| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| ఉ. |
ఆ సమయంబునన్ విభు డనంతుఁడు గృష్ణుఁడు చిత్రమూర్తియై చేసెను మండలభ్రమణశీలపరస్పరబద్ధబాహు కాం తా సువిలాసమున్ బహువిధస్ఫురితాననహస్తపాద వి న్యాసము రాసముం గృతవియచ్చరనేత్రమనోవికాసమున్. |
1082 |
| వ. | ఇట్లు బహుగతులం దిరుగ నేర్పరి యగు హరి దర్పించి తన యిరుగెలంకుల నలంకృతలయి కళంక రహిత చంద్రవదన లిద్దఱు ముద్దియ లుద్దిగొని వీణ లందుకొని వీణలం బ్రవీణలై, సొంపుమెఱసి యింపుగ వాయించుచు నానందలహరీనిధానం బగు గానంబు సేయ నవిరళంబై తరళంబుగాని వేడుక సరళంబగు మురళంబు లీలం గేల నందుకొని మధురంబగు నధరంబునం గదియించి మించి కామినీజనకబరికా సౌగంధికగంధబంధురకరాంగుళీకిసలయంబులు యతిలయంబులం గూడి వివరంబుగ మురళీవివరంబుల సారించి పూరించుచు సరిలేనిభంగిం ద్రిభంగియై కమలకర్ణికాకారంబున నడుమ నిలిచి, మఱియు గోపసుందరు లెంద ఱందఱకు నందఱయి సుందరుల కవలి యెడలం దానును దన కవలియెడల సుందరులును దేజరిల్ల, నృత్తవిద్యామహార్ణవవేలావలయవలయితంబై, విస్మితాఖండలంబైన రాసమండలంబుఁ గల్పించి, వేల్పులు హర్షంబునం గుసుమవర్షంబులు గురియ నందుఁ బ్రసూనమంజరీ సహచరంబులైన చంచరీకంబుల మించు ప్రకటించుచు సువర్ణమణిమధ్యగంబులైన మహేంద్రనీలంబుల తెఱంగు నెఱపుచుఁ, గరిణీవిహారబంధురంబులైన సింధురంబుల చెలువుఁ గైకొనుచుఁ బల్లవితకుసుమిత లతానుకూలంబులైన తమాలంబుల సొబగు నెగడించుచు మెఱపుఁదీవల నెడ నెడం బెడం గడరు నల్ల మొగిళ్ళ పెల్లు సూపుచు, తరంగిణీసంగతంబు లయిన రోహణాచలశృంగంబులబాగు లాలించుచు, జగన్మోహనుండై యుండి రక్తకమలారుణంబులును, జంద్రశకలనిర్మలనఖరసంస్ఫురణంబులును, శ్రుతినితంబినీసీమంతవీథికాలంకరణంబులును, సనకసనందనాది యోగీంద్రమానసాభరణంబులును నయిన చరణంబులు గదియ నిడి సమస్థితి నంజలిపుటంబులం బుష్పంబు లుల్లసిల్లఁ జల్లి, సల్లలిత కమలప్రశస్తంబు లయిన హస్తంబులు వల్లవీజనులకంఠంబులపై నిడి, తాను గీతానుసారంబగు విచిత్ర పాదసంచారంబులు సలుపుచు, వర్తులాకారరాసబంధంబులవర్తనంబునం బ్రవర్తించి, వెండియు వ్రేతలుం దానును శంఖ పద్మ వజ్ర కందుక చతుర్ముఖ చక్రవాళ చతుర్భద్ర సౌభద్ర నాగ నంద్యావర్త కుండలీకరణ ఖురరీబంధ ప్రముఖంబు లయిన విశేషరాసబంధంబులకుం జొచ్చి యేకపాద సమపాద వినివర్తిత గతాగత వలిత వైశాఖమండల త్రిభంగిప్రముఖంబులైన తానకంబుల నిలుచుచుఁ, గనకకింకిణీ మంజులమంజీర శింజనంబులు జగజ్జనకర్ణరంజనంబులై చెలంగ; ఘటితమర్దితపార్శ్వగప్రముఖంబులైన పాదకర్మభేదంబులు సేయుచు, సమపాద శకటవదనమతల్లీశుక్తిప్రముఖంబులైన పార్థివచారివిశేషంబులును నపక్రాంతడోలాపాదసూచీ ప్రముఖంబులైన వ్యోమచారివిశేషంబులనుం జూపుచు, సురేంద్రశాఖి శాఖామనోహరంబులును, నపహసిత దిక్కరీంద్రకరంబులును, ద్రిలోకక్షేమంకరంబులును నగు కరంబులం దిరంబులగు రత్నకటకంబుల మెఱుంగులు నింగి చెఱంగులం దఱచుకొన నర్ధచంద్రకర్తరీముఖకపిత్థ కటకాముఖశుకతుండలాంగూల పద్మకోశపతాక ప్రముఖంబులైన స్వస్వభావసూచకనానావిధకరభావంబు లాచరించుచుఁ గటినిబద్ధ సువర్ణచేలాంచల ప్రభానికరంబులు సుకరంబులై దిశాంగనాముఖంబులకు హరిద్రాలేపన ముద్రాలంకారంబు లొసంగుచు, నాస్కందితభ్రమరశకటాసనప్రముఖంబులైన జానుమండలభేదంబులును, నలాతదండలాతలలిత విచిత్రప్రముఖంబులైన దైవమండలంబులు నొనర్చుచుఁ గమనీయ కంబుకంఠాభిరామంబులు నుద్దామతేజస్తోమంబులునైన నీలమౌక్తికవజ్రవైదూర్య దామంబులరుచు లిందిరాసుందరీమందిరంబు లయి సుందరంబులైన యురంబులం దిరుగుడువడి కలయంబడ నగాంతరవాహ్యలగ్నచ్ఛత్ర ప్రముఖంబులైన భ్రమణవిశేషంబుల విలసించుచు, నిద్దంబులగు చెక్కుటద్దంబుల నుద్దవిడిం దద్దయుం బ్రభాసిత చంద్రమండలంబులందు కుండలంబులమెఱుంగు మొత్తంబులు నృత్యంబు లొనరింపఁ గటిభ్రాంతదండరచిత లలాటతిలకమయూరలలితచక్రమండల నికుంచితగంగావతరణ ప్రముఖంబులైన కరణంబు లెఱింగించుచు, వెలిదమ్మివిరులసిరులఁ జెన్ను మిగులు కన్నులవలన దీనజనదైన్య కర్కశంబులై తనరు కటాక్షదర్శనజాలంబులు జాలంబులై కామినీజన నయనమీనంబుల నావరింప లలితకుంచితవికాసముకుళ ప్రముఖంబు లయిన చూడ్కులం దేజరిల్లుచు, ననేక పరిపూర్ణచంద్రసౌభాగ్యసదనంబులగు వదనంబులఁ బ్రసన్నరాగంబులు ప్రకటించుచు, నుదంచిత పింఛమాలికామయూఖంబు లకాలశక్రచాపంబుల సొంపు సంపాదింప, నికుంచితాకుంచితకంపితాకంపిత పరివాహితపరావృత్త ప్రముఖంబులైన శిరోభావంబులు నెఱపుచు, మృగనాభితిలకంబులు గల నిటలఫలకంబులఁ జికురంబుల నికరంబులు గప్ప, నపరాజితసూచికావిద్ధపరిచ్ఛిన్న విష్కంభరేచిత ప్రముఖంబులగు నంగహారంబుల విలసిల్లుచుఁ, జరణకటికరకంఠరేచకంబు లాచరించుచు నొప్పె; నప్పు డా రాసంబు సంజనితసకలజనమానసోల్లాసకరంబై సుధార్ణవంబునుంబోలె నుజ్జ్వలరసాభిరామంబై, రామరాజ్యంబునుంబోలె రాగపరిపూర్ణంబై, పూర్ణచంద్రమండలంబునుంబోలెఁ గువలయానందంబై, నందనవనంబునుంబోలె భ్రమరీవిరాజమానంబై, మానధనుచిత్తంబునుంబోలెఁ బ్రధానవృత్తిసమర్థంబై, సమర్థకవివిలసనంబునుంబోలె బహుప్రబంధభాసురంబై, సురలోకంబునుంబోలె వసుదేవనందనవిశిష్టంబై, శిష్టచరితంబునుంబోలె ధరణీగగనమండలసుందరంబై, సుందరీరత్నంబునుంబోలె నంగహారమనోహరంబై, హరవధూనిలయంబునుంబోలె ననేకచారిసుకుమారంబై, సుకుమారవృత్తంబునుంబోలె నుద్దీపితవంశంబై యుండె; నందు. | 1083 |
| చ. |
నడుములు వీఁగి యాడఁ, జిఱునవ్వులు నివ్వటిలంగ, హారముల్ సుడివడ, మేఖలల్ వదలఁ, జూడ్కి మెఱుంగులు పర్వ, ఘర్మముల్ వొడమఁ గురుల్ చలింప, శ్రుతిభూషణముల్ మెఱయన్ సకృష్ణలై పడఁతుక లాడుచుం జెలఁగి పాడిరి మేఘతటిల్లతాప్రభన్. |
1084 |
| క. |
అంకరహితేందు వదనలు, పంకజలోచనునిఁ గూడి పరఁగ నటింపం గింకిణుల నూపురంబుల, కంకణముల మ్రోఁత లెసఁగెఁ గర్ణోత్సవమై. |
1085 |
| క. |
హరిణీనయనలతోడను, హరి రాసక్రీడ సేయ నంబరవీథిన్ సురనాథులు భార్యలతో, సొరిది విమానంబు లెక్కి చూచి రిలేశా! |
1086 |
| క. |
కురిసెం బువ్వుల వానలు, మొరసెన్ దుందుభులు మింట ముదితలుఁ దారున్ సరసన్ గంధర్వపతుల్, వరుసన్ హరిఁ బాడి రపుడు వసుధాధీశా! |
1087 |
| క. |
రామలతోడను రాసము, రామానుజుఁ డాడఁ జూచి రాగిల్లి మనో రాములమీఁద వియచ్చర, రామలు మూర్ఛిల్లి పడిరి రాజకులేంద్రా! |
1088 |
| క. |
తారాధిపనిభవదనలు, తారాధిపవంశ్యుఁ గూడి తారు నటింపం దారలతోడ సుధాంశుఁడు, దారును వీక్షింప రేయి దడవుగ జరిగెన్. |
1089 |
| మ. |
యమునాకంకణచారియై వనజపుష్పామోదసంచారియై రమణీఘర్మనివారియై మదవతీరాసశ్రమోత్తారియై ప్రమదామానసనవ్యభవ్యసుఖసంపత్కారియై చేరి యా కమలాక్షుం డలరంగ గాలి విసరెం గల్యాణభావంబునన్. |
1090 |
| వ. | అప్పుడు. | 1091 |
| చ. |
ప్రమద యొకర్తు మాధవుఁడు పాడ విపంచి ధరించి కేల సం భ్రమమునఁ దంత్రి మీటుచుఁ దిరంబుగ ఠాయము సేసి యొక్క రా గము దగ నాలపించి సుభగస్వరజాతులు వేఱు వేఱు కా నమరఁగఁ బాడెఁ దన్ రమణుఁ డౌనన దారువు లంకురింపఁగన్. |
1092 |
| క. |
ఆడుచుఁ బాడుచు నందొక, చేడియ మంజీరమంజుశింజితమమరం గూడి హరికరము సనుఁగవ, పై డాయఁగ దిగిచె జఘనభారాలసయై. |
1093 |
| క. |
చందనలిప్తంబై యర, విందామోదమున నొప్పు విపులభుజము గో విందుఁ డొక తరుణిమూఁపునఁ, బొందించిన నది దెమల్చి పులకించె నృపా! |
1094 |
| సీ. |
చెలువ యొక్కతె చెక్కుఁ జెక్కుతో మోపిన విభుఁడు దాంబూలచర్వితము వెట్టె నాడుచు నొకలేమ యలసినఁ బ్రాణేశుఁ డున్నతదోఃస్తంభ మూఁత సేసెఁ జెమరించి యొకబాల సేరినఁ గొనగోరఁ జతురుఁడు కుచఘర్మజలము వాపె నలకంబు లొక యింతి కలికచిత్రకరేఖ నంటినఁ బ్రియుఁడు వాయంగ దువ్వెఁ |
|
| ఆ. |
బడఁతి యొకతె పాటపాడి డస్సిన నధ, రామృతమున నాథుఁ డాదరించె హార మొక్క సతికి నంసావృతం బైనఁ, గాంతుఁ డురముఁ జేర్చి కౌఁగిలించె. |
1095 |
| క. |
హాసంబులఁ గరతల వి, న్యాసంబుల దర్శనముల నాలాపములన్ రాసశ్రాంతల నా హరి, సేసెన్ మన్ననలు కరుణసేసి నరేంద్రా! |
1096 |
| క. |
హరితనుసంగసుఖంబునఁ, బరవశలై వ్రేత లెల్లఁ బయ్యెదలు నిజాం బరములు నెఱుఁగమి చోద్యమె?, సురసతు లీక్షించి కరఁగి చొక్కిరి మింటన్. |
1097 |
| వ. | ఇట్లు భగవంతుండైన కృష్ణుం డాత్మారాముం డయ్యును గోపసతు లెంద ఱందఱకు నందఱై నిజప్రతి బింబంబులతోడం గ్రీడించు బాలుపోలిక రాసకేలి సలిపిన. | 1098 |
| క. |
తగఁ గూడి యాడి మనముల, నగెఁ జూచెం బలికె నందనందనుఁ డనుచున్ మగువలు పెద్దఱికముతోఁ, బొగడిరి తమ పూర్వజన్మపుణ్యశ్రేణిన్. |
1099 |