| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| ఉ. |
స్నానము సేసి చేసి నది చల్లనినీటను రామకృష్ణులన్ మానుగఁ జూచి వీరు రథమధ్యమునన్ వసియించి యున్న వా రీ నదినీటిలోపలికి నెప్పుడు వచ్చి? రటంచు లేచి మే ధానిధి సూచె వారిని రథస్థుల భక్తమనోరథస్థులన్. |
1227 |
| వ. | చూచి వెఱఁగుపడి. | 1228 |
| శా. |
‘కంటిన్ మున్ను రథంబుపై; జలములోఁ గంటిన్ దుదిం; గ్రమ్మఱం గంటిం దొంటి రథంబుమీఁద; నిదె యీ కల్యాణచారిత్రు లే వెంటం దోఁచిరి రెండుదిక్కుల; మనోవిభ్రాంతియో? నీటిలో నుం టాశ్చర్యము; చూతు నంచు మఱియు న్నూహించి మగ్నాంగుఁడై. |
1229 |
| ఉ. |
పోషితబాంధవుండు యదుపుంగవుఁ డాజలమందుఁ గాంచె స ద్భాషు సహస్రమస్తకవిభాసితభూషు నహీశు భూమిభృ ద్వేషుఁ గృపాభిలాషుఁ బ్రతివీరచమూవిజిగీషు నిత్య సం తోషు నరోషు నిర్దళితదోషు ననేకవిశేషు శేషునిన్. |
1230 |
| వ. | మఱియు నీలాంబరసంయుతుండును, సిద్ధోరగాదిసన్నుతుండునునై యొప్పు న ప్పాఁపఱేనిం దప్పక కనుంగొని. | 1231 |
| సీ. |
ఆ భోగిభోగపర్యంకమధ్యంబున వలనొప్పు పచ్చనివలువవాని మేఘంబుపైనున్న మెఱుఁగుచందంబున నురమున శ్రీదేవి యొప్పువాని ముసురుతేఁటులు విప్ప ముఖచతుష్కము గల తనయుఁ డాడెడి బొడ్డుఁదమ్మివానిఁ గదలిన బహుపదక్రమవిశేషంబుల రవము సూపెడి నూపురములవాని |
|
| ఆ. |
జలజగర్భ రుద్ర సనక సనందన, సద్ద్విజామర ప్రశస్యమాన చరితుఁడైనవాని సౌందర్యఖనియైన, వాని నొక్క పురుషవర్యుఁ గాంచె. |
1232 |
| వ. | మఱియును జారు లక్షణ లక్షిత నఖ పాద గుల్ఫ జాను జంఘోరు కటి నాభి మధ్యోదరుండును, సాదరుండును; శ్రీవత్సకౌస్తుభ వనమాలికావిరాజిత విశాలవక్షుండును, బుండరీకాక్షుండును; శంఖ చక్ర గదా పద్మ హస్తుండును, సత్త్వగుణప్రశస్తుండును; బ్రహ్మసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుండును, భక్తజనపోషణుండును; సుందర కపోల ఫాల నాసాధర వదన కర్ణుండును, నీలనీరదవర్ణుండును; గంబుకంధరుండును, గరుణాగుణబంధురుండును; బ్రహ్లాద నారద సునంద నందప్రముఖ సంభావితుండును, శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతీలోర్జావిద్యా, విద్యా శక్తి మాయాది సేవితుండునునై యొప్పు న ప్పరమేశ్వరునకు మ్రొక్కి భక్తిసంభ్రమంబు లగ్గలంబులుగ గద్గదకంఠుండై దిగ్గనం గరంబులు ముకుళించి యిట్లని వినుతించె. | 1233 |
| దండకము. | శ్రీమానినీమానచోరా! శుభాకార! వీరా! జగద్ధేతుహేతుప్రకారా! సమస్తంబు నస్తంగతంబై మహాలోల కల్లోల మాలాకులాభీల పాథోనిధిం గూలఁగా, బాలకేళీగతిం దేలి నారాయణాఖ్యం బటుఖ్యాతి శోభిల్లు నీ నాభి కంజంబులో లోకపుంజంబులం బన్ను విన్నాణియై మన్న యా బమ్మ యుత్పన్నుఁ డయ్యెం గదా! పావ కాకాశ వాతావనీ వార్యహంకార మాయామహామానసాదుల్ హృషీకాదులున్ లోకముల్ లోకబీజంబులున్ నిత్యసందోహమై నీ మహాదేహమం దుల్లసించున్; వసించున్, నశించున్, జడత్వంబు లేకాత్మయై యొప్పు నీయొప్పిదం బెల్ల నోచెల్ల; చెల్లన్ విచారింపఁ దా రెంతవా? రెంతవారైన మాయాదు లా మాయతోఁగూడి క్రీడించు లోకానుసంధాత యీ ధాత నిర్ణేతయే? నీ కళారాశికిం గొంద ఱంభోజగర్భాదు లధ్యాత్మలందున్న శేషాధిభూతంబులందు న్ననేకాధిదైవంబులందున్ సదా సాక్షివై యుందు వంచుం దదంతర్గతజ్యోతి వీశుండ వంచుం, ద్రయీపద్ధతిం గొంద ఱింద్రాదిదేవాభిధానంబులన్, నిక్క మొక్కండ వంచున్ మఱిం గొంద రారూఢకర్మంబులం ద్రుంచి, సంసారముం ద్రెంచి, సన్న్యస్తులై మించి విజ్ఞానచక్షుండ వంచున్, మఱిం బాంచరాత్రానుసారంబుగాఁ దన్మయత్వంబుతోఁ గొంద ఱీ వాత్మ వంచున్, మఱిం గొంద ఱా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వు వాటింతు వంచున్; మఱిన్ నీవు నారాయణాఖ్యుండ వంచున్, శివాఖ్యుండ వంచున్, మఱిం బెక్కుమార్గంబులన్ నిన్ను నగ్గింతు; రెగ్గేమి? యేఱుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ విశేషంబు లెల్ల న్నశేషంబులై డింది నీయం దనూనంబు లీనంబులౌ; నేకరాకేందు బింబంబు కుంభాంత రాళంబులం బింబితంబైన వేఱున్నదే? యెన్న నేలా? ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులం దేకమౌ రేఖ లోకావధిన్ వీఁక నే పోకలం బోక; యేకాకివై యుండు; దీశా! కృశానుండు నెమ్మోము, సోముండు భానుండు కన్నుల్, దిశల్ కర్ణముల్, భూమి పాదంబు, లంభోనిధుల్ గుక్షి, శల్యంబు లద్రుల్, లతాసాలముల్ రోమముల్, గాలి ప్రాణంబు, బాహుల్ సురేంద్రుల్, ఘనంబుల్ కచంబుల్, నభోవీథి నాభిప్రదేశంబు, రేలుంబగళ్లున్ నిమేషంబు, లంభోజగర్భుండు గుహ్యంబు, వర్షంబు వీర్యంబు, నాకంబు మూర్ధంబుగా నేకమై యున్న నీ మేనిదండం బయోజాతగర్భాండముల్ మండి తోదుంబరానోకహానేకశాఖా ఫలాపూరి తానంతజంతుప్రకాండంబు లీలం బ్రసిద్ధోదరాశిస్థ జంతుప్రకారంబుగా నిండి యుండున్; మహారూప! నీ రూపముల్ వెగ్గలం బుగ్గడింపన్; లయాంభోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి మున్ వేధకున్ వేదరాశిం బ్రసాదింపవే? త్రుంపవే కైటభ శ్రీ మధుం జక్రివై మొత్తవే! యెత్తవే మందరాగంబు రాగంబుతోఁ గూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీఁదికిం ద్రోచి దోషాచరుం గొమ్ములన్ నెమ్ములన్ జిమ్ముచున్ గ్రువ్వవే త్రవ్వవే ఘోరవైరిన్ నృసింహుండవై, దండివై దండి వైరోచనిం జూచి యాచింపవే? పెంపవే మేను బ్రహ్మాండము న్నిండఁ, బాఱుండవై రాజకోటిన్ విపాటింపవే, రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే, నొంపవే క్రూరులన్ వాసుదేవాదిరూపంబులన్, శుద్ధబుద్ధుండవై వైరిదారాంతరంగంబుల న్నంతరంగంబులుంగా గరంగింపవే? పెంపు దీపింపవే? కల్కిమూర్తిం బ్రవర్తించి, నిన్నెన్న నే నెవ్వఁడన్, నన్ను మాయావిపన్నున్ విషణ్ణుం బ్రసన్నుం డవై ఖిన్నతం బాపి మన్నింపవే! పన్నగాధీశతల్పా! కృపాకల్ప!, వందారుకల్పా! నమస్తే నమస్తే నమస్తే నమః. | 1234 |
| మ. |
కలలం బోలెడి పుత్త్రమిత్రవనితాగారాదిసంయోగముల్ జలవాంఛారతి నెండమావులకు నాసల్ సేయు చందంబునం దలఁతున్ సత్యము లంచు; మూఢుఁడ వృథాతత్త్వజ్ఞుఁడన్ నాకు నీ విలసత్పాదయుగంబు సూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతీ! |
1235 |
| వ. | అని మఱియును వినుతింప నక్రూరునికి యమునాజలంబుల లోనన తన మొదలి మేను సూపి చాలించి నటునికైవడిం దిరోహితుండైన నక్రూరుండు నీరు వెడలి వెఱంగుపడుచు వచ్చి రథారోహణంబు సేసిన హరి యిట్లనియె. | 1236 |
| క. |
జలములు చేరువ నున్నవి, తలపోయఁగ నీవు పోయి తడ వయ్యె, నదీ జలముల నభమున ధరణిం, గలుగని చోద్యములు నీకుఁ గానం బడెనే? |
1237 |
| వ. | అనిన నతం డిట్లనియె. | 1238 |
| క. |
‘నీలోన లేని చోద్యము, లేలోకములందుఁ జెప్ప; రీశ్వర! నీటన్ నేలన్ నింగిని నున్నవె? నీలోఁ జోద్యంబు లెల్ల నెగడు మహాత్మా!’ |
1239 |
| వ. | అని పలికి సాయంకాలంబునకు నక్రూరుండు మథురానగరంబు సేర రథంబు గడపె; నంత నటమున్న చని నందాదులు పురోపవనంబున విడిసి యుండ వారలం గూడికొని కృష్ణు డక్రూరునిం జూచి రథంబు గొనుచు నగరంబునకుం జనుము; మేము వెనుక వచ్చెద’ మనిన నతం డిట్లనియె. | 1240 |
| క. |
‘నా యింటికి విచ్చేయుము, నీ యంఘ్రి సరోజరేణునికరము సోఁకన్ నా యిల్లు పవిత్రం బగు, శ్రీయుత! నీ భటునిఁ బెద్ద సేయం దగదే? |
1241 |
| వ. | అని మఱియుఁ బ్రార్థించిన హరి యిట్లనియె. | 1242 |