పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
సూర్యాస్తమయ చంద్రోదయముల వర్ణనము
మ. గగనారణ్యచరాంధకారగజముం గాలాహ్వయవ్యాధుఁ డ
చ్చుగఁ బట్టన్‌ గమకించి మ చ్చిడుటకై చూతాంకురశ్రేణిచే
నొగిఁ గల్పించిన కందుకం బనఁగ సూర్యుం డంత వీక్షింపఁగాఁ
దగె మందప్రభతోడ పశ్చిమమహాధాత్రీధరేంద్రంబునన్‌.
1288
క. తరుణుఁ డగు శీతకరునిన్‌, మరగి వియల్లక్ష్మి దన్ను మాని ముదుకఁడున్‌
ఖరకరుఁడు ననుచు ద్రొబ్బిన, కరణిన్‌ రవి పశ్చిమాద్రికడఁ గ్రుంకె నృపా!
1289
క. కళలు కలుగుఁ గాక కమల తోడగుఁ గాక, శివుని మౌళిమీఁదఁ జేరుఁగాక
నన్యు నొల్లఁ దపనుఁడైన మత్పతి యని, సాధ్విభంగిఁ గమలజాతి మొగిడె.
1290
క. సుందరసాయంసంధ్యా, వందనవిప్రార్ఘ్యతోయవజ్రహతోద్య
న్మందేహాసురరక్త, స్యందము క్రియఁ గెంపుసొం పెసఁగె నపరదిశన్‌.
1291
ఆ. భూమి నుండి మింటఁ బూర్ణమై కర్కట, మకర మీనరాశి మహితమైన
హరియశస్సుధాబ్ధియందులతుంపురు, లనఁగ జుక్క లొప్పె నాకసమున.
1292
క. ఎల్లదిశలు నిండిన శ్రీ, వల్లభు గుణమహిమ బ్రహ్మ వాసించుటకై
చల్లినమృగమద మనఁగా, వెల్లివిరిసెఁ దమము గగనవీథుల నెల్లన్‌.
1293
క. ఆ చీఁకటి వెనుతగిలినఁ, బ్రాచీదిశనుండి గంతుఁ బరువున రవి భ
ర్మాచలము మలఁక త్రోవను, వే చనియెంగాక నిలిచి విఱుగక యున్నే?
1294
ఉ. మీకును వైరి; యెప్పుడును మిక్కిలి మాకును వైరి; రాజు దో
షాకరుఁ; డింక వచ్చు జలజాతములార! మదీయబాలురం
జేకొనుఁ డంచు బాలకులఁ జీఁకటి దాఁచిన భంగిఁ జిక్కి రా
రాక వసించెఁ దుమ్మెదలు రాత్రి సరోరుహకుట్మలంబులన్‌.
1295
సీ. ప్రాచీదిశాంగనాఫాలతలంబున, దీపించు సిందూరతిలక మనఁగ
దర్పించి విరహులధైర్యవల్లులు ద్రెంప, దర్పకుం డెత్తిన దాత్ర మనఁగ
నలిగి కాలకిరాతుఁ డంధకారమృగంబు ఖండింప మెఱయించు ఖడ్గ మనఁగ
గగనతమాలవృక్షము తూర్పుకొమ్మను, లలితమై మెఱయు పల్లవ మనంగఁ
 
ఆ. దొగలు సంతసిల్ల దొంగలు భీతిల్లఁ, గడలి మిన్ను ముట్టి కడలుకొనఁగఁ
బొడిచె శీతకరుఁడు భూరిచకోరక, ప్రీతికరుఁడు జారభీతికరుఁడు.
1296
క. దర్పితతారాధిపపరి, సర్పిత కిరణౌఘమిళితసకలదివంబై
యేర్పడి కమలభవాండము, గర్పూరపుఁ గ్రోవిభంగిఁ గనుపట్టె నృపా!
1297
క. ఆ రేయి గోపయుతులై, క్షీరాన్నము గుడిచి రామకృష్ణులు మదిఁ గం
సారంభ మెఱిఁగి యిష్ట వి, హారంబుల నప్రమత్తులై యుండి రిటన్‌.
1298
క. తన పురికి రామకృష్ణులు, సనుదెంచి నిజానుచరులఁ జంపుటయు మహా
ధనువు గదిసి విఱుచుటయును, విని కంసుఁడు నిదుర లేక విహ్వలమతియై.
1299
సీ. కర్ణరంధ్రములు చేఁ గప్పిన లోపలి ప్రాణఘోషము వినఁబడక డిందెఁ
దోయాదికములందుఁ దొంగిచూచిన యంతఁ దల గానరా దయ్యెఁ దనువుమీఁదఁ
గరశాఖ నాసికాగ్రంబుపై నిడి చూడ గ్రహతారకలు రెండుగా నగపడె
వెలుఁగున నిలుచుండి వీక్షింపఁగా మేనినీడ సరంధ్రమై నేలఁ దోఁచె
 
ఆ. నడుగుజాడ దృష్టమౌట లే దయ్యెను, దరువులెల్ల హేమతరువు లగుచు
మెఱయుచుండెఁ గాలమృత్యువు డగ్గఱ, బుద్ధి యెల్లఁ గలఁగె భోజపతికి.
1300
క. గరళముఁ దినుటయుఁ బ్రేతముఁ, బరిరంభించుటయు నగ్నభావుఁ డవుటయున్‌
శిరమునఁ దైలము వడుటయు, ఖరపతి నెక్కుటయు నతఁడు కలలోఁ గనియెన్‌.
1301
వ. మఱియు రక్తకుసుమమాలికాధరుండై యొక్కరుండును నెక్క డేనియుం జనుచున్న వాఁడ నని కల గాంచి మరణహేతుక భీతిఁ జింతాక్రాంతుండై నిద్రఁ జెందక వేగించుచున్న సమయంబున. 1302
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )