| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| క. |
నీవు జనించిన కతమున, నో వల్లభ! లక్ష్మి మంద నొప్పె నధికమై నీ వెంటనె ప్రాణము లిడి, నీ వా రరసెదరు చూపు నీ రూపంబున్. |
1037 |
| క. |
శారదకమలోదరరుచి, చోరకమగు చూపువలన సుందర! మిమ్ముం గోరి వెల యీని దాసుల, ధీరత నొప్పించు టిది వధించుట గాదే? |
1038 |
| ఆ. |
విషజలంబువలన విషధరదానవు, వలన ఱాలవానవలన వహ్ని వలన నున్న వానివలనను రక్షించి, కుసుమశరునిబారిఁ గూల్పఁ దగునె? |
1039 |
| ఉ. |
నీవు యశోదబిడ్డఁడవె? నీరజనేత్ర! సమస్తజంతు చే తో విదితాత్మ వీశుఁడవు తొల్లి విరించి దలంచి లోక ర క్షా విధ మాచరింపు మని సన్నుతి సేయఁగ సత్కులంబునన్ భూవలయంబుఁ గావ నిటు పుట్టితి గాదె మనోహరాకృతిన్. |
1040 |
| ఆ. |
చరణసేవకులకు సంసారభయమును, బాపి శ్రీకరంబు పట్టు గలిగి కామదాయియైన కరసరోజంబు మా, మస్తకముల నునిచి మనుపు మీశ! |
1041 |
| ఉ. |
గోవులవెంటఁ ద్రిమ్మరుచుఁ గొల్చినవారలపాపసంఘముల్ ద్రోవఁగఁజాలి శ్రీఁ దనరి దుష్టభుజంగఫణాలతాగ్ర సం భావితమైన నీ చరణపద్మము చన్నులమీఁద మోపి త ద్భావజపుష్పభల్లభవబాధ హరింపు వరింపు మాధవా! |
1042 |
| క. |
బుధరంజనియును సూక్తయు, మధురయు నగు నీదువాణి మరఁగించెను నీ యధరామృతసంసేవన, విధి నంగజతాపమెల్ల విడిపింపఁగదే! |
1043 |
| క. |
మగువలయెడ నీ క్రౌర్యము, దగునే? నిజభక్తభీతి దమనుఁడ వకటా! తగదు భవద్దాసులకును, నగు మొగముం జూపి కావు నళినదళాక్షా! |
1044 |
| మ. |
ఘనలక్ష్మీయుతమై వినన్ శుభదమై కామాదివిధ్వంసియై సనకాదిస్తుతమై నిరంతరతపస్సంతప్తపున్నాగ జీ వనమై యొప్పెడు నీ కథామృతము ద్రావం గల్గునే భూరి దా న నిరూఢత్వము లేనివారలకు మానారీమనోహారకా! |
1045 |
| క. |
నీ నగవులు నీ చూడ్కులు, నీ నానావిహరణములు నీ ధ్యానంబుల్ నీ నర్మాలాపంబులు, మానసముల నాఁటి నేఁడు మగుడవు కృష్ణా! |
1046 |
| ఆ. |
ఘోషభూమి వెడలి గోవుల మేపంగ, నీరజాభమైన నీ పదములు గసవు శిలలుఁ దాఁకి కడునొచ్చునో యని, కలఁగు మా మనములు కమలనయన! |
1047 |
| ఉ. |
మాపటివేళ నీవు వనమధ్యము వెల్వడి వచ్చి గోష్పద ప్రాపితధూళిధూసరితభాసితకుంతలమై సరోరుహో ద్దీపిత మైన నీ మొగము ధీరజనోత్తమ! మాకు వేడ్కతోఁ జూపి మనంబులన్ మరునిఁ జూపుదు గాదె క్రమక్రమంబునన్. |
1048 |
| ఆ. |
భక్తకామదంబు బ్రహ్మ సేవిత మిలా, మండనంబు దుఃఖమర్దనంబు భద్రకరమునైన భవదంఘ్రియుగము మా, యురములందు రమణ! యునుపఁ దగదె? |
1049 |
| ఆ. |
సురతవర్ధనంబు శోకాపహరణంబు, స్వరితవంశనాళసంగతంబు నన్యరాగజయమునైన నీ మధురాధ, రామృతమునఁ దాప మార్పు మీశ! |
1050 |
| ఉ. |
నీ వడవిం బవల్ దిరుగ నీ కుటిలాలకలాలితాస్య మి చ్ఛావిధిఁ జూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనుం గావున రాత్రులైన నినుఁ గన్నుల నెప్పుడుఁ జూడకుండ ల క్ష్మీవర! ఱెప్ప లడ్డముగఁ జేసె నిదేల? విధాత క్రూరుఁడై. |
1051 |
| ఉ. |
అక్కట! బంధులున్ మగలు నన్నలుఁ దమ్ములుఁ బుత్త్రకాదులున్ నెక్కొని రాత్రిఁ బోకుఁ డన నీ మృదుగీతరవంబు వీనులన్ వెక్కసమైన వచ్చితిమి వేగమె మోహము నొంది నాథ! నీ వెక్కడఁ బోయితో? యెఱుఁగ మీక్రియ నిర్దయుఁ డెందుఁ గల్గునే? |
1052 |
| తే. |
మదనుఁ డార్వంగ నీవాడు మంతనములు, నవరసాలోకనం బగు నగుమొగంబు కమల కిరవైన మహితవక్షస్స్థలంబు, మా మనంబుల లోఁగొని మరపెఁ గృష్ణ!” |
1053 |
| మ. |
అరవిందంబులకంటెఁ గోమలములై యందంబులై యున్న నీ చరణంబుల్ కఠినంబులై మొనయు మా చన్నుంగవల్ మోవఁగా నెరియంబోలు నటంచుఁ బొక్కుదుము నీ యీ కర్కశారణ్య భూ పరిసంచారము కృష్ణ! నీ ప్రియలకుం బ్రాణవ్యథం జేయదే! |
1054 |
| క. |
కట్టా! మన్మథుకోలలు, నెట్టన నో నాఁట బెగడి నీ పాదంబుల్ పట్టికొనఁగ వచ్చిన మము, నట్టడవిని డించి పోవ న్యాయమె? కృష్ణా! |
1055 |
| క. |
హృదయేశ్వర! మా హృదయము, మృదుతరముగఁ జేసి తొల్లి మిక్కిలి కడ నీ హృదయము కఠినము చేసెను, మదీయసౌభాగ్య మిట్టి మందము గలదే? |
1056 |
| ఉ. |
క్రమ్మి నిశాచరుల్ సురనికాయములన్ వడిఁ దాఁకి వీఁక వా లమ్ముల తెట్టెముల్ వఱప నడ్డము వచ్చి జయింతు వండ్రు; ని న్నమ్మిన ముగ్ధలన్ రహితనాథల నక్కట! నేఁడు రెండు మూఁ డమ్ముల యేటుకాఁ డెగవ నడ్డము రాఁ దగదే కృపానిధీ! |
1057 |
| క. |
తియ్యవిలుకాఁడు డీకొని, వ్రయ్యలుగాఁ దూఱనేసె వనితల మనముల్ వియ్యాన నింక నయినం, గు య్యాలింపం గదయ్య గోవింద! హరీ! |
1058 |
| మ. |
అని యిట్లంగన లంచితస్వరముతో నంకించుచుం బాడుచుం దను ‘రావే’ యని చీరి యేడువ జగత్త్రాణుండు త్రైలోక్య మో హనుఁడై మన్మథమన్మథుం డయి మనోజ్ఞాకారియై హారియై ఘనపీతాంబరిధారియై పొడమెఁ దత్కాంతాసమీపంబునన్. |
1059 |
| క. |
వచ్చిన వల్లభుఁ గనుఁగొని, విచ్చేసె నటంచు సతులు వికసితముఖులై యచ్చుగ ప్రాణము లొడలికి, వచ్చిన నిలుచుండు నవయవంబుల భంగిన్. |
1060 |
| సీ. |
అబల యొక్కతె భక్తి నంజలి గావించి ప్రాణేశుకెంగేలు వట్టికొనియె నింతి యొక్కతె జీవితేశ్వరుబాహువు మూఁపున నిడికొని ముదము నొందె వనిత యొక్కతె తనవల్లభుతాంబూలచర్విత మాత్మహస్తమునఁ దాల్చెఁ బడఁతి యొక్కతె ప్రియుపదములు విరహాగ్నితప్తకుచంబులఁ దాపుకొనియె |
|
| ఆ. |
భామ యొకతె భ్రుకుటిబంధంబు గావించి, ప్రణయభంగరోషభాషణమున దష్టదశన యగుచు దండించు కైవడి, వాఁడి చూడ్కిగముల వరునిఁ జూచె. |
1061 |
| క. |
హరిముఖకమలముఁ జూచుచుఁ, దరుణి యొకతె ఱెప్పలిడక తనియక యుండెన్ హరిపదకమలముఁ జూచుచు, మరగి తనివి లేని సుజనుమాడ్కి నరేంద్రా! |
1062 |
| ఉ. |
ఒక్కలతాంగి మాధవునియుజ్జ్వలరూపము సూడ్కితీవలం జిక్కఁగఁ బట్టి హృద్గతముఁ జేసి వెలిం జనకుండ నేత్రముల్ గ్రక్కున మూసి మేనఁ బులకంబులు గ్రమ్మఁగఁ గౌఁగిలించుచుం జొక్కములైన లోచవులఁ జొక్కుచు నుండెను యోగికైవడిన్. |
1063 |
| సీ. |
ఎలయించి ప్రాణేశ! యెందుఁ బోయితి వని తోరంపుటలుకతో దూఱె నొకతె జలజాక్ష! ననుఁ బాసి చనఁగ నీ పాదంబు లెట్లాడె నని వగ నెయిదె నొకతె నాథ! నీ వరిగిన నాప్రాణ మున్నది కూర్మియే యిది యని కుందె నొకతె యీశ్వర! నను నిన్ను నిందాఁకఁ బాపెనే పాపపువిధి యని పలికె నొకతె |
|
| ఆ. |
తలఁగి పోవునట్టి తప్పేమి సేసితి?, నధిప! పలుకు ధర్మ మనియె నొకతె యేమినోము ఫలమొ హృదయేశ! నీమోము, మరలఁ గంటి ననుచు మసలె నొకతె. |
1064 |
| క. |
‘పలికినఁ బ్రతిజ్ఞఁ దప్పెడిఁ, బలికించినఁ గాని రమణుఁ బలుక’ నటంచుం గలకంఠి యొకతె చెలితోఁ, బలుకుల నమృతములు గురియుపగిదిం బలికెన్. |
1065 |
| క. |
పట్టినఁ గాని మనోవిభుఁ, బట్టఁ గదా? యంచు నొక్క బాలిక సఖి చే పట్టుకొని చెప్పె ధైర్యము, పట్టెల్లను మరునిటెంకిపట్టుగ నధిపా! |
1066 |
| క. |
చెలువుఁడు సెప్పక పోయిన, సొలపున నొకముగ్ధ మున్ను చూడ ననుచు నౌ దల వంచి యుండఁ జాలక, తల యెత్తెను లోన మరుఁడు దలయెత్త నృపా! |
1067 |
| వ. | ఇవ్విధంబున. | 1068 |
| క. |
హరిసురుచిర లలితాకృతిఁ, దరుణులు గని ముక్తవిరహతాపజ్వరలై పరమోత్సవంబు సలిపిరి, పరమేశ్వరుఁ గనిన ముక్తబంధుల భంగిన్. |
1069 |
| వ. | అంత న క్కాంతుండు గాంతాజనపరిక్రాంతుఁడై వనాంతరంబున శక్తినికరసంయుక్తుండైన పరమ పురుషుండునుంబోలె వారలం దోడ్కొని మందారకుందకుసుమపరిమళమిళితపవమానమానితమధుకర నికరఝంకారసుకుమారంబును, శరత్కాలచంద్రకిరణసందోహసందళితాంధకారంబును, యమునా తరంగసంగతకోమలవాలుకాస్ఫారంబునునై యమలినంబైనవులినంబు ప్రవేశించె. వారును జ్ఞానకాండంబున నీశ్వరుం గని విరహవేదనలు విడిచి పరిపూర్ణమనోరథలై. | 1070 |
| క. |
పాఠీననయన లెల్ల న, కాఠిన్య పటాంచలములఁ గౌతుకములు హృ త్పీఠముల సందడింపఁగఁ, బీఠముఁ గల్పించి రంతఁ బ్రియునకు నధిపా! |
1071 |
| ఆ. |
పరమయోగిహృదయభద్రపీఠంబుల, నుండు మేటి వ్రజవధూత్తరీయ పీఠమున వసించి పెంపారెఁ ద్రిభువన, దేవి లక్ష్మి మేనఁ దేజరిల్ల. |
1072 |
| మ. |
మదనోద్దీపకుఁడైన నాథునికి సమ్మానంబు గావించుచున్ ముదితల్ హాసవిలోకవిభ్రమములన్ మోదించుచుం జేరి త త్పదముల్ హస్తతలంబులం బిసుకుచుం బైముట్టుచున్ దూఱుచుం జదురుల్ వల్కుచుఁ గూర్మి నిట్లనిరి యీషత్కోపదీప్తాస్యలై. |
1073 |
| క. |
‘కొలిచినఁ గొలుతురు కొందఱు, గొలుతురు దముఁ గొలువకున్నఁ గొందఱు పతులం గొలిచినను గొలువకున్నను, గొలువరు మరికొంద ఱెలమి గోపకుమారా!’ |
1074 |
| వ. | అని త న్నుద్దేశించి రహస్యంబుగాఁ బలికిన సుందరుల పలుకులు విని గోపాలసుందరుం డిట్లనియె. | 1075 |
| సీ. |
‘కొలిచినఁ గొలుతురు కొందఱు పశువులభజనము భంగిని ఫలముకొఱకు నై; సఖ్యధర్మములందు సిద్ధింపవు కొందఱు తండ్రులగుణముఁ దాల్చి దయ గలవారలు తగినసుహృత్తులు గొలువనివారలఁ గొల్తు రెపుడు ధర్మకామంబులు దనరంగఁ గొందఱు కొలువనివారిని గొలుచువారిఁ |
|
| ఆ. |
గొలుచు తలఁపులేమిఁ గొలువ రాత్మారాము, లాప్తకాము లజ్ఞు లతికఠినులు వారియందుఁ బిదపవానిఁగాఁ జింతించి, యే లతాంగులార! యిట్టు లనుట. |
1076 |
| క. |
ఏ నిం దెవ్వఁడ నయినం, గా నంగనలార! పరమకారుణికుండన్ మానసబంధుఁడ నిత్య, ధ్యానము మీ కొసఁగవలసి తలఁగితిఁ జుండీ! |
1077 |
| మ. |
నను సేవించుచునున్న వారలకు నే నా రూపముం జూపఁ; జూ చినఁ జాలించి మదించి వారు మఱి నన్ సేవింపరో యంచు; ని ర్ధనికుం డాత్మధనంబు సెడ్డ నెపుడుం దత్పారవశ్యంబుఁ దా ల్చిన భంగిన్ ననుఁ బాసి మత్ప్రియుఁడు దాఁ జింతించు నా రూపమున్. |
1078 |
| తరలము. |
తగవు ధర్మముఁ జూడనొల్లక తల్లిదండ్రుల బంధులన్ మగల బిడ్డలఁ బాసివచ్చిన మన్నిషక్తల మిమ్ము నేఁ దగదు; పాసితిఁ దప్పు సైపుఁడు; తద్వియోగభరంబునన్ వగలఁ బొందుచు మీర లాడిన వాక్యముల్ వినుచుండితిన్. |
1079 |
| ఉ. |
పాయని గేహశృంఖలలఁ బాసి నిరంతరమత్పరత్వముం జేయుచు నున్న మీకుఁ బ్రతిసేయ యుగంబులనైన నేర; నన్ బాయక కొల్చు మానసము ప్రత్యుపకారముగాఁ దలంచి నా పాయుటఁ దప్పుగాఁ గొనక భామినులార! కృపన్ శమింపరే!’ |
1080 |
| క. |
చక్కగ హరి యిటు పలికిన, చక్కనివాక్యముల నతని సంగమమున లో నిక్కిన వియోగతాపము, లొక్కట విడిచిరి లతాంగు లుర్వీనాథా! |
1081 |