| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| ఉ. |
ఎట్టితపంబు సేయఁబడె? నెట్టి చరిత్రము లబ్ధ మయ్యెనో? యెట్టిధనంబు లర్హులకు నీఁబడెనో తొలిబామునందు; నా యట్టి వివేకహీనునకు నాదిమునీంద్రులు యోగదృష్టులం బట్టఁగ లేని యీశ్వరుని బ్రహ్మమయున్ హరిఁ జూడఁ గల్గెడిన్. |
1189 |
| ఉ. |
సూరులు దొల్లి యే విభునిశోభితపాదనఖప్రభావళిం జేరి భవాంధకారములఁ జిక్కక దాఁటుదు రట్టి దేవునిన్ వైరముతోడనైనఁ బిలువన్ ననుఁ బంచి శుభంబు సేసె ని ష్కారణమైన ప్రేమ నిదె; కంసునిఁ బోలు సఖుండు గల్గునే? |
1190 |
| మ. |
‘ఇతఁ డా కంసునిచేతఁ బంపువడి నన్ హింసింప నేతెంచి నాఁ డతిదుష్టుం’డని చూచునో సకలభూతాంతర్బహిర్మధ్య సం గతుఁ డౌటం దలపోసి నన్ను సుజనుంగాఁ జూచునో యెట్టి యు న్నతి గావించునొ యే క్రియం బలుకునో? నాభాగ్య మెట్లున్నదో? |
1191 |
| వ. | అని మఱియును. | 1192 |
| మ. |
అలకభ్రాజితమై సుధాంశునిభమై హాసప్రభోద్దామమై జలజాక్షంబయి కర్ణకుండలవిరాజద్గండమై యున్న యా జలజాతాక్షు ముఖంబు సూడఁ గలుగున్ సత్యంబు వో నాకు నా వల దిక్కేఁగుచు నున్న నీ వనమృగవ్రాతంబు లీత్రోవలన్. |
1193 |
| ఉ. |
మాపటివేళ నేను జని మాధవుపాదసమీపమందు దం డాపతితుండ నైన నతఁ డాశుగకాలభుజంగవేగ సం తాపిత భక్తలోకభయదారణమైన కరాబ్జ మౌదలన్ మోపి హసించి నా కభయముం గృపతోడుత నీయకుండునే? |
1194 |
| వ. | అని మఱియు నక్రూరుం డనేకవిధంబుల గోవిందసందర్శనంబుఁ గోరుచు నమందగమనంబున సుందరస్యందనారూఢుండై చని చని. | 1195 |
| క. |
ముందటఁ గనె ఘనచందన, కుంద కుటజ తాల సాల కురవక వట మా కందన్ నందితబల గో, విందన్ వికచారుణారవిందన్ బృందన్. |
1196 |
| వ. | కని బృందావనంబు దఱియం జొచ్చి యందు సాయంకాలంబున నడవికి నెఱిగల మేఁతల వెంబడిం దిగంబడి రాక చిక్కిన కుఱ్ఱ కోడె పడ్డ తండంబులం గానక; పొద, యిఱుము, మిఱ్ఱు పల్లం బనక తూఱి, పాఱి, వెదకి కానక చీరెడు గోపకుల యాహ్వానశబ్దంబు లాకర్ణింపుచుఁ గోమలఘాసఖాదనకుతూహలంబులం జిక్కి మక్కువం గ్రేపులం దలంచి తలారింపక, తమకంబులం దమతమయంత నంభారవంబులు సేయుచు నూధంబులు స్రవింపఁ బరువులిడు ధేనువులును, ధేనువులకు నోసరించుచు సద్యోజాతంబులగు తర్ణకంబుల వహించి, నవసూతికలు వెనుదగులుటవలన దామహస్తులై చను వల్లవుల మెల్లన విలోకించుచు, మంద యిరుగెలంకులం గలంకరహితులై పులి సివంగి వేఁగి లోనగు వాలుమెకంబుల మొత్తంబులవలన నప్రమత్తులయి కుఠార కుంత శరాసన ప్రముఖాయుధంబులు ధరియించి, కావలి తిరుగు వ్రేలం గడచి, నానావిధ సరసతృణకబళ ఖాదన గరిష్ఠలై గోష్ఠంబులు ప్రవేశించి, రోమంథలీలాలసలై యున్న ధేనువులును, జన్నులు గుడిచి తల్లులమ్రోలఁ బెల్లురేఁగి క్రేళ్లుఱుకు లేఁగలును, వెదలైన మొదవులం బైకొని పరస్పర విరుద్ధంబులై డీకొని కొమ్ముల యుద్ధంబులు సలుపు వృషభంబులును, నకుంఠితబలంబులం గంఠరజ్జువులం ద్రెంచుకొని, పొద లుఱికి, దాఁటి తల్లులం దూఁటి, కుడుచు తఱపి దూడల దట్టించి పట్టనోపక గ్రద్దనఁ బెద్దలం జీరు గోపకుమారులును, గొడుకుల మగల మామల మఱందుల వంచించి పంచాయుధభల్ల భగ్నహృదయలై గృహకృత్యంబులు మఱచి శంకిలక సంకేతస్థలంబులఁ గృష్ణాగమనతత్పరలై యున్న గోపకామినులును, గోష్ఠప్రదేశంబుల గోవులకుఁ గ్రేపుల విడిచి యొడ్డుచు, మరలం గట్టుచు, నీడ్చుచుం, గ్రీడించుగోపకులును, గోఖురసముద్ధూతకరీషపరాగపటలంబులవలన నుల్లారి దులదులనైన ధేనుదోహనవేళావికీర్ణపయోబిందుసందోహపరంపరాసంపాదితపంకంబులును, దోహనసమయ గోపకరాకృష్టగోస్తననిర్గతంబు లయి కలశంబులందుఁ బడియెడు క్షీరధారల చప్పుళ్లును, మహోక్షకంఠ సంస్పర్శనస్నిగ్ధంబులైన మందిరద్వారదారుస్తంభంబుల పొంతలనుండి, యులికిపడి నలుదిక్కులు గనుంగొని నూతనజనవిలోకనకుపితంబులై కరాళించుసారమేయంబులుం గలిగి, బలరామకృష్ణ బాహుదండప్రాకారరక్షావిశేషభూషంబైన ఘోషంబుఁ బ్రవేశించి యందు. | 1197 |
| క. |
జలజాంకుశాదిరేఖలు, గల హరిపాదముల చొప్పుఁ గని మోదముతోఁ బులకించి రథము డిగి యు, త్కలికన్ సంతోషబాష్పకలితాక్షుండై. |
1198 |
| మ. |
కనె నక్రూరుఁడు పద్మనేత్రులను రంగద్గాత్రులన్ ధేను దో హనవాటీగతుల న్నలంకృతుల నుద్యద్భాసులం బీత నీ ల నవీనోజ్జ్వలవాసులం గుసుమమాలాధారులన్ ధీరులన్ వనితాకాములఁ గృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములన్. |
1199 |
| క. |
కని వారల పాదములకు, వినయంబున మ్రొక్కె భక్తివివశుం డగుచుం దనువునఁ బులకాంకురములు, మొనయఁగ నానందబాష్పములు జడి గురియన్. |
1200 |
| వ. | తదనంతరంబ. | 1201 |
| క. |
అక్రూరులైన జనుల న, వక్రగతిం గాచు భక్తవత్సలుఁ డంత న్నక్రూరుఁ గౌఁగిలించెను, జక్రాంకిత హస్తతలముఁ జాఁచి నరేంద్రా! |
1202 |
| వ. | మఱియు నక్రూరుండు బలభద్రునికిం బ్రణతుండైన నతండు గౌఁగిలించి చెట్ట వట్టుకొని కృష్ణసహితుండై గృహంబునకుం గొనిపోయి మే లడిగి గద్దియ యిడి పాదప్రక్షాళనంబు సేసి మధుపర్కంబు సమర్పించి, గోవు నిచ్చి, యాదరంబున రసవదన్నంబు పెట్టించి తాంబూల గంధమాల్యంబు లొసంగె నయ్యవసరంబున నందుం డుపవిష్టుండైన యక్రూరుని సత్కరించి యిట్లనియె. | 1203 |
| క. |
చెలియలు మొఱయిడ నల్లుర, ఖలుఁడై పొరిగొనిన యట్టి కంసుఁడు బ్రదుకం గలదే మనికి దశార్హుల, కిలపై? మీసేమ మింక నే మని యడుగన్? |
1204 |
| వ. | అని పలికె నంత నక్రూరుం డొక పర్యంకంబున సుఖోపవిష్టుండై యుండ హరి యిట్లనియె. | 1205 |
| మ. |
శుభమే నీకుఁ? బ్రమోదమే సఖులకుం? జుట్టాలకున్ సేమమే? యభయంబే ప్రజకెల్ల? గోత్రజుల కాత్మానందమే? మామ ము క్త భయుండే? వసుదేవదేవకులు తత్కారాగృహంబందు మ త్ప్రభవవ్యాజనిబద్ధులై బ్రతికిరే ప్రాణానిలోపేతులై? |
1206 |
| మ. |
నెఱి నేఁ డిక్కడ నీవు రాఁగ వగతో నీతోడ నేమైన నా కెఱుఁగం జెప్పు మటంచుఁ జెప్పరు గదా యేమందు?రా వార్త యే తెఱఁగున్ లేదని డస్సిరో వగచిరో దీనత్వముం జెందిరో వెఱతో నాతలిదండ్రు లెట్లుపడిరో? విన్పింపు మక్రూరకా! |
1207 |
| వ. | మఱియు నీ వేమి కారణంబున వచ్చి? తని హరి యడిగిన నతండు కంసునికి నారదుండు వచ్చి చెప్పిన వైరానుబంధప్రకారంబును గంసుండు దేవకీవసుదేవుల వధియింపం గమకించి మానిన తెఱంగును, ధనుర్యాగంబు పేరు సెప్పి పుత్తెంచినప్రకారంబును నెఱింగించిన రామకృష్ణులు నగి రంత తమ్ముం బరివేష్టించిన నందాదిగోపకులం జూచి కృష్ణుం డిట్లనియె. | 1208 |
| శా. |
భూనాథుండు మఖంబుఁ జూడఁ బిలువం బుత్తెంచినాఁ; డవ్విభుం గానం బోవలెఁ; బాలు నెయ్యి పెరుఁగుల్ గట్నంబులుం గానుకల్ మీ నేర్పొప్పఁగఁ గూడఁబెట్టుఁడు తగన్ మీ మీ నివాసంబులన్; యానంబుల్ గొని రండు పొండు మథురాయాత్రాభిముఖ్యంబుగన్. |
1209 |
| వ. | అని నియమించె; నంత నక్రూరుండు మథురకు హరిం గొనిపోయెడి నని యెఱింగి వ్రేతలు గలంగి. | 1210 |
| మ. |
హరినవ్వుల్ హరిమాటలున్ హరిమనోజ్ఞాలాపముల్ లీలలున్ హరివేడ్కల్ హరిమన్ననల్ హరికరాబ్జాలంబనాహ్వానముల్ హరిణీలోచన లందఱున్ మఱి యుపాయం బెట్లొకో యంచు లో నెరియన్ ముచ్చటలాడి రంత గములై యేకాంతగేహంబులన్. |
1211 |
| వ. | మఱియుఁ దమలో నిట్లనిరి. | 1212 |
| ఉ. |
మేటిగృహస్థు బ్రహ్మ యని మిక్కిలి నమ్మితి మమ్మ! చూడ నే పాటియు లేదు మాకుఁ బరిపాలకుఁడైన సరోజనేత్రు ని చ్చోట వసింపనీక యొకచోటికిఁ బో విధియించి పిన్న బి డ్డాటలు చేసె నీదుడుకు లక్కట! భారతికైనఁ జెప్పరే! |
1213 |
| వ. | అని విధి దూఱుచు మదనతాపాయత్తచిత్తలై. | 1214 |
| ఉ. |
రమ్మని చీరినంతనె పురంబున కేగెడుఁ గాని నన్ను నీ కొమ్మలు నమ్మినారు మరుకోలల కగ్గము సేసి పోవఁగా ముమ్మరమైన తాపముల మ్రొగ్గుదురో యనఁ డంబుజాక్షుఁ డా యమ్మలు గోపవృద్ధులుఁ బ్రయాణము వల్దన రైరి చెల్లరే! |
1215 |
| శా. |
అక్రూరుం డని పేరువెట్టుకొని నేఁ డస్మన్మనోవల్లభుం జక్రిన్ మాకడఁ బాపికొంచు నరుగం జర్చించి యేతెంచి నాఁ డక్రూరుం డఁట క్రూరుఁ డీతఁడు నిజం బక్రూరుఁ డౌనేని ని ర్వక్రత్వంబునఁ గృష్ణుఁ బెట్టి తన త్రోవం బో విచారింపఁడే? |
1216 |
| ఉ. |
ఫుల్లసరోజలోచనలు పూర్ణసుధాంశుముఖుల్ పురాంగనల్ మెల్లనె యెల్లి పట్టణము మేడలనుండి సువర్ణలాజముల్ సల్లఁగ వారిఁ జూచి హరి సంగతి సేయఁ దలంచుఁ గాక వ్రే పల్లె వసించుముద్దియలపైఁ బడ నేల తలంచు నక్కటా! |
1217 |
| క. |
పురసతుల విలోకనములు, సరసాలాపములు నర్మసంభోగములున్ మరగి హరి మనల నొల్లఁడు, నరవరు లోయమ్మ! నూతనప్రియులు గదే. |
1218 |
| క. |
పుట్టెన్నఁడు హరి నెఱుఁగని, పట్టణసుందరుల కితనిఁ బతిఁ జేసి కడున్ దట్టపువిరహాగ్నులకును, గట్టిఁడి దైవంబు ఘోషకాంతల వెదకెన్. |
1219 |
| మ. |
‘హరి నేలా కొనిపోయె’ దంచు మన మా యక్రూరుఁ బ్రార్థింతమా? ‘హరిఁ బోనీకుఁడు నిల్పరే’ యనుచు నేఁ డర్చింతమా’ వేల్పులన్? హరిపాదంబుల కడ్డముల్ పడుదమా; ‘హా దైవమా’! యంచు నా తరుణుల్ కొప్పులుఁ జీరలున్ మఱచి కందర్పజ్వరభ్రాంతలై. |
1220 |
| మ. |
ఉవిదల్ సిగ్గులు మాని కన్గవల నీ రొండొండ వర్షింపఁగా వివశత్వంబులతోఁ గపోలతటసంవిన్యస్తహస్తాబ్జలై పవనోద్ధూతలతాభలై ‘మముఁ గృపం బాలింపు గోవింద! మా ధవ! దామోదర’ యంచు నేడ్చిరి సుజాతంబైన గీతంబులన్. |
1221 |
| వ. | అంత మఱునాఁడు సూర్యోదయకాలంబునం దన తోడఁ బయనంబునకు గమకించి నడచు గోపికలను ‘మఱలి వత్తు’ నని దూతికాముఖంబున నివర్తించి, కృష్ణుండు శకటంబులందుఁ గానికలు గోరసంబులు నిడుకొని నందాదు లయిన గోపకులు వెను తగుల నక్రూరచోదితం బయిన రథం బెక్కి మథురాభిముఖుండై చను సమయంబున. | 1222 |
| చ. |
‘అదె చనుచున్నవాఁడు ప్రియుఁ డల్లదె తే రదె వైజయంతి, య ల్లదె రథఘోటకాంఘ్రిరజ మాదెస మార్గము చూడుఁ డంచు లో నొదవెడి మక్కువన్ హరిరథోన్ముఖలై గములై వ్రజాంగనల్ గదలక నిల్చిచూచి రటు గన్నుల కబ్బిన యంత దూరమున్. |
1223 |
| వ. | ఇట్లు బలభద్రాక్రూరసహితుండై చని. | 1224 |
| క. |
అవలోకించెను గృష్ణుఁడు, ప్రవిమలకల్లోలపవనభాసితజన్య న్నవసన్నపాపసైన్యన్, గవిజనమాన్యన్ గళిందకన్యన్ ధన్యన్. |
1225 |
| వ. | కని తత్కాళిందియందుఁ బరిక్షుణ్ణ మణిగణసముజ్జ్వలంబు లగు జలంబులు ద్రావి, తరుసమూహ సమీపంబున రామసహితుండై కృష్ణుండు రథంబు ప్రవేశించె; నంత నక్రూరుండు వారలకు మ్రొక్కి వీడ్కొని కాళిందీహ్రదంబు సొచ్చి విధిపూర్వకంబుగ వేదమంత్రంబుల జపించుచు. | 1226 |