పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ కృష్ణమూర్తి మథురానగరప్రవేశము సేయుట
క. యదుకులవిద్వేషణుఁడై, మదమున వర్తించు కంసు మర్దించి భవ
త్సదనంబుఁ జూడ వచ్చెదఁ, బొద యీ స్యందనముఁ గొనుచుఁ బురమున కనఘా!.
1243
వ. అని పలికిన నక్రూరుండు పురంబునకుం జని రామకృష్ణులు వచ్చి రని కంసున కెఱింగించి తన గృహంబునకుం జనియె; నంత నపరాహ్ణంబున బలభద్రగోపాలసహితుండై కృష్ణుండు. 1244
మ. పరిఖల్‌ గోటలుఁ గొమ్మలుం బడగలుం బ్రాసాదముల్‌ వీథులున్‌
హరులుం దేరులు వీరులున్‌ గజములున్‌ హర్మ్యంబులున్‌ వాద్యముల్‌
తరుణుల్‌ ధాన్యములున్‌ ధనంబులు మహోద్యానంబులున్‌ దీర్ఘికల్‌
గర మాశ్చర్యరుచిం దనర్చు మథురన్‌ గాంచెన్‌ విభుం డంతటన్‌.
1245
వ. కని య ప్పురంబు ప్రవేశించి వచ్చు సమయంబున. 1246
ఉ. ‘నందతఫఃఫలంబు, సుగుణంబులపుంజము, గోపకామినీ
బృందమునోముపంట; సిరివిందు; దయాంబుధి; యోగిబృందముల్‌
డెందములందుఁ గోరెడు కడింది నిధానము సేరవచ్చె నో
సుందరులార! రండు చని చూతము కన్నుల కోర్కి దీఱఁగన్‌.
1247
వ. అని మఱియు గోవిందసందర్శనకుతూహలంబులఁ బౌరసుందరులు పరస్పరాహూయమానలై భుంజానలై భోజనభాజనంబులు దలంగఁ ద్రోచియు, శయానలై లేచియు, నభ్యజ్యమానలై జలంబు లాడకయు గురుజనశిక్ష్యమాణలై యోడకయు, గృహకార్యప్రవర్తమానలై పరిభ్రమింపకయు, రమణరమమాణలై రమింపకయు, శిశుజన బిభ్రాణలై డించియు, నలంకుర్వాణలై యన్యోన్య వస్త్రాభరణ మాల్యానులేపనంబులు వీడ్వడ ధరించియు నరిగి. 1248
క. వీటఁ గల చేడె లెల్లను, హాటకమణిఘటితతుంగహర్మ్యాగ్రములం
గూటువలు గొనుచుఁ జూచిరి, పాటించి విశాలవక్షుఁ బద్మదళాక్షున్‌.
1249
సీ. వీఁడటే రక్కసి విగతజీవగఁ జన్నుఁబాలు ద్రావిన మేటిబాలకుండు
వీఁడటే నందునివెలఁదికి జగమెల్ల ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు
వీఁడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాఁపరీఁడు
వీఁడటే యెలయించి వ్రేతలమానంబు సూఱలాడిన లోకసుందరుండు
 
తే. వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు, వీనిఁ బొందనిజన్మంబు విగతఫలము
వీనిఁ బలుకనివచనంబు విహగరుతము, వీనిఁ జూడనిచూడ్కులు వృథలు వృథలు.
1250
మ. చెలియా! గోపిక లీ కుమారతిలకుం జింతించుచుం బాడుచుం
గలయం బల్కుచు నంటుచున్‌ నగుచు నాకర్షింపుచున్‌ హస్తగా
మలకక్రీడకుఁ దెచ్చి నిచ్చలును సమ్మానంబులం బొందఁగాఁ
దొలి జన్మంబుల నేమి నోఁచిరొ కదే దుర్గప్రదేశంబులన్‌
1251
క. అని మఱియుఁ బౌరకాంతలు, మునుకొని హరిరూపు నేత్రముల వెంటను లోఁ
గొని తాల్చిరి హృదయములను, జనితప్రమదమున విరులు సల్లుచు నధిపా!
1252
వ. మఱియును. 1253
క. నానావిధగంధములుఁ బ్ర, సూనఫలాదులును హరితశుభలాజములుం
గానిక లిచ్చుచు విప్రులు, మానుగఁ బూజించి రా కుమారోత్తములన్‌.
1254
వ. ఆ సమయంబున నగరద్వారంబు నుండి వచ్చు రాగకారుండగు నొక్క రజకుం గని హరి యిట్లనియె. 1255
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )