| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| క. |
అరుణహరినఖరవిదళిత, గురుతిమిరేభేంద్రకుంభకూటవినిర్ము క్త రుధిరమౌక్తికములక్రియ, సురపతిదిశఁ గెంపుతోడఁ జుక్కలు మెఱసెన్. |
1303 |
| సీ. |
పౌలోమి తనబాలుపాన్పుపైఁ గనుపట్టఁ బన్నిన పవడంపుబంతి యనఁగ నాయురర్థముల వ్యయంబు లొత్తిలి చాటు కాలజాంఘికు చేతిఘంట యనఁగ ఘనజంతుజీవితకాలరాసుల విధి కొలువ నెత్తిన హేమకుంభ మనఁగఁ బశ్చిమదిక్కాంత పరఁగఁ గైసేయుచో ముందట నిడుకొన్న ముకుర మనఁగఁ |
|
| తే. |
గోకతాపోపశమదివ్యఘుటిక యనఁగఁ, బద్మినీకాంతనోములఫల మనంగ మూఁడుమూర్తుల సారంపు ముద్ద యనఁగ, మిహిరమండల ముదయాద్రిమీఁద నొప్పె. |
1304 |
| క. |
వచ్చెం జల్లని గాడ్పులు, విచ్చెం గమలములు; దమము విరిసి బిలంబుల్ చొచ్చెం; బద్మమరందము, మెచ్చెం దుమ్మెదలు గ్రోలి మిహిరుఁడు వొడమన్. |
1305 |
| క. |
సంకాశితోదయాచల, పంకజసఖకిరణరాగపరిపూర్ణంబై పంకేరుహగర్భాండము, కుంకుమసలిలంపుఁ గ్రోవి కొమరున నొప్పెన్. |
1306 |
| వ. | తదనంతరంబ. | 1307 |
| సీ. |
పాషాణవల్మీకపంకాదిరహితంబు మృదులకాంచననిభమృణ్మయంబు కమనీయకస్తూరికాజలసిక్తంబు బద్ధచందనదారుపరివృతంబు మహనీయకుసుమదామధ్వజతోరణమండితోన్నతమంచమధ్యమంబు బ్రాహ్మణ క్షత్త్రాది పౌరకోలాహలం బశ్రాంత తూర్యత్రయాంచితంబు |
|
| ఆ. |
నిర్మలంబు సమము నిష్కంటకంబునై, పుణ్యపురుషుమనముఁ బోలి కంస సైన్యతుంగ మగుచు సంతుష్టలోకాంత, రంగమైన మల్లరంగ మొప్పె. |
1308 |
| క. |
ఆ మల్లరంగపరిసర, భూమిస్థిత మంచమందు భోజేంద్రుఁడు మా న్యామాత్యసంయుతుండై, భూమీశులు గొలువ నుండెఁ బొక్కుచు నధిపా! |
1309 |
| మ. |
సకలాంభోనిధిమేఖలావహనముం జాలించి యేతెంచు నా గ కులాగంబులభంగి నొప్పుచుఁ దగం గైసేసి చాణూర ము ష్టికకూటుల్ శలతోసలుల్ గురువులన్ సేవించుచున్ రంగ ధా త్రికి నేతెంచిరి తూర్యఘోషముల నుద్రేకం బనేకంబుగన్. |
1310 |
| క. |
నందాదులైన గోపకు, లందఱుఁ జని కానుకలు సమర్పించి నృపున్ సందర్శించి తదనుమతిఁ, జెంది మహామంచముల వసించిరి వరుసన్. |
1311 |
| వ. | అంత రామకృష్ణులు నలంకృతులై మల్లదుందుభినినదంబు విని సందర్శన కుతూహలంబున. | 1312 |
| క. |
ఓడక రంగద్వారముఁ జాడం జని వారు కనిరి సమదకువలయా పీడంబున్ భిన్నపరా, క్రీడంబుం బ్రమదకంటకితచూడంబున్. |
1313 |
| వ. | కని తత్కరిపాలశ్రేష్ఠుండైన యంబష్ఠునికి మేఘనాదగంభీరభాషణంబుల రిపుభీషణుండగు హరి యిట్లనియె. | 1314 |