పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ కృష్ణుఁడు కేశివ్యోమాసురుల సంహరించుట
వ. అని పలికి రథం బెక్కి యక్రూరుండు సనిన సకలజనుల వీడుకొలిపి కంసుం డంతిపురంబునకుం జనియె; నంతఁ గంసప్రేరితుండై. 1165
సీ. ఖురపుటాహతిఁ దూలి కుంభినీచక్రంబు ఫణిరాజఫణులకు బరువుసేయ
భీషణహేషావిభీషితులై మింట నమృతాంధు లొండొరు నండ గొనఁగఁ
జటులచంచలసటాచ్ఛటలగాడ్పుల మేఘములు విమానములపై ముసుఁగు వడఁగ
వివృతాస్యగహ్వరవిపులదంతంబులు ప్రళయాగ్నికీలల పగిది మెఱయఁ
 
తే. గాలపాశలీలగా వాల మే పార, వాహ మగుచు గంధవాహగతుల
విజితశక్రపాశి వీర్యపయోరాశి, కేశి వచ్చె మంద క్లేశ మంద.
1166
క. భీషణ ఘోటక దానవ, హేషానిర్ఘోషభిన్నహృదయనిఖిల గో
యోషాపురుషార్భకమై, ఘోషము హరి సూడ దైన్యఘోషం బయ్యెన్‌.
1167
వ. అయ్యవసరంబున. 1168
ఉ. పేదల ఘోషగోపకుల బిట్టదలించుట వీరధర్మమా?
కాదు; వ్రజంబులో దనుజ ఘస్మరుఁ డేఁ డని తన్ను రోయు క్ర
వ్యాదునిఁ జూచి గోపకుల కడ్డము వచ్చి నిశాట! యింకఁ బో
రా దని శౌరి చీరె మృగరాజుక్రియ న్నెదిరించె దైత్యుఁడున్‌.
1169
ఆ. నిష్ఠురోగ్రసింహనినదంబుతో నింగి, మ్రింగుభంగి నోరు మిగులఁ దెఱచి
కఱవరాఁగ నతఁడు గాటు దప్పించినఁ, దన్నె నెగసి తురగదానవుండు.
1170
ఉ. తన్నిన తన్నునం బడక దానవహంత సమీకరంతయై
కన్నులఁ గెంపు పెంపెనయ గ్రక్కున ఘోటనిశాటుపాదముల్‌
వన్నె సెడంగఁ బట్టి వడి వైచె ధనుశ్శతమాత్రదూరముం
బన్నగడింభమున్‌ విసరి పాఱఁగ వైచు ఖగేంద్రుకైవడిన్‌.
1171
ఉ. వైచిన మ్రొగ్గి లేచి వెస వాజినిశాటుఁడు హుంకరించి సం
కోచము లేక పైఁబడిన గోపకులేంద్రుఁడు దిగ్గజేంద్రశుం
డా చటులప్రభాబలవిడంబకమైన భుజార్గళంబు దో
షా చరు నోటిలో నిడియెఁ జండఫణిన్‌ గుహ నుంచు కైవడిన్‌.
1172
శా. దంభోళిప్రతిమానకర్కశమహోద్యద్వామదోఃస్తంభమున్‌
శుంభల్లీల నఘారి వానిరదముల్‌ చూర్ణంబులై రాలఁగా
గంభీరంబుగఁ గుక్షిలోఁ జొనిపి వీఁకన్‌ వృద్ధిఁ బొందింపుచున్‌
గుంభించెం బవనంబు పిక్కటిలఁ దత్కుక్షిన్‌ నరేంద్రోత్తమా!
1173
క. వాయువు వెడలక నిలిచినఁ, గాయంబు సెమర్పఁ గన్నుగవ వెలి కుఱుకన్‌
మాయ సెడి తన్నుకొనుచును, గూయుచు నశ్వాసురుండు గూలెన్‌ నేలన్‌.
1174
ఆ. ఘోటకాసురేంద్రుకుక్షిలోఁ గృష్ణుని, బాహు వధిక మైనఁ బట్టలేమిఁ
బగిలి దోసపండు పగిదిఁ దద్దేహంబు, వసుమతీశ! రెండు వ్రయ్య లయ్యె.
1175
క. నలినాక్షుఁడు లీలాగతి, విలయముఁ బొందించె నిట్లు వీరావేశిన్‌
బలలాశిన్‌ జగదభినవ, బలరాశిన్‌ విజితశక్రపాశిం గేశిన్‌.
1176
వ. ఆ సమయంబునం బుష్పవర్షంబులు గురియించి సురలు వినుతించి; రంత హరిభక్తి విశారదుండైన నారదుండు వచ్చి గోవిందుని సందర్శించి రహస్యంబున నిట్లనియె. 1177
సీ. ‘జగదీశ! యోగీశ! సర్వభూతాధార! సకలసంపూర్ణ! యీశ్వర! మహాత్మ!
కాష్ఠగతజ్యోతికైవడి నిఖిలభూతములందు నొకఁడవై తనరు దీవు
సద్గూఢుఁడవు; గుహాశయుఁడవు సాక్షివి నీయంతవాఁడవై నీవు మాయఁ
గూడి కల్పింతువు గుణముల; వానిచేఁ బుట్టించి రక్షించి పొలియఁ జేయు
 
ఆ. దీ ప్రపంచమెల్ల నిట్టి నీ విప్పుడు, రాజమూర్తు లయిన రాక్షసులను
సంహరించి భూమిచక్రంబు రక్షింప, నవతరించినాఁడ వయ్య! కృష్ణ!
1178
వ. దేవా! నీచేత నింకఁ జాణూర ముష్టిక గజ కంస శంఖ యవన ముర నరక పౌండ్రక శిశుపాల దంతవక్త్ర సాల్వ ప్రముఖులు మడిసెదరు; పారిజాతం బపహృతం బయ్యెడిని; నృగుండు శాపవిముక్తుం డగు; శమంతకమణి సంగ్రహంబగు; మృతబ్రాహ్మణపుత్త్రప్రదానంబు సిద్ధించు; నర్జునసారథివై యనేకాక్షౌహిణీబలంబుల వధియించెదవు; మఱియును. 1179
శా. కృష్ణా! నీ వొనరించు కార్యములు లెక్కింపన్‌ సమర్థుండె? వ
ర్ధిష్ణుండైన విధాత మూఁడుగుణముల్‌ దీపించు లోపించు రో
చిష్ణుత్వంబున నుండు నీవలన; నిస్సీమంబు నీరూపు నిన్‌
విష్ణున్‌ జిష్ణు సహిష్ణు నీశు నమితున్‌ విశ్వేశ్వరున్‌ మ్రొక్కెదన్‌.
1180
వ. అని వినుతించి వీడుకొని నారదుం డరిగె; నంత నొక్కనాఁడు కృష్ణసహితు లయి గోపకుమారు లడవికిం జని పసుల మేపుచు నొక్క కొండదండ నిలాయనక్రీడ సేసి రందు. 1181
క. కొందఱు గొఱియల మంచును, గొందఱు పాలకుల మంచుఁ గుటిలత్వమునం
గొందఱు దొంగల మనుచును, జెంది కుమారకులు క్రీడసేసిరి తమలోన్‌.
1182
శా. ఆలో దొంగలలో మయాసురసుతుం డాద్యుండు వ్యోముండు గో
పాలుండై చని మేషకల్పనలతో భాసిల్లి క్రీడించు త
ద్బాలవ్రాతము నెల్ల మెల్లన చతుఃపంచావశిష్టంబుగా
శైలాంతర్గుహలోనికిం గొని చనెం జౌర్యం బవార్యంబుగన్‌.
1183
వ. ఇట్లు కొండగుహలోనఁ గ్రమక్రమంబున గోపకుమారుల నిడి, యొక్క పెనుఱాతఁ దద్ద్వారంబుఁ గప్పి యెప్పటియట్ల వచ్చిన. 1184
ఉ. వీరుఁడు మాధవుం డఖిలవేది నిశాచరభేది నవ్వుతో
‘నౌర! నిశాట! దొంగతన మచ్చుపడెన్‌ నెఱదొంగ వౌదు; వా
భీరుల నెల్ల శైలగుహఁ బెట్టితి చిక్కినవారిఁ బెట్టరా!
రార యటంచుఁ బట్టె మృగరాజు వృకాఖ్యముఁ బట్టు కైవడిన్‌.
1185
ఉ. పంకజలోచనుం డొడిసి పట్టిన శైలనిభాసురాకృతిన్‌
బింకముతోడఁ బొంగి విడిపించుకొనంగ బలంబు లేమి లో
శంకిలి బిట్టు తన్నుకొనఁ జక్కన యా రణభీము వ్యోమునిం
గొంకకఁ గూల్చె న వ్విభుఁడు గోయని మింట సుపర్వు లార్వఁగన్‌.
1186
ఆ. ఘోరదనుజు నేలఁ గూల్చి పర్వతగుహ, వాత నున్న ఱాయి వ్రయ్యఁ దన్ని
గుహఁ జరించుచున్న గోపాలకులఁ గొంచు, బల్లిదుండు గొల్లపల్లె కరిగె.
1187
వ. అంత నారాత్రి మథురానగరంబున నక్రూరుండు వసియించి నియతుండయి మఱునాఁడు రేపకడ లేచి, నిత్యకృత్యంబు లాచరించి, రథంబెక్కి కదలి నందగోకులంబునకుం బోవుచుం దెరువునఁ దనలో నిట్లనియె. 1188
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )