పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీకృష్ణుండు రజకుని జంపి వాయక సుదాము లొసంగు పూజల నంగీకరించి మే లొసంగుట
ఉ. విందులమై నరేశ్వరునివీటికి వచ్చితి మేము; మాకు మా
మందలలోనఁ గట్టికొన మంచిపటంబులు లేవు; నీ ముడిన్‌
సుందరధౌతచేలములు శోభిలు చున్నవి; తెమ్ము; నిన్ను మే
లందెడు; నిమ్ము; రాజుదెస నల్లుర; మో రజకాన్వయాగ్రణీ!
1256
వ. అనిన రోషించి వాఁ డిట్లనియె. 1257
శా. ఎట్టెట్రా! మనుజేంద్రుచేలములు మీ కీఁ బాడియే? మీరలుం
గట్టం బోలుదురే? పయోఘృతదధిగ్రాసంబులన్‌ మత్తులై
యిట్టాడం జనెఁ గాక గొల్లలకు మీ కెబ్భంగి నోరాడెడిన్‌?
గట్టా! ప్రాణముఁ గోలుపోయెదు సుమీ కంసోద్ధతిన్‌ బాలకా!
1258
క. మా రాజుసొమ్ముఁ గైకొన, నే రాజులు వెఱతు; రింత యెల్లిదమే నీ;
కీ రాజరాజగృహమున, నీ రాజసమేల? గొల్ల! యేఁగుము తలఁగన్‌.
1259
వ. అనిన విని రోషించి. 1260
క. ఘోరకరాగ్రతలంబున, ధీరుఁడు కృష్ణుండు శిరము దెగిపడఁ గొట్టెం
బౌరుల గుండెలు వగులఁగ, వీరోద్రేకిన్‌ మదావివేకిన్‌ జాకిన్‌.
1261
వ. ఇట్లు భగ్నుండైన రజకునిం జూచి వానివారలు పటంబులు డించి వెఱచి పఱచిన రామకృష్ణులు వలసిన వస్త్రంబులు ధరియించి కొన్ని గోపకుల కొసంగి చనుచుండ. 1262
క. అంతట నొక వాయకుఁ డా, క్రంతన్‌ వసుదేవసుతులఁ గని బహువర్ణా
త్యంత మృదుపటాభరణము, లెంతయు సంతసముతోడ నిచ్చెన్‌ మెచ్చన్‌.
1263
శా. కారుణ్యంబున వానిఁ గైకొని యలంకారంబు గావించి శృం
గారోదంచితదిగ్గజేంద్రకలభాకారంబులం బొల్చి రా
శూరుల్‌; మాధవుఁ డంత వాయకునిశుశ్రూషన్‌ మహాప్రీతుఁడై
సారూప్యంబును లక్ష్మియు న్నొసఁగె నైశ్వర్యాదిసంధాయియై.
1264
వ. అంత నా రామకృష్ణులు సుదాముం డను మాలాకారుగృహంబునకుం జనిన నతండు గని లేచి గ్రక్కున మ్రొక్కి చక్కన యర్ఘ్యపాద్యాదికంబు లాచరించి సానుచరు లయినవారలకుఁ దాంబూల కుసుమగంధంబు లొసంగి యిట్లనియె. 1265
ఉ. పావన మయ్యె నా కులము; పండెఁ దపంబు; గృహంబు లక్ష్మికిన్‌
సేవిత మయ్యె; నిష్టములు సేకుఱె: విశ్వనిదానమూర్తులై
భూవలయంబుఁ గావ నిటు పుట్టిన మీరలు రాకఁ జేసి నే
నే విధ మాచరింతుఁ? బను లెయ్యవి? బంట; నెఱుంగఁ జెప్పరే.
1266
వ. అని పలికి. 1267
క. దామోదరరాముల కు, ద్దామయశోహసితతుహినధాములకు వధూ
కాములకుఁ దెచ్చియిచ్చె సు, దాముఁడు ఘనసురభికుసుమదామము లధిపా!
1268
క. వారును మాలికుఁ డిచ్చిన, భూరికుసుమదామములను భూషితులై ‘ నీ
కోరిన వర మిచ్చెద’ మని, కారుణ్యము సేయ నతఁడు గని యిట్లనియెన్‌.
1269
క. ‘నీ పాదకమలసేవయు, నీ పాదార్చకులతోడినెయ్యమును నితాం
తాపారభూతదయయును, దాపసమందార! నాకు దయసేయఁ గదే!
1270
వ. అని వేఁడికొనిన నిచ్చి మఱియు మాధవుం డమ్మాలికునకు బలాయుఃకీర్తిసంపద లొసంగి వాని గృహంబు వెడలి రాజవీథిం జనిచని. 1271
క. ఆ నలినాక్షుఁడు గాంచెను, నానాలేపములభాజనము సేకొనుచుం
బూని చనుదెంచు దానిని, నాననరుచినిచయవినమితాబ్జం గుబ్జన్‌.
1272
వ. కని యిట్లనియె. 1273
క. ‘ఎవ్వరిదానవు? లేపము, లెవ్వరికిం గోరికొనుచు నేగెదు? నీ పే
రెవ్వతె’ మా కి మ్మిన్నియు, నివ్వటిలెదు చక్క నగుచు నీరజనేత్రా!’
1274
వ. అనిన న య్యబల యిట్లనియె. 1275
ఉ. చక్కనివాఁడ వౌదు; సరసంబుల నొంపకు; మెల్లవారికిన్‌
జక్కఁదనంబు లెక్కడివి? చారుశరీర! త్రివక్ర యండ్రు; నే
నిక్కము కంసుదాసిని; వినిర్మలలేపనవిద్యదాన; నన్‌
మిక్కిలి రాజు మెచ్చుఁ; దగ మీరు విలేపనముల్‌ ధరింపరే?
1276
క. అని పలికి యా కుమారుల, తనువులు నగవులును, వీక్షితమ్ములు మాటల్‌
తన చిత్తముఁ గరఁగించిన, ననులేపము లిచ్చె వారి కబల ప్రియముతోన్‌.
1277
సీ. ఇ వ్విధంబునఁ గుబ్జ యిచ్చిన లేపంబు, లన్నియు, దాను దేహమున నలఁది-
కొని ప్రసన్నత నొంది కుబ్జ మువ్వంకల, యొడలు సక్కఁగ నొత్తి యునుపఁ దలఁచి
తత్పదంబుల మీదఁ దన పదంబులు ద్రొక్కి హస్తాంగుళద్వయ మబల గౌద-
క్రింద విప్పుగ నిడి కృష్ణుఁడు మీఁదికి, నెత్తిన వక్రత లెల్ల మాని
 
ఆ. చక్కనైన చిత్తజన్ముబాణముక్రియఁ, గొమరు మిగిలి పిఱుఁదు గుచయుగంబు
సొంపు సేయఁ దరుణి సుందరమూర్తియై, కమలనయనుఁ జూచి కాంక్షతోడ.
1278
క. ‘వేంచేయుము నా యింటికిఁ, బంచశరాకార!’ యనుచుఁ బై కొం గాక
ర్షించి హరిఁ దిగిచెఁ గామిని, పంచాశుగబాణజాలభగ్నహృదయయై.
1279
క. కామిని తిగిచినఁ గృష్ణుఁడు, రాముని వీక్షించి నగుచు రాజానన! మ
త్కామితముఁ దీర్చి పిదపన్‌, నీ మందిరమునకు వత్తు నేఁ డలుగకుమీ!
1280
వ. అని వీడుకొలిపి కృష్ణుండు విపణిమార్గంబునం జని చని తాంబూలమాలికాగంధంబులును బహువిధంబు లయిన కానికలును బౌరు లిచ్చినం బరిగ్రహించుచు ధనుశ్శాల కరిగి యందు. 1281
క. సురరాజువింటికైవడి, గురుతరమై భూరివీరగుప్తం బయి దు
స్తరమైన విల్లు పొడగని, నరులు వల దనంగ బిట్టు నగి వికసితుఁడై.
1282
శా. బంధుల్‌ మేలన వామహస్తమునఁ జాపం బెత్తి మౌర్వీలతా
సంధానం బొనరించి కొంచెపుఁదెగన్‌ శబ్దించుచున్‌ ధీరతా
సింధుం డా హరి దాని ఖండితముగాఁ జేసెన్‌ జనుల్‌ చూడఁగా
గంధేభంబు రసాలదండము నొగిన్‌ ఖండించుచందంబునన్‌.
1283
క. కోదండ భంగనిర్గత, నాదము వీనులకు భీషణం బయి యాశా
రోదోంతరములు నిండుచు, భేదించెన్‌ భోజవిభునిబింకము నధిపా!
1284
వ. అప్పుడు. 1285
ఉ. ‘అద్దిర! రాచవిల్‌ విఱిచె నర్భకుఁ డెంతయు శంక లేక నేఁ
డుద్దవిడిన్‌ సహింపఁ దగ దుగ్రతఁ బట్టుద’ మంచుఁ గ్రుద్ధులై
గ్రద్దన లేచి తద్ధనువుకావలివా రరుదేర వారి న
య్యిద్దఱుఁ గూడి పట్టి మడియించిరి కార్ముకఖండహస్తులై.
1286
వ. అట్లు రామకృష్ణులు మథురాపురంబున విహరించి వెడలి విడిదలకుం జని రంత. 1287
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )