పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీకృష్ణుఁడు కుబేరభటుండగు శంఖచూడుం డను గుహ్యకుని సంహరించుట
చ. మఱి యొకనాఁటి రాత్రి బలమాధవు లుజ్జ్వల వస్త్రమాలికా
ధరులును లేపనాభరణధారులునై చని మల్లికాది పు
ష్ప రసనిమగ్నమత్తమధుపంబుల గీతము వించుఁ దద్వనాం
తరమున వెన్నెలన్‌ వ్రజనితంబిను లుండఁగఁ బాడి రింపుగన్‌.
1120
క. ఆ పాట సెవుల సోఁకిన, నేపాటియు దేహలతల నెఱుఁగక దృగ్వా
చా పాటవములు సెడి పడి, రా పాటలగంధులెల్ల నటవీవీథిన్‌.
1121
వ. ఇట్లు సకలభూతసమ్మోహనంబగు గానంబు సేయుచు, నిచ్ఛావర్తనంబులం బ్రమత్తులచందంబున రామకృష్ణులు క్రీడింపఁ గుబేరభటుండు శంఖచూడుం డనువాఁడు రామకృష్ణరక్షితలగు గోపికలం దన యోగబలంబున నుత్తరపుదిక్కునకుం గొనిపోవ నయ్యోషిజ్జనంబులు ‘రామకృష్ణేతి’ భాషణంబులం జీరి పులికి నగపడిన మొదవులక్రియ మొఱయిడిన విని. 1122
ఉ. గ్రద్దన సాలవృక్షములు గైకొని బల్లిదు లన్నదమ్ము లా
యిద్దఱుఁ గాలమృత్యువుల యేపున వే చని ‘యోడకుండుఁ డో
ముద్దియలార’ యంచుఁ దను ముట్టినఁ జూచి కలంగి గుహ్యకుం
డుద్దవిడిం దగం బఱచె నుత్తర మింతుల డించి భీతుఁడై.
1123
వ. ఇట్లు గుహ్యకునిచేత విడివడిన గోపికల ‘రక్షించుకొని యుండు’ మని బలభద్రునిం బలికి. 1124
శా. ‘ఓరీ! గుహ్యక! పోకు పోకు మని రోషోక్తిన్‌ బకారాతి వాఁ
డే రూపంబున నెందుఁ జొచ్చె నెటఁ బోయెం దోడఁ దా నేఁగి దు
ర్వారోదంచితముష్టి వానితల ద్రెవ్వం బట్టి తద్వీరు కో
టీరభ్రాజితరత్నముం గొనియె దండిన్‌ గోపికల్‌ సూఁడఁగన్‌.
1125
వ. ఇట్లు శంఖచూడునిం జంపి వానిశిరోరత్నంబు దెచ్చి బలభద్రుని కిచ్చి మెప్పించె; మఱియు నొక్కదినంబునం గృష్ణుండు వనంబులకుం జనిన నతనిలీలలు వాడుచు నిండ్లకడఁ దద్విరహ వేదనానల భరంబు సహింపక గోపికలు దమలో నిట్లనిరి. 1126
శా. భ్రూవిక్షేపముతోడ దాపలి భుజంబుం జెక్కుఁ గీలించి కె
మ్మోవిన్‌ వేణువుఁ గూర్చి సుస్వరముగా మ్రోయించుచు న్నంగుళీ
ప్రావీణ్యంబు విభుండు సూపఁ గని సప్రాణేశలై యుండియున్‌
నీవీబంధము లూడఁ బొక్కుదురువో నింగిన్‌ నిలింపాంగనల్‌.
1127
మ. నవమాధుర్యము గల్గు కృష్ణుమురళీనాదామృతస్యందముల్‌
సెవులం జొచ్చి హృదంతరాళముల భాసిల్లన్‌ సవత్సంబులై
యువిదా! మేపులకుం దొఱంగి మృగగోయూథంబు లుత్కంఠతో
దివికిం గంఠము లెత్తి లో వదలుఁ బో దేహేంద్రియవ్యాప్తులన్‌.
1128
శా. ఓ కంజేక్షణ! కృష్ణుఁ డుజ్జ్వలితహారోద్దాముఁడై గాన వి
ద్యా కౌతూహలితన్‌ మనోజ్ఞమురళీధ్వానంబు గావింపఁగా
నాకర్ణించి సశంపమై మొఱయు నీలాభ్రంబుగాఁ జూచుచుం
గేకారావము లిచ్చుచున్‌ మురియుఁ బో కేకీంద్రసంఘాతముల్‌.
1129
మ. లలనా! యేటికిఁ దెల్లవాఱె? రవి యేలా తోఁచెఁ బూర్వాద్రిపైఁ?
గలకాలంబు నహంబు గాక నిసిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా
వలఱేఁడుం గృప లేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లో కదే!
కలదే మాపటివేళయుం గలుగునే కంజాక్షు సంభోగముల్‌.
1130
ఉ. ఎప్పుడు ప్రొద్దు గ్రుంకు? హరి యెప్పుడు గోవుల మేపి వచ్చు? నా
కెప్పుడు తన్ముఖాంబుజసమీక్షణ మబ్బు? నతండు వచ్చి న
న్నెప్పుడు గారవించుఁ? దుది యెప్పుడు మద్విరహాగ్నిరాశికిం
జెప్పఁగదమ్మ! బోఁటి! మరుచేఁతల నుల్లము దల్లడిల్లెడిన్‌.
1131
మ. చెలియా! కృష్ణుఁడు నన్నుఁ బాసి వనముం జేరంగ నయ్యా క్షణం
బులు నా కన్నియు నుండ నుండఁగఁ దగన్‌ బూర్ణంబులై సాఁగి లో
పలఁ దోఁచుం బ్రహరంబులై దినములై పక్షస్వరూపంబులై
నెలలై యబ్దములై మహాయుగములై నిండారు కల్పంబులై.
1132
వ. అని మఱియుఁ గృష్ణవిరహదుఃఖంబున బహువిధంబులఁ బశ్చాత్తాపంబు నొందుచు గోపిక లోపికలు లేక యెట్టకేలకు దినంబు గడపి దినాంతసమయంబునందు. 1133
మ. ‘అదె భానుం డపరాద్రిఁ జేరె? నిదె సాయంకాల మేతెంచె; న
ల్లదె గోపాదపరాగ మొప్పెసఁగె, బృందారణ్యమార్గంబు నం
దిదె వీతెంచె వృషేంద్రఘోషము; ప్రియుం డేతెంచె రం’ డంచుఁ దా
మెదు రేతెంతురు మాపు కృష్ణునికి న య్యింతుల్‌ పరిభ్రాంతలై.
1134
వ. ఇట్లు తన కెదురు వచ్చిన మచ్చిక న చ్చెలువల నచ్యుతుం డిచ్ఛానువర్తనంబుల గారవించె నంత నొక్కనాఁడు. 1135
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )