పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
వృషభాసుర సంహారము
సీ. ఎవ్వనిమూఁపుర మీక్షించి మేఘంబు లద్రిశృంగం బని యాశ్రయించు
నెవ్వనిఱంకె కర్ణేంద్రియంబులు సోఁక గర్భపాతం బగు గర్భిణులకు
నెవ్వనిపదహతి నెగయుపరాగంబు లంధకారారాతి నావరించు
నెవ్వఁడు గొమ్ముల నెదిరించి చిమ్మినఁ బృథ్వీధరంబులు పెల్లగిల్లు
 
తే. నట్టి వృషభాసురేంద్రుఁ డహంకరించి, వాలలత యెత్తి పెనుఱంకె వైచి నేలఁ
గాలు ద్రవ్వుచు నిశితశృంగములు సాఁచి, మంద బెగడంగఁ గవిసె నమందగతిని.
1136
వ. అట్లు వృషభాకారంబున నరిష్టుఁడు హరికి నరిష్టంబు సేయం దలంచి పై కుఱికిన. 1137
ఉ. క్రేపులు వాఱె గోవులకుఁ, గ్రేపులు గోవులు గోవృషంబులం
బైపడె; వత్సధేనువృషభంబులు గోపకులందుఁ జొచ్చె; నా
గోపకు లా వృషేంద్రములు గోవులు లేఁగలు విచ్చి పాఱఁగా
గోపచమూవిభుండు గనె గోవృషదైత్యుఁడు వెంట నంటఁగన్‌.
1138
వ. ఇట్లు భయభ్రాంతులై కాంతలుం దారును గృష్ణ!; కృష్ణ! రక్షింపు రక్షింపు మనియెడు గోపకులకు నడ్డంబు వచ్చి దీనజనరక్షకుండైన పుండరీకాక్షుం డిట్లనియె. 1139
ఉ. ‘బాలుర నింతులం బసులఁ బాఱఁగఁ దోలుట బంటుపంతమే
చాలు, వృషాసురేంద్ర! బలసంపదఁ జూపఁగ నెల్లబోఁటి గో
పాలురమంద గాదు; చను పైఁ బడితేనిఁ బ్రచండ కృష్ణ శా
ర్దూలము నేఁడు నీగళముఁ ద్రుంపక చంపక పోవనిచ్చునే?
1140
ఆ. అనుచు ధిక్కరించి హస్తతలంబులఁ, జప్పుడించి నగుచుఁ జలము మీఱఁ
బన్నగేంద్రభయదబాహుదండము సాఁచి, దండి మెఱసి దనుజుదండ నిలిచె.
1141
వ. అప్పుడు. 1142
చ. ఖురముల నేలఁ ద్రవ్వుచు నకుంఠితవాలసమీరణంబులన్‌
విరవిరఁ బోయి మేఘములు వివ్వ విషాణము లొడ్డికొంచు దు
స్తరతరమూర్తియై వృషభదైత్యుఁడు కన్నుల నిప్పు లొల్కఁగా
దురదుర వచ్చి తాఁకె రిపుదుర్మదమోచనుఁ బద్మలోచనున్‌.
1143
ఉ. యాదవకుంజరుండు వృషభాసురుకొమ్ములు రెండుఁ బట్టి య
ష్టాదశపాదమాత్రము గజంబు గజంబును ద్రొబ్బు కైవడిన్‌
భేదిల ద్రొబ్బ న య్యసుర బిమ్మిటి నొంది చెమర్చి మ్రొగ్గి దు
ర్మాదముతోడ డీ కొనెఁ బ్రమత్తవిమర్దను నా జనార్దనున్‌.
1144
ఆ. అంత గోపసింహుఁ డసురకొమ్ములు వట్టి, ధరణి ద్రొబ్బి త్రొక్కి దైత్యభటుల
కొమ్ము వీఁగ సురలకొమ్ము వర్ధిల వాని, కొమ్ము వెఱికి మొత్తి కూల్చె నధిప!
1145
క. ఉక్కు సెడి రోఁజి నెత్తురు, ముక్కున వాతను స్రవింప మూత్రశకృత్తుల్‌
మిక్కిలి విడుచుచుఁ బసరపు, రక్కసుఁ డని సమసెఁ బ్రజకు రాగం బమరన్‌.
1146
వ. ఇట్లు వృషభాసురుం జంపిన, నిలింపులు గుంపులు గొని విరులు వర్షింప, గోపకులు హర్షింప గోపసతు లుత్కర్షింప బలభద్రుండును దానును గోవిందుండు పరమానందంబున మందకుం జనియె నంత. 1147
చ. ఘనుఁ డొకనాఁడు నారదుఁడు గంసునితోడ యశోద గూఁతుఁ దాఁ
గనుటయుఁ జక్రి దేవకికి గర్భజుఁ డౌటయు మున్ను రోహిణీ
తనయుఁడు రాముఁ డౌటయును దద్విభు లిద్దఱు మంద నున్న వా
రని యెఱుఁగంగఁ జెప్పిన మహాద్భుత మంచుఁ జలించి కిన్కతోన్‌.
1148
చ. కొడుకుల మందలోన నిడి గొంటుతనంబున మోసపుచ్చె నీ
బడుగును బట్టి చంపు టిది భావ్య మటంచుఁ గృపాణపాణియై
వడి వసుదేవునిం దునుమ వచ్చిన కంసునిఁ జూచి నారదుం
డుడుగుము చంపఁ బోల దని యోడక మానిచి పోయె మింటికిన్‌.
1149
వ. మఱియు నలుకదీఱక కంసుండు దేవకీవసుదేవుల లోహపాశబద్ధులంజేసి కేశి యనువానిం బిలిచి రామకేశవులం జంపు మని పంపి, మంత్రిభటగజారోహకచాణూరముష్టికసాల్వకోసలప్రముఖుల రావించి యిట్లనియె. 1150
శా. ఎందున్‌ నన్నెదిరించి పోరుటకు దేవేంద్రాదులుం జాల రీ
బృందారణ్యము మంద నిప్పుడు మదాభీరార్భకుల్‌ రామ గో
విందుల్‌ వర్ధిలుచున్నవారఁట రణోర్విం గంసునిం ద్రుంతు’ మం
చుం దర్పంబులు పల్కు చుందురఁట; యీ చోద్యంబులన్‌ వింటిరే?
1151
క. పట్టణజనములు సూతురు, దట్టంబుగ మల్లరంగతలపార్శ్వములం
బెట్టింపుఁడు తమగంబులు, పుట్టింపుఁడు వీట మల్లుపో రనుమాటన్‌.
1152
శా. విన్నాణంబులఁ బోర నేర్తురు మహావీర్యప్రతాపాది సం
పన్నుల్‌ మీరలు మేటిమల్లుగములం బ్రఖ్యాతులై పెంపుతో
మన్నా రా బలకృష్ణులం బెనఁకువన్‌ మర్దించి మత్ప్రీతి కా
సన్నుల్‌ గండు పురీజనుల్‌ వొగడ నో చాణూర! యో ముష్టికా!
1153
శా. రా రా హస్తిపకేంద్ర! గండమదధారాగంధలోభాంధ గం
భీరాళివ్రజమైన మత్కువలయాపీడద్విపేంద్రంబు మ
ద్ద్వారోదంచితదేహళీపరిసరస్తంభంబు డాయంగ నా
భీరుల్‌ రా నదలించి డీకొలుపు నీ బీరంబు తోరంబుగన్‌.
1154
క. పశువిశసనములు సేయుఁడు, పశుపతికిం బ్రియము గాఁగ భావించి చతు
ర్దశినాఁడు ధనుర్యాగము, విశదంబుగఁ జేయవలయు విజయముకొఱకున్‌.
1155
వ. అని తనవారి నందఱ నయ్యైపనులకు నియమించి యదుశ్రేష్ఠుండగు నక్రూరునిం బిలిపించి చెట్ట వట్టికొని యిట్లనియె. 1156
శా. అక్రూరత్వముతోడ నీవు మనఁగా నక్రూరనామంబు ని
ర్వక్రత్వంబునఁ జెల్లె మైత్రి సలుపన్‌ వచ్చున్‌ నినుం జేరి నీ
వక్రోధుండవు మందలోన బలకృష్ణాభీరు లస్మద్వినా
శ క్రీడారతులై చరింతు రఁట యోజం దెచ్చి యొప్పింపవే?
1157
ఆ. నాకు వెఱచి సురలు నారాయణుని వేఁడి, కొనిన నతఁడు వచ్చి గోపకులము
నందుఁ గృష్ణమూర్తి నానకదుందుభి, కుదితుఁ డయ్యె ననఁగ నొకటి వింటి!
1158
వ. కావున నీవు గోపకులచేత నరులు గొని ధనుర్యాగంబుఁ జూడ రండని వారలం దోడ్కొని రమ్ము. వచ్చిన. 1159
శా. కొండల్‌ గూలఁగ ద్రొబ్బు గొమ్ముల తుదిం గోపించి కోరాడుచో
దండిన్‌ దండి నధఃకరించు నొకవేదండంబు నాయింట బ్ర
హ్మాండం బైనఁ గదల్ప నోపు బలకృష్ణాభీరులం బోరిలో
ఖండింపం దడ వెంత దాని కదియుం గాదేని నక్రూరకా!
1160
శా. చాణూరుండును ముష్టికుండును సభాసంఖ్యాతమల్లుల్‌ జగ
త్ప్రాణున్‌ మెచ్చరు సత్త్వసంపదల బాహాబాహి సంగ్రామ పా
రీణుల్‌ వారలు రామకృష్ణుల బలోద్రేకంబు సైరింతురే?
క్షీణప్రాణులఁ జేసి చంపుదురు సూ సిద్ధంబు యుద్ధంబునన్‌.
1161
సీ. ఆ రామకేశవు లంతరించిన వసుదేవముఖ్యులఁ జంపి తెగువ మెఱసి
వృష్ణి భోజ దశార్హ వీరులఁ దెగటార్చి ముదుకఁడు రాజ్యకాముకుఁడు ఖలుఁడు
నగు నుగ్రసేను మా యయ్యఁ గీటడఁగించి పినతండ్రి దేవకుఁ బిలుకుమార్చి
మఱియు వైరులనెల్ల మర్దించి నే జరాసంధ నరక బాణ శంబరాది
 
ఆ. సఖులతోడ భూమిచక్ర మేలెదఁ బొమ్ము, తెమ్ము వేగమ వసుదేవసుతుల
మఖము పేరు సెప్పి మంత్రభేదము సేయ, వలయుఁ బెంపఁ జనదు వైరిజనుల.
1162
వ. అనిన నక్రూరుం డిట్లనియె. 1163
ఉ. పంపినఁ బోనివాఁడనె నృపాలక! మానవు లెన్నఁ దమ్ము నూ
హింపరు దైవయోగముల నించుక గానరు తోఁచినట్లు ని
ష్కంపగతిం జరింతు రది గాదన వచ్చునె? యీశ్వరేచ్ఛఁ ద
ప్పింపఁగ రాదు నీపగతుబిడ్డలఁ దెచ్చెదఁ బోయి వచ్చెదన్‌.
1164
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )