వరుస లాఱడి వోవఁగ నీదు నవ్వులన్‌
మెత్తని మాటలన్‌ మరుఁడు మేకొని యేఁచిన వచ్చినార; మే
పొత్తుల నొల్ల మో పురుషభూషణ! దాస్యము లిచ్చి కావవే!
993
మ. మగువల్‌ సిక్కరె తొల్లివల్లభులకున్‌? మన్నించి తద్వల్లభుల్‌
మగపంతంబు దలంపరే? తగులముల్‌ మాపాలనే పుట్టెనే?
మగవా రాడెడు మాటలే తగవు నీ మాటల్‌ మనోజాగ్నిచేఁ
బొగులం జాలము; కౌఁగిలింపుము మముం; బుణ్యంబు పుణ్యాత్మకా!
994
ఉ. కుండలదీప్తగండమును గుంచితకుంతలఫాలమున్‌ సుధా
మండితపల్లవాధరము మంజులహాసవిలోకనంబునై
యుండెడు నీ ముఖంబుఁ గని యుండఁగ వచ్చునె? మన్మథేక్షు కో
దండ విముక్తబాణముల దాసుల మయ్యెద; మాదరింపవే.
995
సీ. నీ యధరామృతనిర్ఝరంబుల నేఁడు సేరి వాతెఱలపైఁ జిలుకకున్న
నీ విశాలాంచితనిర్మలవక్షంబుఁ గుచకుట్మలంబులఁ గూర్పకున్న
నీ రమ్యతరహస్తనీరజాతంబులు చికురబంధంబులఁ జేర్పకున్న
నీ కృపాలోకననివహంబు మెల్లన నెమ్మొగంబుల మీఁద నెఱపకున్న
 
ఆ. నీ నవీనమాననీయసల్లాపంబు, కర్ణరంధ్రదిశలఁ గప్పకున్న
నెట్లు బ్రదుకువార? మెందుఁ జేరెడువార? మధిప! వినఁగఁ దగదె యాఁడుకుయులు.
996
మ. భవదాలోకనహాసగీతజములై భాసిల్లు కామాగ్నులన్‌
భవదీయాధరపల్లవామృతముచేఁ బాపం దగుం, బాప వే
ని వియోగానలహేతిసంహతులచే నీఱై, భవచ్చింతలన్‌
భవదంఘ్రిద్వయవీథిఁ బొందెదము నీ పాదంబులానం బ్రియా!
997
క. తరుమృగఖగగోగణములు, కర మొప్పెడు నిన్నుఁ గన్న గానము విన్నం
గరఁగి పులకించు; నబలలు, గరఁగరె నినుఁ గన్న నీదు గానము విన్నన్‌?
998
సీ. ఈ పంచబాణాగ్ని నేమిట నార్తుము నీ మంజువాగ్వృష్టి నెగడదేని
నీ మన్మథాంభోధి నే త్రోవఁ గడతుము నీ దృష్టి నావయై నిలువదేని
నీ చిత్తజధ్వాంత మే జాడఁ జెఱతుము నీ హాసచంద్రిక నిగుడదేని
నీ దర్పకజ్వర మే భంగి నడఁతుము నీ నవాధరసుధ నింపవేని
 
ఆ. నెట్లు నిర్వహింతు? మే లాగు మాలాగు;, కరుణ సేయ వేనిఁ గదియ వేని
మరుఁడు నిర్దయుండు మన నిచ్చునే? యశో, దా కుమార! యువతిధైర్యహార!
999
ఆ. అమరులఁ గాచిన హరిక్రియఁ, గమలేక్షణ! నీవు నేఁడు కరుణ నభయ హ
స్తము మా యురముల శిరములఁ, బ్రమదంబున నిడుము మూర్ఛ పాల్పడకుండన్‌.
1000
క. కట్టా! తలమునుకలునై, దట్టపు విరహాగ్నిశిఖలు తరుణుల నేఁచన్‌
నెట్టున్‌ బలుకవు చూడవు, కట్టిఁడివి గదా కుమార! కరుణోదారా!
1001
వ. అని యిట్లు కుసుమశరునిశరపరంపరాపరవశలై యోపికలు లేక పలికిన గోపికల దీనాలాపంబులు విని, నవ్వి యోగీశ్వరుండయిన కృష్ణుం డాత్మారాముండై వారలతో రమించె నప్పుడు. 1002
మ. కరుణాలోకములం బటాంచలకచాకర్షంబులన్‌ మేఖలా
కర బాహు స్తన మర్శనంబుల నఖాంకవ్యాప్తులన్‌, నర్మ వా
క్పరిరంభంబుల మంజులాధరసుధాపానంబులం గాంతలం
గరఁగించెన్‌ రతికేళిఁ గృష్ణుఁడు గృపం గందర్పుఁ బాలార్చుచున్‌.
1003
క. మక్కువ వికసితవదనలు, సక్కఁగఁ దనుఁ గొల్వ హాసచంద్రికతోడన్‌
మిక్కిలి మెఱసెను గృష్ణుఁడు, చుక్కలగమినడిమి పూర్ణసోమునిభంగిన్‌.
1004
ఆ. సతులు దన్నుఁ బాడ సంప్రీతి నాడుచు, నఱుత నున్న వైజయంతితోడ
వనజలోచనుండు వనభూషణుం డయ్యె, యువతిజనశతంబు లోలిఁ గొలువ.
1005
ఉ. చిక్కక యీశుఁడై యెదిరిఁ జిక్కులఁ బెట్టెడి మాయలానికిం
జిక్కి కృతార్థలై మరునిచిక్కులఁ జొక్కి లతాంగు లుండఁగా
మక్కువ శాంతి సేయుటకు మన్నన సేసి ప్రసన్నుఁ డౌటకుం
జక్కన నా విభుండు గుణశాలి దిరోహితుఁ డయ్యె నయ్యెడన్‌.
1006
వ. ఇట్లు హరి గను మొఱంగి చనిన కరిం గానక తిరుగుకరేణులపెల్లున నుల్లంబులు దల్లడిల్ల వల్లవకాంతలు తదీయగమనహాసవిలాసవీక్షణవిహారవచనరచనానురాగంబులం జిత్తంబులు గోల్పడి, వివిధచేష్టలకుం బాల్పడి, తదాత్మకత్వంబున నేన నేన కృష్ణుండ నని కృష్ణగుణావేశంబులం జరియించుచు. 1007
క. భూతములలోనఁ వెలిఁ బ్ర, ఖ్యాతుం డగు నట్టివాని గాంతలు కాళిం
దీ తీరవనాంతరముల, బ్రాఁతిన్‌ వెదుకంగఁ జనిరి పాడుచు నధిపా!
1008
సీ. పున్నాగ! కానవే పున్నాగవందితుఁ; దిలకంబ! కానవే తిలకనిటలు
ఘనసార! కానవే ఘనసారశోభితు; బంధూక! కానవే బంధుమిత్రు
మన్మథ! కానవే మన్మథాకారుని; వంశంబ! కానవే వంశధరునిఁ
జందన! కానవే చందనశీతలుఁ గుందంబ! కానవే కుందరదను
 
తే. నింద్రభూజమ! కానవే యింద్రవిభవుఁ, గువలవృక్షమ! కానవే కువలయేశుఁ
బ్రియకపాదప! కానవే ప్రియవిహారు; ననుచుఁ గృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు.
1009
వ. మఱియును. 1010
ఉ. నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడివాఁడు మౌళిపరిసర్పితపింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ చెప్పరే?
1011
ఉ. అంగజునైనఁ జూడ హృదయంగముఁడై కరఁగించువాఁడు శ్రీ
రంగదురంబువాఁడు మధురంబగు వేణురవంబువాఁడు మ
మ్మంగజుపువ్వుఁదూపులకు నగ్గము సేసి లవంగలుంగ నా
రంగములార! మీకడకు రాఁడు గదా! కృప నున్నఁ జూపరే!
1012
సీ. మానినీమన్మథు మాధవుఁ గానరే సలలితోదారవత్సకములార!
సలలితోదారవత్సకవైరిఁ గానరే సుందరోన్నతలతార్జునములార!
సుందరోన్నతలతార్జునభంజుఁ గానరే ఘనతరలసదశోకంబులార!
ఘనతరలసదశోకస్ఫూర్తిఁ గానరే నవ్యరుచిరకాంచనంబులార!
 
ఆ. నవ్యరుచిరకాంచనకిరీటుఁ గానరే, గహనపదవికురవకంబులార!
గహనపదవికురవకనివాసిఁ గానరే, గణికలార! చారుగణికలార!
1013
సీ. అదె నందనందనుం డంతర్హితుం డయ్యెఁ బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేల పాసితి వని యైలేయలతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా! చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి మాధవీలతలార! మనుపరమ్మ!
 
ఆ. జాతిసతులఁ బాయ నీతియే హరి కని, జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ, జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!
1014
క. హరిచరణములకుఁ బ్రియవై, హరి నిను మన్నింప భద్ర మందెడు తులసీ!
హరి నీ దెస రాఁడు గదా, హరి చొప్పెఱిఁగించి శుభము లందింపఁగదే!
1015
తే. పొగడఁ దగువానిఁ గానరె పొగడలార!, యీ డెఱుంగని విభుఁ జూపుఁ డీడలార!
మొల్లమగుకీర్తివాఁ డేడి మొల్లలార!, శుకనిగదితునిఁ జెపుఁడు కింశుకములార!
1016
క. తరుణీకుచకుంకుమయుత, హరికంధరదామగంధ మడరెడుఁ జూడ్కుల్‌
హరిఁ గనిన పగిదిఁ దనరెడి, హరిణీ! హరిజాడఁ బుణ్య మయ్యెడిఁ జెపుమా!
1017
క. కిటియై కౌఁగిటఁ జేర్చెను, వటుఁడై వర్ధిల్లి కొలిచె వడిఁ గృష్ణుండై
యిటఁ బదచిహ్నము లిడెఁ గ్రిం, దటి బామున నేమి నోఁచి తమ్మ ధరిత్రీ!
1018
వ. అనుచు మదనోన్మాదచిత్తలై తదాత్మకత్వంబున కృష్ణలీలల ననుకరించుచు. 1019
సీ. పూతనయై యొక్క పొలఁతి చరింపంగ శౌరియై యొక కాంత చన్నుఁ గుడుచు;
బాలుఁడై యొకభామ పాలకు నేడ్చుచో బండి నే నను లేమఁ బాఱఁ దన్ను;
సుడిగాలి నని యొక్క సుందరి గొనిపోవ; హరి నని వర్తించు నబ్జముఖియు
బకుఁడ నే నని యొక్క పడఁతి సంరంభింపఁ బద్మాక్షుఁడను కొమ్మ పరిభవించు
 
ఆ. నెలమి రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ, గోపవత్సగణము గొంద ఱగుదు;
రసురవైరి ననుచు నబల యొక్కతె చీరుఁ, బసుల మనెడి సతుల భరతముఖ్య!
1020
ఆ. లోక మెల్లఁ గుక్షిలోపల నున్నది, మాధవుండ నేను మాత వీవు
చూడు మనుచు నొక్క సుందరి యొకతెకు, ముఖముఁ దెఱచి చూపు ముఖ్యచరిత!
1021
క. వెన్నలు దొంగిలి తినియెడి, వెన్నుఁడ నని యొకతె నుడువ వేఱొక్కతె చే
సన్నల యశోద నంచును, గ్రన్నన కుసుమములదండఁ గట్టు నిలేశా!
1022
క. ‘కాళియఫణి యిది వీరలు, కాళియఫణిసతులు మ్రొక్కఁ గడఁగిరి నే గో
పాల కుమారుఁడ’ ననుచును, లీలాగతి నాడు నొక్క లేమ నరేంద్రా!
1023
క. తరుణులు గోపకు లందఱు, హరిహయుఁ డిదె వానఁ గురిసె హరి నే’ నని భా
సుర చేలాంచల మొక్కతె, గిరి నెత్తెద ననుచు నెత్తుఁ గెంగేల నృపా?
1024
క. ‘మీరలు గోపకు లే నసు, రారిని దావాగ్ని వచ్చె నటు సూడకుఁడీ
వారించెద’ నని యొక్కతె, సేరి బయల్‌ కబళనంబు సేయు నరేంద్రా!’
1025
వ. ఇట్లు తన్మయత్వంబున గోపసుందరులు బృందావనంబునం గల తరులతాదుల హరి నడుగుచు, దుర్గమంబు లయిన విపినమార్గంబుల సరోజాతకేతన హల కులిశ కలశాంకుశాది శుభలక్షణ లక్షితంబు లయి మనోహరంబు లయిన హరిచరణంబుల చొప్పుఁ గని తప్పక చెప్పికొనుచుఁ దమలో నిట్లనిరి. 1026
సీ. కొమ్మకుఁ బువ్వులు గోసినాఁ డిక్కడ మొనసి పాదాగ్రంబు మోపినాడు
సతి నెత్తుకొని వేడ్క జరిగినాఁ డిక్కడఁ దృణములోఁ దోఁపదు తెఱవజాడ
ప్రియకు ధమ్మిల్లంబు వెట్టినాఁ; డిక్కడఁ గూర్చున్న చోటిదె కొమరు మిగులు
నింతికిఁ గెమ్మావి యిచ్చినాఁ డిక్కడ వెలఁది నిక్కిన గతి విశద మయ్యె
 
ఆ. సుదతితోడ నీరు సొచ్చినాఁ డిక్కడఁ, జొచ్చి తా వెడలిన చోటు లమరెఁ
దరుణిఁ గాముకేళిఁ దనిపినాఁ డిక్కడ, ననఁగి పెనఁగియున్న యంద మొప్పె.
1027
వ. మఱియును. 1028
సీ. ఒక యెలనాఁగ చేయూఁదినాఁ డిక్కడ సరస నున్నవి నాల్గుచరణములును
నొక నీలవేణితో నొదిఁగినా డిక్కడ మగజాడలో నిదె మగువజాడ
యొక లేమ మ్రొక్కిన నురివినాఁ డిక్కడ రమణి మ్రొక్కిన చొప్పు రమ్య మయ్యె
నొక యింతి కెదురుగా నొలసినాఁ డిక్కడ నన్యోన్యముఖములై యంఘ్రు లొప్పె
 
ఆ. నొకతె వెంటఁ దగుల నుండక యేగినాఁ, డడుగుమీఁదఁ దరుణి యడుగు లమరె
నబల లిరుగెలంకులందు రాఁ దిరిగినాఁ, డాఱుపదము లున్న వమ్మ! యిచట.
1029
సీ. ఈ చరణంబులే యిందునిభానన! సనకాదిమునియోగసరణి నొప్పు
నీ పాదతలములే యెలనాఁగ! శ్రుతివధూ సీమంతవీథులఁ జెన్ను మిగులు
నీ పదాబ్జంబులే యిభకులోత్తమయాన! పాలేటిరాచూలిపట్టుఁగొమ్మ
లీ సుందరాంఘ్రులే యిందీవరేక్షణ! ముక్తికాంతామనోమోహనంబు
 
ఆ. లీ యడుగుల రజమె యింతి! బ్రహ్మేశాది, దివిజవరులు మౌళిదిశలఁ దాల్తు
రనుచుఁ గొంద ఱబల లబ్జాక్షుఁ డేగిన, క్రమముఁ గనియు నతనిఁ గానరైరి.
1030
వ. అప్పుడు. 1031
సీ. పతుల దైన్యంబును భామలక్రౌర్యంబుఁ జూపుచు విభుఁ డొక్క సుదతితోడ
విహరింప నది యెల్లవెలఁదుల వర్జించి నాయొద్ద నున్నాఁడు నాథుఁ’ డనుచు
గర్వించి రాఁ జాలఁ గమలాక్ష! మూఁపున నిడుకొను మనుఁడు న య్యీశ్వరుండు
మొఱఁగిపోయినఁ దాపమును బొంది ‘యో కృష్ణ! యెక్కడఁ జనితి? ప్రాణేశ! రమణ!
 
తే. నీకు వరవుడ నయ్యెద నిలువు’ మనుచు, వగవఁ గొందఱు కాంత లా వనితఁ జూచి
వరుఁడు మన్నింప గర్వించి వనజనేత్ర, చిక్కె నేఁడని వెఱఁగును జెంది రపుడు.
1032
వ. మఱియును. 1033
సీ. ‘ఈ పొదరింటిలో నిందాఁకఁ గృష్ణుండు నాతోడ మన్మథనటన మాడె
నియ్యోల మగుచోట నిందాఁకఁ జెలువుండు గాఢంబుగా నన్నుఁ గౌఁగిలించె
నీ మహీజమునీడ నిందాఁక సుభగుండు చిట్టంటుచేఁతల సిగ్గుగొనియె
నీ పుష్పలతపొంత నిందాఁక దయితుండు నను డాసి యధరపానంబు సేసె
 
ఆ. నీ ప్రసూనవేది నిందాఁక రమణుండు, గుసుమదామములను గొప్పుఁ దీర్చె
ననుచుఁ గొంద ఱతివ లంభోజనయనుని, పూర్వలీలఁ దలఁచి పొగడి రధిప!
1034
మ. అని యిబ్భంగి లతాంగు లందఱును బృందారణ్యమం దీశ్వరున్‌
వనజాక్షుం బరికించి కానక విభున్‌ వర్ణించుచుం బాడుచున్‌
మనముల్‌ మాటలుఁ జేష్టలుం గ్రియలు న మ్మానాథుపైఁ జేర్చి వే
చని ర య్యామునసైకతాగ్రమునకున్‌ సంత్యక్తగేహేచ్ఛలై.
1035
వ. చని గోపికలు హరి నుద్దేశించి యిట్లనిరి. 1036
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )