| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | ఇట్లు హరి రాసకేళి సాలించి, కరకాంచితలగు తటిల్లతలచెలువున ఘర్మసలిలకణాక్రాంతలగు కాంతలం గూడి జలక్రీడాకుతూహలుండై యమునాజలంబులు సొర, నందు ముందర సుందరులు సొచ్చి పదప్రమాణంబు, జానుదఘ్నంబు, కటిద్వయసంబు, మధ్యమాత్రంబు, కుచంబులబంటి యని పలుకుచుం గుచ నయన నాభివివర కుంతలంబులు చక్రవాకజలచరావర్తశైవాలంబులచందంబున నందంబుగ నీడు వొందిన, యేఱులని కళిందనందన గరంబులు సాఁచి పరిరంభంబులకు నారంభించు కైవడి నెదురు చనుదెంచి తాఁకు తరంగంబులకు నులుకుచు, సారసంబులకుం గరంబులు సాఁచుచు, మరాళంబులం జోపుచుఁ, జెన్ను మిగిలిన యన్నుల చన్నుల యెత్తువత్తు మను నెపంబులం దపంబులు నీటఁ గావించు మాడ్కిని సంచరించు చక్రవాకంబులం దోలుచు, నితాంతకాంతి సదనంబులగు వదనంబులకు నోడి వ్రీడం జెంది కంది చందురుండు సలం బుడిగి జలంబునం బడి కంపించుకరణి, నిజకరచలిత జలప్రతిబింబితుండై కదలు చంద్రునిం గని మెచ్చి సోలుచు, సలిలావగాహ సమయ సముచ్చలిత వారిశీకర పరంపరలవలన మకరందపానమత్తమధుకరపక్ష విక్షేపణసంజాతవాతసముద్ధూత కుముదాది పరాగపటలంబులం జెఱుచుచు, మోముఁదమ్ముల కమ్మఁదనంబునకు మూఁగి, జుమ్మురను తుమ్మెదలకు వెఱచుచుఁ గరంబుల నీ రెగయం జఱచుచు, నీలనీరద నిపతిత పయోబిందుసందోహంబులం దడియు పువ్వుఁదీవియల బాగునఁ గృష్ణుకరద్వయతోయంబులం బెక్కుతోయంబులం దడియుచుఁ, గ్రందుకొని సుడియుచు, నసమబాణుని పులుగడిగిన కుసుమబాణంబుల పగిది మేనులు మెఱయ సలిలావగాహన పరాయత్తచిత్త లగుచు, మొత్తంబులై సరసభాషణములం ద్రుళ్లుచుఁ, గరంబుల నీరు నించి హరిమీఁదం జల్లుచుఁ, జల్లునెడం దడఁబడన్ దాఁటుచు, దాఁటి చనక నిలువరించుచు వినోదింప, హరియుం గరేణుకర వికీర్ణనీరధారాభిషిక్తంబగు శుండాలంబు లీల నాభీరకామినీకరసముజ్ఝిత జలాసారంబులం దోఁగుచు, వ్రజవధూజనహస్తప్రయుక్తకల్హార కైరవపరాగపటలంబువలన భూతిభూషణు సిరి వహించుచు, గోపికాజన పాణికిసలయసమున్ముక్త కమలదళంబులవలన సహస్రనయనుని రూపుఁ జూపుచు గోపాలబాలికా కుచకలశ కుంకుమపంకంబువలనఁ బ్రభాతబాలభానునిభంగి భాసిల్లుచు, ఘోషయోషాకటాక్ష విక్షేపణంబువలన మధుపపరివృత హరిచందనసౌందర్యంబు నొందుచు, వల్లవీహాసరుచులవలనఁ జంద్రికాప్రభాభాసిత నీలశైలంబు క్రియ నమరె; నంత. | 1100 |
| మ. |
సతులుం దానును నీటిలో వెడలి భూషాగంధచేలాద్యలం కృతుఁడై కుంభి కరేణుయూథములతోఁ గ్రీడించుచందంబునన్ లతలందుం దరులందుఁ బుష్పమయలీలాశయ్యలందున్ సుఖో న్నతుఁడై కృష్ణుఁడు క్రీడలం దనిపె నా నారీలలామంబులన్. |
1101 |
| వ. | ఇట్లు శరత్కాలంబున వెన్నుం డింద్రియస్ఖలనంబు సేయక గోపికలతోడ రమించె నని చెప్పిన మునివరునకు భూవరుం డిట్లనియె. | 1102 |
| మత్తకోకిలము. |
ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మమూర్తియు నైన స త్కర్ముఁ డీశుఁ డధర్మశిక్షయు ధర్మరక్షయుఁ జేయఁగా నర్మిలిన్ ధరమీఁదఁ బుట్టి పరాంగనాజనసంగ మే ధర్మ మంచుఁ దలంచి చేసె? నుదాత్తమానస! చెప్పుమా! |
1103 |
| వ. | అనిన శుకుం డిట్లనియె. | 1104 |
| ఆ. |
సర్వభక్షుఁ డగ్ని సర్వంబు భక్షించి, దోషి గాని పగిది దోష మైనఁ జేసి దోషపదముఁ జెందరు తేజస్వు, లగుటఁ జంద్రవాసవాదు లధిప! |
1105 |
| క. |
ఈశ్వరుఁడు గానివాఁడు న, రేశ్వర! పరకాంతఁ దలఁచి యెట్లు బ్రదుకు? గౌ రీశ్వరుఁడు దక్క నన్యుఁడు, విశ్వభయదవిషము మ్రింగి వెలయం గలఁడే? |
1106 |
| క. |
సత్యము ప్రభువులవచనము, నిత్యముఁ దద్వచనవీథి నిలుతురు పెద్దల్; సత్యాసత్యము గావున, సత్య మనుచుఁ జనరు వారిచరితమున నృపా! |
1107 |
| మ. |
ఘనులై యెవ్వని పాదపంకజపరాగధ్యానసంప్రాప్త యో గ నిరూఢత్వముచే మునీంద్రులు మహాకర్మంబులం బాసి బం ధ నిరోధంబులు లేక విచ్చలవిడిన్ దర్పింతు, రా దివ్య శో భనుఁ డెట్లుండిన నుండెఁగాక! కలవే బంధంబు లుర్వీశ్వరా! |
1108 |
| ఆ. |
గోపజనములందు గోపికలందును, సకలజంతులందు సంచరించు నా మహాత్మునకుఁ బరాంగన లెవ్వరు?, సర్వమయుఁడు లీల సలిపెఁ గాక? |
1109 |
| వ. | అని చెప్పి శుకుం డిట్లనియె నంత బ్రాహ్మీముహూర్తంబునం గృష్ణు వీడ్కొని గోపిక లిచ్ఛ లేకయు నిండ్లకడ కేఁగినం గృష్ణమాయామోహితులై గోపకులు వారలం గోపింపనేరరై రివ్విధంబున. | 1110 |
| ఇంద్రవజ్ర. |
గోపాలకృష్ణుండును గోపకాంతల్ ప్రాపించి క్రీడించిన భంగు లెల్లన్ రూపించి వర్ణించి నరుండు హృత్సం తాపంబులన్ బాయును దత్ప్రసక్తిన్. |
1111 |