పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
సర్పరూపియగు సుదర్శనుం డను గంధర్వుని శాపవిమోచనము
వ. అంత నొక్కనాఁడు నందాదులైన గోపకు లంబికావనంబునకు శకటంబు లెక్కి, జాతరకుం జని సరస్వతీనదీ జలంబుల స్నానంబులు సేసి, యుమామహేశ్వరుల నర్చించి కానిక లిచ్చి, బ్రాహ్మణులకు గో హిరణ్యవస్త్రాన్నదానంబు లొసంగి, జలప్రాశనంబు సేసి, నియమంబున నుండ దైవయోగంబున నాఁకొని యొక్కమహోరగంబు నిదురవోయిన నందునిం గఱచి మ్రింగ నగ్గలింప నతండు కృష్ణ కృష్ణేతి వచనంబులం దన్ను విడిపింపు మని మొఱ యిడిన విని. 1112
క. గోపకు లందఱు మేల్కొని, కోపముతోఁ బెద్దగుదెలఁ గొఱవుల మొత్తన్‌
దాపము నొందియు వదలక, పాపపుఁ బెనుబాము నందుఁ బట్టె నృపాలా!
1113
వ. అ య్యవసరంబునఁ గృష్ణుండు దర్పించి పాదతాడనంబు సేసి త్రొక్కిన సర్పంబు సర్పరూపంబు విడిచి విద్యాధరేంద్రరూపంబుఁ దాల్చి హరికి మ్రొక్కిన నతనికి హరి యిట్లనియె. 1114
ఉ. మండితమూర్తితోఁ గనకమాలికతో శుభలక్షణుండవై
యుండెడు నీకుఁ గష్టపుమహోరగదేహ మిదేల వచ్చె? నె
వ్వండవు? నామ మెయ్యది? భవంబున కెద్ది మిషంబు? నాకు నొం
డొండ యెఱుంగఁ జెప్పుము బుధోత్తమ! నీ పని చోద్య మయ్యెడిన్‌.
1115
వ. అనిన వాఁ డిట్లనియె: ‘దేవా! యేను సుదర్శనుండను విద్యాధరుండ; విమానారూఢుండనై రూపసంపద్గ ర్వంబులం జొక్కి దిక్కులం జరించుచు నొక్కయెడ నాంగిరసులైన ఋషులం గురూపులైన వారలం గని నగిన వారును నీవు రూపదర్పంబున మమ్ము నగితివి; గావున మహాసర్పంబవై యుండు’ మని శపించి పిదప నే వేఁడుకొనిన నిట్లనిరి. 1116
చ. యదుకులమందు భక్తులభయంబు హరించుటకున్‌ జనార్దనుం
డుదయము నొంది యీ యడవి కొక్కదినంబున రాఁగలండు త
త్పదమున నీవు తన్నఁబడి పన్నగదేహము తోడఁ బాసి నీ
మొదలిటిమేను గాంచెదవు మూఢుఁడ! పొమ్మని రా దయానిధుల్‌.
1117
మ. నినుఁ జింతించిన విన్నఁ బేరుకొనినన్‌ నిర్మూలమై క్రుస్సి పా
పనికాయంబు వినష్టమౌ నఁట! భవత్పాదంబు నామీఁదఁ బె
ట్టినఁ దద్బ్రాహ్మణశాపసంజనితకౌటిల్యంబు దా నిల్చునే?
వనజాతేక్షణ? నేఁడు వాసె నురగత్వం బెల్ల నేఁ బోయెదన్‌.
1118
వ. అని విన్నవించి హరికిం బ్రదక్షిణంబు వచ్చి, మ్రొక్కి, సుదర్శనుండు దివంబునకుం జనియె, సర్పంబువలన నందుండు విముక్తుం డయ్యెఁ; దత్ప్రకారంబు విని వెఱఁగుపడి గోపకులు దేవతా మహోత్సవంబు సమాప్తి నొందించి కృష్ణకీర్తనంబు సేయుచు మరల మందకుం జని రంత. 1119
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )